గర్భస్రావం చేయించుకునే హక్కు విషయంలో అమెరికా కంటే భారత్ మెరుగ్గా ఉందా?

ఫొటో సోర్స్, JONAS GRATZER
- రచయిత, మానసీ దాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా టెక్సస్‌లో ఒక కొత్త చట్టం అమలు చేశారు. దీని ప్రకారం ఆరు వారాల పిండాన్ని గర్భస్రావం చేసుకోవడం చట్టవిరుద్ధం.
చట్టం ఉల్లంఘించిన కేసులను కోర్టుల వరకూ తీసుకొచ్చినవారికి బహుమతి అందించే నిబంధనలు కూడా ఉన్నాయి.
అమెరికాలో ఈ చట్టం చర్చనీయాంశం అయ్యింది. అక్కడ దీని మద్దతుదారులు "ఒక జీవితాన్ని చిదిమేసే హక్కు ఎవరికీ లేదు" అంటుంటే, మరోవైపు దీనిని వ్యతిరేకించేవారు "గర్భస్రావానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం మహిళల హక్కుగా ఉండాలి" అని అంటున్నారు.
అమెరికాతో భారత్‌ను పోల్చి చూస్తే, మన దేశంలో 2021 మార్చి 25న గర్భస్రావం చట్టం(మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971)లో సవరణలు చేశారు. అత్యాచారం, వ్యభిచారం లాంటి కేసుల్లో గర్భస్రావం చేయించుకునే పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచారు.
అయితే దీనికోసం ఇద్దరు డాక్టర్ల అనుమతి తప్పనిసరి అనే షరతు ఉంది. భారత్‌లో సాధారణంగా ఒక డాక్టర్ అనుమతితో 20 వారాల లోపు పిండాన్ని గర్భస్రావం చేయించుకోవచ్చు.
దీంతో ప్రపంచమంతా ఈ వారం 'అమెరికా గర్భస్రావ చట్టం' చరిత్ర గురించి అన్వేషించింది.
ఇక గర్భస్రావం విషయానికి వస్తే, అమెరికాతో పోలిస్తే భారత్‌లోని మహిళల పరిస్థితి మెరుగ్గా ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది.

ఫొటో సోర్స్, SCOTT OLSON
అమెరికాలో గర్భస్రావం చట్టం చరిత్ర
అమెరికాలో గర్భస్రావం చేయించుకోవడం ఒకప్పుడు సర్వ సాధారణం అని అమెరికా ఇలెనాయ్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ లెస్లీ రీగన్ చెప్పారు.
"అప్పట్లో ఇక్కడ ఇంగ్లండ్ నుంచి వచ్చిన చట్టం అమల్లో ఉండేది. దాని ప్రకారం చిన్న వయసు పిండాలను గర్భస్రావం చేయించుకోవడం చట్టబద్ధంగా ఉండేది. డాక్టర్లు దానికి ప్రకటనలు ఇచ్చేవారు. ఎక్కడైనా సులభంగా గర్భస్రావం చేయించుకునే క్లినిక్స్ ఉండేవి. డాక్టర్లతోపాటూ మంత్రసానులు, నకిలీ వైద్యులు కూడా వాటిని చేస్తుండేవారు" అన్నారు.
కానీ, తప్పుడు పద్ధతుల్లో అబార్షన్ చేయడంతో సారా గ్రాస్వేనర్ అనే ఒక మహిళ చనిపోయింది. తర్వాత అక్కడ గర్భస్రావ చట్టాలకు పునాదులు పడ్డాయి. కనెక్టికట్‌లో మొదటిసారి 1821లో గర్భస్రావాన్ని చట్టవిరుద్ధంగా మార్చారు. 1880వ దశకం చివర్లలో మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి.
తర్వాత 1960 ప్రారంభంలో గర్భస్రావం చేసే డాక్టర్లు దాదాపు కనిపించకుండా పోయారు.
"అలా డాక్టర్లు రహస్యంగా అబార్షన్లు చేయడం మొదలుపెట్టారు. తమ గుర్తింపు రహస్యంగా ఉంచేవారు. చట్టం భయంతో రహస్య ప్రాంతాల్లో గర్భస్రావం చేసేవారు. అబార్షన్ నేరం కావడంతో శిక్ష పడుతుందనే భయం ఉండేది. కానీ, మళ్లీ డాక్టర్లతోపాటూ నకిలీ డాక్టర్లు కూడా అలాంటి పనులు చేయడం మొదలెట్టారు. దాంతో వాటిపై ఆందోళనలు, సమస్యలు పెరిగాయి" అని లెస్లీ చెప్పారు.

ఫొటో సోర్స్, fpg
మహిళలకు గర్భస్రావం చేయించుకోవడం జీవన్మరణ సమస్యగా మారింది. 1971లో తన గర్భస్రావం విఫలమవడంతో ఒక మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్నే రో వర్సెస్ వెడ్ కేసుగా చెబుతారు.
గర్భస్రావం సౌకర్యాలు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె అభ్యర్థించారు. గర్భధారణ, గర్భస్రావం కేసుల్లో నిర్ణయం ప్రభుత్వాలకు కాకుండా ఆ మహిళలకే ఉండాలని కోరారు. రెండేళ్ల తర్వాత కోర్టు తన తీర్పు వినిపించింది. గర్భస్రావం చేసుకోవడం చట్టబద్ధంగా చెప్పింది. "రాజ్యాంగం గర్భిణులకు గర్భస్రావానికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు ఇస్తుంది" అని పేర్కొంది.
"దాదాపు అన్ని రాష్ట్రాల్లో అలాంటి కేసులే వచ్చాయి. కోర్టులు గర్భస్రావం చట్టాలను చట్టవిరుద్ధంగా చెప్పాయి. రాజ్యాంగం ప్రకారం మహిళలు తమ శరీరానికి సంబంధించిన అన్ని నిర్ణయాలూ తీసుకోవచ్చు అన్నాయి. అది ఒక అపూర్వమైన తీర్పు. ఎందుకంటే ఆ తర్వాత ఆస్పత్రులు మహిళలకు గర్భస్రావం సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి అయ్యింది" అని లెస్లీ చెప్పారు.
ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అబార్షన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాల్సి వచ్చింది. కానీ అప్పటికీ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు గర్భస్రావంపై నిషేధించే చట్టాలను అలాగే ఉంచాయి.
కానీ అప్పటివరకూ అమెరికాలో గర్భస్రావం అనేది ఒక పెద్ద రాజకీయ అంశం కాదు. కానీ ఆ తర్వాత నుంచి అక్కడ పరిస్థితి మారడం మొదలైంది.

ఫొటో సోర్స్, THE WASHINGTON POST VIA GETTY IMAGES
గర్భస్రావం చుట్టూ రాజకీయాలు
వెస్ట్ జార్జియా యూనివర్సిటీలో డేనియల్ విలియమ్స్ హిస్టరీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రారంభంలో గర్భస్రావ వ్యతిరేక ఉద్యమాలకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం ఉండేది కాదని చెప్పారు.
"అక్కడ సంప్రదాయ కేథలిక్ గ్రూపులకు సన్నిహితంగా ఉండే ఎన్నో క్రైస్తవ గ్రూపులు ఉన్నాయి. గత నాలుగు దశాబ్దాలకు పైగా ఇవి గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీతో ఉన్నాయి. 70వ దశకంలో వీరికి విడాకుల కేసులు పెరగడం, పెళ్లిళ్ల గురించి యువత అభిప్రాయాల్లో మార్పులు, పెళ్లికి ముందు సెక్స్, గర్భస్రావం లాంటి అంశాలు పెద్ద ప్రచారాంశాలుగా మారాయి. అది కోల్డ్ వార్ సమయం. కమ్యూనిస్టుల ప్రభావంతో తమ సంస్కృతి నాశనం అవుతోందని వారు భావించారు" అని ఆయన చెప్పారు.
అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే 1951లో పన్నెండవ పోప్ పాయస్ తన సందేశంలో ఏం చెప్పారో తెలుసుకోవాలి.
"ప్రతి మనిషితోపాటూ వారి గర్భంలో ఇంకా పుట్టని బిడ్డకు కూడా జీవించే హక్కు ఉంది. ఆ బిడ్డను ఆ దేవుడే ఇచ్చాడు. తల్లిదండ్రులు, సమాజం లేదా మనిషి సృష్టించిన ప్రభుత్వాలు కాదు" అని పోప్ అన్నారు.
రో అండ్ వెడ్ కేసులో కోర్టు తీర్పు తర్వాత రాష్ట్రాలన్నీ గర్భస్రావంపై అమలు చేసిన ఆంక్షలను తొలగించడం మొదలవగానే, ఈ మత సమూహాలకు అది అతిపెద్ద సమస్యగా మారింది. దానిని అడ్డుకోడానికి అవి రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాయి.
1970వ దశకంలో రిపబ్లికన్ పార్టీ చిన్నదిగా ఉండేది. అది ఈ మత సమూహాలతో కలిసి తన ప్రభావాన్ని పెంచుకుంది అని డేనియల్ చెప్పారు.
వారు రాజకీయ నేతలు విస్మరించలేని ఒక పెద్ద ఓటు బ్యాంకులా మారారు. దాంతో 1968 నుంచి 88 మధ్య జరిగిన ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఐదింటిలో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది.
1983లో పార్లమెంటులో గర్భస్రావం చట్ట సవరణ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. కానీ అవి ఆమోదం పొందలేదు. ఆ తర్వాత పార్లమెంటు ద్వారా గర్భస్రావాన్ని నిషేధించడం కష్టమని ఆ గ్రూపులకు అర్థమైపోయింది. వారు కోర్టు ద్వారా ముందుకెళ్లాలనుకున్నారు. కానీ దానికోసం సంప్రదాయ జడ్జిల నియామకం అవసరమైంది. వారిని అధ్యక్షుడే నియమిస్తారు.
"గర్భస్రావం అంశంపై డెమాక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆలోచనలు వేరు వేరుగా ఉండేవి. 1980 వరకూ ఈ అంశం పోలరైజేషన్‌కు కారణం అయ్యింది. గత కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు జడ్జిల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు రెండుగా చీలడం కనిపించింది. 1980కి ముందు అలా ఉండేది కాదు" అంటారు డేనియల్.
అంటే అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే ఆలోచనా ధోరణి ఉన్న జడ్జిలను నియమించేవారు. డెమాక్రాట్స్ చేతుల్లో ఉంటే సుప్రీంకోర్టులో గర్భస్రావాన్ని సమర్థించే జడ్జిలు వచ్చేవారు.
చట్టాల్లో మార్పులకు శ్రీకారం
ఎంబర్ ఫిలిప్స్ ద వాషింగ్టన్ పోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. "ట్రంప్ పదవీకాలంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జిల నియామకం ఎక్కువగా జరిగింది. చట్ట సవరణ ఒక స్థాయి వరకూ క్లియర్ అయ్యింది" అని ఆమె చెప్పారు.
టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇటీవల ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. దాని ప్రకారం ఆరు వారాల పిండాన్ని గర్భస్రావం చేయించుకోవడం చట్టవిరుద్ధం.
"గత 50 ఏళ్లలో బహుశా అత్యంత వివాదాస్పద చట్టం ఇదే. దీని ప్రకారం పిండం గుండె కొట్టుకోవడం వినిపిస్తుంటే గర్భస్రావం చేయించుకోవడం కుదరదు. మహిళలకు ఆ సమయానికి తను గర్భవతి అనే విషయం కూడా తెలీదు" అంటారు ఎంబెర్.
"ఈ చట్టంలో సామాన్యులకు బహుమతి ఇచ్చే నిబంధన కూడా ఉంది. అది దీనిలో అత్యంత వివాదాస్పద కోణం. గర్భస్రావం చేయించుకోడానికి సాయం చేసిన ఎవరినైనా ఇది కోర్టు బోనులో నిలబెడుతుంది" అన్నారు.
ఈ చట్టాన్ని అడ్డుకోడానికి కోర్టులు కూడా తమ అసమర్థత వ్యక్తం చేశాయి. అది నిజంగా ఒక పెద్ద షాక్ లాంటిది.
గర్భస్రావం అంశంపై రెండుగా చీలిన దేశం
టెక్సస్ కేసు కోర్టును చేరేలోపే, మిసిసిపీలో కోర్టు 15 వారాల వరకూ గర్భస్రావానికి అనుమతి ఇచ్చే చట్టం రద్దు చేయడానికి సంబందించి ఒక అపీల్ మీద విచారణ జరుపుతోంది.
తర్వాత రో వర్సెస్ వెడ్ కేసులో గర్భస్రావాన్ని చట్టబద్ధంగా చెప్పిన తీర్పు రద్దవుతుందేమోనని అబార్షన్ మద్దతుదారులు ఆందోళనకు గురయ్యారు.
"విషయం మిసిసిపీ కోర్టుదే కాదు. చాలా మంది రో వర్సెస్ వెడ్ కేసు తీర్పును రద్దు చేయించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కాకపోయినా, రేపైనా ఇలాంటి కేసులో కోర్టు వరకూ వెళ్తారు" అని మేరీ జిగ్గర్ అన్నారు.
మేరీ జిగ్లర్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్‌గా ఉన్నారు.
అయితే కోర్టు తీర్పు రాకముందే క్షేత్ర స్థాయిలో చాలా రాష్ట్రాల్లో గర్భస్రావం కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలు తగ్గిపోయాయి.
"అబార్షన్‌ను అడ్డుకోవడం మొదటి నుంచీ ఉంది. మిసిసిపీలో ఒకే ఒక అబార్షన్ క్లినిక్ ఉంది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి క్లినిక్ వరకూ చేరుకోడానికి వంద మైళ్లకు పైగా వెళ్లాల్సి వస్తోంది. పేదలకు అది చాలా కష్టం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో అబార్షన్ చేసుకోవడం ఇప్పుడు తగ్గిపోయిందని మనం చెప్పవచ్చు. టెక్సస్‌లో దీని గురించి చట్టం చేశారనేది వేరే విషయం" అని ఆమె చెప్పారు.
మిసిసిపీ కోర్టు తీర్పు రావడానికి ఇంకా కనీసం ఏడాది సమయం ఉంది.
"ఈ కోర్టు రో వర్సస్ వెడ్ కేసులో తీర్పును రద్దు చేసి, రాజ్యాంగంలో గర్భస్రావం గురించి ఏం చెప్పలేదు అనడానికి చాలా అవకాశం ఉంది. అంటే రాజ్యాంగంలో గర్భస్రావాన్ని నిషేధించలేదు. కానీ, దానిని చట్టపరమైన హక్కుగా కూడా చెప్పలేదు అనవచ్చు. అదే జరిగితే ప్రతి రాష్ట్రం తమ కోసం ప్రత్యేక చట్టం చేయడం గురించి స్వతంత్రులు అయిపోతాయి" అంటారు మేరీ.

ఫొటో సోర్స్, REUTERS/LUCAS JACKSON
రో వర్సెస్ వెడ్ కేసులో వచ్చిన తీర్పు రద్దైతే అమెరికాలో గర్భస్రావం చట్టం భవిష్యత్తు ఎలా ఉంటుంది?
"20 నుంచి 25 రాష్ట్రాలు గర్భస్రావాన్ని పూర్తిగా చట్టవిరుద్ధం అంటాయి. కొన్ని రాష్ట్రాలు ముందే సిద్ధం చేసిన అలాంటివాటిని కోర్టు తీర్పు రాగానే అమలు చేస్తాయి. కొన్ని రాష్ట్రాలు ఈ కేసుతో 1973 కంటే ముందు కాలానికి వెళ్లిపోతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు గర్భస్రావానికి అనుమతి ఇచ్చే చట్టాలను బలోపేతం చేస్తాయి. కానీ, దేశం మొత్తం గర్భస్రావానికి అనుమతి ఇచ్చే, దానిని నిషేధించే రాష్ట్రాలుగా రెండుగా విడిపోతుంది" అని మేరీ వివరించారు.
కానీ, ఈ కేసు అక్కడితో ముగుస్తుందా లేదా... అబార్షన్ వ్యతిరేక గ్రూపులు మాత్రం దీనిని మొత్తం దేశమంతా నిషేధించాలనే ప్రచారాన్ని కొనసాగిస్తాయి.
"అది త్వరలో జరుగుతుందని నాకు అనిపించడం లేదు. ఈ కేసులో సుప్రీంకోర్టు పెద్దగా ఏం చేయలేదనేది కూడా నిజం. మత సంస్థలు దీన్ని పెద్ద అంశంగా మార్చే పని చేశాయి. రాజకీయ పార్టీలకు ఇది కీలకం. వీటన్నిటి మధ్యా కోర్టు కేవలం ఒక చిన్న భాగమే" అంటారు మేరీ
అంటే రాబోవు కాలంలో అమెరికాలో ఇది కీలక అంశంగా అలాగే కొనసాగుతుంది.
మరోవైపు అమెరికాతో భారత్‌ను పోల్చిచూస్తే ఇక్కడ డాక్టర్ల అనుమతితో మహిళలు 20 వారాల వయసు పిండాన్ని అబార్షన్ చేయించుకోవచ్చు.
పిండంలో ఏవైనా తీవ్ర వ్యాధులు ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తే మెడికల్ బోర్డ్ అనుమతితో 20 వారాల తర్వాత కూడా కొన్ని వారాల వరకు గర్భస్రావం చేయించుకోవచ్చు.
ఇలాంటప్పుడు, భారత్‌లో పిల్లల్ని కనడానికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు అసలు మహిళల చేతుల్లో ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది.
అంటే, గర్భస్రావం విషయంలో అమెరికాతో పోలిస్తే ఇక్కడి మహిళల పరిస్థితి మెరుగ్గానే ఉందా?

ఫొటో సోర్స్, VIVIANE MOOS
అమెరికా వర్సెస్ భారత్
ఆలోక్ వాజ్‌పేయి పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆయన "భారత్‌లో అబార్షన్ హక్కు కచ్చితంగా మహిళలకు ఉంది. కానీ, అమెరికా మహిళలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పడం భావ్యం కాదు" అన్నారు.
"గర్భస్రావం విషయంలో ఇక్కడ నిర్ణయం మహిళల చేతుల్లో ఉండదు. బదులుగా వారి భర్త లేదా కుటుంబం తీసుకుంటుంది. అబార్షన్ కోసం మహిళ ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానిని సమాజంలో ఒక కళంకంలా కూడా చూస్తారు. అందుకే చాలా కేసుల్లో మహిళలు అసురక్షిత గర్భస్రావ పద్ధతులను ఎంచుకుంటూ ఉంటారు" అంటారు ఆలోక్.
లాన్సెట్ భారీ స్థాయిలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం 2015లో దేశంలో మొత్తం 1.56 గర్భస్రావాలు జరిగాయి. అందులో కేవలం 38 లక్షల అబార్షన్లు అంటే 22 శాతం కంటే తక్కువ కేసులు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వరకూ వచ్చాయి.
మహిళలకు చట్టపరంగా గర్భస్రావం చేయించుకునే హక్కు ఉన్నప్పటికీ, గర్భిణులు ఇతర సమస్యలు ఎదుర్కుంటున్న కొన్ని దేశాల్లో భారత్ కూడా ఒకటి.
"మన దగ్గర చట్టం ఉంది. కానీ దాని అమలులో లోపాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలకు అందుబాటులో ఉండాల్సిన సదుపాయాల కొరత ఉంది. అందుకే మహిళలు ఈ చట్టాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు" అని ఆలోక్ చెప్పారు.
కానీ, గర్భస్రావం దేశంలో ఎప్పుడూ పెద్ద అంశంగా మారలేదు. అలా ఎందుకు
"ఇక్కడ కచ్చితంగా సామాజిక, సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. మహిళలు అసురక్షిత గర్భస్రావం చేయించుకుంటున్నారు. అందుకే ఆ గణాంకాలు లభించడం లేదు. వాటిపై లాన్సెట్ రిపోర్ట్ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలకు గర్భ నిరోధక సాధనాలు కూడా అందుబాటులో లేవు అనేది మరో విషయం. చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణ కోసం గర్భస్రావాన్నే ఎంచుకుంటున్నారు" అన్నారు.
మహిళల పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం రెండు స్థాయిల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. మొదటిది చట్టంలో డాక్టర్లను అనుమతించడం, 20 వారాల పరిమితి లాంటి షరతులు తొలగించడం. రెండోది దానికి అవసరమైన సౌకర్యాలను వారికి అందుబాటులోకి తీసుకురావడం.
"మహిళలకు డాక్టర్ల ఆమోదం అవసరం లేదు. మన మెడికల్ టెక్నాలజీ చాలా మెరుగుపడింది. 20 వారాల తర్వాత కూడా ఇక్కడ సురక్షితంగా గర్భస్రావం చేయించుకోవచ్చు. అందుకే ఈ షరతులు ఇక అవసరం లేదు. దీనితోపాటూ ప్రాథమిక సౌకర్యాల కింద డాక్టర్ల సౌకర్యం, సురక్షిత గర్భస్రావం కోసం కేంద్రాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది" అని ఆయన చెప్పారు.
అమెరికాతో పోలిస్తే భారత్‌లో మహిళల పరిస్థితే మెరుగ్గా ఉందే అనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు.
"భారత్ ఏ విషయంలో అమెరికా కంటే మెరుగైన స్థితిలో ఉందంటే, ఇక్కడ గర్భస్రావం కాల పరిమితి ఎక్కువగా ఉంది. చట్టం మహిళకు నిర్ణయం తీసుకునే హక్కు ఇస్తుంది".
"కానీ సామాజిక, సాంస్కృతిక పరిధిలో ఉంటూ ఆమె తన హక్కును ఉపయోగించుకోలేకపోతోంది. వసతుల లేమి కారణంగా ఏర్పడిన అంతరం మహిళలు ఈ హక్కును ఉపయోగించుకోడానికి అనుమతించడం లేదు".
"అయితే ఇక్కడ ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఈ అంతరాన్ని తగ్గించడం కాదు, సామాజిక స్థాయిలో మార్పులు తీసుకురావడమే. అది జరిగినప్పుడే మహిళలు చట్టం అందించిన హక్కును ఉపయోగించుకోగలరు" అంటారు ఆలోక్.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













