వైజాగ్ గ్యాస్ లీకేజీ ప్రమాదం: ప్రజల సంక్షేమమే ముఖ్యం, కంపెనీ కాదన్న ప్రభుత్వం.. విచారణకు వివిధ కమిటీల ఏర్పాటు

ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ భవనం

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వల్ల తలెత్తిన కాలుష్యం పూర్తిగా అదుపులో ఉందని జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఈ అంశంపై ఆయన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్థి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రహదారులు, భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌లతో కలసి మీడియాతో మాట్లాడారు.

లీకేజి ప్రభావం నుంచి ఆ ప్రాంతం కోలుకుంటుందని, గాలిలో కలసిన గ్యాస్ ప్రభావం తగ్గుతుందని కన్నబాబు తెలిపారు. 8వ తేదీ రాత్రి 7 గంటలకు 17.5 పీపీఎం ఉండగా ప్రస్తుతం 1.9 పీపీఎం ఉందని చెప్పారు. గ్యాస్ ప్రభావం వాతావరణంలో చాలా వేగంగా తగ్గుతోందని వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం కూడా మరోసారి పరిశీలించిన అనంతరం ప్రజలు తమ ఇళ్లకు ఎప్పుడు తిరిగిరావచ్చో ప్రకటిస్తామని తెలిపారు.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డైరక్టర్ అధ్యక్షతన అంతర్గత కమిటీ, ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ప్రొఫెసర్ ఎస్. బాల ప్రసాద్ అధ్యక్షతన మరో కమిటీలు విచారణ చేయడంతో పాటు తిరుపతి ఐఐఎస్ఈఆర్ బృందం కూడా అధ్యయనం చేసి సూచనలు, సాంకేతిక అంశాలపైన సలహాలు ఇస్తారన్నారు.

"పారిశ్రామిక నిపుణులతో కేబినెట్ కార్యదర్శి ఒక కమిటీని పంపిస్తున్నారు. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన బృందం వచ్చి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటంపై సూచనలు ఇస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ నాగ్‌పూర్ బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిదేదిక అందిస్తుంది. గ్యాస్ లీకేజీ ప్రజలపై చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మెడికల్ అండ్ హెల్త్ కమిటీ ఉంటుంది. వీరంతా రేపటి నుంచే తమ పని ప్రారంభిస్తారు" అని చెప్పారు.

మొత్తం 585 మంది హాస్పటళ్లలో చేరగా, 173 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు.

ప్రజల సంక్షేమం, భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని, కంపెనీ కాదని బొత్స అన్నారు. విచారణ కమిటీల నివేదికలు రాగానే వాటికి అనుగుణంగా కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు
ఫొటో క్యాప్షన్, పాలీ ఎల్జీమర్స్ భవనం వద్ద నుంచి మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు

ఉదయం నుంచి ఏం జరిగింది?

విశాఖపట్నం నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద స్థానికులు, గ్యాస్ లీకేజి ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు.

మూడు మృతదేహాలను కంపెనీ భవనం వద్దకు తీసుకువచ్చి వారు నిరసన తెలిపారు.

ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.

సీపీఐ, సీపీఎం సహా పలు పార్టీల నాయకులు గ్రామస్తులకు మద్దతుగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

శనివారం ఉదయం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ ప్రదేశానికి వచ్చారు. ఆ తర్వాత గ్రామస్తులు ఇక్కడికి చేరుకున్నారు.

మంత్రులు అవంతి శ్రీనివాస్, జయరాంలు కూడా ఇక్కడికి వచ్చారు.

ఆందోళన చేస్తున్నవారు మంత్రులను నిలదీశారు. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేయాలని వారు డిమాండ్ చేశారు. మంత్రులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అయితే, మంత్రుల మాటల్ని స్థానికులు పట్టించుకోలేదు. తక్షణం ఫ్యాక్టరీని మూసేయాలని, ఈ మేరకు అధికారికంగా ప్రకటించాలని కోరారు. కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

‘‘మూడు రోజులు గడుస్తోంది. కంపెనీకి సంబంధించిన వాళ్లు ఒక్కళ్లైనా మా దగ్గరికి వచ్చారా?’’ అని ఆందోళన కారులు ప్రశ్నించారు.

గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్
ఫొటో క్యాప్షన్, గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రి అవంతి శ్రీనివాస్

దాదాపు అరగంట పాటు ఆందోళన కారులతో మాట్లాడిన తర్వాత మంత్రులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఆందోళన కారుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అక్కడ వేసిన టెంట్‌ను తొలగించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం మొదలైంది.

దీంతో కొంత సేపు గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కంపెనీ మూసేయాలన్న డిమాండ్‌ను తాము నెరవేర్చలేమని, శాంతి భద్రతల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు కోరారు.

‘‘ప్రజల్ని కాపాడినప్పుడు మేం మంచోళ్లమా.. మా హక్కుల కోసం పోరాడితే చెడ్డోళ్లమా’’ అని ఆందోళన చేస్తున్నవారు పోలీసులను నిందించారు.

కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

మృతుల బంధువులతో చర్చించి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సూచించి, అంబులెన్స్‌ల సహాయంతో వాటిని తరలించారు.

‘కరోనా కన్నా ఇదే ప్రమాదకరం’

కాగా, పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనావైరస్ సోకితే బతికే అవకాశం ఉందని, వెంటనే చనిపోరని, చికిత్స కూడా ఉందని.. లీకైన గ్యాస్‌ను పీల్చినవాళ్లు అక్కడికక్కడే మృతి చెందారని.. కరోనాకంటే ఈ గ్యాసే ఎక్కువ ప్రమాదకరమని ఆందోళన కారులు అన్నారు.

కరోనావైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని, కాబట్టి ఆందోళన విరమించుకుని, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు కోరినప్పుడు స్థానికులు ఇలా స్పందించారు.

తెల్లవారుజామున గ్యాస్ వాసన వచ్చిందని, కరోనా వైరస్‌ను నివారించేందుకు ఏవో మందులు చల్లుతున్నారని తాము అనుకున్నామని ఆందోళనలో పాల్గొన్న మహిళ ఒకరు బీబీసీతో చెప్పారు.

అయితే, కొద్దిసేపటికి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోయిందని, దాంతో తలో దిక్కూ పరిగెత్తామని చెప్పారు. ఆ క్రమంలో ఫ్యాక్టరీ వైపు వచ్చినవాళ్లు చనిపోయారని, వేరే దిక్కుకు వెళ్లిన వాళ్లు బతికిపోయారని ఆమె అన్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)