జనాభా నియంత్రణ: ఎంతమంది పిల్లల్ని కనాలో నిర్ణయించేది ఎవరు? ప్రభుత్వమా, మహిళలా?

ఫొటో సోర్స్, ARINDAM DEY
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా అప్పటికే పిల్లలుండి గర్భ నిరోధక పద్ధతులను అవలంబిస్తున్నమహిళలు ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఇబ్బందులు కూడా పడతారు.
కుటుంబ నియంత్రణ పాటించిన వారిపై వరాలు కురిపించడం, పాటించని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి కాదు. చిన్న కుటుంబాన్ని కలిగిన వారికి బహుమతులు, ఎక్కువమందిని కన్న వారిని ప్రభుత్వ పథకాలకు దూరంగా పెట్టాలనడం కొత్త విషయం కాదు.
1970లలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాలంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు(స్టెరిలైజేషన్) రూపంలో ఇది మొదటిసారి జరిగింది. 1990లలో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనేక రాష్ట్రాల్లో 'ఇద్దరు పిల్లలు' విధానాన్ని అమలు చేశారు.
పొరుగు దేశం చైనా నుంచి 'వన్ చైల్డ్ పాలసీ', 'టూ చైల్డ్ పాలసీ'లాంటి వాటితోపాటు జపాన్, దక్షిణ కొరియాల నుంచి కూడా కుటుంబ నియంత్రణ విధానాలను భారత్ స్ఫూర్తిగా తీసుకుని అనుసరించింది.
ఇప్పుడు అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఇలాంటి విధానాన్ని అవలంబించాలని కోరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ జనాభాపైనా, మహిళల జీవితాలపైనా ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
'ఎమర్జెన్సీ' కాలంలో బలవంతపు కుటుంబ నియంత్రణ
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో భారతదేశంలో సగటున ఒక మహిళ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. అంటే దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) ఆరుగా ఉండేది.
జనాభా నియంత్రణపై మొదటి అడుగు 1952 మొదటి పంచవర్ష ప్రణాళికలో తీసుకున్నారు.'ఫెర్టిలిటీ', 'ఫ్యామిలీ ప్లానింగ్' పై పరిశోధనలు చేసి, 'దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన స్థాయికి జనాభాను' తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ, పాత పద్ధతులు సరైన ప్రభావం చూపించలేదని, జనాభా నియంత్రణకు కొత్త పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉందని ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది.
1976లో తీసుకువచ్చిన మొదటి జాతీయ జనాభా విధానం ప్రకారం, కుటుంబ నియంత్రణకు లక్ష్యాలు నిర్ణయించారు. వాటిని నెరవేర్చితేనే రాష్ట్రాలకు కేంద్రం సహాయం అందిస్తుందని షరతులు కూడా విధించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, SANTOSH BASAK
కుటుంబ నియంత్రణ ఆపరేషన్-మహిళలు
సంతాన నియంత్రణ పద్ధతులు అనుసరించే అవకాశం స్త్రీ, పురుషులిద్దరికీ ఉంది. కానీ, అప్పటి ప్రభుత్వం పురుషులపైనే ఎక్కువగా దృష్టి సారించింది.
ఆపరేషన్ చేయించుకోని పురుషులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించడం, రేషన్ నుంచి మినహాయించడంలాంటి నిర్ణయాలు అమలు చేయడం సులభంగా ఉండేది.
ఇక, మహిళల ట్యూబెక్టమీ ఆపరేషన్‌తో పోలిస్తే పురుషుల వేసెక్టమీ ఆపరేషన్ చాలా సులభం. ఇందుకోసం ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేశారు.
అయితే, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సమయంలో సుమారు 2 వేలమంది పురుషులు మరణించారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో, ఈ బలవంతపు కుటుంబ నియంత్రణ పద్ధతుల నుంచి కొత్త ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి.
అయితే, ఆ తర్వాత కాలంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే బాధ్యత పురుషుల నుంచి స్త్రీలకు మళ్లింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
''1975-76లో 46శాతం మంది స్త్రీలకు ఆపరేషన్లు జరగ్గా, 1976-77లో అది 25 శాతానికి తగ్గింది. అయితే, 1977-78 వచ్చే సరికి స్త్రీలలో ఆపరేషన్లు చేయించుకున్న వారి సంఖ్య 80 శాతానికి పెరిగింది. 1989-90నాటికి ఇది 91.8 శాతానికి చేరుకుంది'' అని 'రీ ప్రొడక్టివ్ హెల్త్ మ్యాటర్స్' అనే పత్రికలో ప్రొఫెసర్ టీకెఎస్ రవీంద్రన్ రాశారు.
2015-16 సంవత్సరానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్.ఎఫ్.హెచ్.ఎస్) ప్రకారం, కుటుంబ నియంత్రణలో పురుషుల వేసేక్టమీ ఆపరేషన్ల వాటా కేవలం 0.3 శాతం మాత్రమే. అంటే, స్టెరిలైజేషన్ విషయంలో భారమంతా మహిళలపైనే పడింది.
47శాతం మహిళలు ఇప్పటికీ గర్భ నిరోధక పద్ధతులు వాడటం లేదు. 2005-06 నుండి 2015-16 వరకు గర్భ నిరోధక పద్ధతుల వాడకంలో స్వల్ప క్షీణత ఉంది. ఇందులో పురుషుల భాగస్వామ్యం కూడా పడిపోతూనే ఉంది. ప్రస్తుతం కుటుంబ నియంత్రణలో వారి సహకారం 10 శాతం కన్నా తక్కువే.
సంతానాన్ని నిరోధించే బాధ్యతను మహిళలపై ఉంచారు. కానీ, దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వారికి లేదు. ప్రభుత్వం మళ్లీ ప్రోత్సహకాలు, శిక్షలు అంటే దానివల్ల ఎక్కువగా బాధలు అనుభవించేది కూడా మహిళలే.

ఫొటో సోర్స్, SANTOSH BASAK
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు అర్హత
ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మంది పురుషులకు స్టెరిలైజేషన్ చేసినా, 1981 జనాభా లెక్కల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గకపోగా, పెరుగుదల నమోదైంది.
గర్భ నిరోధకత విషయంలో కండోమ్‌ల వంటి తాత్కాలిక పద్ధతులకు బదులుగా ఆపరేషన్ ద్వారా శాశ్వత విధానాలను ప్రభుత్వం అమలు చేసింది.
అయితే, తమకు ఎక్కువమంది పిల్లలు వద్దు అనుకున్నప్పుడు మాత్రమే దంపతులు ఈ శాశ్వత విధానం వైపు వెళతారని, అందువల్లే జనాభా పెరుగుదల రేటు తగ్గలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత ప్రజలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేయించుకోవడం మానేశారు. అంటే, జనాభా తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాల విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రాలేదు.

ఫొటో సోర్స్, Reuters
జనాభా నియంత్రణ, ఆధునికతలను అర్థం చేసుకోవడానికి అమెరికాకు చెందిన ఆంత్రోపాలజిస్ట్ రూత్ ఎస్.ఫ్రెడ్ 1958-83 మధ్య దిల్లీకి సమీపంలోని ఓ గ్రామంలో పరిశోధన చేశారు. ఆయన పరిశోధనా ఫలితాలను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రచురించారు.
ఆయన అధ్యయనం ప్రకారం, ''ప్రభుత్వ విధానం మారిన తర్వాత కుటుంబ నియంత్రణ నిర్ణయాలు పురుషుల ఆర్థిక స్థితిగతులపై లేదా కనీసం ఒక కొడుకైనా పుట్టాడా అన్న దానిపై ఆధారపడి ఉంటాయి. ఇందులో మహిళల ఇష్టాయిష్టాలకు స్థానం లేదు'' అని రాశారు.
1990లలో రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు పంచాయతీ రాజ్ ఎన్నికల్లో సీట్లు కేటాయించినా, ఆ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు, అంతకంటే తక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలన్న నిబంధనను కూడా అప్పుడే అమల్లోకి తెచ్చారు.

ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG
మహిళలపై సంతాన నియంత్రణ నిబంధనల ప్రభావం
''ఇద్దరుకంటే ఎక్కువమంది సంతానం ఉంటే దాని ప్రభావం దంపతులిద్దరి పైనా ఉండాలి. కానీ, ఇది ఎక్కువగా మహిళను ప్రభావితం చేసింది'' అని నిర్మల్ బాఖ్ అనే ప్రభుత్వ అధికారి అయిదు రాష్ట్రాలలో తాను జరిపిన పరిశీలన ఆధారంగా గుర్తించారు.
‘‘ఓ వ్యక్తి పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత , మూడో బిడ్డను కన్నాడు. కానీ, ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు’’ అని ఒక ఉదాహరణను వివరించారు బాఖ్.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత భార్య మూడోసారి గర్భవతి అయినప్పుడు, ఆమెను పక్కనున్న గ్రామానికి, లేదా రాష్ట్రానికి పంపడం, రహస్యంగా ప్రసవానికి ఏర్పాట్లు చేసిన ఘటనలు కూడా ఉన్నాయని నిర్మల్ బాఖ్ వెల్లడించారు. అబ్బాయి పుడితే రాజకీయ పదవిని వదులు కోవడం, అమ్మాయి పుడితే భార్యను వదులుకున్న ఘటనలు కూడా ఉన్నాయని చెప్పారు బాఖ్.
చాలాచోట్ల మహిళలకు అసురక్షిత గర్భస్రావాలు జరిగాయి. కొన్నిచోట్ల పిండం అబ్బాయా, అమ్మాయా అన్నది అక్రమంగా గుర్తించి భ్రూణ హత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి.
''జనాభా నియంత్రణ అవసరమే అయినా, ఇది మహిళలపై తీవ్ర ప్రభావం చూపింది'' అని నిర్మల్ బాఖ్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో కొడుకు కావాలా, పంచాయతీ ఎన్నికల్లో పదవి కావాలా అన్నది నిర్ణయించడంలో మహిళల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని చెప్పారాయన.

ఫొటో సోర్స్, GOH CHAI HIN
చైనా జనాభా పాలసీ
జనాభా నియంత్రణలో ప్రభుత్వ జోక్యానికి అతిపెద్ద ఉదాహరణ పొరుగు దేశం చైనా రూపంలో కనిపిస్తుంది. భారత్ కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా, దానిని తగ్గించడానికి 1980లో 'వన్ చైల్డ్ పాలసీ' తీసుకొచ్చింది.
కనీసం ఒక కొడుకు ఉండాలన్న కోరిక చైనాలో కూడా ఎక్కువగానే ఉంది. అందుకే, గ్రామీణ ప్రాంతాలలో మొదటి బిడ్డ ఆడపిల్ల అయినప్పుడు రెండో బిడ్డను కనడానికి నిబంధనలు అంగీకరిస్తాయి.
అంటే, కనీసం ఒక కొడుకు కోరిక కారణంగా గ్రామీణ, అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలో లింగనిష్పత్తిని, వన్ చైల్డ్ పాలసీని పణంగా పెట్టారు.
అందుకే, వన్ చైల్డ్ పాలసీ ప్రవేశపెట్టిన రెండు దశాబ్దాల తరువాత, చైనాలో పిల్లల లింగ నిష్పత్తి బాగా క్షీణించింది.
ఇక్కడ కూడా, ప్రభుత్వ నిబంధనలకు దొరక్కుండా, కనీసం ఒక కొడుకు కావాలన్న కోరికతో అక్రమ గర్భస్రావాలు, భ్రూణ హత్యల వంటి పద్ధతులను ఉపయోగించారు.
యూనిసెఫ్ గణాంకాల ప్రకారం 1982లో 100 మంది బాలికలకు 108.5 మంది అబ్బాయిలు ఉండగా, 2005లో సగటున 118.6 మంది అబ్బాయిలు ఉన్నారు.
2017నాటికి ప్రతి 100 మంది బాలికలకు 111.9 మంది అబ్బాయిలు మిగిలారు. కానీ, ప్రపంచంలో ఇప్పటికీ అత్యంత ఘోరమైన లింగ నిష్పత్తులలో ఇది ఒకటి. అయితే, ప్రస్తుతం చైనాలో జనాభా విధానాన్ని మార్చారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
పురుషులు ఏమనుకుంటున్నారు?
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం గర్భ నిరోధకత మహిళల బాధ్యతేనని 40శాతం మంది పురుషులు భావిస్తున్నారు. అయితే, గర్భనిరోధక పద్ధతులను అనుసరించే మహిళలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది పురుషులతో లైంగిక సంబంధాలను కలిగి ఉంటారని 20శాతం మంది పురుషులు నమ్ముతున్నారు.
అంటే, మహిళలు గర్భనిరోధక బాధ్యతతో పాటు, వారి నైతిక ప్రవర్తనపై సందేహాలను ఎదుర్కొంటున్నారు. కొడుకును కనివ్వాలన్న సామాజిక ఒత్తిడి కూడా దీనికి తోడవుతోంది.
2000లో భారతదేశంలో అవలంబించిన రెండవ జాతీయ జనాభా విధానం.. బలవంతపు పద్ధతులకు బదులుగా పిల్లలు, తల్లి ఆరోగ్యం, మహిళా సాధికారత, గర్భ నిరోధక పద్ధతులపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
గర్భనిరోధకతలో పురుషుల భాగస్వామ్యం పెంచడం గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతోంది.
గర్భ నిరోధకత విషయంలో మహిళల నుంచి బాధ్యతను పంచుకోవడం, వారి హక్కులను గుర్తించడం ద్వారా మెరుగైన లింగ నిష్పత్తిని సాధించవచ్చు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపించని అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఈ సూచన వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ పుట్టుక రహస్యం తేలాల్సిందే... ఎందుకంటే?
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- PTSD: అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలు వెంటాడుతుంటే ఏం చేయాలి?
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








