ఐర్లాండ్: ‘అబార్షన్లపై ఉద్యమానికి భారతీయ మహిళ మరణమే కారణం’

అబార్షన్లను నిషేధించాలా, అనుమతించాలా అనే అంశంపై ఐర్లాండ్‌లో ఈనెల 25న దేశవ్యాప్తంగా రెఫరెండం నిర్వహించనున్నారు. అక్కడ అబార్షన్లకు ఈ స్థాయి ప్రాధాన్యం లభించడానికి ఓ భారతీయ మహిళ మరణం కూడా ప్రధాన కారణమైంది.
అబార్షన్లపైన ఐర్లాండ్‌లో చాలా ఏళ్లుగా విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉంది. వాటికి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలామంది ఉద్యమిస్తూనే ఉన్నారు. కానీ 2012లో సవితా హలప్పనవార్ అనే భారతీయ వైద్యురాలి మరణం తరవాత అబర్షాన్లపై అక్కడ దేశ వ్యాప్త ఉద్యమం ఊపందుకుంది.
ఐర్లాండ్‌లో ఉండే సవిత 17వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తనకు గర్భస్రావం జరుగుతందని తెలీడంతో, అబార్షన్ చేసి పిండాన్ని తొలగించమని వైద్యుల్ని కోరారు. కానీ గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోంది కాబట్టి అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పారు.
కానీ ఆ తరవాత కొద్ది రోజులకే ఆమె గర్భస్రావం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో చనిపోయారు. సవిత మరణంతో దేశవ్యాప్తంగా వైద్యులకు, రాజకీయ నేతలకు, అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలనే ఆందోళనలు ఊపందుకున్నాయి.
ఐరిష్ చట్టాల ప్రకారం కడుపులో ఉన్న బిడ్డకు కూడా తల్లితో సమానంగా జీవించే హక్కు ఉంటుంది. అందుకే అక్కడ రేప్ కేసులు, అవాంఛిత గర్భాలతో పాటు గర్భస్థ శిశువు బతికే అవకాశాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా అబార్షన్లు చేయరు.
సవిత విషయంలోనూ అదే జరిగింది. దానివల్లే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అక్కడ సమస్య బిడ్డ బతుకుతుందా, చనిపోతుందా అన్నది కాదు. ఆమె పరిస్థితిని గమనించి వైద్య ప్రక్రియలో భాగంగా ఆమెకు అబార్షన్ చేసుండాల్సింది’ అని ఐర్లాండ్‌లోని సవిత స్నేహితురాలు మృదుల వాసేపల్లి అన్నారు.
సవిత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ రావడంతో చివరిగా వైద్యులు అబార్షన్ చేయొచ్చని నిర్ధరించారు. ఆ ప్రక్రియ మొదలవడానికి ముందే సవిత ప్రసవించారు. కానీ బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఆ తరవాత సవిత సెప్టిక్ షాక్‌కు గురయ్యారు. అవయవాలు ఒక్కొక్కటిగా స్తంభిస్తూ రావడంతో 2012 అక్టోబర్ 28న ఆమె చనిపోయారు.
ఆమె మృతిపై విచారణ జరిపిన సభ్యులు వైద్యపరమైన కారణాల(మెడకల్ మిస్ అడ్వెంచర్) వల్లే ఆమె చనిపోయారని తేల్చారు. అన్నీ సరిగా జరిగుంటే, సవిత ఆ రోజే తన 5వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకొని ఉండేవారు.
మూడు స్వతంత్ర నివేదికలు కూడా వైద్యం అందడంలో సమస్యల కారణంగానే సవిత చనిపోయినట్లు తేల్చాయి.
మొత్తమ్మీద ఐర్లాండ్‌లో అబార్షన్లపై జరుగుతున్న చర్చలపై సవిత మరణం పెను ప్రభావమే చూపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘సవిత చనిపోయిన వారం రోజుల్లోనే దేశంలో చాలా చలనం వచ్చింది. అప్పట్నుంచీ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి’ అని అబార్షన్ అనుకూల ప్రచారకురాలు డెటె మెక్‌లాలిన్ తెలిపారు.
‘కొత్తతరం అమ్మాయిలు అబార్షన్ గురించి మాట్లాడటానికి సంకోచించట్లేదు. అలాంటి వాళ్లంతా సవిత గురించి తెలుసుకొని చలించారు. ఆ పరిస్థితి తమకు, తమ పిల్లలకు, తమ భాగస్వాములకు కూడా ఎదురవొచ్చని దేశంలో చాలామంది భావించారు’ అని డెటె చెప్పారు.
‘ది ఐరిష్ టైమ్స్’కు చెందిన పాత్రికేయురాలు కిట్టీ హోలాండ్ మొదటగా సవిత మరణం గురించిన కథనం రాయడంతో ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.
అబార్షన్ విషయంలో రాజ్యాంగ సవరణ చేయాలా వద్దా అనే దానిపై రెఫరెండంను నిర్వహించాలని చాలా మంది ఉద్యమించారు.
కానీ అబార్షన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించేవాళ్లు మాత్రం చట్టాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సవిత కేసును చట్టానికి అనవసరంగా ఆపాదిస్తున్నారు. ఆమె మరణం చట్టం కారణంగా చోటుచేసుకోలేదు. అబార్షన్ చట్టంలో మార్పు కోరుకునేవాళ్లే ఇలా ఆమె మరణానికీ చట్టానికీ ముడిపెడుతున్నారు’ అని కొరా షెర్లాక్ అనే ‘ప్రో లైఫ్’ ప్రచారకర్త అన్నారు.
ఐర్లాండ్‌లో అబార్షన్లపై చర్చలు, నిరసనలు చోటు చేసుకున్నప్పుడల్లా సవిత పేరు తెరమీదకు వస్తోంది.
అక్కడి అబార్షన్ చట్టాల కారణంగానే సవిత చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు భావిస్తున్నారు. అబార్షన్లకు అనుకూలంగా ఓటు వేయాలని వాళ్లు పిలుపునిస్తారు.
‘మేం అనుభవించిన క్షోభను మరే కుటుంబం అనుభవించకూడదు. ఇప్పటికీ తన మరణం మమ్మల్ని బాధిస్తూనే ఉంది’ అని సవిత తండ్రి ఆనందప్ప అంటున్నారు.
ప్రతి సంవత్సరం సవిత చనిపోయిన రోజున ఐర్లాండ్‌లోని అనేక నగరాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడివారు తన పేరును ఎప్పటికీ మరచిపోలేరు’ అంటారు సవిత స్నేహితురాలు మృదుల.
ఇవి కూడా చదవండి
- #BBCSpecial : దేశంలో దళితులు, ముస్లింల సమస్యలు ఏంటి? చర్చిద్దాం రండి
- పరిశోధన: ‘రోజూ ఒక గుడ్డు తినాలి సరే.. మరి పచ్చసొన ఏం చేయాలి?’
- వేదాంత ఫ్యాక్టరీ: అసలేంటీ వివాదం? ఎందుకిన్ని ఆందోళనలు?
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది!
- అగ్రిగోల్డ్ కేసులో మరో అరెస్ట్ - ఇంతకూ ఏంటీ అగ్రిగోల్డ్ కేసు?
- కర్ణాటక ఎన్నికలు రాహుల్ గాంధీకి ఏం నేర్పాయి? 2019లో బీజేపీని ఎలా ఎదుర్కొంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








