ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం దుకాణం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే. జాగ్రత్తగా గమనిస్తే ఈ షాపు దగ్గరకొచ్చి ‘ఖరీదైన చౌక మద్యా’న్ని కొంటున్నదెవరో అర్థమవుతుంది. అల్పాదాయ వర్గాల వారే ఈ దుకాణాల దగ్గర తారసపడతారు.
అదే పనిగా అనంతపురం పట్టణం ’ఫస్ట్ రోడ్’లోని ఉన్న చిన్న వైన్ షాపు దగ్గర నాలుగు గంటల పాటు కాచుక్కూచున్నాను. ఇక్కడ చదువుకున్న వాళ్లు, ఉన్నతోద్యోగులు, ఇతర అధికాదాయ వర్గాల ‘పెద్దమనుషులు’ అరుదుగా కనిపించారు.
ఎందుకంటే, పొరుగు రాష్ట్రాల్లో దొరికే పాపులర్ బ్రాండ్స్ వారికి ఇక్కడ దొరకవు. వాళ్లంతా మద్యం మానేశారా? లేదు. వాళ్ల మార్గాల్లో వారికి పాపురల్ బ్రాండ్స్ మద్యం దొరుకుతూనే ఉంది.
పాపులర్ బ్రాండ్స్ లేని కొరతను ఒక వైపు కర్ణాటక, మరొక వైపు తెలంగాణ, కొంతవరకు పుదుచ్చేరి, తమిళనాడు తీరుస్తూనే ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలనుంచి చాలా సులభంగా మద్యం రాష్ట్రంలోకి చొరబడుతున్నది.
నిజానికి కొంతమంది యవకులకు ఇది మంచి ఉపాధి మార్గమైంది. ‘‘సరిహద్దున ఉన్న కర్ణాటక గ్రామాలలో కేవలం ఆంధ్ర వారి కోసం షాపులు వెలిశాయి’’ అని తెలుగు దేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక దుకాణాలు పుట్టుకొచ్చాయి
‘‘ఉదాహరణకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అన్ని బ్రాండ్ల మద్యం దొరుకుతుంది. మీకు రెగ్యులర్‌గా కావాలంటే హోం డెలివరీ ఉంటుంది. ఇదంతా కర్ణాటక మద్యం’’ అని శ్రీనివాసులు చెప్పారు.
‘‘ఆంధ్రా వారి కోసం 150 ఇళ్లు కూడా లేని వూడెం, కొత్తూరు గేటు వంటి చిన్న గ్రామాలలో కూడా రెండు మూడు మద్యం దుకాణలు పుట్టుకొచ్చాయి.
సరిహద్దు పట్టణాల్లో ఉన్న చాలా మంది యువకులు మద్యం అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. రాత్రిపూట, పల్లె దారుల్లో నుంచి ఒక్కొక్క యువకుడు 20 నుంచి 30 బాటిల్స్ కర్ణాటక మద్యాన్ని తీసుకొస్తున్నాడు.
ఒక ట్రిప్పుకి రూ. 1000 నుంచి రూ. 1500 కమీషన్ వీరు సంపాదిస్తారు. ఇది చాలా సర్వసాధారణమైంది.’’
అందుకే మధ్యతరగతి వారిలో చాలా మందికి ఇలాంటి మద్యం సమృద్ధిగా దొరుకుతూ ఉంది. వాళ్లెవరూ ఆంధ్రా ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గరకు వచ్చి, గుంపుల్లో చొరబడి ’మందు‘ కొనాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
చరిత్ర ఏం చెబుతోంది?
మద్యపానంపై నిషేధం విధించడం ఇదేమీ తొలిసారి కాదు. ఇదివరకు తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు నిషేధం విధించారు.
1947 ఆగస్టు 26న మద్రాసు ప్రభుత్వం ‘మద్రాసు ప్రొహిబిషన్ ఎంక్వయిరీ కమిటీ’ని నియమించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో విధించిన మద్యపాన నిషేధం ఎలా అమలుజరుగుతుందో పరిశీలించేందుకు నియమించిన ఈ కమిటీకి కేఏ నాచియప్ప గౌండర్ చైర్మన్‌గా ఉన్నారు. ఎం. కుమరన్ ఎమ్మెల్యే, (మలబారు జిల్లా), నాయకల్లు శంకర్ రెడ్డి ఎంఎల్ సి (కర్నూలు జిల్లా),వేదరత్నం పిళ్లై , ఎమ్మెల్యే( తంజావూరు జిల్లా) టి సుబ్రమణ్యం, కాంగ్రెస్ అధ్యక్షుడు (బళ్లారి జిల్లా) సభ్యులుగా ఉన్నారు. కమిటీకి కడప జిల్లా ప్రొహిబిషన్ అధికారి జివి రంగారెడ్డి కార్యదర్శి.
1937 నుంచి 1947 మధ్య నాలుగు దఫాలుగా పదహారు జిల్లాల్లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది. మొటదటిసారి సి.రాజగోపాలాచారి (రాజాజీ) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, రెండో సారి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిషేధం అమలులోకి వచ్చింది.
రాజాజీ హయాంలో 1937 అక్టోబర్ 1న నిషేధం ప్రారంభమైన మొదటి జిల్లా సేలం. తర్వాత అక్టోబర్ 1, 1938న కడప, చిత్తూరు జిల్లాలకు విస్తరింపచేశారు. రాజాజీ ప్రభుత్వం 1939లో కూలిపోయింది. దాంతో మద్యనిషేధానికి కష్టాలొచ్చాయి. ఫలితంగా అక్రమ సారా మళ్లీ విజృంభించింది. దీనిని అదుపు చేయలేక, నిషేధం అమలుచేయలేక 1944 జనవరి 1న నిషేధం ఎత్తేశారు.
తర్వాత 1946 మార్చిలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి టంగూటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అప్పుడు ఎక్సైజ్ మంత్రి తెలుగు వారే. ఆయన పేరు కడప కోటిరెడ్డి. కొత్త ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం మీద మళ్లీ చర్చ మొదలయింది. రాజాజీ తీసుకువచ్చిన విధానాన్ని అమలు చేయాల వద్దా అనే దాని మీద తర్జన భర్జనలు మొదలయ్యాయి.
నిషేధం విధించాలా వద్దా అనే విషయం మీద కాంగ్రెస్ వాళ్లు ప్రతిచోట ప్రజలను అడగడం మొదలుపెట్టారు. ప్రెసిడెన్సీలో మద్య నిషేధం తప్పక ఉంటుందని, ప్రెసిడెన్సీలోని అన్ని జిల్లాల్లో విధించడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి అక్కడ మద్యనిషేధం విధిస్తామని ఎక్సైజ్ మంత్రి కోటిరెడ్డి గుంటూరులో ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని జిల్లాల్లోనూ...
కొన్ని జిల్లాల్లోనే కాదు, ప్రెసిడెన్సీలోని అన్ని జిల్లాల్లో మద్యనిషేధం విధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడా రాష్ట్రమంతా నిషేధం విధించాలనే ఒత్తిడి మొదలైంది.
ఈ ఒత్తిడిని టంగుటూరు ప్రకాశం ప్రభుత్వం తట్టుకోలేక పోయింది. చివరకు, మద్య నిషేధం విధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకాశం పంతులు ప్రకటన చేయాల్సి వచ్చింది.
ఈ సారి గతంలో రాజాజీ ప్రభుత్వం నిషేధం అమలు చేసిన నాలుగు జిల్లాలలతో పాటు మరొక నాలుగు జిల్లాలలో అంటే ఎనిమిది జిల్లాలలో నిషేధం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
అనంతపురం, బళ్లారి, కర్నులు, కడప, చిత్తూరు, నార్త్ అర్కాట్, సేలం, మలబారు జిల్లాల్లో ఆ ఏడాది అక్టోబర్ 1న మద్యపాన నిషేధం ప్రవేశపెట్టారు. 1947 అక్టోబర్ 1న మరో ఎనిమిది జిల్లాలు- గుంటూరు, నెల్లూరు తంజావూరు, తిరుచిరాపల్లి, మదురై, నీలగిరులు , సౌత్ కెనరా జిల్లాలు వీటికి తోడయ్యాయి.
ఇలా దేశంలో మొట్టమొదట మద్యపాన నిషేధం అమలైన ప్రాంతాలలో ఏడు తెలుగు జిల్లాలున్నాయి. అంటే మద్యపాన నిషేధంతో తెలుగు వాళ్లకు సుదీర్ఘానుభవం ఉన్నట్లే లెక్క.
ఈ జిల్లాల్లో మద్యపానం నిషేధం ఎలా ఉంది? సాధించేందేమిటి? ప్రజల జీవితాలు బాగుపడ్డయా? లేదా అక్రమ మద్యం తయారీ ఎలా ఉంది? తదితర అంశాలను ‘మద్రాసు ప్రొహిబిషన్ ఎంక్వయిరీ కమిటీ’ పరిశీలించి 1948 డిసెంబర్ 2న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజా ఉద్యమంలా...
మద్యపాన నిషేధం ఆ రోజుల్లో కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాదు, ప్రజా ఉద్యమం లాగా కొనసాగింది. ఒక వైపు మహాత్మాగాంధీ నాయకత్వంలోని జాతీయోద్యమంలో భాగంగా మద్యపాన నిషేధం ఉద్యమం సాగుతూ ఉంది.
ఆనాడు కాంగ్రెస్ నేతలలో కార్యకర్తల్లో చాలా మంది గాంధీ మార్గంలో నడిచేందుకు ఇష్టపడే వాళ్లు. మాంసాహారం మానేయడం, ఆశ్రమాలు స్థాపించడం, సాధు జీవితాన్ని పాటించడం, ఇంటింటికి తిరిగి మద్యపాన నిషేధంపై ప్రచారం చేయడం లాంటి గాంధీ విలువలు ప్రచారం చేసే వారు.
అందుకే 1937లో అయిదు తెలుగు జిల్లాలో మద్యపాన నిషేధం అమలయ్యాక, దాన్ని విజయవంతం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రభుత్వమేకాదు, కాంగ్రెస్ పార్టీలోని గాంధేయవాదులు కూడా విపరీతంగా కృషి చేశారు.
నిషేధ కమిటీలు గ్రామ స్థాయిలోనూ ఏర్పడ్డాయి. వారి ప్రచారం తీవ్రంగా సాగింది. రాజాజీ పట్టుదల అంతా ఇంతాకాదు. కల్లు మానిపించే ఉద్దేశంతో కొన్ని సందర్భాలలో తాటి చెట్లు నరికేశారు.
తర్వాత ఇది బతుకు దెరువుని దెబ్బతీస్తుందనే విమర్శలు రావడంతో ఆ పని మానేశారు. కల్లు నిషేధం వల్ల ఉపాధి కోల్పోయిన వారిని వలస పంపించారు.
అధికార పార్టీ వాళ్లు ఇలా పనిగట్టుకుని ఇల్లిళ్లూ తిరిగి మద్యపాన నిషేధం అమలుచేయడం మళ్లీ ఎప్పుడూ జరగలేదు.
సరిహద్దు ప్రాంతాలలో మద్యం షాపులకు ఐదేళ్ల పాటు కొత్త లైసెన్స్‌లు ఇచ్చేది లేదని చెప్పి మైసూరు ప్రభుత్వం మద్రాసుకు సహకారం అందించింది.
ప్రొహిబిషన్ ఉన్న జిల్లాల పొరుగు జిల్లాల్లోనూ ఐదు మైళ్ల పాటు మద్యరహిత ప్రాంతం (డ్రై బెల్టు) ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో ఎక్సైజు, పోలీసు శాఖతోపాటు ప్రొహిబిషన్ పోలీసు అనే విభాగం ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను పరిశీలించి మద్యపానం నిషేధం అమలు తీరెలా ఉందనేదాని మీద గౌండర్ కమిటీ నివేదిక సమర్పించాలి.
అనంతపురం, కడప, చిత్తూరు, బళ్లారిలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ జిల్లాలలో ఈ కమిటీ పర్యటించి అనేక సమావేశాలు సభలు నిర్వహించి నివేదిక సమర్పించింది. నిషేధం వల్ల మద్యం మానేసిన కుటుంబాలలో వచ్చిన మార్పులను ఈ కమిటీ నమోదు చేసింది.

ఆర్థిక పరిస్థితి బాగుపడింది..
‘నిషేధం వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగుపడింది, మద్యానికి వెచ్చిస్తూ వచ్చిన డబ్బుని చాలా కుటుంబాలు కుటుంబావసరాల మీద వెచ్చిస్తూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాయి’ అని కమిటీ రాసింది.
ఈ పరిణామాన్ని విశదంగా వివరిస్తూ ‘ఈ అధిక ధరల కాలంలో మద్యపాన నిషేధం లేకపోతే, చాలా మంది తాగుడు మీద డబ్బంతా ఖర్చు పెట్టే వాళ్లు. ఈ కుటుంబాలన్నీ అపుడు ఆర్థికంగా చితికిపోయి ఉండేవి’ అని పేర్కొంది. అంతేకాదు, మరింత కఠినంగా అమలుచేస్తూ మద్యపానాన్ని రాష్ట్రానికంతా విస్తరింపచేయాలని 1947 సెప్టెంబర్ 13న మద్రాసు ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
అయితే, మద్యపాన నిషేధం చట్టం అమలు తీరుపట్ల కమిటీ పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం అక్రమంగా రవాణా అవుతోందని కమిటీ గుర్తించింది.
హైదరాబాద్ (నైజాం), మైసూరు, బనగాని పల్లె, సందూరుల నుంచి విపరీతంగా సారా అక్రమ రవాణ అవుతూ ఉండటాన్ని నిషేధ వైఫల్యానికి ఒక ప్రధాన కారణంగా కమిటీ పేర్కొంది. బనగాని పల్లె సంస్థానం అప్పుడే ఇండియన్ యూనియన్లో విలీనం కావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. మొత్తానికి సారా స్మగ్లింగ్ అనేది నిషేధ చట్టానికి తూట్లు పొడుస్తూ ఉందని కమిటీ భావించింది.

ఫొటో సోర్స్, INSTAGRAM/WALK_WITH_M
సహకారం అందలేదు..
మరొక విషయం ఏంటంటే, సాతంత్ర్యోద్యమ విలువల ప్రభావం బలంగా ఉన్నా, మద్యం నిషేధానికి ప్రజల సహకారం కొరవడింది. దీనికి తోడు బలహీనమైన యంత్రాంగం, అవినీతి కూడా ఉండేవి. దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేసి మద్యపాన నిషేధాన్న కొనసాగించాలని కమిటి సిఫార్సు చేసింది.
అయితే, రాజకీయ పరిణామలు ప్రతికూలంగా మారాయి. మద్రాసు రాష్ట్రం చీలిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రలో నిషేధం వీగిపోయింది. మద్రాసు రాష్ట్రంలో కుంటుతూ ఇది 1971 దాకా నడిచింది. ఆ ఏడాది డీఎంకే అధినేత కరుణానిధి నిషేధం పూర్తిగా ఎత్తేశారు. ఈ ప్రకటనకు కొద్ది సేపటి ముందు రాజాజీ.. కరుణానిధిని కలుసుకుని నిషేధం ఎత్తేయవద్దని కోరారు. అది వీలు కాలేదు.
గాంధీ జీవించి ఉన్నపుడు, ఆయన చనిపోయాక కూడా మద్యపాన నిషేధానికి ప్రజలు సహకారం పెద్దగా లభించలేదు. నిషేధం వల్ల సాంఘిక ప్రయోజనం ఉన్నా ప్రభుత్వాల ఆదాయం పడిపోవడాన్ని రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. నిషేధం ఎత్తేశారు.
రాజాజీ, ప్రకాశం పంతులు, ఇతర బ్రాహ్మణ ముఖ్యమంత్రులు, గాంధేయవాదులు మద్యపాన నిషేధం అమలుచేసేందుకు కట్టుబడి ఉన్నారు. బ్రాహ్మణేతర ముఖ్యమంత్రులు మద్యపాన నిషేధం అమలు తీరు మీద అంత శ్రద్ధ చూపలేదు.

ఫొటో సోర్స్, TDP/FB
ఆనాడు నిషేధం ఎత్తివేత ఎందుకు
మద్యపాన నిషేధాన్ని ‘వైఫల్యం’ నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా నిషేధాన్ని కొనసాగిస్తూన్నట్లు కనిపించినా, అక్కడ లెక్కలేనన్ని సడలింపుల చిల్లులుపడతాయి. ఆ రాష్ట్రం అక్రమ సారా స్వర్గమవుతుంది.
హరియాణా, బిహార్, గుజరాత్, తమిళనాడు, కేరళ... ఇలా ఎక్కడైనా సరే మద్య నిషేధం అభాసు పాలవుతూనే ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు.
ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న‘పాక్షిక మద్య పాన’ నిషేధం ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకు మద్యపాన నిషేధం విధిగా విఫలమవుతున్నదనేది పెద్దప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఎలా ఉన్నా, మద్యపాన నిషేధం చరిత్ర చెప్పేదేంటంటే నిషేధం ఎవరు విధించినా, ఎక్కడ విధించినా వైఫల్యమే చివరకు మిగిలేది.

ఫొటో సోర్స్, Getty Images
రెండో సారి తెలుగు దేశం హయాంలో మద్యపాన నిషేధం రాష్ట్రమంతా అమలయింది. 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న మద్యపాన నిషేధ నిర్ణయం (జనవరి 16, 1995) వెనుక మహిళల ఉద్యమం ఉన్నా, చట్టంగా అది కేవలం ప్రభుత్వం అమలు చేసిన ప్రయోగమే.
1937 నాటి గాంధేయవాదులు ఎన్టీయార్ ప్రభుత్వంలో లేరు. అప్పటి కాంగ్రెస్ గాంధేయవాదులు ప్రచారం చేసినట్లు తెలుగుదేశం నాయకులెవరూ నిషేధం అమలును విజయవంతం చేసేందుకు పనిచేయలేదు. నాటి కాంగ్రెస్ పార్టీలాగా తెలుగుదేశంపార్టీ గ్రామ కమిటీలు, క్షేత్ర స్థాయి కమిటీలు వేసి మద్యపాన నిషేధం చట్టం విజయవంతయ్యేందుకు కృషి చేయలేదు.
కొందరు టీడీపీ నేతలు దొంగ రవాణ చేసి దండుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి తోడు సమాజంలో బలపడుతున్న మధ్య తరగతి కుటుంబాలలో మద్యపానానికి కొద్దికొద్దిగా జనామోదం లభిస్తూ ఉంది. ఇవన్నీ రెండోసారి నిషేధం విఫలం కావడానికి కారణాలయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ అదాయం పడిపోయిందంటూ, ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1, 1997న నిషేధం ఎత్తివేశారు.

జగన్మోహన్ రెడ్డి నిషేధం
ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మద్యపాన నిషేధమంటూ కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చారు. ఇదొక విచిత్రమైన నిషేధం. నిషేధం ఎక్కడుందో ఎంత వెదికినా కనిపించదు. నిషేధం ఎవరికో, ఎవరి మీదనో అర్థం కాదు. ప్రజలకు మద్యం అన్ని వైపుల నుంచి అందుబాటులోకి వస్తున్నది. ప్రభుత్వ మద్యం వ్యాపారం జోరుగా సాగుతూ ఉంది. రాబడి బాగా పెరుగుతూ ఉంది.
షాపులు తక్కువ, పనివేళలు తక్కువ.. ధరలెక్కువ ,రాబడి ఎక్కువ.. ప్రభుత్వమే అందిస్తున్న లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2021 లో మద్యం సేల్స్ పెరగిన తీరు చూస్తే కళ్లు తిరుగుతాయి.
డిపోల వారీగా మద్యం అమ్మకాల్లో గుంటూరు-1 లో 143 శాతం పెరుగుదల ఉంది. 120.28 శాతం పెరుగుదలతో విజయవాడ-1 రెండో స్థానంలో ఉంది.
అమ్మకాలు విపరీతంగా పెరిగిన డిపోలలో విజయవాడ-3 (92.78శాతం), గుంటూరు-3 (83.12 శాతం), చిత్తూరు-2 (76.33 శాతం), కర్నూలు (72 శాతం), ప్రొద్దుటూరు (69.15 శాతం), పశ్చిమగోదావరి-2 (68 శాతం), శ్రీకాకుళం (61.66 శాతం) ఉన్నాయి.
అనంతపురం, భీమవరం, నెల్లూరు-2, వైజాగ్-1లలో పెరుగుదల 50 శాతం పైబడే ఉంది. ప్రజల చేత మద్యపానం మానిపించేందుకంటూ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచింది. ధరలు పెంచడంతో ప్రజలు మానలేదు గాని, ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ ఉంది.
పూర్తిగా కోవిడ్ ప్రభావం నుంచి వ్యాపారాలు కోలుకోలేదు, ఉపాధి అవకాశాల పునరుద్ధరణ పూర్తికాలేదు. దానికి తోడు పెట్రోలు దగ్గర నుంచి వంటనూనే సరకుల వరకు.. ధరలన్నీ పెరిగాయి. కుటుంబాల రాబడి పెరగలేదు. మరి, ప్రజలు జగన్ ప్రభుత్వం అందిస్తున్న చీప్ లిక్కర్‌నే అత్యధిక ధర పెట్టి ఎలా కొంటున్నారు?

ఫొటో సోర్స్, Reuters
పక్కదారి పడుతోందా?
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి వంటి నగదు బదిలీ పథకాల నుంచి కొంత మొత్తం పక్కదారి పట్టి ఉండే అవకాశాలున్నాయని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ క్రిష్ణనాయక్ అభిప్రాయపడ్డారు.
‘ప్రభుత్వం సదుద్దేశంతో డబ్బును తల్లుల బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తున్నా, అది భర్త చేతికి పోకుండా అడ్డుకోవడం చాలా కష్టం. ముందు మద్యం అలవాటు మానిపించే ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగపోతే, ప్రజలు ఏదో ఒక రూపంలో మద్యం తాగుతారు. ధరలు పెంచినంత మాత్రాన మద్యం మానేయరు’ అని ప్రొఫెసర్ నాయక్ అభిప్రాయపడ్డారు.
మానవహక్కుల సంస్థకు చెందిన డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ (అనంతపురం) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
“ మద్యం బాగా అందుబాటులో ఉంది. పాక్షిక నిషేధంలో మద్యం దొరకని పరిస్థితి అనేది లేదు. దొరుకుతున్నపుడు అప్పోసప్పో చేసైనా కొంటారు. ‘అమ్మఒడి’ కింద ఇచ్చిన డబ్బులో కొంత వరకు సద్వినియోగమవుతూన్నా.. కొంత మొత్తం మిగతా కుటుంబావసరాలకు వాడుతున్నారు. అందులో నుంచి కొంత మొత్తం మద్యపానికి పోతూ ఉండవచ్చు. పాక్షిక మద్యపాన నిషేధం అమలు అనేది ఉత్త మాట. అల్పాదాయ వర్గాలు షాపుల దగ్గర క్యూలుకట్టి కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తి కోలుకోలేదు, నిజమే. అనీ ఎవరూ మద్యం మానడం లేదు. ఏదో ఒక పని చేస్తున్నారు. ఎంతో కొంత సంపాదిస్తున్నారు. దాన్నే మద్యానికి వెచ్చిస్తున్నారు. ప్రభుత్వాదాయ అంకెలు చెబుతున్నదదే. రాష్ట్రంలో పాక్షిక మద్యపాన నిషేధం ఎక్కుడుంది? ”అని డాక్టర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు.
1937 నాటి నిషేధానికి ఇప్పటికి తేడా ఏంటంటే 1937లో జాతీయోద్యమ ప్రభావం బలంగా ఉండింది. అందువల్ల, మద్యపానం దురలవాటు అనే భావన ఉండింది. అదే సినిమా, నాటకాల వంటి పాపులర్ కల్చర్‌లో ప్రచారమవుతూ వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, 2019 నాటి పరిస్థితి ఏమిటి? మద్యపానానికి జనామోదం పెరిగింది. సినిమాలలో యువకులు, తండ్రీ కొడుకులు కలిసి మద్యం సేవించడం ఎపుడూ కనిపించే ఎపిసోడ్.
సాంఘికంగా చూస్తే మద్యపాన నిషేధం భారత దేశంలో విజయవంతమయ్యే అవకాశాలు బాగా తక్కువ అని కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషయాలజీకి చెందిన ప్రొఫెసర్ చెన్నూరు సతీశ్ చెప్పారు.
“అసలు మద్యపాన నిషధం భావనే సంస్కృతీకరణ నుంచి వచ్చింది. సమాజంలో మద్యపానం సేవించే వాళ్లంతా ఎక్కువ మంది తక్కువ కులాల వాళ్లే. ఈ కులాలలో మద్యపానం సేవనం అంతా భావిస్తున్నంత నేరం కాదు. నిషేధం వెనక చూపిస్తున్న ఆర్థిక కారణాలకంటే సాంఘికామోదం ప్రజలను మద్యపానం వైపు మళ్లిస్తూ ఉంది. ఈ కారణాంతో కుటుంబాలు కూలిపోతున్నాయి, ఆర్థిక పతనం వంటి వాదనలతో మద్యపానం అమలుచేయడం సాధ్యంకాదు. దీనికితోడు సమాజంలో మద్యపానానికి ఆమోదం పెరుగుతూ ఉంది’ అని ప్రొఫెసర్ సతీశ్ అన్నారు.
అలాంటి వాతావరణంలో మద్యపాన నిషేధం విజయవంతమెలా అవుతుంది. కాకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నిషేధం విఫలమయింది’ అని నిషేధం ఎత్తేయాల్సిన పని లేదు. పాక్షిక నిషేధం, దశల వారీ నిషేధం అంటూ స్టేటస్-కో కొనసాగిస్తూ చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు.అది ప్రభుత్వానికి లాభం, మందు బాబులకు లాభం, మద్యం అక్రమ రవాణాదారులకు లాభం.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








