అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?

ఫొటో సోర్స్, ullstein bild Dtl/Getty Images
జర్మనీలోని నాజీ పార్టీ ప్రధాన నాయకుల్లో ఒకరైన, యూదుల మారణకాండలో కీలక పాత్ర పోషించిన హెన్రిక్ హిమ్లెర్ 1938లో ఐదుగురు శాస్త్రవేత్తలను టిబెట్ పంపించారు. ఆర్యుల మూలాలను కనుక్కునే బాధ్యతను ఈ ఐదుగురు శాస్త్రవేత్తలకు అప్పగించారు.
ఆ ఐదుగురు శాస్త్రవేత్తలు భారత్ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశించారు. వారి ప్రయాణ విశేషాలను రచయిత వైభవ్ పురందరే బీబీసీకి వివరించారు.
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యేందుకు సరిగ్గా ఏడాది ముందు ఇది జరిగింది. కొందరు జర్మన్లు దొంగచాటుగా భారత్‌లోని తూర్పు సరిహద్దులకు చేరుకున్నారు.
‘‘ఆర్యుల జాతి మూలాలను కనుక్కోవడమే’’ ఈ జర్మన్ శాస్త్రవేత్తల లక్ష్యం.
1500 ఏళ్లకు ముందు నోర్డిక్ ఆర్యన్ జాతి ప్రజలు భారత్‌లోకి ప్రవేశించారని అడాల్ఫ్ హిట్లర్ బలంగా నమ్మేవారు. ‘‘స్థానికులతో (ఆర్యేతరులతో) కలవడంతో ఆర్యుల జాతి కలుషితమైంది. దీంతో భూమిపై మిగతా జాతుల కంటే వారిని ఉన్నతంగా నిలబెట్టే మేలిమి లక్షణాలను ఆర్యులు కోల్పోయారు’’అని హిట్లర్ భావించేవారు.
భారతీయులు, భారతీయుల స్వాతంత్ర్య ఉద్యమం విషయంలో హిట్లర్ చాలాసార్లు తన అయిష్టతను బయటపెట్టారు. తన ప్రసంగాలు, చర్చలు, రచనల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Keystone/Getty Images
ఆ నగరంలో స్వచ్ఛమైన ఆర్యులు
హిట్లర్ ప్రధాన లెఫ్టినెంట్లలో ఒకరైన హిమ్లెర్.. ఆర్యుల మూలాల విషయంలో భారత్ ఉపఖండాన్ని కూడా జల్లెడ పట్టాలని భావించేవారు. అలా టిబెట్‌పై వారి దృష్టి పడింది.
నోర్డిక్ తెల్లజాతీయుల ఆధిపత్యం (ఆర్యుల ఆధిపత్యం) సిద్ధాంతాలను నమ్మేవారు ‘‘అట్లాంటిస్’’ నగరం గురించి చెప్పుకునేవారు. ఇక్కడ స్వచ్ఛమైన ఆర్యుల రక్తం గల జాతి జీవించేదని వారు భావించేవారు.
ఈ నగరం అట్లాంటిక్ సముద్రంలో ఇంగ్లండ్, పోర్చుగల్ మధ్యలో ఉండేదని వారు చెబుతుంటారు. అయితే, ఒక భారీ పిడుగు పడటంతో ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని వారు నమ్ముతారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆర్యులు కొందరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోయారని, అలా వెళ్లిన ప్రాంతాల్లో హిమాలయ ప్రాంతం కూడా ఒకటని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా ప్రపంచానికి పైకప్పు లాంటి టిబెట్ ప్రాంతానికి ఆర్యులు వెళ్లారని విశ్వసిస్తారు.

ఫొటో సోర్స్, ullstein bild Dtl/Getty Images
వారిని అన్వేషిస్తూ..
1935లో పురాతన వారసత్వ సంపద అన్వేషణ కోసం అహ్నెనేర్బ్ పేరుతో ఒక విభాగాన్ని హిమ్లెర్ స్థాపించారు. పిడుగుపాటు తర్వాత అట్లాంటిస్ నుంచి ఆర్యులు ఎక్కడికి వెళ్లారో కనుక్కోవడమే ఈ విభాగం లక్ష్యం.
దీనిలో భాగంగానే ఐదుగురు జర్మన్లను ఆయన భారత ఉపఖండానికి పంపించారు.
ఈ బృందంలో ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిలో ఒకరు ఎర్నెస్ట్ స్కాఫెర్. 28ఏళ్ల జంతుశాస్త్ర నిపుణుడైన స్కాఫెర్.. ఇదివరకు రెండుసార్లు భారత్-చైనా-టిబెట్ సరిహద్దులను సందర్శించారు. 1933లో ఆయన నాజీలతో చేతులు కలిపారు.
జంతువులను వేటాడటం అంటే స్కాఫెర్‌కు విపరీతమైన పిచ్చి ఉండేది. ఒకసారి పడవలో వెళ్తూ ఓ బాతును ఆయన షూట్ చేయాలని అనుకున్నారు. ఆ బోటులో పక్కనే ఆయన భార్య ఉన్నారు. బాతుకు గురిపెట్టిన తూటా అదుపుతప్పి పక్కనే ఉన్న ఆయన భార్యకు తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించారు.
ఇక రెండో వ్యక్తి బ్రూనో బెర్జెర్. మానవ పురాతత్వ శాస్త్రవేత్త అయిన బెర్జెర్.. 1935లో నాజీలతో చేతులు కలిపారు. పుర్రెల కొలతలు తీసుకోవడం, టిబెటన్ల ముఖ కవళికలను రికార్డు చేసుకోవడం, ఫేస్ మాస్క్‌లు తయారుచేయడం ఈయన పని. ‘‘ఈ ప్రాంతంలో నోర్డిక్ ఆర్యుల జాతి మూలాలను కనిపెట్టేందుకు దోహదపడే సమాచారాన్ని నేను సేకరించే వాణ్ని’’అని ఆనాడు ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ullstein bild Dtl/Getty Images
శ్రీలంక మీదుగా..
ఈ ఐదుగురితో కూడిన నౌక మే 1938లో శ్రీలంకలోని కొలంబోలో దిగింది. అక్కడి నుంచి వారు మరో నౌకలో మద్రాస్ వెళ్లారు. అక్కడి నుంచి మరో నౌకలో కలకత్తాకు చేరుకున్నారు.
తీర ప్రాంతాల్లో జర్మన్లు అడుగుపెట్టారని గూఢచారుల ద్వారా బ్రిటిష్ అధికారులు తెలుసుకున్నారు. వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని మొదట బ్రిటిషర్లు భావించారు. బ్రిటిష్ ఆధీనంలోని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ‘‘ద జెస్టపో ఏజెంట్ ఇన్ ఇండియా’’పేరుతో ఓ కథనం కూడా ప్రచురితమైంది.
అప్పుడు స్వతంత్ర ప్రాంతమైన సిక్కింలోని గాంగ్‌టక్‌లోనూ ఈ ఐదుగురినీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూశారు. కానీ మొత్తానికి అన్ని అడ్డంకులనూ దాటుకుంటూ వీరు టిబెట్ చేరుకున్నారు.
ఆ ఏడాది చివరినాటికి బ్యాగులు, భుజాలపై స్వస్తిక చిహ్నాలున్న ఈ ఐదుగురు నాజీలూ టిబెట్‌లోకి అడుగుపెట్టారు.
టిబెట్‌లో అప్పటికే చాలాచోట్ల స్వస్తిక చిహ్నాలు కనిపిస్తుండేవి. వీటిని స్థానికులు ‘‘యంగ్‌డ్రంగ్’’అనే పేరుతో పిలుస్తారు. ఈ శాస్త్రవేత్తలకు భారత్‌లోనూ ఈ గుర్తులు కనిపించే ఉంటాయి. ఎందుకంటే హిందువులు ఈ గుర్తును అదృష్టానికి ప్రతీకగా చూసేవారు. నేటికీ చాలా ఇళ్ల బయట, దేవాలయాల్లో, వీధి చివర బోర్డులపై, వాహనాలపై స్వస్తిక గుర్తు కనిపిస్తుంటుంది.
టిబెట్‌లో పరిస్థితులు వేరు..
శాస్త్రవేత్తలు వచ్చే సమయంలో టిబెట్‌లో పరిణామాలు వేగంగా మారుతూ ఉండేవి.
1933లో 13వ దలైలామా కన్నుమూశారు. కొత్త దలైలామా వయసు కేవలం మూడేళ్లు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జర్మన్లను టిబెటన్లు, అక్కడి పాలకులు సాదరంగా ఆహ్వానించారు. బెర్జెర్ అయితే స్థానికులకు వైద్య సేవలు కూడా అందించారు.
అయితే హిందూ మతంలానే బౌద్ధం కూడా ఆర్యుల పవిత్రతను దెబ్బ తీసిందని నాజీలు బలంగా నమ్ముతున్నారని ఆనాటి టిబెటన్ బౌద్ధులకు తెలిసుండదు.
పరిశోధన పేరుతో స్కాఫెర్, బర్జెర్‌లతోపాటు మిగతా శాస్త్రవేత్తలు కూడా ఆర్యుల మూలాల గురించి శోధించారు. అయితే, యుద్ధంనడుమ వీరి పరిశోధన మధ్యలోనే ముగించుకొని వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, ullstein bild Dtl/Getty Images
అయితే, అప్పటికే 376 మంది టిబెటన్ల పుర్రెల కొలతలను బెర్జెర్ తీసుకున్నారు. మరో 2,000 ఫోటోలు కూడా తీశారు. మరో 350 మంది చేతివేళ్లు, చేతుల ముద్రలను సేకరించారు.
దాదాపు 2,000 పురాతన కళాకృతులను కూడా ఆయన సేకరించారు. ఈ బృందంలోని మరో సభ్యుడు 18,000 మీటర్ల బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్‌లో చాలా వివరాలను రికార్డు చేశారు. 40,000 ఫోటోలు తీశారు.
వీరి పర్యటన ముగించాల్సిన అవసరం రావడంతో, వీరు కలకత్తా నుంచి సురక్షితంగా విమానంలో వచ్చేందుకు హిమ్లెర్ ఏర్పాట్లు చేశారు. మ్యూనిక్‌లో ఆయనే స్వయంగా వెళ్లి వీరికి ఆహ్వానం పలికారు.
తాను సేకరించిన సమాచారాన్ని స్కాల్జ్‌బర్గ్‌లోని ఓ భవనంలో స్కాఫెర్ ఉంచారు. అయితే, 1945లో సంకీర్ణ దళాలు జర్మనీపై పైచేయి సాధించాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని ధ్వంసం చేశాయి. దీంతో టిబెటన్ల ఫోటోలతోపాటు చాలా సమాచారం ధ్వంసమైంది.
మిగతా పరిశోధకుల సమాచారం కూడా ఇలానే ధ్వంసమైంది. ఆ యుద్ధం తర్వాత, ఆర్యుల ఆధిపత్యం అనే సిద్ధాంతానికి చోటు లేకుండా పోయింది. దీంతో ఈ సమాచారం కూడా మరుగునపడింది.
‘‘హిట్లర్ అండ్ ఇండియా: ద అన్‌టోల్డ్ హిస్టరీ ఆఫ్ హిస్ హేట్రెడ్ ఫర్ ద కంట్రీ అండ్ ఇట్స్ పీపుల్స్’’ పుస్తకాన్ని వైభవ్ పురందరే రాశారు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









