మోదీ జాబ్ దో, మోదీ రోజ్‌గార్ దో... ట్విటర్‌లో మార్మోగిపోతున్న హ్యాష్‌ట్యాగులు

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PTI

    • రచయిత, నిధి రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత కొద్ది రోజులుగా "మోదీ_రోజ్గార్_దో", మోదీ_జాబ్_దో" అనే హ్యాష్‌ట్యాగులతో ట్విటర్ దద్దరిల్లిపోతోంది. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటూ అనేకమంది డిమాండ్ చేస్తున్నారు.

కంబైండ్ గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సరిగ్గా నిర్వహించలేదని కొందరు విద్యార్థులు ఆరోపణలు చేయడమే ట్విటర్‌లో ఈ హాష్‌ట్యాగులు ట్రెండ్ అవ్వడానికి ప్రధాన కారణం.

ప్రభుత్వ కార్యాలయాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణుల ఉద్యోగాలు పొందేందుకు ప్రతీ సంవత్సరం లక్షలాది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తారు.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 26 ఏళ్ల రంజీత్ రఘునాథ్ గత ఏడాది అగ్రికల్చర్‌లో పీజీ పూర్తి చేసుకుని, వ్యవసాయ విభాగంలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియతో రంజీత్ ఇప్పటికే బాగా విసిగిపోయి ఉన్నారు.

"ముందుగా, వాళ్లు తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించరు. ఒకవేళ కల్పించినా, పరీక్షలు సరిగ్గా నిర్బహించరు. పోనీ అది సవ్యంగా జరిగినా, ఫలితాల్లో గందరగోళం జరుగుతుంది. నేను ఇప్పటి వరకూ వ్యవసాయ విభాగంలో అనేక పరీక్షలకు హాజరయ్యాను. నాకు రావలసిన న్యాయమైన అవకాశం కోసం పోరాడుతూనే ఉన్నాను. పరీక్షా ఫలితాల్లో పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి" అని రంజీత్ బీబీసీతో చెప్పారు.

రంజీత్ కూడా "మామా_రోజ్గార్_దో" అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింఘ్ చౌహాన్‌ను ఆ రాష్ట్రంలో "మామా" అని సంభోదిస్తారు.

"హక్కుల కోసం పోరాడుతున్న యువకుల్లో నేనూ ఒకడిని. దీనిపై ఒక చర్చను ప్రారంభించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాం. దీని గురించి మేము ఏదో ఒకటి చెయ్యాలి" అని రంజీత్ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఇండియాలో నిరుద్యోగ సమస్య

ఉద్యోగాల గురించి యువత ఈ స్థాయిలో ట్వీట్ చేస్తూ, చర్చలు జరపడానికి ప్రధాన కారణం ప్రస్తుతం దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాల ప్రకారం.. 2021 జనవరిలో దేశంలోని నిరుద్యోగుల సంఖ్య నాలుగు కోట్లు.

ఇందులో రెండు రకాల నిరుద్యోగులు ఉన్నారు.. ఉద్యోగం లేక వెతుక్కుంటున్నవాళ్లు, ఉద్యోగం వెతుక్కోకుండా ఉన్నవాళ్లు.

అయితే, 2020 డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు 9.1 శాతం నుంచీ 2021 జనవరిలో 6.5 శాతానికి తగ్గింది.

2019-20 ఆర్థిక సంవత్సరం చివరికొచ్చేసరికి ఇండియాలో సుమారు 40 కోట్ల ఉద్యోగులు, 3.5 కోట్ల నిరుద్యోగులు ఉన్నారని సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయి.

దీనికి ప్రతీ ఏడాది సుమారు రెండు కోట్ల శ్రామిక జనాభా (వర్కింగ్-ఏజ్ పాపులేషన్) అంటే 15 నుంచీ 59 ఏళ్ల లోపువారు అదనంగా కలుస్తూ ఉంటారు.

కాగా, 30 ఏళ్లు దాటిన పీయూష్ మాల్వీయలాంటివారు ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నాలు చేసి విఫలమవడంతో ప్రయత్నాలు విరమించుకుంటున్నారు.

"నేను 2016లో పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశాను. తరువాత అనేకమార్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. కానీ ఒక్కసారి కూడా నా ప్రయత్నాలు ఫలించలేదు. 2011లో నా బీఎడ్ పూర్తి అయ్యింది. టీచర్ అవ్వాలనుకున్నాను. ఆ కోరికా నెరవేరలేదు" అని మహరాష్ట్రలోని చిఖల్దారకు చెందిన పీయూష్ తెలిపారు.

ప్రస్తుతం పీయుష్, తన తండ్రి నడుపుతున్న మొబైల్ ఎలక్టానిక్స్ వ్యాపారాన్నే అందిపుచ్చుకున్నారు. పీయూష్ కూడా ట్విటర్‌లో పై హాష్‌ట్యాగులతో ట్వీట్ చేశారు. నిరుద్యోగ సమస్య గురించి చర్చించడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఏం జరగకపోయినా, కనీసం జనం దాని గురించి మాట్లాడుతున్నారు. యువత నిరుద్యోగంలో కూరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడాలి. ఈ విషయాలను చర్చించడానికి సోషల్ మీడియా ఒక ముఖ్య వేదికగా నిలిచింది" అని పీయూష్ అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో నిరుద్యోగ సమస్య ఇంతగా ప్రబలడానికి కారణాలేంటి?

డీమానిటైజేషన్ వలనే మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ అభిప్రాయపడ్డారు.

"డీమానిటైజేషన్ అసంఘటిత రంగాన్ని అతలాకుతలం చేసింది. దాని నుంచి కోలుకుంటూ ఉండగానే కరోనావైరస్ దాడి మొదలైంది. సమస్య మరింత జటిలం అయిపోయింది" అని ఆయన అన్నారు.

ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీవ్రంగా పరిగణించకపోవడమే అన్నిటికన్నా పెద్ద సమస్య అని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ అంటున్నారు.

"ఆర్థికాభివృద్ధిని పెంచే దిశలో మూలధనానికి ప్రాముఖ్యతనిచ్చే పరిశ్రమల ఏర్పాటు, వృద్ధి జరుగుతోంది. కానీ శ్రామికుల సంఖ్య పెంచే విధంగా పరిశ్రమ అభివృద్ధి జరగట్లేదు. ప్రభుత్వం తగినన్ని నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించడం లేదు. ఉద్యోగావకాశాలు పెంపొందించే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి. ఎకనామిక్ సర్వేగానీ, యూనియన్ బడ్జెట్ 2021 గానీ ఈ సమస్య గురించి చర్చించనే లేదు" అని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని సీఎంఐఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

2021 జనవరిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య స్థాయి 8 శాతం దగ్గర ఉండగా, గ్రామీణ ప్రాంతల్లో 5.8 శాతం ఉంది.

ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ) పథకంలాంటిది తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ పథకం కింద ప్రభుత్వం గ్రామీణ ప్రాంతల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతీ ఇంటికీ 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తుంది. ఈ పథకం కింద ఉపాధికి దరఖాస్తు పెట్టుకున్నవారికి 15 రోజులలోపు ఉద్యోగం రాకపోతే, ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతిని అందజేస్తుంది.

"పట్టణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టడం గురించి చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా అమలు చేస్తారనేది భవిషత్తులో తెలుస్తుంది" అని ప్రణబ్ సేన్ తెలిపారు.

దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ముందు దాన్ని ఒక సమస్యగా గుర్తించాలని మహేశ్ వ్యాస్ అంటున్నారు.

"ముందు దాన్ని ఒక సమస్యగా గుర్తిస్తే, అప్పుడు పాలసీ విధానాల గురించి చర్చించవచ్చు" అని ఆయన అన్నారు.

"ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాల ప్రోత్సాహంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి" అని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ బీబీసీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రస్తుతం నిరుద్యోగ సమస్య గురించి ట్విటర్‌లో ఆరంభమైన చర్చలు ఎటు దారి తీస్తాయన్నది వేచి చూడాల్సిందే.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)