కరోనా మహమ్మారి తర్వాత ఆఫీసుల్లో మనం ఆరోగ్యంగా పని చేయగలమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ చాఫిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'ఇంటి నుంచి పని విధానం' ముగిసి తిరిగి మనం పనిచేసే చోటుకు వెళ్లినప్పుడు జలుబు, ఫ్లూ వైరస్‌లు పెరగకుండా అడ్డుకోడానికి కరోనా వైరస్ ద్వారా నేర్చుకున్న పాఠాలు మనకు పనికొస్తాయా?
'నా జీవిత కాలంలో ఇంతకాలం పాటు నేను జలుబు బారిన పడకుండా ఉండటం ఏ సంవత్సరంలోనూ జరగలేదు' అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్‌లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎమరిటస్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ అండ్ వ్యాక్సినాలజీ క్లినికల్ ప్రొఫెసర్ జాన్ స్వార్ట్జ్‌బర్గ్ గుర్తు చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం చివరిసారిగా ఆయన సాధారణ అనారోగ్యానికి గురైనట్లు చెప్పుకొచ్చారు.
గత 18 నెలలుగా కోవిడ్- 19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ... వాస్తవానికి చాలా దేశాల్లో జలుబు, ఫ్లూ లాంటి కొన్ని సాధారణ అనారోగ్యాలు తగ్గుముఖం పట్టాయి. కరోనా నేపథ్యంలో తీసుకునే జాగ్రత్తల వల్ల ఆ కేసుల సంఖ్య తగ్గింది.
వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉన్న దేశాల్లో ప్రజలు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి తాత్కాలికంగా బయటపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తే ఈ సాధారణ అనారోగ్యాలు మళ్లీ తిరగబెడతాయా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహోద్యోగులతో కలిసి పని చేయాల్సిన పరిస్థితే ఏర్పడితే, సాధారణ అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి కరోనా నుంచి నేర్చుకున్న చాలా పాఠాలను ఉద్యోగులతో పాటు యజమానులు పాటించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లూ ఎందుకు వస్తోంది?
రికార్డుల ప్రకారం చూస్తే 2020-2021 ఫ్లూ సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 2020 నుంచి జనవరి 2021 వరకు బ్రిటన్‌లో ఒకే ఒక ఫ్లూ కేసు నమోదైంది. అమెరికాలో సీడీసీ గణాంకాల ప్రకారం, 27 సెప్టెంబర్ 2020 నుంచి 22 మే 2021 వరకు 1,899 పాజిటివ్ ఫ్లూ కేసులు రికార్డయ్యాయి. అక్కడ సీజన్ మొత్తంలో పాజిటివిటీ రేటు 0.2 శాతమే. కరోనాకు ముందు, 2018-2019 ఫ్లూ సీజన్‌లో 1,76,731 పాజిటివ్ కేసులు నమోదు కాగా... పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉంది. దీనితో పోలిస్తే తాజా సీజన్ కేసుల గణాంకాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
భారీ సంఖ్యలో ఫ్లూ వ్యాక్సీన్లు అందించడమే ఈ కేసుల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొన్నారు. అమెరికాలో 26 ఫిబ్రవరి 2021 నాటికి 193.7 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సీడీసీ పంపిణీ చేసింది. మునుపటి సీజన్ కంటే ఈ సంఖ్య దాదాపు 20 మిలియన్ డోసులు ఎక్కువ. అంతేకాకుండా కరోనాను కట్టడి చేసేందుకు తీసుకున్న జాగ్రత్త చర్యలు కూడా ఫ్లూ కేసుల తగ్గుదలకు దోహదపడ్డాయని వారు వెల్లడించారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలు ఫ్లూ, జలుబు వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్నాయని అన్నారు.
అయితే, తక్కువ సంఖ్యలో ఫ్లూ కేసుల వల్ల ప్రతికూలత ఏంటంటే... ఈ సీజన్‌లో మనలో చాలా మందికి తక్కువ రోగ నిరోధక శక్తి ఉండనుంది. 'సాధారణంగా, ఫ్లూ రాని వ్యక్తులు కూడా వైరస్ బారిన పడతారు. అది వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా మరుసటి ఏడాది ఫ్లూ సీజన్ వచ్చే నాటికి వారిలో యాంటీబాడీలు అలాగే ఉంటాయి' అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేష్ ప్రొఫెసర్ ఈలీ క్లీన్ వివరించారు.
వచ్చే సీజన్ ఫ్లూ వ్యాక్సీన్ ప్రభావంపై కూడా ఆందోళనలు ఉన్నాయి. సాధారణంగా ప్రతీ సీజన్‌కు ఫ్లూ వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గత సంవత్సరానికి చెందిన డేటాను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు. ఈ ఏడాది తక్కువ ఫ్లూ కేసులు నమోదు కావడం వల్ల శాస్త్రవేత్తలకు అవసరమైన డేటా అందుబాటులో ఉండదు. 'ఫ్లూ వేవ్ ప్రారంభం కానుంది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండనుంది. కేసుల సంఖ్యలో పెరుగుదల గణనీయంగా ఉంటుంది' అని క్లీన్ హెచ్చరించారు.
గత 18 నెలల అనుభవాలతో ఈ ఫ్లూ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యాల బారిన పడకుండా వర్క్ ప్లేస్‌ను రూపొందించుకోవడానికి చెడు అలవాట్లను వదిలివేయాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫ్లూ, జలుబు లాంటి వైరస్‌లు శ్వాస మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మీరు కిక్కిరిసిన లేదా వెలుతురులేని ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లయితే ఆ పని ప్రదేశాలు ప్రమాదకరంగా మారతాయి' అని ఆక్యుపేషనల్ హెల్త్ స్టాటెన్ ఐస్లాండ్ క్లినిక్‌లోని మౌంట్ సినాయ్ సిలికాఫ్ సెంటర్స్ మెడికల్ డైరెక్టర్, డాక్టర్ యెలీనా గ్లోబీనా చెప్పారు. పని ప్రదేశాల్లో మనం ఎందుకు, ఎలా అనారోగ్యాల బారిన పడతాం అనే అంశంపై ఆమె అధ్యయనం చేస్తున్నారు.
2011 డానిష్ అధ్యయనంలో కనుగొన్న అంశాలు యెలీనా వ్యాఖ్యలతో సరిపోలాయి. ఆ అధ్యయనంలో తెలిపిన ప్రకారం... పని ప్రదేశాల్లో మనం అనారోగ్యం బారిన పడుతున్నామా లేదా అనే అంశం, ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యతో కచ్చితంగా ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత కార్యాలయాల్లో పనిచేసే వారి కంటే... బహిరంగ కార్యాలయాలు అంటే ఒక గదిలో పక్క పక్కన కూర్చొని పని చేసే వారు తీసుకునే సిక్ లీవులు 62 శాతం ఎక్కువని ఈ అధ్యయనంలో తేలింది. 2013లో స్వీడన్‌లో చేసిన అధ్యయనం కూడా ఈ అంశాలనే పునరుద్ఘాటించింది. వ్యక్తిగత క్యాబిన్‌లలో కూర్చొని పనిచేసే వారి కంటే, ఒకే గదిలో ఎలాంటి అడ్డంకీ లేకుండా పక్క పక్కనే కూర్చొని పనిచేసేవారు అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువని పేర్కొంది.
మనం అనారోగ్యంగా ఉన్నామని తెలిసి కూడా కార్యాలయాలకు వెళ్తుంటాం. పని ప్రదేశంలో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి ఈ ప్రవర్తనే ప్రధాన కారణం. 2019లో యూఎస్ ప్రొఫెషనల్స్‌పై రిక్రూటింగ్ సంస్థ రాబర్ట్ హాఫ్ చేసిన సర్వేలో 90 శాతం మంది తాము అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కార్యాలయాలకు వెళ్తామని ఒప్పుకున్నారు. ఇలా ఆరోగ్యం బాలేనప్పుడు కూడా పనిచేయడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని దేశాల్లో సిక్ అలవెన్స్ లభించదు. కొన్న చోట్ల పని సంస్కృతి వల్ల, మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇలా చేస్తుంటారు.
'కొన్ని నిబంధనల కారణంగా ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు పనిచేసేందుకు మొగ్గు చూపుతారు. ఉదాహరణకు మీ కార్యాలయంలో లీవ్ పాలసీ సరిగా లేదనుకోండి. అంటే మీరు ఒక నెలలో నిర్దిష్ట పని గంటలను పూర్తి చేయలేని పక్షంలో మీరు బీమాను కోల్పోతారు అనే నిబంధన ఉన్నట్లయితే... అది మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా సెలవు తీసుకోవడానికి అడ్డంకిగా మారుతుంది' అని యెలీనా వివరించారు.
కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ పాలసీ ఉన్పప్పటికీ దానిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫ్లూ లేదా జలుబు వల్ల సెలవు తీసుకోవడం సరైనదే అని కేవలం 42 శాతం సీనియర్ మేనేజర్లు మాత్రమే నమ్ముతున్నారని యూకే ఆరోగ్య బీమాదారు ఏఎక్స్‌ఏ పీపీపీ 2015లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
భద్రతా ప్రమాణాలను పాటించండి
మహమ్మారి సమయంలో మనం అలవాటు పడిన చాలా జాగ్రత్త చర్యలు, రాబోయే రోజుల్లో మనల్ని పని ప్రదేశాల్లో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
మాస్క్ వినియోగంపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం జలుబు, ఫ్లూ ఇన్‌ఫెక్షన్ల నివారణకు మాస్క్ వినియోగించాలని సీడీసీ సిఫారసు చేయట్లేదు. వైరస్ ముప్పు అధికంగా ఉన్న వారికి కూడా మాస్క్ వాడకాన్ని ప్రతిపాదించట్లేదు.
'ప్రతీ ఒక్కరు కచ్చితంగా అన్ని వేళల్లో మాస్క్ ధరించే పరిస్థితుల్లోకి మనం మారనంతవరకు ప్రజారోగ్యాన్ని కాపాడటంలో పెద్ద ప్రభావాన్ని చూపలేము' అని క్లీన్ చెప్పారు. మనం అనారోగ్యంగా ఉన్నామని గుర్తించేలోపే ఫ్లూ వైరస్ సంక్రమిస్తుందని ఆమె చెప్పారు.
మాస్క్ వినియోగాన్ని 'ది స్విస్ చీజ్ డిఫెన్స్'గా స్వార్ట్జ్‌బర్గ్ వర్ణించారు. సమష్టిగా కృషి చేస్తే చిన్న చిన్న ఆరోగ్య రక్షణ సూత్రాలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయని అన్నారు.
ప్రతీ ఏడాది ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవడంతోపాటూ పాటు గొంతు నొప్పి ఉన్న సమయంలో మాస్క్ వాడటం ద్వారా గొప్ప ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. 'అన్ని సమయాల్లో మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సమయాల్లో మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి మాస్క్ ధరించాలి' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మన దినచర్యను సర్దుబాటు చేసుకోవడం కూడా పని ప్రదేశంలో అనారోగ్యం బారిన పడే అవకాశాలను ప్రభావితం చేస్తుంది. కార్యాలయాల్లో రొటేషన్ షెడ్యూల్‌ను అమలు చేయాలని గ్లోబీనా సిఫారసు చేశారు. దీని ప్రకారం ఒక రోజులో కొంతమంది మాత్రమే కార్యాలయానికి వచ్చే అవకాశముంటుంది. 'ఇది కార్యాలయం రద్దీగా లేకుండా చేస్తుంది. సహోద్యోగుల మధ్య సామాజిక దూరాన్ని ప్రోత్సహిస్తుంది' అని ఆమె చెప్పారు. తక్కువ మందితో కార్యాలయాలు పనిచేస్తే ఫ్లూ, జలుబు బారిన పడే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి.
మహమ్మారి సమయంలో ఇంటి నుంచి పని విధానం విజయవంతమైంది. కాబట్టి ఈ ఫ్లూ వైరస్‌ను కట్టడి చేసేందుకు కొన్ని కార్యాలయాలు ఈ సంస్కృతినే కొనసాగించాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులను కార్యాలయాలకు దూరంగా ఉంచడం ద్వారా ప్రజారోగ్యాన్న కాపాడటమే కాదు ఆర్థికంగా వెనుకబడిన వారిని కూడా ఆదుకోవచ్చు.
'ఉద్యోగులను కూడా ఫ్లూ ప్రభావితం చేస్తుంది. ఒకవేళ పని ప్రదేశంలో ఫ్లూ వ్యాప్తి చెందితే, అది టీమ్‌లో 20 నుంచి 50 శాతం ఉద్యోగులను కొన్ని రోజుల పాటు పనికి దూరం చేస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులను వచ్చే నెలల్లో మీరు ఇంటి నుంచి పనిచేయగలరా అని అడుగుతాయని నేను ఊహిస్తున్నా' అని యూనివర్సటీ ఆఫ్ హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డివిజన్ ఆఫ్ ఎపిడెమిలాజి అండ్ బయో స్టాటిస్టిక్స్ హెడ్ బెంజమిన్ కౌలింగ్ పేర్కొన్నారు.
కరోనాకు ముందు అయితే ఇలాంటి విజ్ఞప్తిని ఊహించుకోవడం కష్టం. కానీ కరోనా ప్రతీ ఒక్కరిలో ఆరోగ్య అవగాహనను పెంచడంతో పాటు, సుదీర్ఘ మార్పునకు దారి తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
'పని ప్రదేశాల్లో ఎదురయ్యే ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడం అనేది మహమ్మారి వల్ల వచ్చిన మార్పులలో ప్రధానమైనది' అని గ్లోబీనా చెప్పారు.
'ఏడాదిన్నరగా మనం ఉపయోగించిన జాగ్రత్త చర్యలను కాస్త సవరించి కొనసాగిస్తే, పని ప్రదేశాల్లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నిజంగా కట్టడి చేయవచ్చు. కానీ ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్నేంటంటే.... మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోగలమా? అనేదే.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








