మానసిక ఆరోగ్యం: "నా కూతురిని మెంటల్ ఆసుపత్రిలో వదిలి వస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది"

రేచెల్ పెద్ద కూతురితో

ఫొటో సోర్స్, Andrew Fox

ఫొటో క్యాప్షన్, రేచెల్ పెద్ద కూతురితో
    • రచయిత, సరోజ్ పథిరాణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అక్టోబరు 10వ తేదీని మానసిక ఆరోగ్య దినంగా నిర్ణయించింది. 2021వ సంవత్సరానికి "అసమానతలతో కూడిన ప్రపంచంలో మానసిక ఆరోగ్యం" అనే అంశాన్ని థీమ్ గా నిర్ణయించింది.

అల్పాదాయ దేశాలు, పేద దేశాల్లో 75% -95% మంది ప్రజలు మానసిక ఆరోగ్య సేవలను పొందలేకపోతున్నారని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ పేర్కొంది. ఈ సమస్య పేద దేశాలకు మాత్రమే పరిమితం కాదు.

సంపన్న దేశాల్లో నివసిస్తున్న వారు కూడా అవసరమైన సేవలను పొందేందుకు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బీబీసీ వివిధ దేశాలకు చెందిన ఒక మాజీ మానసిక రోగి, ఒక రోగి తల్లి, ఒక కేర్ వర్కర్, ఒక మానసికవైద్య నిపుణురాలితో మాట్లాడింది. మానసిక ఆరోగ్య సేవలు అవసరం ఉన్నవారు దానిని పొందేందుకు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసుకుంది.

తిరుచెల్వి

ఫొటో సోర్స్, P. Thiruchelvi

ఫొటో క్యాప్షన్, తిరుచెల్వి

రోగి: ఐడి కార్డు లేకపోతే చికిత్స లేదు

పి తిరుచెల్వికి వివాహం జరిగినప్పటి నుంచీ భర్త ఆమెను వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు.

ఆమెను తీవ్రంగా హింసించేవారు. ఆ వేదన మిగిల్చిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు కూడా ఆమె తీవ్రమైన బాధకు గురయ్యారు.

తిరుచెల్వి ఒక కొడుక్కి జన్మనిచ్చిన కొన్నేళ్ల తర్వాత 2009లో ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఆ వేదనతో ఆమె మానసిక వ్యథకు లోనయ్యారు.

తిరుచెల్వి, ఆమె కొడుకు నిరాశ్రయులయ్యారు. చేతిలో ఒక్క పైసా లేదు. ఆకలితో అలమటించారు. వారు తమిళనాడులోని గుదలూర్ జిల్లాలో ఉన్నారు. అయితే, ఆమె ఉనికిని నిరూపించుకునేందుకు ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలూ లేవు.

ఆమె తీవ్రమైన మానసిక వేదనకు లోనయ్యారు. ఆమెకు మద్దతిచ్చేందుకు ఎవ్వరూ లేరు.

అధికారిక పత్రాలు లేనిదే ప్రభుత్వ వైద్య సేవలను అందుకోవడం భారతదేశంలో చాలా కష్టమైన పని.

గ్రామస్థులతో తిరుచెల్వి

ఫొటో సోర్స్, P. Thiruchelvi

ఫొటో క్యాప్షన్, గ్రామస్థులతో తిరుచెల్వి

చాలా మంది లాగే, ఉనికిని నిరూపించుకునేందుకు ఆమె దగ్గర కూడా అధికారిక గుర్తింపు పత్రాలు లేవు. ఒక స్థిరమైన చిరునామా లేదు. దాంతో, గుర్తింపు పత్రాలను పొందే అవకాశం కూడా లేదు.

ప్రభుత్వ వైద్య సేవలు తీసుకునే పరిస్థితులు లేకపోవడంతో ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించింది.

"నాకేమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాలేదు. నా ప్రాణాలు తీసుకోవాలనిపించింది" అని ఆమె చెప్పారు.

అయితే, ఆమె ఎలాగో ఒకలా చెన్నై వెళ్లగలిగారు. అక్కడ బన్‌యాన్ అనే స్వచ్చంద సంస్థకు చెందిన బృందం ఆమెను గుర్తించింది.

అదే సమయంలో బన్‌యాన్ నిరాశ్రయులకు సహాయం చేసే ప్రాజెక్టు పై పని చేస్తోంది.

గ్రామస్థులతో తిరుచెల్వి

ఫొటో సోర్స్, Thiruchelvi

ఫొటో క్యాప్షన్, గ్రామస్థులతో తిరుచెల్వి

దీంతో, తిరు చెల్వికి, ఆమె కుమారుడికి పరిస్థితులు మెరుగయ్యాయి. స్వచ్చంద సంస్థ ఆమెను ఒక హోటల్‌లో పెట్టి చికిత్స ఇప్పించడం మొదలుపెట్టింది.

ప్రస్తుతం ఆమె స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మానసిక ఆరోగ్య సేవలను పొందేందుకు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను వైద్య సేవలు అందించే సంస్థలతో అనుసంధానం చేసే పనిని చేస్తున్నారు.

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లితండ్రుల పిల్లలతో కూడా కలిసి ఆమె వారికి సహాయం అందేలా చూస్తున్నారు.

ఫిలిప్పా రీకీ

ఫొటో సోర్స్, Philippa Reekie

ఫొటో క్యాప్షన్, ఫిలిప్పా రీకీ

ఆరోగ్య సంరక్షకురాలు:ఎటువంటి సహాయం లభిస్తుంది?

దక్షిణ ఆఫ్రికాలో 2014లో 1.7 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడితో, మత్తు మందుల ప్రభావంతో, ఆందోళన, స్కిజోఫెనియా లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ది సండే టైమ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా పేర్కొంది.

సౌత్ ఆఫ్రికా స్ట్రెస్ అండ్ హెల్త్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ వివరాలను ప్రచురించింది. ఈ అధ్యయనంలో 30.3 శాతం మంది వయోజనులు తమ జీవితకాలంలో ఏదో ఒక రకమైన మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది.

అంటే, మూడో వంతు జనాభా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అర్ధం అని మానసిక ఆరోగ్య ప్రచారకురాలు ఫిలిప్పా రీకీ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా 15-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారి పట్ల ఆందోళన ఎక్కువగా ఉందని, ఈ వయసు వారిలో ఆత్మహత్యలు ప్రతి ఏడాదికీ పెరుగుతున్నాయని అన్నారు.

అయితే, మానసిక ఆరోగ్య సంరక్షకులు, నిపుణుల కొరత కూడా తీవ్రంగా ఉంది.

"సామాజిక వైద్య సంస్థల ద్వారా వైద్య సదుపాయాలూ అందించేందుకు తగినన్ని నిధులు లేవు" అని రీకీ అన్నారు. హానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న పిల్లలకు, యుక్తవయస్సు వారికి తగినన్ని సేవలు అందుబాటులో లేవు" అని ఆమె అన్నారు.

జనరల్ ఆసుపత్రుల్లో కూడా మానసిక రోగులకు ప్రత్యేక వార్డులు లేవు అంటూ దక్షిణ ఆఫ్రికాలో మానసిక వైద్య కేంద్రాల కొరత కూడా తీవ్రంగా ఉందని అన్నారు.

దక్షిణ ఆఫ్రికా మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదికలో ఆర్ధిక వ్యవహారాలను అమలు చేసే విషయంలో చోటు చేసుకుంటున్న లోపాలు, మానసిక వైద్య సంస్థల్లో నెలకొన్న సిబ్బంది కొరత గురించి ప్రస్తావించింది.

కానీ, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల పరిస్థితులు కూడా దారుణంగానే ఉన్నాయి.

"మానసిక రోగులకు చికిత్స అందించే వార్డులలో మానసిక రోగులకు టాయిలెట్లను వాడుకునే సౌకర్యం లేకపోవడం, లేదా బాత్ రూమ్ లలో వారికి అవసరమైన ప్రైవసీ కూడా లేదనే నివేదికలు కూడా వచ్చాయి. చాలా ఆసుపత్రుల్లో మానసిక రోగుల కోసం తగినన్ని బెడ్‌లు కూడా లేవు" అని రీకీ చెప్పారు.

చాలా దేశాల మాదిరిగానే, మానసిక అనారోగ్యం చుట్టూ అల్లుకున్న అనుమానాలు సహాయం కోరేందుకు అడ్డు పడుతూ ఉంటాయి.

"కానీ, వారు సహాయం అడిగినప్పటికీ, ఎటువంటి సహాయం అందుబాటులో ఉందనే ప్రశ్న తలెత్తుతుంది" అని ఫిలిప్ప్పా అన్నారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ లో ఒక ఆసుపత్రి

ఫొటో సోర్స్, Andrey Bessonov

ఫొటో క్యాప్షన్, సెయింట్ పీటర్స్‌బర్గ్ లో ఒక ఆసుపత్రి

మానసిక శాస్త్ర నిపుణురాలు: "ఒక్కొక్క రోగికీ 10 నిమిషాలు మాత్రమే సమయం"

డాక్టర్ వెరా (పేరు మార్చాం) గత 45 సంవత్సరాలుగా రష్యాలో డాక్టర్ గా పని చేస్తున్నారు.

ఆమె ఒక ప్రభుత్వ వైద్య కేంద్రంలో మానసిక శాస్త్ర నిపుణురాలిగా పని చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఆమె పేరును రహస్యంగా ఉంచమని కోరారు.

రష్యాలో గతంలో కంటే ఉత్తమమైన మానసిక ఆరోగ్య సేవలు లభిస్తున్నట్లు డాక్టర్ వెరా చెప్పారు.

కానీ, పేద వారికి అందిస్తున్న వైద్యం తగిన ప్రమాణాలతో ఉండటం లేదని చెప్పారు.

"సోవియట్ కాలంలో చాలా తక్కువ మంది మానసిక శాస్త్ర నిపుణులు ఉండేవారు" అని ఆమె బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతం ప్రతీ కిండర్ గార్డెన్ స్కూలులోనూ ఒక రెసిడెంట్ సైకియాట్రిస్ట్ ఉన్నట్లు చెప్పారు. వారంతా ఉచితంగానే తమ సేవలు అందిస్తారని తెలిపారు.

అంటే, దేశంలో ప్రతీ ఒక్కరికీ అవసరమైన స్థాయిలో మానసిక ఆరోగ్య సేవలు అందుతున్నాయని చెప్పడం ఆమె ఉద్దేశం కాదు.

ఆమె ఒక ప్రైవేటు క్లినిక్‌లో పని చేసేటప్పుడు, ఆమె కేవలం 4- 10 మందికి మాత్రమే చికిత్స అందించాల్సి వచ్చేది. ప్రతీ రోగి ఆమెతో 30 నిమిషాల సేపు గడిపేవారు.

కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె షిఫ్ట్ సమయంలో కనీసం 40 మంది రోగులను చూడాలి.

"ఒక్కొక్క రోగిని చూసేందుకు మాకు లభించేది 10 నిమిషాలు మాత్రమే" అని చెప్పారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ లో ఒక ఆసుపత్రి

ఫొటో సోర్స్, Andrey Bessonov

ఫొటో క్యాప్షన్, సెయింట్ పీటర్స్‌బర్గ్ లో ఒక ఆసుపత్రి

"ఉచితంగా మానసిక వైద్య సహాయం చేసేవారు.. తమ కనీస అవసరాలకు తగినంత డబ్బులు కూడా సంపాదించలేరు. కానీ, వైద్య రంగానికి ప్రైవేటు రంగం లాభదాయకంగా ఉంది" అని అన్నారు.

"అందుకే, వారు డబ్బులను సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజుల్లో అందరూ డబ్బు వెనుకే పరుగు పెడుతున్నారు. కానీ, ప్రైవేటు వైద్య సేవలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ప్రతీ ఒక్కరికీ ఆ ఖర్చును భరించే శక్తి ఉండదు" అని డాక్టర్ వెరా అన్నారు.

"రోగులందరూ వైద్యం కోసం తరచుగా రావడం, వల్ల చికిత్సను తరచుగా అందించాల్సి రావడం వల్ల ప్రభుత్వ రంగ సిబ్బంది సమయానికి మించి పని చేయాల్సి వస్తోంది" అని ఆమె అన్నారు.

ఆధునిక ప్రపంచంలో ఉన్న ఒత్తిళ్లు పిల్లల్లో మానసిక సమస్యలు పెరగడానికి కారణమని ఆమె అభిప్రాయ పడ్డారు.

1000 మంది పిల్లలున్న స్కూలుకు ఒక్క మానసిక శాస్త్ర నిపుణులు ఉండటం సరిపోదని అన్నారు.

"ప్రస్తుతం సమాజంలో ఉన్న మానసిక సమస్యలకు మరింత మంది మానసిక నిపుణుల అవసరముంది" అని ఆమె అన్నారు.

రేచెల్ పెద్ద కూతురు పిల్లిని పట్టుకుని ఉన్న చిత్రం

ఫొటో సోర్స్, Andrew Fox

ఫొటో క్యాప్షన్, రేచెల్ పెద్ద కూతురు పిల్లిని పట్టుకుని ఉన్న చిత్రం

తల్లి:"నా కూతురుని మానసిక వైద్య కేంద్రంలో వదిలి పెట్టి వస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది"

రేచెల్ బానిస్టర్ కూతురిలో మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తి, ఈటింగ్ డిసార్డర్ మొదలైనప్పుడు, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హాంషైర్‌లోని ఒక స్థానిక డాక్టర్ వెంటనే స్పందించారు.

"ఆసుపత్రుల్లో ఎదుర్కొనే ఒత్తిడి వల్ల చాలా మంది సిబ్బంది సిక్ లీవ్‌లో ఉంటారు. దాంతో, క్లినికల్ థెరపీ కోసం వైద్యులను కలవడానికి అపాయింట్ మెంట్లు అరుదుగా లభిస్తాయి" అని రేచెల్ చెప్పారు.

"దీనివల్ల, ఒక కచ్చితమైన థెరపీ కానీ, లేదా వైద్యునితో అవసరమైన థెరప్యూటిక్ సంబంధాలను ఏర్పర్చుకునేందుకు అవకాశాలు ఉండవు" అని అన్నారు.

దాంతో, రేచెల్ కూతురు ఈటింగ్ డిసార్డర్ విషమించింది. ఆమె బరువు కోల్పోవడంతో పాటూ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది.

"రెండు సంవత్సరాల వరకూ చాలా లోపాలతో కూడిన సంరక్షణ అందింది" అని రేచెల్ గుర్తు చేసుకున్నారు.

మొదట్లో రేచెల్‌, తన కూతురుని ఇంటికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కేంద్రంలో చికిత్సకు పంపారు. ఆ తర్వాత 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రానికి, చివరకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కాట్లాండ్‌కు పంపారు.

కూతురుని ఆసుపత్రిలో చేర్చి ఎయిర్‌పోర్టుకు తిరిగి వస్తుండగా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని రేచెల్ చెప్పారు.

ఈమె ముగ్గురు పిల్లల తల్లి. ఇటీవల బ్రిటిష్ ప్రభుత్వం.. వైద్య సేవలకు ఇచ్చే నిధులకు విధించిన కోత, ప్రభుత్వ నిధులు కొరత కారణంగానే తన ఇంటికి దగ్గరగా వైద్య సేవలను అందించే కేంద్రాన్ని పొందలేకపోయానని రేచెల్ చెప్పారు.

2018లో రేచెల్ కేసు విషయంలో బీబీసీ ప్రచురించిన కథనానికి స్పందించి "తగని ప్రదేశాల్లో పిల్లలను దూరంగా ఉంచే పీడకలలను అంతం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం" అని బ్రిటిష్ వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

రేచెల్ పెద్ద కూతురు పిల్లిని పట్టుకుని ఉన్న చిత్రం

ఫొటో సోర్స్, Andrew Fox

ఫొటో క్యాప్షన్, పెద్ద కూతురుతో రేచల్

అసమానతలు, కోతలు

ఈ వ్యాసంలో ప్రస్తావించిన దేశాల్లో మానసిక ఆరోగ్య సేవల కొరత, అణగారిన వర్గాల వారికి, పేద వారికి తగిన చికిత్స అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల్లో విస్తృతంగా ఉన్న సమస్యలు.

ప్రపంచంలో సంపన్న దేశాలు తమ తలసరి ఆదాయం కంటే 650 రెట్లు మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం వెచ్చిస్తుంటే, పేద దేశాలు మాత్రం వైద్యం కోసం చేసే కేటాయింపుల్లో ప్రభుత్వం అత్యంత తక్కువ భాగాన్ని మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

సంపన్న దేశాల మొత్తం ఖర్చుల్లో 4 శాతం కంటే తక్కువ మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం పెడుతుండగా, పేద దేశాల్లో 1 శాతం కంటే కాస్త ఎక్కువ ఉంది.

ప్రపంచంలో సంపన్న దేశాల్లో 2017-2020 మధ్యలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ వ్యక్తి పైనా ప్రభుత్వం పెట్టే ఖర్చును సగానికి పైగా తగ్గించినట్లు ఇదే నివేదికలో పేర్కొన్నారు.

యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మానసిక అనారోగ్య సమస్యల పట్ల, మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం పట్ల సరైన దృష్టి పెట్టడం లేదు అని రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్‌కు చెందిన డాక్టర్ ట్రూడి సేనేవిరాట్నే అన్నారు.

"మానసిక అనారోగ్యం చుట్టూ అల్లుకున్న అనుమానాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది మానసిక అనారోగ్యం గురించి చర్చించడాన్ని సౌకర్యవంతంగా భావించటం లేదు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)