T20 World Cup - IndvsPak: ‘అభిమానుల్లో ఇదివరకటిలా ఆవేశం లేదు.. కానీ థ్రిల్ మాత్రం కొనసాగుతోంది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, బీబీసీ కోసం
అక్టోబరు 24న పాకిస్తాన్‌తో ఆడే మ్యాచ్‌తో ఈసారి భారత్ టీ20 ‘‘వరల్డ్ కప్’’ ప్రయాణం మొదలవుతుంది. దీన్ని కేవలం మ్యాచ్ మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దీని ప్రాధాన్యం చాలా ఎక్కువ.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఓడిన జట్టులో ఆత్మన్యూనత కనిపించొచ్చని వివరిస్తున్నారు.
భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరిగేటప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఉద్వేగం పతాక స్థాయిలో ఉంటుంది. ప్రజల్లో ఉండే ఈ విపరీత ఉద్వేగమే క్రీడాకారుల్లో ఒత్తిడికి కారణం అవుతుంటుంది.
అయితే, ఇదివరకటితో పోలిస్తే, ఈ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ప్రజల్లో ఉన్మాదం తగ్గుతోంది. అయితే, ఉద్వేగం మాత్రం అదే స్థాయిలో కనిపిస్తోంది.
భారత్-పాక్ మ్యాచ్‌లను ఒక సాధారణ మ్యాచ్‌గానే చూస్తామని రెండు దేశాల జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇతర క్రీడాకారులపై ఒత్తిడి తగ్గించేందుకే వారు అలా చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Reuters
నిజానికి రెండు జట్లూ, ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని అనుకుంటాయి. ఈ పంతమే క్రికెట్ అభిమానుల్లో ఉద్వేగాన్ని పెంచుతుంటుంది. మ్యాచ్‌లో గెలిచినా లేదా ఓడినా ప్రస్తుతం క్రికెటర్లు ఇదివరకటిలా పదునైన వ్యాఖ్యలు చేయడం లేదు. ముఖ్యంగా వారి ఆటపైనే వారు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
‘‘భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేటప్పుడు క్రీడాకారులపై ఇదివరకు ఎంత ఒత్తిడి ఉండేదో.. ఇప్పుడు అదే స్థాయిలో ఉంటోంది. నిజానికి ఈ ఒత్తిడిలో ఎలాంటి మార్పూ లేదు. ముఖ్యంగా ఈ ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు క్రికెటర్లు అలా చెబుతుంటారు’’ అని భారత మాజీ క్రికెటర్, నేషనల్ కోచ్ మదన్‌లాల్ చెప్పారు.
భారత్‌లో ప్రతిఒక్క క్రీడాకారుడూ పాక్‌పై పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడాలని భావిస్తాడు. ఒకసారి పాత మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ మ్యాచ్‌లలో మనకు హైవోల్టేజీ కనిపిస్తుంది. రెండు దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ ఇది ఒత్తిడికి కారణం అవుతుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడూ ఒడిదొడుకులే..
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తరచూ ఒడిదొడుకులకు లోనవుతుంటాయి. ఇవి స్పోర్ట్స్ సంబంధాల్లోనూ ప్రతిబింబిస్తుంటాయి. తమ దేశంలో ఉగ్రదాడులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఒకరకమైనమైన విరోధభావం ఏర్పడుతోంది.
భారత్, పాక్‌ల మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోవడంతో... ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లను చాలా మంది యుద్ధాలతో పోలుస్తుంటారు. 1952-53లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఈ ఉన్మాద వాతావరణం మొదలైంది.
ఆనాడు దిల్లీలో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ విజయం సాధించింది. అయితే, లఖ్‌నవూలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలయ్యింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ పరిస్థితుల ప్రభావం క్రీడాకారులపై కూడా కనిపించింది. మ్యాచ్‌లో ఓడిపోతే క్రికెట్ వీరాభిమానులు సృష్టించే ఉద్రిక్త వాతావరణాన్ని తలచుకుని క్రీడాకారులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవారు. ఓడిపోయిన జట్టులోని క్రీడాకారుల ఇళ్లపై రాళ్లతో దాడులు, దోపిడీ లాంటివి కూడా జరిగేవి.

ఫొటో సోర్స్, Getty Images
ఉన్మాదం పతాకస్థాయికి
భారత్, పాక్‌లలోని ప్రజలు క్రికెట్‌ను ఏ స్థాయిలో ప్రేమిస్తారంటే, ఓటమిని అసలు వారు జీర్ణించుకోలేరు. బెంగళూరులో జరిగిన 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆనాడు ఫిట్‌నెస్ కారణాలతో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మ్యాచ్‌లో పాల్గొనలేదు. దురదృష్టవశాత్తు పాక్ ఈ మ్యాచ్ ఓడిపోయింది.
దీంతో ఈ ఓటమికి వసీం అక్రమ్ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు వీరాభిమానులు లాహోర్‌లోని ఆయన ఇంటిపై రాళ్లతో దాడులు చేశారు.
వసీం అక్రమ్‌లానే చాలా మంది క్రికెట్ వీరాభిమానుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లలో తమ దేశ జట్లు ఓడిపోతే, క్రికెట్ అభిమానులు చాలా తీవ్రంగా స్పందిస్తుంటారు. గెలుపును కూడా అలా వేడుకగానే జరుపుకుంటారు.
1999 ఫిబ్రవరి 7న ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ తర్వాత వేడుకలు ఎప్పటికీ మరచిపోలేనివి.
సెకండ్ ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే పది వికెట్లు తీసి జిమ్ లేకర్ రికార్డును సమం చేశారు. దీంతో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీధుల్లో డ్రమ్స్ మోగిస్తూ జరిగిన వేడుకలు ఎప్పటికీ మరచిపోలేనివి.

ఫొటో సోర్స్, Getty Images
కర్ఫ్యూలా మ్యాచ్..
ఒకప్పుడు దూరదర్శన్‌లో మహాభారత్ సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ వచ్చే సమయంలో రోడ్లపై ఎవరూ కనిపించేవారు కాదు. కర్ఫ్యూ విధించినట్లుగా రోడ్లు ఉండేవి. ఎందుకంటే అందరు టీవీ ముందు కూర్చునేవారు.
పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఇలాంటి వాతావరణమే కనిపించేది. మ్యాచ్‌కు రెండు, మూడు రోజుల ముందు నుంచీ దీనిపై విపరీతమైన చర్చ మొదలయ్యేది. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్రేజ్ తగ్గుతూ వస్తోంది. మళ్లీ ఈ క్రేజ్‌ను పెంచేందుకు, కావాలనే భారత్, పాకిస్తాన్‌లను ఐసీసీ ఒక గ్రూప్‌లో పెడుతోంది.
2019 ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ గ్రౌండ్ కెపాసిటీ 26,000 మాత్రమే. అయితే, టికెట్ల కోసం 8 లక్షల మంది అర్జీ పెట్టుకున్నారు. దీని బట్టీ ఈ మ్యాచ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 50 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను టీవీల్లో చూడటంతో సరికొత్త రికార్డు నమోదైంది.
అయితే, గత దశాబ్ద కాలంలో క్రికెట్‌కు అభిమానులు స్పందిస్తున్న తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికీ ఎవరూ తమ జట్టు ఓడిపోవాలని కోరుకోరు. అయితే, ఓటమిని జీర్ణించుకోవడం అలవాటు చేసుకున్నారు. దీంతో ఇదివరకటిలా తీవ్రంగా స్పందించే తీరు తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్, పాక్ తరచూ ఆడటం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్న మాట వాస్తవమే. అయితే, ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లలో రెండు దేశాలు కలిసి ఆడటం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
ఒకప్పుడు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ లాంటి పాకిస్తానీ ప్లేయర్లు భారత ప్రోగ్రామ్‌లలో తరచూ కనిపించేవారు. అయితే, 2019 పుల్వామా దాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. స్పోర్ట్స్‌లోనూ ఈ ఒడిదొడుకులు కనిపించాయి.
ద్వైపాక్షిక బంధాలు గాడి తప్పడంతో, పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడకూడదని డిమాండ్లు వినిపించేవి. పుల్వామా దాడి అనంతరం, 2019 వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడకూడదని డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి.
అయితే, అలాంటి డిమాండ్లను ఐసీసీ పట్టించుకునేది కాదు. ఈసారి మ్యాచ్‌లకు అతిథ్యమిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయినప్పటికీ, అలాంటి డిమాండ్లను పట్టించుకునే అవకాశం లేదు.
(అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- టీ-20 వరల్డ్ కప్: టీమిండియా ఆటగాళ్లెవరు? వారిపై ఉన్న అంచనాలేంటి?
- కోవిడ్ 19: జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళలు ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు
- అత్యాచార బాధితులు 26వ వారంలో అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడం సురక్షితమేనా
- బంగ్లాదేశ్: ‘దుర్గాపూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని గుర్తించాం’ - పోలీసుల ప్రకటన
- ఆర్యన్ ఖాన్ కస్టడీ అక్టోబరు 30 వరకు పొడిగింపు
- ఫేస్‌బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- వైఎస్ జగన్: ‘విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








