తెలంగాణ: అత్యాచార బాధితులు 26వ వారంలో అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సురక్షితం

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, THINKSTOCK

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక పదహారేళ్ల అత్యాచార బాధితురాలి కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పునిస్తూ "కడుపులో బిడ్డ జీవితం కన్నా తల్లి జీవితమే ముఖ్యం" అని చెప్పింది.

రేప్ కారణంగా గర్భవతి అయిన ఆమె అబార్షన్‌కు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ అమ్మాయి అప్పటికే 26 వారాల గర్భంతో ఉంది.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 (సవరణ) కింద అబార్షన్‌కు అనుమతి కోరుతూ ఆమె తరఫున తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, TS HIGH COURT

కోర్టు ఏం చెప్పింది?

"కడుపులో పిండం లేదా పుట్టబోయే బిడ్డ జీవితం, తల్లి జీవితం కన్నా ఎక్కువ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం హుందాగా, ఆత్మగౌరవంతో, ఆరోగ్యకరమైన జీవితం (మానసికంగా, శారీరకంగా) జీవించే హక్కు ఆమెకు ఉంది.

గర్భాన్ని కోరుకునే హక్కు ఎంత ఉందో, గర్భస్రావం చేయించుకునేందుకు కూడా ఆమెకు అంతే హక్కు ఉంది.

ముఖ్యంగా అత్యాచారం లేదా లైంగిక హింస వలన గర్భవతి అయినప్పుడు లేక గర్భం ధరించడానికి ఆమె సిద్ధంగా లేనప్పుడు చట్టపరిమితులకు లోబడి అబార్షన్ చేయించుకునే హక్కు ఆమెకు ఉంటుంది" అని ఈ కేసు విచారణలో జస్టిస్ విజయసేనా రెడ్డి స్పష్టం చేశారు.

మెడికల్ బోర్డు ఏం చెప్పింది?

26వ వారంలో అబార్షన్ చేయించుకునేందుకు మెడికల్ బోర్డు సమ్మతించింది. కానీ, దీని వలన కలిగే ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించింది.

అబార్షన్ తరువాత అధిక రక్తస్రావం కావొచ్చని, రక్తం ఎక్కించాల్సిన అవసరం రావొచ్చని సూచించింది.

ఆరోగ్య సమస్యలు వెంటనే తలెత్తవచ్చు లేదా భవిష్యత్తులో రావొచ్చు. గర్భస్రావానికి ఎక్కువ సమయం పడుతుందని, అది సెప్సిస్‌కు దారి తీయవచ్చని హెచ్చరించింది. సర్జరీ చేసి డెలివరీ చేయాల్సి రావొచ్చని చెప్పింది.

శారీరక, మానసిక ప్రభావాలు

అత్యాచార బాధితురాలి విషయంలో కోర్టు నిర్ణయాన్ని వైద్యులు స్వాగతించారు. కానీ, 26వ వారంలో గర్భం తొలగించడం వల్ల శారీరక, మానసిక ప్రభావాలు ఉండవచ్చని, దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రత్యేక వర్గాల మహిళలకు గర్భస్రావం వ్యవధిని 20 నుంచి 24 వారాలకు పెంచారని దిల్లీ మాక్స్ ఆసుపత్రిలోలోని గైనకాలజిస్ట్ హేమాంగి నేగి తెలిపారు.

ప్రత్యేక వర్గాలు అంటే అత్యాచార బాధితులు, మైనర్‌లు, రక్త సంబంధీకుల చేతిలో లైంగిక హింసకు గురైనవారు, వికలాంగ మహిళలు, ఇతరత్రా ఆపద ఉన్నవారు.

ప్రస్తుత కేసులో 16 ఏళ్ల చిన్న పిల్ల, 26 వారాల గర్భం.. కాబట్టి అబార్షన్ తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేగి అన్నారు.

"సహజంగా గర్భస్రావం జరిగితే ఏ ప్రమాదం ఉండదు. కానీ, ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో అబార్షన్ చేస్తారు కాబట్టి నొప్పులు రావడానికి కొన్ని మందులు ఇస్తారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. సీ సెక్షన్ చేయాల్సి రావొచ్చు. అప్పుడు మరింత ప్రమాదం.

ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మిని లేబర్ ఉంటుంది. నొప్పులు రప్పిస్తారు. నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు. అది కష్టమైతే సీ సెక్షన్ చేస్తారు. ఎందుకంటే కడుపులో బిడ్డ వయసు ఆరు నెలలు" అని నేగి బీబీసీతో చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

రక్తహీనత సమస్యలు

అబార్షన్ తరువాత రక్తహీనత, ఇన్‌ఫెక్షన్, గర్భాశయంలో పగుళ్లు రావొచ్చని మెడికల్ బోర్డు కూడా తెలిపింది.

అయితే, చట్టప్రకారం 26వ వారంలో అబార్షన్‌కు అనుమతి లేదని, కానీ ఒక ప్రత్యేక సందర్భంలో కోర్టు ఇందుకు అనుమతించింది కాబట్టి వెంటనే అబార్షన్ చేయాలని గైనకాలజిస్ట్ షాలినీ అగర్వాల్ సూచించారు. ఆలస్యం అయే కొద్దీ డెలివరీలో సమస్యలు పెరుగుతాయి.

"అబార్షన్ సమయంలో ఎక్కువ రక్తం కోల్పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు రక్తం ఎక్కించాల్సి రావొచ్చు. ముందుగా అన్ని పరీక్షలు చేసే రక్తం ఎక్కిస్తారు. కానీ ఒక్కోసారి రియాక్షన్లు రావొచ్చు. ముందు ముందు గర్భం దాల్చడంలో సమస్యలు ఎదురు కావొచ్చు" అని డాక్టర్ అగర్వాల్ వివరించారు.

అమ్మాయి వయసు 16 ఏళ్లే కావడం మూలాన సీ సెక్షన్ లేదా నార్మల్ డెలివరీకి తన శరీరం సిద్ధంగా ఉండదని డాక్టర్లు అంటున్నారు. అందువల్ల శారీరకంగా, మానసికంగా ప్రభావాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

"ఈ అమ్మాయిలాగ ప్రత్యేకమైన కేసు కాకపోయినా, గర్భం దాల్చిన మహిళలకు రక్తపోటు (బీపీ) పెరిగినా, దాని ప్రభావం కిడ్నీ మీద పడినా, అకస్మాత్తుగా తల తిరగడం, ఒళ్ళు తూలడం లాంటివి జరుగుతున్నా 20 వారాల తరువాత అబార్షన్ చేస్తాం. ఆరోగ్య రీత్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

కానీ, గర్భనిరోధకాలు పని చేయక లేదా సాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చినప్పుడు, 20 వారాల తరువాత అబార్షన్ చేయడానికి చట్టం అనుమతించదు" అని డాక్టర్ నేగీ చెప్పారు.

హేమాంగి నేగి
ఫొటో క్యాప్షన్, హేమాంగి నేగి

చట్టంలో ఏముంది?

ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం, 'మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు 2021' రాజ్యసభలో 2021 మార్చి 16న ఆమోదం పొందింది.

ఈ బిల్లు ద్వారా ప్రత్యేక వర్గాల మహిళలకు గర్భస్రావం వ్యవధిని 20 నుంచి 24 వారాలకు పెంచారు.

భారతదేశంలో 1971 ఆగస్టులో తొలిసారిగా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ బిల్లులో పలు సవరణలు చేస్తూ వచ్చారు.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, 1971 ప్రకారం, 12 వారాల గర్భం అయితే డాక్టర్ సలహాతో అబార్షన్ చేయించుకోవచ్చు. 12 నుంచి 20 వారాల లోపు ఇద్దరు డాక్టర్లను సంప్రదించడం తప్పనిసరి. 20 వారాల తరువాత అబార్షన్‌కు అనుమతి లేదు.

ప్రస్తుత సవరణలో ప్రత్యేక వర్గాల మహిళలకు ఈ గడువును 20 నుంచి 24 వారాలకు పెంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)