పురుషులలో సంతాన లోపం: పిల్లలు లేని మగవారు పడే అవమానాలకు అడ్డుకట్ట పడేది ఎలా? :అభిప్రాయం

సంతానలేమి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ శైలజా చందు
    • హోదా, బీబీసీ కోసం

ఆయన డాక్టర్ ముందు కూర్చున్నారు. తన విషయం మాట్లాడుతూ, మాటి మాటికీ మూసి వున్న తలుపువైపు చూస్తున్నాడు. ఆ తలుపు తోసుకుని ఎవరైనా వస్తారేమోనని భయపడుతున్నాడు.

డాక్టర్ బయట రిసెప్షన్లో నర్సుకి ఫోన్ చేసి "నేను బెల్ కొట్టే వరకూ ఎవర్నీ పంపించొద్దు" అని చెప్పారు.

"ఎవరూ రారు. చెప్పండి."

"కొలీగ్స్ సూటి పోటి మాటలు తట్టుకోలేకపోతున్నాను మేడం. పెళ్లై నాలుగేళ్లవుతున్నా పిల్లలు లేరని అందరూ నవ్వుతున్నారు. భార్యే కాదు, అత్తగారింట్లో అసలు మర్యాద లేదు. బావమరిది , మావగారు నన్నసలు ఇంటి అల్లుడిలా పలకరించడం లేదు. ఎలాగైనా సరే, ఎంత ఖర్చైనా సరే, రమకు ప్రెగ్నన్సీ వచ్చేలా చేయండి. మీ కాళ్లు పట్టుకుంటాను" అని కర్చీఫ్‌ తీసి, కళ్ళు తుడుచుకున్నాడు.

'మగవారు ఏడవకూడదు. అది ఆడవాళ్ల లక్షణం. ఎంతటి బాధనైనా ఓర్చుకోవాలి' ఇవన్నీ అజ్ఞాతంగా మగవాళ్లపై పడిన బరువైన ఆంక్షలు.

"ఏదో రకంగా నాకు హెల్ప్ చెయ్యండి మేడం. లేదంటే నేను చచ్చిపోవాల్సిందే, ఈ అవమానాలు భరించలేను" ఆయన కన్నీళ్లు ధారలు కడుతున్నాయి.

జనం సూటిపోటి మాటలకు, ఒక పసిబిడ్డ సమాధానం చెప్పాలి. అప్పుడే, ఆయన బాధ తీరుతుంది.

ప్రేమించడానికో... పెంచడానికో కాదు.. లోకం నుంచి ఎదురయ్యే బుల్లీయింగ్ తట్టుకోవడానికి ఒక బిడ్డ కావాలి.

సంతానలేమి

ఫొటో సోర్స్, Getty Images

భూమి పుట్టి నలభై మిలియన్ల సంవత్సరాలైంది. ఎంతో మంది పుట్టారు. పోయారు. ఈనాటికీ పక్కింట్లో పిల్లలు పుట్టకపోతే, అది మనకు జీవన్మరణ సమస్య.

పెళ్లయిన ఎనిమిదో నెలలోనే "ఏం బావా, మా చెల్లెలు నీళ్లోసుకోలేదా? నన్ను మావయ్యని చేసే ఉద్దేశం లేదా? నేనా పిలుపుకి నోచుకోలేదా?" అంటూ సరసంగా బుల్లీయింగ్ మొదలెడతారు.

ఇది ప్రాణాంతకమైన సరసం. ఆడవారికి తోడికోడలి పోరులా, మగవారికి కూడా ఇలాంటి బుల్లీయింగ్ ఉంటుంది.

వాళ్ల పిల్లలకు ముక్కు తుడిచే తీరిక ఉండదు కానీ, వేరే వాళ్లకు పిల్లలు లేకపోతే మాత్రం అల్లాడిపోతుంటారు.

"ఆ డాక్టరమ్మ దగ్గరకెళ్లు. ఆవిడ చెయ్యి మంచిది. ఈ స్వామీజీ దీవెనలు తీసుకుంటే సంతాన యోగం వస్తుంది" అనే సలహాలతో తోటివారి జీవితం నరకం చేస్తుంటారు.

సంతానలేమి

ఫొటో సోర్స్, bambam kumar jha/getty images

ప్రకృతిలోని ప్రతి జీవి పునరుత్పత్తి ద్వారా తన ఉనికిని నిలబెట్టుకుంటోంది.

సంతానం కోరుకునే జంటల్లో 90 శాతం మంది సహజంగానే బిడ్డకు జన్మనిస్తారు. మిగిలిన పది శాతం జంటలకు వైద్య సహాయం అవసరం అవుతుంది.

సంతానం ఆలస్యం కావడానికి పురుషులకు సంబంధించిన కారణాలు సుమారు 30 శాతం ఉంటాయి. అవి మూడు రకాలు.

  • వీర్య కణాల ఉత్పత్తిలో సమస్య.
  • వీర్య కణాలు అండాన్ని చేరుకునే ప్రయాణంలో ఇబ్బందులు.
  • లైంగిక పటుత్వం లేకపోవడం

కొంత మందిలో చెప్పుకోదగ్గ ఏ కారణమూ లేకపోవచ్చు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.

మూడు దశాబ్దాల క్రితం భారతీయ పురుషుల్లో, ఒక మి.లీ వీర్యంలో వీర్యకణాల సంఖ్య 60 మిలియన్లు ఉండేదని, ప్రస్తుతం అది 20 మిలియన్లకు పడిపోయిందని ఎయిమ్స్ వైద్యుల ఒక అధ్యయనంలో తేలింది.

వీర్య కణాల సంఖ్య ఇలా తగ్గడానికి అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణం అని చెప్పారు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార లోపాలు, మద్యం, పొగతాగడం, సరిగా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి లాంటివి దీనికి కారణమని పేర్కొన్నారు.

వీర్య కణాల తగ్గడానికి, పురుషుల్లో సంతానం కలగకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

సంతానలేమి

ఫొటో సోర్స్, Getty Images

హార్మోన్ సంబంధిత కారణాలు:

హైపోథలమస్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, ప్రొలాక్టిన్ (పాల వుత్పత్తి సంబంధించిన హార్మోన్) స్థాయి పెరగడం , స్టెరాయిడ్ల వాడకం, థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోవడం.

జన్యుపరమైన లోపాలు:

పురుషుల్లో సాధారణంగా ఉండవలసిన Xy క్రోమోజోములకు బదులు, XXY, లేదా XO వుండడం వల్ల వీర్యకణాలు లోపించి సంతానలోపం ఉంటుంది.

వృషణాలకు సంబంధించిన సమస్యలు:

వృషణాలకు దెబ్బ తగలడం, ఇన్ఫెక్షన్ లేదా కాన్సర్ రావడం. కేన్సర్‌కు కీమోథెరపీ, రేడియో థెరపీలు చేయించుకోవడం వల్ల కూడా సంతానం కలిగే అవకాశాలు తగ్గుతాయి.

వృషణాల నుంచి వీర్యం ప్రయాణించే నాళంలో అడ్డంకులు ఏర్పడడం వల్ల వీర్య కణాలు అండం వరకూ ప్రయాణించలేవు.

కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా సంతానం కలిగే అవకాశాలను తగ్గిస్తాయి.

ఒత్తిడి(డిప్రెషన్):

మానసిక ఒత్తిడి వల్ల స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుందని పరిశోధనల్లో తేలింది. డిప్రెషన్ వల్ల వీర్య కణాల సాంధ్రత, కదలికలు తగ్గడమే కాక, అసాధారణ ఆకృతిలో ఉన్న కణాలు ఎక్కువవుతాయని కనుగొన్నారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ఊబకాయం(ఒబెసిటీ)

మగవారిలో వీర్య కణాలకు , వారి బరువుకు కూడా సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది.

సాధారణ బరువున్న పురుషులతో పోలిస్తే ఊబకాయం ఉన్న మగవారిలో సంతానం కలిగే అవకాశాలు తక్కువ.

వారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా వున్నట్లు కనుగొన్నారు. సాధారణంగా గర్భం రావడానికే కాదు, కృత్రిమ గర్భధారణ పద్ధతుల వల్ల గర్భాన్ని పొందాలనుకునే వారికి కూడా అధిక బరువు ఒక సమస్య.

ఆహారం & సంతానోత్పత్తి

పళ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, సెలేనియం, జింక్ , ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్ లాంటివి వీర్యం నాణ్యతను పెంచడానికి దోహదపడతాయి.

అధిక కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన మాంసం, ఆల్కహాల్, కాఫీ లాంటివి సెమెన్ క్వాలిటిని, సంతాన అవకాశాలను తగ్గిస్తాయి.

పొగతాగడం, మద్యం సేవించడం

పొగతాగడం వల్ల సెమెన్ క్వాలిటీ పైన దుష్ప్రభావాలు ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించే జంటలు స్మోకింగ్‌కు దూరంగా ఉండడం మంచిది.

స్మోకింగ్ వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గడమే కాకుండా, వాటి కదలికలు తగ్గడం, వాటి ఆకారంలో అసహజ మార్పులు రావడం జరుగుతుంది. అలాంటి అసాధారణ వీర్యం సంతానోత్పత్తికి ఉపయోగపడవు.

ఆల్కహాల్ తీసుకునే వారిలో సంతానం పొందడానికి అవసరమైన హార్మోన్లు తగ్గుతాయి. అంతే కాదు వీర్య పరిమాణం, వీర్య కణాల సంఖ్య, వాటి కదలిక, సరైన ఆకృతి వున్న కణాలు తగ్గిపోతాయి.

నిద్రలేమి

యువతలో ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఎక్కువవుతోంది.

నిద్ర లేమి వల్ల వృషణాల పరిమాణం, స్పెర్మ్ క్వాలిటీ రెండూ తగ్గుతాయి.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, Science Photo Library

పురుషులకు సంతానం ఆలస్యమైతే?

జీవనశైలిని మార్చుకోవడం (సరైన ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, ఆల్కహాల్, పొగతాగడం తగ్గించడం) వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరిగి, సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి

రకరకాల కారణాలను బట్టి వీరికి చికిత్స వుంటుంది, అది తెలుసుకోడానికి కొన్ని పరీక్షలు అవసరం అవుతాయి.

వీరికి ముందుగా వీర్య పరీక్ష చేయించాలి. వీర్య కణాల సంఖ్య, కదలికలు, వాటి ఆకారం WHO ప్రమాణాలకు లోబడి ఉందా అనేది చూడాలి.

ఏదైనా తేడా గమనించినపుడు, మరోసారి పరీక్షలు చేయాలి. కొన్ని సందర్భాలలో క్రోమోజోముల పరీక్ష, హార్మోన్ల స్థాయి, వృషణాల నుంచి కణాలు సేకరించి బయాప్సీ చేయాల్సి ఉంటుంది.

ఈ పరీక్షల ద్వారా వీర్య కణాలు సాధారణంగానే ఉన్నాయా లేక పరిణితి చెందే దశలోనే ఆగిపోతున్నాయా అనే విషయం స్పష్టమవుతుంది.

sperm penetration assay(SPA), hemizona assay (HZA) అనే ఈ రెండు పరీక్షల ద్వారా వీర్యకణం, అండంలోనికి చొచ్చుకుని పోయే సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.

పురుషులలో హార్మోన్ల లోపానికి అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీర్యకణాల లోపాన్ని అధిగమించి, సంతానం పొందడానికి ఎన్నో వైద్య పద్ధతులు ఉన్నాయి.

ఉదాహరణకు వీర్యకణాల్లో చిన్న చిన్న లోపాలకు టెస్ట్ ట్యూబ్ ప్రెగ్నన్సీ (IVF), పెద్ద లోపాలకు (ICSI) ట్రీట్‌మెంట్స్ ఉన్నాయి.

గర్భాశయంలోకి వీర్యం ప్రవేశపెట్టడం(Intra uterine insemination): ఈ పద్ధతి ద్వారా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, స్పెర్మ్ కాన్సంట్రేషన్ వల్ల, నాణ్యమైన కణాలనే వేరు చేసి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)