కరోనావైరస్: ఊబకాయులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా?

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ఊబకాయంతో బాధపడేవారు గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 మధుమేహం సహా అనేక రకాల కొత్త రుగ్మతల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఊబకాయులపై ప్రస్తుత కరోనావైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి.

ఊబకాయంతో బాధపడేవారికి ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు నిపుణులు విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు.

బ్రిటన్‌లో దాదాపు 17,000 కోవిడ్-19 రోగులపై ఒక పరిశీలన జరిగింది. ఊబకాయం లేనివారితో పోల్చితే బీఎంఐ 30కి మించి ఉండి, ఊబకాయంతో బాధపడేవారు చనిపోయే ప్రమాదం 33 శాతం అధికంగా ఉంది.

కోవిడ్-19 సోకిన మిగతా రోగులతో పోల్చితే ఊబకాయులు చనిపోయే అవకాశం రెట్టింపు శాతం ఉందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ విభాగం నిర్వహించిన మరో అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ వారికి ఆ ఊబకాయంతో పాటు గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం లాంటి ఇతర సమస్యలు కూడా ఉంటే, వారు చనిపోయే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

ఆరోగ్యం విషమించి బ్రిటన్‌లోని ఐసీయూలలో చికిత్స పొందుతున్న రోగుల మీద మరో అధ్యయనం జరిగింది. కోవిడ్-19 బారిన పడి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నవారిలో 34.5 శాతం మంది అధిక బరువు, 31.5 శాతం మంది ఊబకాయం, 7 శాతం మంది తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్నవారు (మొత్తం 73 శాతం మంది) ఉన్నారు. మిగతా 26 శాతం మంది ఆరోగ్యకరమైన స్థాయిలో బీఎంఐ ఉన్నవారు.

కరోనావైరస్ రోగుల్లో అత్యధిక శాతం మంది బీఎంఐ 25కి మించి ఉంటోందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ చెబుతోంది. చైనా, అమెరికా, ఇటలీ దేశాల్లో జరిగిన ప్రాథమిక అధ్యయనాలు కూడా ఊబకాయం ఒక ముఖ్యమైన ప్రమాద కారకమని చెబుతున్నాయి.

వయసు మీద పడటం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం లాంటి కారణాలతో కోవిడ్-19 ప్రభావం మరింత తీవ్రమవుతోంది.

ఊబకాయులకు బయటకు కనిపించని రుగ్మతలు చాలా ఉండే అవకాశం ఉంది

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, ఊబకాయులకు బయటకు కనిపించని రుగ్మతలు చాలా ఉండే అవకాశం ఉంది

ఊబకాయం ఎందుకు ప్రమాదకరం?

మీరు బరువు ఎంత ఎక్కువ ఉంటే, మీ శరీరంలో అంత ఎక్కువ కొవ్వు ఉన్నట్లు అర్థం. దాని వల్ల మీ శరీర దృఢత్వం తగ్గుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. అప్పుడు రక్తంలో ఆక్సిజన్ కలిసి అది శరీరమంతటికీ ప్రసరించడం కష్టంగా మారుతుంది. అది గుండె, రక్త ప్రవాహంపై కూడా ప్రభావం చూపుతుంది.

“అధిక బరువు ఉన్నవారి శరీరానికి ఆక్సిజన్ కూడా ఎక్కువగా అవసరం అవుతుంది. దాంతో, వారిలోని ఊపిరితిత్తుల వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది” అని గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నవీద్ సత్తార్ చెప్పారు.

కోవిడ్-19 లాంటి వ్యాధుల వల్ల ఊబకాయుల ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంటుంది.

“ఊబకాయంతో బాధపడేవారిలో అప్పటికే కీలకమైన అవయవాలకు సరిపడా ఆక్సిజన్ అందదు. వారికి కోవిడ్-19 సోకితే, అది శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది” అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన డాక్టర్ ద్యాన్ సెల్లాయా వివరించారు.

అధిక బరువు ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉంది

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, అధిక బరువు ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉంది

ఎంజైమ్ పాత్ర ఏంటి?

మన శరీర కణాల్లో ACE2 అనే ఎంజైమ్ ఉంటుందని, కణాలలోకి కరోనావైరస్ ప్రవేశించడానికి ప్రధాన మార్గం ఆ ఏంజైమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఊబకాయులలో చర్మం కింద, అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కణాలలో ఈ ఎంజైమ్ అధికంగా ఉంటుందని చెబుతున్నారు. వారు సులువుగా కరోనావైరస్ బారిన పడి, తీవ్ర అనారోగ్యానికి గురవడానికి ఇదొక కారణం అయ్యుండొచ్చు.

రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుందా?

హానికారక సూక్ష్మ క్రిములను సమర్థంగా ఎదర్కోవాలంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. కానీ, ఊబకాయంతో బాధపడేవారిలో అది బలహీనంగా ఉంటుంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఇంకా ఏవైనా కారణాలు దాగి ఉండొచ్చా?

ఊబకాయంతోపాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సరిగా పనిచేయకపోవడం లాంటి ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. కోవిడ్-19 లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేవరకూ ఆ రుగ్మతలు పెద్దగా బయటపడకపోవచ్చు.

ఊబకాయుల్లో రక్తం గడ్డకట్టడం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతుంటారు. అయితే, అందుకు కారణం ఏంటన్నది స్పష్టంగా తెలియదు.

ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలి?

ఊబకాయానికి ప్రధాన కారణం మనం ఎంచుకునే జీవన విధానమేనని 80 శాతం మంది డాక్టర్లు చెప్పే మాట.

ఊబకాయం రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే ఉత్తమ మార్గం.

ఫాస్ట్ వాకింగ్, జాగింగ్, సైకిల్ తొక్కడం లాంటివి చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

నెమ్మదిగా కొద్దికొద్దిగా తినడానికి ప్రయత్నించండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవద్దు.

ఆహారంలో పరిమాణం కన్నా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)