Womens Health: లేటు వయసులో గర్భం దాలిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డాక్టర్ శైలజ చందు
    • హోదా, బీబీసీ కోసం

భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్త్రీ తన తొలిబిడ్డను పొందే వయసు పెరుగుతోంది.

మహిళలు విద్య, కెరీర్ పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అన్ని విధాలా స్థిరపడిన తర్వాతే వివాహం, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో మొదటిసారి తల్లి కాబోయే వయసు మునుపటికన్నాపెరుగుతోంది. చదువు, కెరీర్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఒక కారణమైతే, మరో కారణం ఆధునిక వైద్యం.. వయసు మీరిన మహిళలకు కూడా సంతానావకాశాలను కలుగజేస్తోంది.

కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 35- 40 సంవత్సరాలు దాటిన మహిళలు గర్భం దాల్చినపుడు.. తల్లి, బిడ్డా ఇద్దరూ అనారోగ్య సమస్యల బారినపడే అవకాశముంది.

గర్భం దాల్చబోయే ముందు, గర్భంతో ఉన్నపుడు, కాన్పు సమయంలో.. ఇలా ప్రతి దశలోనూ సమస్యలు తలెత్తుతాయి.

అంతే కాకుండా, వయసు పెరిగే కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి. కనుక, కృతిమ పద్ధతుల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది.

అయితే, కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలతో పోలిస్తే, వయసు మీరిన మహిళలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ

ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోం

సంతానం కలగడానికి అండాశయాలను ఉత్తేజితపరిచే మందులు వాడవలసి వస్తుంది.

ఆ క్రమంలో 'ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోం' అనే ఒక పరిస్థితి ఎదురవుతుంది. అండం విడుదల కోసం ఉపయోగించే శక్తివంతమైన హార్మోన్ల ఫలితంగా అండాశయాలు వాచిపోతాయి. పొట్టలో నీరు చేరుతుంది.

దాదాపు 30 శాతం మహిళలలో ఈ సైడ్ ఎఫెక్ట్ తేలిక స్థాయిలో వుంటుంది కానీ, 70 శాతం మంది స్త్రీలలో తీవ్రస్థాయికి చేరుకుని, శరీరంలోని మిగిలిన వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ

కొన్నిసార్లు అండం గర్భాశయంలో ఏర్పడకుండా, పక్కనే వున్న ఫేలోపియన్ ట్యూబులో ఏర్పడుతుంది. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ అంటారు. అలా ట్యూబులో గర్భం వచ్చినపుడు, అక్కడ ఇమడలేక, పగిలిపోయి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీయవచ్చు.

ఇలా జరిగే అవకాశాలు వయసు మీరిన స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువని పరిశోధనలు తెలుపుతున్నాయి.

జన్యు లోపాలున్న బిడ్డలు

తల్లి వయసు పెరిగే కొద్దీ క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ ఉన్న బిడ్డను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పాతికేళ్ల యువతి గర్భం దాల్చితే ఆ ప్రమాదం 1,250 మందిలో ఒకరికి ఉంటుంది. అదే 40 ఏళ్ల మహిళ గర్భం దాల్చితే ఆ రిస్క్ 100 మందిలో ఒకరికి ఉంటుంది.

అంటే 1250 మంది పాతికేళ్ల యువతుల్లో ఒకరికి డౌన్స్ సిండ్రోం బిడ్డ కలిగే అవకాశం వుంటే, నలభై యేళ్లు దాటిన 100 మంది స్త్రీలలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ బిడ్డ పుట్టే అవకాశముంది.

ప్రెగ్నన్సీలో బీపీ పెరగడం

నలభైకు దగ్గరవుతున్న స్త్రీలు గర్భం దాల్చినపుడు హై బీపీ సమస్య వస్తుంది.

ఇరవై, ఇరవై అయిదేళ్ల యువతులలో 2 శాతం మందికి హై బీపీ వచ్చే రిస్క్ వుంటే, నలభై సంవత్సరాలున్న మహిళలలో 26 శాతం మందికి హై బీపీ వస్తుంది.

అధిక రక్తపోటు వల్ల ఫిట్స్ రావడం, బ్రెయిన్‌లోని రక్తనాళాలు చిట్లి, రక్త స్రావం జరగడం, గర్భంలోనే బిడ్డ చనిపోవడం వంటి ప్రమాదాలు జరుగుతాయి.

అధిక బరువు

సాధారణంగానే 40 దాటిన మహిళలు బరువు పెరుగుతారు. వారికి ప్రెగ్నన్సీ వస్తే, బరువు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

బరువు పెరగడం వల్ల బీపీ పెరగడం, షుగర్ వ్యాధి రావడం, ఇంకా రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి.

షుగర్ వ్యాధి

గర్భంతో ఉన్నపుడు మామూలుగానే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. వయసు వల్ల ఆ రిస్క్ మరింత ఎక్కువ అవుతుంది.

ప్రెగ్నన్సీలో వచ్చే షుగర్ వ్యాధి వల్ల బిడ్డ బరువు ఎక్కువగా ఉండడం, కాన్పు కష్టం కావడం, హఠాత్తుగా పొట్టలోనే చనిపోవడం, వంటి ప్రమాదాలు తలెత్తుతాయి.

వెనస్ త్రొంబోఎంబాలిజం

సిరల్లో రక్తం గడ్డ కట్టడం అనే సమస్య 35 సంవత్సరాల వయసు దాటిన మహిళలో ఎక్కువగా ఉంటుంది. ఆ గడ్డలు ఊపిరితిత్తుల వరకూ ప్రయాణిస్తే, ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.

ఈ సమస్య, ఆ స్త్రీ గర్భం దాల్చినపుడు మరింత ఎక్కువయే ప్రమాదం వుంది.

థైరాయిడ్ సమస్య

వయసు మీరిన స్త్రీలలో గర్భం వచ్చినపుడు థైరాయిడ్ గ్రంధి సమస్య కూడా తోడవుతుంది. వీరిలో థైరాయిడ్ సరిగా పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది.

ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోం నిర్థరణకు ఈస్ట్రోజెన్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోం నిర్థరణకు ఈస్ట్రోజెన్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది

కాన్పు కష్టం అవుతుంది

వయసు పెరిగే కొద్దీ సాధారణ కాన్పు జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. సిజేరియన్ ద్వారా కాన్పు చేయవలసి వస్తుంది. కాన్పు తరువాత ఎక్కువ రక్తస్రావం అయ్యే ప్రమాదముంది.

తక్కువ వయసు యువతులతో పోలిస్తే, వయసు మీరిన గర్భిణీ స్త్రీలు ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండవలసి రావడం, ఐసీయూలో చికిత్స ఆవశ్యకత 30 శాతం ఎక్కువ.

పుట్టిన బిడ్డలు సైతం తక్కువ చురుకుదనంతో వుండడమే కాక, పలురకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. పుట్టిన నెల లోపే బిడ్డ చనిపోయే రిస్క్ కూడా అధికమే.

ప్లాసెంటా సమస్యలు

ప్లాసెంటా, గర్భాశయం లోపలి గోడలకు అతుక్కుని వుంటుంది. ఇది తల్లి నుంచి బిడ్డకు ఆహారాన్ని, ఆక్సిజన్‌ను చేరవేసే ముఖ్యమైన భాగం. కాన్పు జరిగాక ఇది బయటపడుతుంది.

గర్భాశయ ముఖద్వారానికి, అంటే కాన్పు జరిగే మార్గానికి ప్లాసెంటా దూరంగా ఉండాలి. వయసు పెరిగిన తర్వాత వచ్చే గర్భాలలో ఇది గర్భాశయ ద్వారానికి దగ్గరగా ఉంటుంది. అరుదుగా ఆ ద్వారాన్ని కప్పివేస్తూ వుంటుంది.

అటువంటి పరిస్థితిలో గర్భంతో ఉన్నప్పుడే రక్తస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. కొన్ని సార్లు అధిక రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు.

ఈ ప్రమాదం ఇరవై ఏళ్ల యువతులతో పోలిస్తే, నలభై ఏళ్ల స్త్రీలలో 2 - 3 రెట్లు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.

అంతే కాదు, ఆరోగ్యవంతమైన ప్లాసెంటా వుండడం వల్ల బిడ్డ పెరుగుదల మెరుగ్గా ఉంటుంది.

వయసు మీరిన స్త్రీలలో ప్లాసెంటా ద్వారా బిడ్డకు ఆహారం, ఆక్సిజన్ సరఫరా అంత సమర్థవంతంగా జరగదు. అందువల్ల తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం లేదా పొట్టలోనే బిడ్డ మరణించడం జరుగుతుంది.

ఎన్నో కారణాల వల్ల మొదటిసారి తల్లి కావడం స్త్రీలలో ఆలస్యమవుతోంది. స్త్రీలు 35- 40 సంవత్సరాలకు గర్భం దాల్చినపుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీరి సంరక్షణ క్లిష్టమైనదే, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదే.

అయినా, ఆధునిక వైద్యం ఎప్పటికప్పుడు సమస్యకు అనుగుణంగా అభివృద్ధి చెందుతోంది. వేర్వేరు శాఖల్లోని వైద్య నిపుణులు ప్రణాళికా బద్ధంగా చికిత్స అందించడం ద్వారా వీరి సంరక్షణ సులభమవుతుంది.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)