HPV: గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తపడడం ఎలా?

హెచ్‌పీవీ వైరస్

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్
    • రచయిత, డాక్టర్ శైలజా చందు
    • హోదా, బీబీసీ కోసం

భారత మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భకోశ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భకోశ క్యాన్సర్‌ది నాలుగో స్థానం.

భారత్‌లో ప్రతి ఏటా 1,22,844 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌కు గురవుతుండగా, 67,477 మంది ఆ వ్యాధితో మరణిస్తున్నారు.

దాదాపు అన్ని గర్భాశయ క్యాన్సర్లు (99.7%) అధిక ప్రమాదకర రకమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్( హై రిస్క్ హెచ్‌పీవీ) సంక్రమణ వల్లే వస్తాయని పరిశోధనల్లో తేలింది.

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) అంటే?

కొన్ని వైరస్‌ల సముదాయాన్ని హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ)వైరస్ అంటారు.

వీటిలో దాదాపు 100 రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి కాగా, మరికొన్ని అంత ప్రమాదకరం కాదు.

హెచ్‌పీవీ అనేది చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా ఎలాంటి లక్షణాలను కలిగించవు. చాలా మందికి తమకు హెచ్‌పీవీ సోకినట్లు తెలీదు.

ఈ వైరస్ ఎలాంటి హాని కలిగించకుండా శరీరంలో 15-20 ఏళ్లు ఉంటుంది. ఎక్కువ మంది మహిళల్లో ఈ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు వాటంతటవే నయం అవుతాయి.

హెచ్‌పీవీ 16, 18 ప్రమాదకరమైనవి ఈ వైరస్‌లు జనానాంగాల క్యాన్సర్, ఆసన క్యాన్సర్, తల మరియు మెడ క్యాన్సర్లు వచ్చేలా చేస్తాయి.

ప్రమాదకరం కాని వైరస్‌ల వల్ల పులిపిరులు లాంటి చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Carcinoma Cervix)

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్‌లో గర్భాశయ క్యాన్సర్ నాలుగో స్థానంలో ఉంది. 2018లో 5 లక్షలకు పైగా ఈ కేసులు నమోదయ్యాయి, ఈ వ్యాధితో 3 లక్షల మంది చనిపోయారు.

ఈ క్యాన్సర్ ఎక్కువగా తక్కువ ఆదాయం వున్న దేశాలలో వస్తోంది.

గర్భకోశ ముఖ ద్వారపు క్యాన్సర్‌కు కారణాలు.

గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా హెచ్‌పీవీ-16, 18 వల్ల వస్తుంది.

చిన్న వయసులోనే లైంగిక సంబంధాలు ఉండడం, చిన్న వయసులో గర్భం దాల్చడం, ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు కలిగి వుండడం, పేదరికం, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పోషకాహార లోపం లాంటివి దీనికి కారణాలుగా చెప్పవచ్చు.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ధూమపానం, HIV/AIDs, క్లమిడియా లాంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు లాంటి ఇతర అంశాల కూడా దీనికి కారణం కావచ్చు.

గర్భాశయ స్క్రీనింగ్

ఫొటో సోర్స్, Science Photo Library

ప్రమాదకరమైన ఈ గర్భ కోశ క్యాన్సర్ ని నివారించడం ఎలా?

గర్భకోశ క్యాన్సర్ నివారణకు మూడంచెల విధానం ఉంది.

1. వాక్సీన్ ద్వారా

2. మహిళందరికీ స్క్రీనింగ్ పరీక్షలు

3. తొలిదశలో కాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించడం ద్వారా 90% వరకు దీనిని విజయవంతంగా నిర్మూలించవచ్చు.

హెచ్‌పీవీ వాక్సీన్‌లో 2 డోసులుగా ఇస్తారు. లైంగిక సంబంధాలు ఏర్పడక ముందే ఈ వ్యాక్సీన్ వేయించడం చాలా ముఖ్యం.

బాలికలకు 12- 13 ఏళ్ల వయసులోనే మొదటి డోస్ వేయించాలి. రెండో డోస్ 6 నుండి 12 నెలల వ్యవధి తర్వాత వేయించాలి. కొంత మందికి మూడు డోసుల వాక్సిన్ కూడా అవసరమవుతుంది.

వాక్సీన్ మొదటి డోస్ 15 ఏళ్ల వరకు వేయించుకోనట్లయితే, తప్పని సరిగా మూడు డోసులు వేయించుకోవాలి.

స్వలింగ సంపర్కులు, వ్యాక్సీన్‌కు అర్హులైన ట్రాన్స్ జెండర్లకు మూడు టీకాల మోతాదు అవసరం.

టీకా మూడు డోసులు అవసరమైన వారికి మొదటి డోస్ తర్వాత కనీసం ఒక నెల తర్వాత రెండో డోస్ ఇవ్వాలి. రెండో డోస్ వేసిన 12 నెలల్లోపు మూడో డోస్ ఇవ్వాలి.

స్క్రీనింగ్ పరీక్షలు

ఫొటో సోర్స్, CANCER COUNCIL AUSTRALIA

గర్భ కోశపు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

ఇవి రెండు రకాలు.

1.పాప్ స్మియర్

2. హెచ్ పి వి పరీక్ష

పాప్ స్మియర్: గర్భాశయ ముఖ ద్వారం నుండి కొన్ని కణాలు సేకరించి వాటిలో క్యాన్సర్ కు చెందిన మార్పులు గానీ , క్యాన్సర్ వచ్చే ముందు మార్పులేమైనా వున్నాయా అని పరీక్షించడం.

ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ లో గర్భాశయ ముఖ ద్వారం నుంచి కణాల శాంపిల్ సేకరిస్తారు.

ఇది క్లినిక్‌లో రెండు మూడు నిముషాల్లో జరిగే తేలిక పాటి పరీక్ష. నొప్పి కలిగించని పరీక్ష కాబట్టి మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు.

ప్రతి మహిళా 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకూ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి.

హెచ్‌పివీ పరీక్ష: దీనిని ప్రతి ఐదేళ్లకొకసారి చేయించుకోవాలి.

స్క్రీనింగ్ పరీక్షలు

ఫొటో సోర్స్, Science Photo Library

స్క్రీనింగ్ పరీక్షల లక్ష్యమేమిటి?

క్యాన్సర్ కన్నా ముందు స్థితిని కార్సినోమా ఇన్ సైటూ(Carcinoma in situ) అంటారు. ఆ దశలో వ్యాధిని కనుగొని, చికిత్స అందించడం ద్వారా కాన్సర్‌ను 90 శాతం విజయవంతంగా నిర్మూలించవచ్చు.

స్క్రీనింగ్ పరీక్షల ద్వారా కాన్సర్‌ని తొలిదశలో గుర్తించడమే కాదు, క్యాన్సర్ రాబోయే ముందు మార్పులను పసి గట్టడం కూడా సాధ్యమవుతుంది. వెంటనే చికిత్స చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు.

హెచ్‌పీవీ టీకా వల్ల ఎంతకాలం రక్షణ వుంటుంది?

హెచ్‌పీవీ సంక్రమించకుండా టీకా కనీసం పదేళ్లు రక్షిస్తుందని అధ్యయనాల్లో నిరూపితమైంది. అయితే ఈ రక్షణ ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

వాక్సీన్ తీసుకున్న వారికి స్క్రీనింగ్ అవసరం లేదా?

అదొక అపోహ మాత్రమే. హెచ్‌పీవీ వాక్సీన్, కొన్ని రకాల ప్రమాదకరమైన వైరస్‌ల నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తుంది.

గర్భాశయ క్యాన్సరుకు కారణమయ్యే ఇతర హెచ్‌పీవీ రకాల నుండి రక్షణ కోసం స్క్రీనింగ్ చాలా అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకున్న అమ్మాయిలందరూ 25 ఏళ్లు వచ్చాక క్రమం తప్పకుండా ప్రతి మూడేళ్లకు ఒకసారి పాప్ స్మియర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి.

హెచ్‌పీవీ వాక్సిన్ వల్ల పురుషులకు కలిగే ఉపయోగం?

పురుషుల్లో సంభవించే క్యాన్సర్లు, ఉదాహరణకు పాయువు (Anal Carcinoma, పురుషాంగం, నోరు, గొంతు క్యాన్సర్ లాంటివి హెచ్‌పీవీ 16, 18 వల్ల వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

టీకాలు వేయించుకున్న అమ్మాయిల నుంచి హెచ్‌పీవీ వైరస్ సోకదు. తద్వారా 'హెర్డ్ ఇమ్యూనిటీ' పెరుగుతుంది.

బాలికలకు టీకాలు వేయడం వల్ల పరోక్షంగా ఈ రకమైన క్యాన్సర్ నుంచి అబ్బాయిలను కాపాడ్డానికి సహాయపడుతుంది.

వాక్సీన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి?

సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా వుండవు. ఇంజెక్షన్ చేసిన చోట కొద్దిగా ఎర్రబడడం , తలనొప్పి, టెంపరేచర్ పెరగడం వంటి సాధారణ దుష్ప్రభావాలు కనిపిస్తాయి.

టీనేజర్లు భయానికి గురవడం వల్ల కొన్ని సార్లు స్పృహ తప్పే అవకాశం వుంటుంది. అలాంటి వాటిని వాక్సీన్ సైడ్ ఎఫెక్ట్ గా పరిగణించాల్సిన అవసరం లేదు.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)