డోనల్డ్ ట్రంప్: అబార్షన్ నిషేధం వివాదంపై స్పందించిన ప్రెసిడెంట్

ఫొటో సోర్స్, EPA
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అబార్షన్ మీద కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టాలు చేసిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆ అంశం మీద తన అభిప్రాయాలను వెల్లడించారు.
అత్యాచారం, వావి వరుసలేని సంబంధాలు, తల్లికి ప్రాణాపాయం ఉన్నప్పుడు మినహా మిగతా సందర్భాల్లో అబార్షన్‌కు తాను వ్యతిరేకమని ట్రంప్ చెప్పారు.
అబార్షన్ చట్టాలు, నియమ నిబంధనలు ఇప్పుడు అమెరికాలో ఎన్నికల అంశంగా మారింది. దీనిపై ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఎటువంటి ఉదంతంలోనైనా అబార్షన్‌ను నిషేధిస్తూ అలబామా రాష్ట్రం కఠిన చట్టం చేసిన కొన్ని రోజులకు ట్రంప్ తన వైఖరిని వెల్లడించారు.
కొత్త చట్టానికి నిరసనగా దీనిని వ్యతిరేకిస్తున్న వారు ఆదివారం భారీ ప్రదర్శన చేపట్టనున్నారు.
అలబామా చట్టాన్ని కోర్టుల్లో అడ్డుకునే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని, అయితే అప్పీళ్ల ద్వారా ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వస్తుందని ఆశిస్తున్నామని.. అబార్షన్ నిషేధాన్ని సమర్థిస్తున్న వారు పేర్కొన్నారు.
1973లో అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును.. ప్రస్తుతం మితవాదులు మెజారిటీగా ఉన్న సుప్రీంకోర్టు తిరగరాయాలని వీరు కోరుకుంటున్నారు.
అబార్షన్ మీద కొత్త ఆంక్షలు విధించాలని మరో పదహారు రాష్ట్రాలు కూడా భావిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ ఏం చెప్పారు?
అలబామా అబార్షన్ చట్టం గురించి ట్రంప్ ఇప్పటివరకూ మాట్లాడలేదు. అయితే, శనివారం సాయంత్రం తన అభిప్రాయాలు చెప్తూ ట్విటర్‌లో వరుసగా పోస్టులు చేశారు.
''నేను ప్రాణి-అనుకూలవాదిని. ప్రాణం నిలబెట్టాలనే వాదనను నేను బలంగా సమర్థిస్తాను. అయితే, అందుకు మూడు మినహాయింపులు ఉన్నాయి. అత్యాచారం, వావివరుసలేని సంబంధాలు, తల్లి ప్రాణాలను రక్షించటం ఆ మినహాయింపులు. ఇది రొనాల్డ్ రీగన్ అనుసరించిన వైఖరి'' అని పేర్కొన్నారు.
మితవాద సుప్రీంకోర్టు జడ్జిలు నీల్ గోరుచ్, బ్రెట్ కవన్నా వంటి వారిని తాను నియమించటం.. వివిధ రాష్ట్రాల్లో అబార్షన్ చట్టాలు మరింత కఠినతరం కావటానికి దోహదపడిందని కూడా ఆయన చెప్పారు.
''గత రెండేళ్లలో 105 మంది అద్భుతమైన కొత్త ఫెడరల్ జడ్జిలతో (ఇంకా చాలా మంది రాబోతున్నారు), ఇద్దరు గొప్ప కొత్త సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మనం చాలా ముందుకు వచ్చాం. జీవన హక్కకు సంబంధించి పూర్తిగా కొత్త సానుకూల దృక్పథం వచ్చింది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో అబార్షన్ అనేది వివాదాస్పద అంశంగానే కొనసాగుతోంది. ప్రత్యేకించి ఎవలాంజికల్ క్రిస్టియన్లు అబార్షన్ మీద కఠిన ఆంక్షలు విధించటం కానీ పూర్తిగా నిషేధించటం కానీ చేయాలని కోరుతున్నారు. అమెరికా ఓటర్లలో వీరు చాలా కీలకమైన భాగం.

''మనం సమైక్యంగా ఉండాలి.. ప్రాణం కోసం 2020లో గెలవాలి'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.
2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అబార్షన్ అంశం ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుందని సీనియర్ డెమొక్రాట్స్ కూడా సూచిస్తున్నారు.
మసాచుసెట్స్ సెనెటర్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్ వారెన్.. అలబామా అబార్షన్ నిషేధం మీద స్పందిస్తూ.. ''ఈ నిషేధం ప్రమాదకరం. అత్యంత క్రూరమైనది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిప్పికొట్టటం ఈ బిల్లు రచయితల కోరిక'' అని పేర్కొన్నారు.
''ఆ అమెరికాలో నేను నివసించాను. అందుకే చెప్తున్నా.. మనం వెనక్కి వెళ్లబోవటం లేదు. నేడు కాదు.. ఎన్నడూ వెనక్కి వెళ్లేది లేదు. మనం గెలుస్తాం'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









