సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం

ఫొటో సోర్స్, Keystone/Hulton Archive/Getty Images
- రచయిత, జి. కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి
- హోదా, బీబీసీ న్యూస్ తెలుగు కోసం
గత నెలలో భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవటానికి ఒక రోజు ముందు, ఆగస్టు 14వ తేదీని ఇకపై ‘భయానకమైన విభజన స్మృతి దినం’ (పార్టిషన్ హారర్స్ రిమెంబరన్స్ డే)గా జరుపుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
ప్రధానమంత్రి ఈ ప్రకటన చేస్తున్నపుడు, విభజన సమయంలో పడిన బాధలు ఎప్పటికీ మరిచిపోలేనివని, విషపూరితమైన సామాజిక విభజనలను, అసమానతలను ఆగస్టు 14 మనకు నిరంతరం గుర్తు చేస్తుందని, తద్వారా ఇది, ఏకత్వం యొక్క ఆవశ్యకతను, సామాజిక సామరస్యాన్ని, మానవ సాధికారతను బలపరుస్తుందని వివరించారు.
భయానకమైన విభజన జ్ఞాపకాలను స్మరించుకోవాలని ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం వెనుక ఒక బలమైన సందేశం ఉంది. అదేంటంటే.. ఒక నిర్ధిష్టమైన సామాజిక వర్గం అనుభూతి చెందే అసౌకర్యం కారణంగా, చరిత్రలో మన పూర్వీకులు నిజంగా ఎదుర్కొన్న కష్టాలు, బాధలు ఒక ముసుగు కింద కనిపించకుండా కప్పి ఉంచకూడదు. నిజానికి, గతంలో కలిగిన గాయాలు నయం కావాలంటే, ఒక బహిరంగ మరియు నిజాయితీతో కూడిన చర్చ అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి, బహిరంగ చర్చ అనే ఔషధం మాత్రమే గతంలో మనకు కలిగిన గాయాలను పూర్తిగా నయం చేస్తుంది.
ఈ నేపథ్యంలో, 17 సెప్టెంబర్, 1948వ తేదీన చరిత్రలో జరిగిన ఒక సంఘటనను గురించి మనం తిరిగి ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ, ఈ చరిత్ర, పుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. 15 ఆగస్టు 1947న బ్రిటిషు పాలకుల నుండి భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందిన సమయంలో.. దేశ ప్రజలంతా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు, కానీ ఆ అదృష్టం అందరినీ వరించలేదు.
నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాత్రం, స్వాతంత్య్రం పొందటానికి మరో 13 నెలల సమయం వేచి చూడవలసి వచ్చింది. దీని కోసం, నాటి భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి రాజకీయ నాయకులు, జేఎన్ చౌదరి వంటి వ్యూహాత్మక ప్రతిభ కలిగిన వ్యక్తుల అవసరం ఏర్పడింది. వారి ఆధ్వర్యంలో జరిగిన "ఆపరేషన్ పోలో" ద్వారా పోలీసులు చేసిన పోరాటం ఫలితంగా, హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం నుండి విముక్తి లభించింది.
నిజాం పాలన నుండి విముక్తి పొందిన ఈరోజును, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల ప్రజలు, "మరాఠ్వాడా ముక్తి సంగ్రామ్ దివస్" గాను, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల ప్రజలు "హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవం" గా జరుపుకుంటున్నారు.
మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ భయంకరమైన నిశ్శబ్ధాన్ని ఎందుకు పాటిస్తోంది? మహారాష్ట్ర విషయంలో కేవలం మరాఠ్వాడా ప్రాంతం మాత్రమే నిజాం పాలనలో ఉండేది. అలాగే, కర్ణాటకలోని ఈశాన్య జిల్లాలయిన బీదర్, కలబురగి, రాయచూరు జిల్లాలు మాత్రమే హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి.
కానీ, నేటి తెలంగాణ రాష్ట్రం మొత్తం, అప్పటి నిజాం పాలనలో ఉండేది. నిజాంపై పోరాటం సాగించిన స్వామి రామానంద తీర్థ, పిహెచ్ పట్వర్ధన్, గోవిందబాయ్ ష్రాఫ్, విజయంత్ర కబ్ర వంటి వారి పోరాటాలను స్మరించుకుంటూ ఇతర రాష్ట్రాలు వారికి గుర్తింపు ఇస్తున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్రం మాత్రం కొమురం భీమ్, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రామచందర్ రావు, నారాయణరావు పవార్, చాకలి ఐలమ్మ వంటి నాయకుల వీరత్వాన్ని, త్యాగాలను గుర్తించడానికి నిరాకరించింది.

ఫొటో సోర్స్, facebook
ఈ విధంగా, రాష్ట్ర ప్రభుత్వం గతాన్ని గుర్తించడానికి అంగీకరించకుండా తిరస్కరించడానికి ఒక నిర్ధిష్టమైన కారణం తెలపకుండా, ఒక సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తన మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీని, ఆ పార్టీ యొక్క గతాన్ని రక్షించడంలో తీరిక లేకుండా గడుపుతోంది.
భారతదేశం స్వాతంత్య్రం సాధించిన సమయంలో, ఎంఐఎం పార్టీ నాయకుడు ఖాసిం రిజ్వీ హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా ఒక ప్రత్యేకమైన స్వతంత్ర దేశంగా తయారు చేయాలని సంకల్పించి, నిజాంకు ఉన్న 24,000 సైన్యానికి అదనంగా 1,50,000 మంది ఎంఐఎం వాలంటీర్లను అందించి నిజాంకు తన మద్దతు తెలియజేశాడు.
తరువాతి కాలంలో వీరంతా రజాకార్లుగా మారి హైదరాబాద్ రాష్ట్రంలో మారణ హోమం సృష్టించారు. నిజాం ఆదేశాలను అమలు చేయడం ద్వారా, హైదరాబాద్‌లో దోపిడీ పాలనను స్థాపించడంలోను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అణచివేయడంలోనూ రజాకార్లు కీలకమైన పాత్రను పోషించారు. వీరు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి ఆస్తులను కొల్లగొట్టి, గ్రామాలపై దాడులు చేసి చాలామంది ప్రజలను మట్టుబెట్టారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని స్మరించుకోవడం వలన, తమ పార్టీ యొక్క సైద్ధాంతిక మూలాలు, క్రూరమైన చర్యలు బాహ్య ప్రపంచానికి తెలిసిపోతాయని ఎంఐఎం పార్టీ భయపడుతోంది. ఇలాంటి విద్రోహకరమైన గతాన్ని దాచి పెట్టే ప్రయత్నంలో, ఎంఐఎం పార్టీ సెప్టెంబర్ 17 వేడుకలను.. నిజాంను అవమానించడంతో సమానంగా చూపిస్తూ, ఈ చర్యలను కొనసాగించడం ద్వారా కొందరు ముస్లింల ఆగ్రహానికి కూడా గురవుతోంది. నిజానికి రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ముస్లింలూ ఉన్నారు. వారి పోరాటాలకు, త్యాగాలకు కూడా గుర్తింపు, గౌరవం లభించట్లేదు.

ఫొటో సోర్స్, FACEBOOK
ఇలాంటి బుజ్జగింపుల పరంపరను రాష్ట్ర ప్రభుత్వం బలంగా కొనసాగించడం ద్వారా, షోయబుల్లా ఖాన్ వంటి అనేకమంది పాత్రికేయుల త్యాగాలను మరచిపోతోంది. ఉర్దూ వార్తాపత్రిక "తాజ్" మరియు "రయ్యత్" అనే దినపత్రికలో సంపాదకీయులుగా పని చేసిన అనుభవంతో, ఖాన్ గారు "ఇమ్రోజ్" అనే దిన పత్రికను స్థాపించారు. ఆ పత్రిక ద్వారా హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మనస్ఫూర్తిగా తన మద్దతును తెలియజేశారు. ఈ కారణంగా, 22 ఆగస్టు 1948న చప్పల్ బజార్ నుండి ఇంటికి వెళుతున్న ఖాన్‌ను మార్గమధ్యంలో రజాకార్లు హత్య చేశారు.
హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయాలని సూచించిన వారిని, ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిని రజాకార్లు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ చారిత్రాత్మకమైన దినాన్ని జరుపుకోకపోవడం ద్వారా, నిజానికి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపాలని పోరాటం చేసిన ఎందరో వీరుల పోరాటాలను, త్యాగాలను గుర్తించలేని గుడ్డివారిగా మనం మారిపోతున్నాము.
ఈ విధంగా, మన చరిత్రను ఖననం చేయడం, నిజాం నుండి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం పోరాడినటువంటి ఎందరో వీరుల కష్టాలను, త్యాగాలను పాతి పెట్టడమే.

ఫొటో సోర్స్, Kishan Reddy
భారతదేశం జరుపుకుంటున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 75 వారాల "ఆజాది కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలలో, సాధారణ భారత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
ఈ మహోత్సవ కార్యక్రమం ద్వారా, నిజాం పాలన నుండి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం చేసిన పోరాటంలో పాల్గొని, గుర్తింపు పొందని అనేక మంది వీరులను నిజంగా గుర్తించి, వారికి సరైన గౌరవాన్ని అందించడం జరుగుతోంది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల వలె, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ ప్రాంత విముక్తి కోసం పోరాడిన ఎందరో వీరుల త్యాగాలను గుర్తించి, ఒక స్మారక కట్టడాన్ని ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలి.
ఈ స్మారక చిహ్నం, మనం నేడు అనుభవిస్తున్న ఈ భూమి కోసం, మన పూర్వీకులు నాడు చేసిన పోరాటాలను, త్యాగాలను నేటి తరానికి, భవిష్యత్ తరాలకు తెలియజేయటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- హైదరాబాద్‌లో పదిలంగా ఉన్న ‘పద్మావత్’ రాతప్రతి
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ వజ్రం ఇది
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: నాటి బ్రిటిష్ ఇండియాలో సంచలనం రేపిన చరిత్ర
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











