కోవిడ్ వ్యాక్సీన్: టీకా వేయించుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందనడం నిజమేనా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాచెల్ స్క్రీర్
- హోదా, బీబీసీ న్యూస్
కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా? వ్యాక్సీన్ వల్ల గర్భవిచ్ఛిత్తి జరిగే ప్రమాదం ఉందా?
కాదని వైద్యులు, నిపుణులు ఎంతగా చెబుతున్నా ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది?
గర్భిణులకు ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు డాక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తారు. కాబట్టి ఒకప్పుడు గర్భిణులకు టీకా వద్దని కొందరు వైద్యులు చెప్పి ఉండొచ్చు.
కానీ, ఇప్పుడు కోవిడ్ టీకా సురక్షితమా కాదా అనే అంశానికి సంబంధించి విస్తృతమైన డాటా అందుబాటులో ఉంది. దానివల్ల ముప్పేమీ లేదని తెలుసుకుని వ్యాక్సీన్ వేయించుకోవాలని చెబుతున్నారు.
కోవిడ్ వ్యాక్సీన్‌కు సంబంధించి మేం కొన్ని వాదనలను పరిశీలించాం. ఆ వాదనలు ఎందుకు తప్పో తెలుసుకున్నాం.

అండాశయాలలో వ్యాక్సీన్ పేరుకుపోతుందన్న వాదన పూర్తిగా తప్పు
ఆ అధ్యయనంలో మనుషులకు ఇచ్చిన మోతాదు కంటే ఎలుకలకు 1,333 రెట్లు ఎక్కువ మోతాదులో టీకా ఇచ్చారు.
అలా ఇచ్చిన 48 గంటల తరువాత ఆ ఎలుకల అండాశయాలలో 0.1 శాతం టీకా ఆనవాళ్లను గుర్తించారు.
మనుషులలో ఇంజెక్షన్ చేసే చోట(భుజం) గంట తరువాత 53 శాతం, 48 గంటల తరువాత 25 శాతం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. భుజం కాకుండా కాలేయంలో కూడా 48 గంటల తరువాత 14 శాతం టీకా ఆనవాళ్లు కనిపించాయి.
వైరస్ జన్యుపదార్థం ఉన్న సూక్ష్మ కొవ్వు బుడగ సహాయంతో వ్యాక్సీన్ చొప్పిస్తారు. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థలో కదలిక తెస్తుంది.
అండాశయాలలోని కొవ్వు సాంద్రతను చూపించి ఇదే ఆధారమంటూ కొందరు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సీన్ వేసుకున్న 48 గంటల తరువాత అండాశయాల్లో కొవ్వు స్థాయి పెరిగింది. ఇంజక్షన్ వేసిన చోటు నుంచి వ్యాక్సీన్‌లోని పదార్థాలు శరీరంలోని భాగాలకు వ్యాపించడం వల్ల ఇలా జరుగుతుంది.
అయితే, ఆ కొవ్వులో వైరస్ జన్యుపదార్థం ఉంటుందనడానికి మాత్రం ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవు.
జపాన్ ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పించిన ఒక అధ్యయన నివేదిక పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు వాదనలు ప్రచారం చేసేవారు మాత్రం 'లీకయిన ఒక అధ్యయనం ప్రకారం' అంటూ తమ వాదనలు ప్రచారం చేస్తున్నారు.
వ్యాక్సీన్ వల్ల అబార్షన్ అవుతుందన్న వాదనా తప్పే
యూకేలో మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్ఏ) ఎల్లో కార్డ్ స్కీమ్, అమెరికాలో వ్యాక్సీన్ యాడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ (వీఏఈఆర్ఎస్) వంటి టీకా పర్యవేక్షణ వ్యవస్థలకు ఇలాంటి గర్భస్రావ ఘటనలు రిపోర్టయ్యాయంటూ కొన్ని పోస్టులు పేర్కొంటున్నాయి.
టీకా వేయించుకున్న తరువాత కలిగే ఆరోగ్య పరిస్థితులు, ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే వాటి గురించి రిపోర్ట్ చేయడానికి ఈ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. అయితే, టీకా వేయించుకున్నవారంతా వీటికి రిపోర్ట్ చేసే అవకాశాలు లేవు.
అయితే, ఈ వ్యవస్థలకు రిపోర్టయిన కేసులలో గర్భస్రావ ఘటనలూ ఉన్నాయి. కానీ, అందుకు కారణం టీకా కాదు. ఇతర సాధారణ కారణాల వల్లే ఆ గర్భస్రావాలు జరిగినట్లు వైద్యులు తేల్చారు.

లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీప్రొడక్టివ్ ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ విక్టోరియా మాలె మాట్లాడుతూ.. వ్యాక్సీన్ దుష్ప్రభావాలను గుర్తించడానికి ఈ రిపోర్టింగ్ వ్యవస్థలు ఉపకరిస్తాయన్నారు.
ఆస్ట్రాజెనెకా టీకాతో కొన్ని నిర్దిష్ట గ్రూపుల రక్తం గడ్డ కట్టిన అరుదైన ఘటనలు వెంటనే అప్రమత్తం కావడానికి పనికొచ్చాయ్నారు.
మావిపై ప్రభావం ఉందనడానికీ ఆధారాలు లేవు
సైంటిఫిక్ రీసెర్చర్ మైఖేల్ యాడన్ ఒక వాదన తీసుకొచ్చారు.
ఫైజర్, మోడెర్నా టీకాలలో ఉన్న వైరస్ స్పైక్ ప్రోటీన్ మావి ఏర్పడడంలో కీలకమైన సిన్సిటిన్-1 అనే ప్రోటీన్‌ను పోలి ఉందని పేర్కొంటూ ఆయన తెరపైకి తెచ్చిన వాదన విస్తృతంగా ప్రచారమైంది.
వైరస్‌పై పోరాడే యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతున్న పిండంపైనా దాడి చేయొచ్చని ఆయన ఊహాగానాలు వినిపించారు.
కోవిడ్ వ్యాక్సీన్ వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందన్న తప్పుడు నమ్మకాలు పెరగడానికి ఈ వాదనలే ప్రధాన కారణమయ్యాయని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మైఖేల్ వాదనలు తప్పని రుజువు చేసే ఆధారాలను శాస్త్రవేత్తలు సంపాదించారు.

అమెరికాకు చెందిన సంతాన సాఫల్య వైద్యుడు రాండీ మోరిస్ ఇలాంటి ఆందోళనలపై నేరుగా స్పందించాలనుకున్నారు.
తన వద్ద ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్న పేషెంట్లను పర్యవేక్షించడం ప్రారంభించారాయన.
వ్యాక్సీన్ వేయించుకున్న, వేయించుకోని, ఇంతకుముందు కరోనా సోకిన 143 మంది మహిళలపై ఆయన అధ్యయనం చేశారు.
వ్యాక్సీన్ వేయించుకున్నవారిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని గుర్తించారు.
తక్కువ మందిపై జరిగిన అధ్యయనమే అయినా ఒకవేళ ఏవైనా దుష్ప్రభావాలు ఉంటే ఈ రోగులలోనూ కనిపించాలి కదా అంటారు రాండీ మోరిస్.
తప్పుడు ప్రచారాలను ఖండించడానికి తగిన ఆధారాలు సంపాదించి శాస్త్రవేత్తలు ప్రజలను చైతన్యం చేసేలోగా తప్పుడు వాదనలు చేసేవారు మరో ఫేక్ ప్రచారం మొదలుపెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19: కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- కోవిడ్-19: కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











