డెల్టా ప్లస్ కరోనా వేరియంట్: ఇట్టే వ్యాపిస్తుంది... ఇప్పుడున్న వ్యాక్సీన్లకు లొంగుతుందా?

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

‘‘డెల్టా ప్లస్’’గా పిలుస్తున్న కరోనా వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని బ్రిటన్‌కు చెందిన నిపుణులు చెబుతున్నారు.

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్‌ఏ) ఈ కొత్త మ్యుటేషన్‌ను "వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌" వర్గంలో చేర్చింది.

అయితే, ఈ కొత్త వేరియంట్‌తో తీవ్ర అనారోగ్యానికి గురవుతారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

దీన్నుంచి ప్రజలను రక్షించడానికి ఇప్పటికే ఉన్న టీకాలు బాగానే పనిచేస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

యూకేలో డెల్టా వేరియంట్ ఇప్పటికీ చాలా కోవిడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నప్పటికీ.. "డెల్టా ప్లస్" లేదా AY.4.2 కేసులు కూడా పెరుగుతున్నాయి.

తాజా గణాంకాల ప్రకారం 6 శాతం కోవిడ్ కేసులు "డెల్టా ప్లస్" తరహాకు చెందినవి.

ఈ "డెల్టా ప్లస్" వేరియంట్‌ భారీ స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం లేదని, ప్రస్తుత వ్యాక్సిన్‌లను తట్టుకుని ఈ వైరస్‌ మనుగడ సాగించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

కానీ డెల్టాతో పోలిస్తే యూకేలో ఈ కేసుల వృద్ధి రేటు పెరిగినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

"ఇటీవలి నెలల్లో యూకేలో ఈ కొత్త వేరియంట్ల మ్యుటేషన్ సర్వసాధారణంగా మారింది. డెల్టాతో పోలిస్తే యూకేలో ‘డెల్టా ప్లస్’ వృద్ధి రేటు పెరిగినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి" అని యూకేహెచ్‌ఎస్‌ఏ తెలిపింది.

అయితే, డెల్టా వేరియంట్‌లా "ఆందోళన కలిగించే వేరియంట్‌"(వేరియంట్ ఆఫ్ కన్సర్న్)గా దీనిని పరిగణించడం లేదు.

అత్యంత ప్రమాదకర వేరియంట్లనే ఈ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ విభాగంలో చేర్చుతారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వేలాది వేరియంట్‌లుగా వ్యాపిస్తోంది. వైరస్‌లు ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతూ ఉంటాయి. కాబట్టి కొత్త వెర్షన్‌లు కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

AY.4.2 అనేది డెల్టాలో కొత్త వేరియంట్‌, ఇది స్పైక్ ప్రోటీన్‌ను ప్రభావితం చేసే కొన్ని కొత్త మ్యూటేషన్‌లను కలిగి ఉంటుంది. వైరస్‌ మానవ కణాలలోకి ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది.

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి Y145H, A222V మ్యూటేషన్‌లు, అనేక ఇతర కరోనావైరస్ వేరియంట్‌లలో కనుగొన్నారు.

అమెరికాలో కూడా కొన్ని కేసులు గుర్తించారు. డెన్మార్క్‌లో కొన్ని కేసులు ఉన్నా, AY.4.2 కొత్త ఇన్‌ఫెక్షన్లు తగ్గాయి.

కరోనావైరస్ నుండి పూర్తి రక్షణ పొందడానికి.. ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ మోతాదులను యూకే అందిస్తోంది.

వైరస్‌కు చెందిన ప్రస్తుత కొత్త వేరియంట్ల నుండి రక్షణపొందడానికి టీకాను కొత్తగా అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉందని చెప్పే ఎటువంటి సూచనలు లేవు.

"ప్రజారోగ్య సలహా అనేది అన్ని ప్రస్తుత వేరియంట్‌లకు సంబంధించినదిగా ఉంటుంది. టీకాలు వేసుకోండి. అర్హత ఉన్నవారు, పిలిచిన వెంటనే మీ మూడో లేదా బూస్టర్ మోతాదు కోసం ముందుకు రండి" అని యూకేహెచ్‌ఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీ హ్యారీస్ అన్నారు.

"జాగ్రత్తగా ఉండండి. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ధరించండి. ఇంటి లోపల ఉండేవారిని కలిసినప్పుడు, గదిలో గాలి బయటకు పోయేలా కిటికీలు, తలుపులు తెరవండి. మీకు లక్షణాలు ఉంటే పీసీఆర్‌ పరీక్ష చేపించుకోండి. ప్రతికూల ఫలితం వచ్చే వరకు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండండి"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)