కరోనా డెల్టా ప్లస్ వేరియంట్: కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి భారత్ తప్పించుకోగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన కోవిడ్ రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మెల్లిమెల్లిగా వ్యాపారాలు, కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ప్రజల రాకపోకలు మొదలవుతున్నాయి.
అయితే, మరి కొన్ని నెలల వ్యవధిలోనే కోవిడ్ థర్డ్ వేవ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
థర్డ్ వేవ్‌ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నాయంటూ కోర్టు ప్రశ్నించింది.
రాబోయే 12-16 వారాల్లోపే మూడో దశ ప్రారంభం కావొచ్చని నిపుణులు గట్టిగా హెచ్చరించారు.
డెల్టా ప్లస్ లాంటి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటే, వ్యాక్సీన్ల ప్రభావం తగ్గిపోతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్, కిందటి ఏడాది తొలిసారిగా భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్ బంధువే.
ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు మూడో వేవ్ ముప్పు ముంచుకొస్తోందనే భయం కనబడుతోంది.
అయితే, ఈ భయాలన్నీ ఎంతవరకు నిజం?
ఇంకా పలు కోవిడ్ దశలు రావచ్చని అంచనా ఉన్నప్పటికీ, వాటి వ్యాప్తి, తీవ్రత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ భద్రతా నిబంధనలు
ఈ మధ్య కాలంలో భారత్‌లో రోజువారీ కేసులు బాగా తగ్గిపోయాయి. మే నెలలో 4 లక్షల కేసుల నుంచి ప్రస్తుతం యాభై వేల కేసులకు పడిపోయాయి.
ఈ తరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కఠిన లాక్‌డౌన్ నిబంధనలే.
ఎన్నికల ప్రచారాలు, మతపరమైన వేడుకలు, ఉత్సవాలు, మార్కెట్లలో రద్దీ.. ఇవన్నీ సెకండ్ వేవ్‌కు కారణాలని విశ్లేషకులు అంచనా వేశారు.
పేలవమైన విధాన నిర్ణయాలు, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికలను విస్మరించడం లాంటివి మరి కొన్ని కారణాలు.
ఇవే తప్పులు పునరావృతం అయితే కోవిడ్ మూడో దశ వచ్చి మీద పడడానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు అంటున్నారు.
భారతదేశంలో పరిస్థితి ఇప్పటికీ చాలా ప్రమాదకరంగానే ఉందని, ప్రజల నడవడిక, కోవిడ్ నిబంధనలు పాటించే తీరుపై థర్డ్ వేవ్ వేగం, తీవ్రత ఆధారపడి ఉంటాయని పబ్లిక్ పాలసీ, ఆరోగ్య వ్యవస్థ నిపుణులు డాక్టర్ చంద్రకాంత్ లహరియా అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి కాకుండా క్రమకమంగా మొదలయితేనే మేలని ఆయన అంటున్నారు.
"మనం తొందరపడి అన్ని ఒకేసారి తెరిచేస్తే, ప్రజలు కోవిడ్ భద్రతా నిబంధనలను పాటించకపోతే, మనకు మనమే వైరస్‌ను ఆహ్వానించినట్లవుతుంది.
కోవిడ్ నిబంధనలను స్థానికంగా, కింది స్థాయిల నుంచి పర్యవేక్షించాలి. వ్యాపార సంస్థలు నిబంధనలు పాటించకపోతే వెంటనే జరిమానా విధించాలి" అని డాక్టర్ లహరియా అన్నారు.
కొత్త వేరియంట్లు ముప్పు తెస్తాయా?
ప్రధానంగా డెల్టా వేరియంట్ వల్లే రెండో దశ తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని కొత్త రకాలు పుట్టుకు రావొచ్చని నిపుణులు అంటున్నారు.
ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని "వేరియంట్ ఆఫ్ కన్సర్న్"గా ప్రకటించింది.
అయితే, దీనివల్ల థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని చెప్పడానికి తగినంత డేటా ప్రస్తుతం అందుబాటులో లేదు.
కానీ, వారాల తేడాతోనే పరిస్థితి మారిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
"వైరస్ వ్యాప్తి ఉన్నంతకాలం కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. ప్రమాదకరమైన కొత్త రకాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలుపరిచే విధంగా మన ప్రయత్నాలను మరింత పెంచాలి" అని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ లలిత్ కాంత్ అన్నారు.
జూన్ వరకు ఇండియా 30,000 శాంపిల్స్‌ను పరీక్షించింది. ఇది చాలదని, ఇంకా భారీగా సీక్వెన్సింగ్ చేయాలని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సీన్లు మనకు తెలిసిన వేరియంట్లపై బాగానే పని చేస్తున్నాయి. కానీ, కొత్త వేరియంట్లపై పని చేస్తాయా, లేదా అనేది కచ్చితంగా తెలీదని అనేకమంది కోవిడ్ రోగులకు వైద్యం అందించిన డాక్టర్ ఫతాహుదీన్ అంటున్నారు.
వ్యాక్సీన్ వేసుకున్న తరువాత కూడా కోవిడ్ బారిన పడిన ఉన్నారు. ముఖ్యంగా మొదటి డోసు వేసుకున్న తరువాత కోవిడ్ సోకినవారు ఎక్కువే.
"థర్డ్ వేవ్ కచ్చితంగా వస్తుంది. కానీ, కొత్త ఉత్పరివర్తనాలను వెంటనే గుర్తించేందుకు భారీగా శాంపిల్స్ పరీక్షించడం, కఠినమైన నిబంధనలు అమలుచేయడం ద్వారా మూడో దశ రాకను ఆలస్యం చేయవచ్చు. వచ్చినా సులువుగా ఎదుర్కోవచ్చు. ఇవన్నీ చేయకపోతే మనం కన్ను మూసి తెరిచే లోపల థర్డ్ వేవ్ మనల్ని ముంచేస్తుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గత ఇంఫెక్షన్ల వల్ల వచ్చిన యాంటీబాడీస్ సరిపోతాయా?
మూడో దశ ఎలా ఉంటుందనేది దేశ ప్రజల రోగ నిరోధక శక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది.
ఎంతమందికి వ్యాక్సీన్లు వేశారు? వ్యాక్సీన్ల ద్వారా లేదా గతంలో వచ్చిన ఇన్‌ఫెక్షన్ల ద్వారా ఎంతమందిలో యాంటీబాడీస్ తయారయ్యాయి అన్నది ముఖ్యం.
జూన్ 9 నుంచి 22 మధ్య కాలంలో దేశంలో రోజుకు సగటున 32.5 లక్షల వ్యాక్సీన్ డోసులు వేశారు.
కానీ, 2021 చివరికల్లా అందరికీ వ్యాక్సీన్లు వేయడం పూర్తి చెయాలంటే రోజుకు 85 నుంచి 90 లక్షల డోసులు వేయాలి.
ప్రస్తుతం 4 శాతం ప్రజలకు రెండు డోసులూ అందించారు. 18 శాతానికి ఒక డోసు వేశారు.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయకపోతే అనేకమందికి కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్ లహరియా అంటున్నారు. గతంలో కోవిడ్ ఇంఫెక్షన్ల వలన యాంటీబాడీస్ తయారైనా, రెండోసారి కోవిడ్ సోకే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.
అయితే, ఎంతమందికి కోవిడ్ సోకింది, ఎంతమందికి యాంటీ బాడీస్ తయారయ్యాయన్నది లెక్కించడం కష్టం. గ్రామాల్లో, నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కూడా చాలామందికి కోవిడ్ టెస్టులు జరగలేదు. వారికి కోవిడ్ సోకిందో లేదో తెలిసే అవకాశం లేదు. లెక్కించిన కోవిడ్ మరణాలు వాస్తవంలో కన్నా చాలా తక్కువ.
కోవిడ్ సోకి, రోగ నిరోధక శక్తి పెరిగినవారు 55-60 శాతం మంది ఉంటారని డాక్టర్ లహరియా అంచనా వేస్తున్నారు.
కాగా, అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్, మేథమెటికల్ మోడలర్ గౌతం మీనన్ మాత్రం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా 60-70 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన రెండో దశలో ఉన్నంత తీవ్రత మూడో దశలో ఉండదని ఆయన అంటున్నారు. అయితే, నిర్లక్ష్యం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
"జనాభాలో సగం కన్నా ఎక్కువమందికి కోవిడ్ సోకినా, 20-30 శాతం మంది కోవిడ్ బారిన పడలేదు అని గుర్తుపెట్టుకోవాలి. వీరిలో వృద్ధులు, రోగ నిరోధక శక్తి బలంగా లేనివాళ్లు ఉండొచ్చు. అందుకే, కేసుల పెరుగుదలను వెంటనే గుర్తించేలా గట్టి నిఘా ఏర్పాటు చేసుకోవాలి" అని ప్రొఫెసర్ గౌతం మీనన్ అన్నారు.
కోవిడ్‌ను ఇప్పటికీ తేలికగా తీసుకోలేమని, తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిపుణులు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు.
"మూడో దశ రావడం కచ్చితం. దాని ప్రభావాన్ని పరిమితం చేయడం, రాకను ఆలస్యం చేయడం మన చేతుల్లో ఉంది" అని డాక్టర్ ఫతాహుదీన్ అన్నారు.
"ఏడాది పైబడి ఈ యుద్ధం చేస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తల గురించి ఒక్కసారి ఆలోచించండి. మేము చాలా అలిసిపోయాం. థర్డ్ వేవ్ కూడా తట్టుకుని నిలబడగలమా అనేది సందేహమే" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- కృష్ణానది తీరంలో గ్యాంగ్ రేప్: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం.. పడవలో పారిపోయిన నిందితులు
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









