‘‘వైట్ ఫంగస్’’: ఔషధాలకు లొంగని ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మే నెలలో కోల్‌కతాలోని ఓ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఒక నడి వయసు వ్యక్తి చేరారు.
ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించడంతో, వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తీవ్రమైన రోగుల ప్రాణాలు కాపాడే స్టెరాయిడ్లను కూడా ఆయనకు ఇచ్చారు. అయితే, ఈ ఔషధాలు రోగుల్లో వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐసీయూలో చాలా రోజులు గడిపిన తర్వాత, ఆయన కోలుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యే సమయంలో.. ఔషధాలకు లొంగని, ప్రాణాంతక ఫంగస్ ఆయనకు సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.
క్యాండిడా ఆరిస్ (సి. ఆరిస్)ను దశాబ్దం క్రితం పరిశోధకులు గుర్తించారు. ఆసుపత్రుల్లో కనిపించే అత్యంత భయానక సూక్ష్మజీవుల్లో ఇది కూడా ఒకటి. రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఈ ఫంగస్ క్రిటికల్ కేర్ యూనిట్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సోకితే మరణించే ముప్పు 70 శాతం వరకు ఉంటుంది.
‘‘కోవిడ్-19 సెకండ్ వేవ్‌లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐసీయూల్లో చికిత్స పొందేవారు, స్టెరాయిడ్లు తీసుకునే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు పెరగడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు’’అని ముంబయికి చెందిన అంటు వ్యాధుల ఆసుపత్రి నిపుణుడు డాక్టర్ ఓమ్ శ్రీవాస్తవ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతున్నాయి?
భారత్‌లో సెకండ్ వేవ్ విజృంభణతో తీవ్రమైన లక్షణాలతో ఐసీయూల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువయ్యాయి.
మొదట అరుదైన, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ మ్యూకర్‌మైకోసిస్ లేదా బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగుచూశాయి.
ముక్కు, కళ్లు, మెదడుపై ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం చూపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇన్ఫెక్షన్ కేసులు దాదాపు 12,000 నమోదయ్యాయి. మరణాలు కూడా 200కి పైనే సంభవించాయి.
ఇప్పుడు కోవిడ్-19 రోగుల్లో మరో ప్రాణాంతక ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఐసీయూల్లో వారం కంటే ఎక్కువ రోజులు ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది.
‘‘క్యాండిడా ఫంగై’’ల్లోని రెండు రకాల ఫంగస్‌లు (ఆరిస్, అల్బికన్స్) మనుషులకు ప్రాణాంతకంగా మారుతుంటాయి. మరో వర్గానికి చెందిన ఫంగస్ ఆస్పెర్‌జిల్లస్ కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇదీ ప్రాణాంతక ఫంగసే.
50 లక్షల రకాల ఫంగస్‌లలో క్యాండిడా, ఆస్పెర్‌జిల్లస్‌ల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
క్యాండిడా ఒక సూక్ష్మజీవి. బాత్రూమ్‌లలోని కర్టెన్లు, కంప్యూటర్ స్క్రీన్లు, డాక్టర్ల స్టెతస్కోప్‌లు, రైల్వే స్టేషన్లలోని రైల్వే బోగీలు, బల్లలపై ఈ ఫంగస్ కనిపిస్తుంది.
ఇది ఎక్కువగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అయితే, కొన్నిసార్లు శ్వాసకోశ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతర్గత అవయవాలు, చర్మాన్ని కూడా ఇది దెబ్బ తీస్తుంది.
ఆస్పెర్‌జిల్లస్ కూడా బయట ఎక్కువగా కనిపిస్తుంది. ఏసీలు, వేడిచేసే పరికరాలపై ఎక్కువగా ఇది జీవిస్తుంది. ఈ ఫంగస్ మన శ్వాస నాళాల్లోకి చొరబడకుండా.. మన వ్యాధి నిరోధక శక్తి కాపాడుతుంది.
అయితే, కరోనావైరస్ సోకడంతో రోగుల్లో రక్త నాళాల గోడలు, చర్మం దెబ్బతింటున్నాయి. ఫలితంగా ఈ ఫంగస్‌లు శ్వాస నాళాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.
తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యేవారు, వెంటిలేటర్‌పై ఉండేవారిలో 20 నుంచి 30 శాతం మందికి ఈ ఫంగస్‌లు సోకుతున్నట్లు మహారాష్ట్రలోని కస్తూర్బా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌పీ కళాంత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఇన్ఫెక్షన్‌ల లక్షణాలు ఏమిటి?
కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు కోవిడ్-19 లక్షణాల్లానే ఉంటాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తదితర ఇబ్బందులు తలెత్తుతాయి.
క్యాండిడా ఇన్ఫెక్షన్లలో గోర్లు, ముక్కు, నోరు, ఊపిరితిత్తుల నుంచి తెల్లని చీము బయటకు వస్తుంటుంది. అందుకే ఈ ఫంగస్‌ను ‘‘వైట్ ఫంగస్’’అని కూడా పిలుస్తారు.
ఇన్ఫెక్షన్ తీవ్రమైతే, అంటే రక్తంలోకి ఫంగస్ ప్రవేశిస్తే.. రక్తపోటు, జ్వరం, కడుపునొప్పి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
ఎందుకు ఈ ఇన్ఫెక్షన్లు సోకుతాయి?
కోవిడ్-19 రోగుల్లో 5 శాతం మందిలో ఇన్ఫెక్షన్ తీవ్రం అవుతుంది. వీరికి దీర్ఘకాలంపాటు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం అవుతుంది.
వెంటిలేటర్‌పై ఉండే రోగుల్లో ఎక్కువగా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్-19తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కిక్కిరిసి పోవడంతో ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాత రకం పీపీఈ కిట్లను వాడటం, ఫ్లూయిడ్ ట్యూబ్‌ల వినియోగం పెరగడం, చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవడంతో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర కారణాలూ ఉన్నాయి..
స్టెరాయిడ్లు, ఇతర ఔషధాలను అతిగా వాడటంతో శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మరోవైపు ముందే పీడించే అనారోగ్యాలు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పును మరింత పెంచుతాయి.
‘‘రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గినప్పుడు, ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి’’అని లాస్ ఏంజెలిస్ కౌంటీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎఫర్ట్స్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ జెచరీ రూబిన్ చెప్పారు.
హెచ్‌ఐవీ రోగులకూ ఈ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రూబిన్ చెప్పారు. ‘‘కోవిడ్ తర్వాత ఈ ఇన్ఫెక్షన్లు రావడం చాలా అరుదు. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి’’.
ఈ ఇన్ఫెక్షన్లను నిర్ధారించడం కూడా కష్టమే. దీని కోసం మొదట ఊపిరితిత్తుల్లో నుంచి నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఔషధాలు కూడా ఖరీదు ఎక్కువే.
‘‘ఇలాంటి ఇన్ఫెక్షన్లున్న రోగులకు చికిత్స అందించడం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. అప్పటికే ఆ రోగుల ఊపిరితిత్తులను కోవిడ్ దెబ్బ తీస్తుంది. ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు. ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్లు’’అని కళాంత్రి వ్యాఖ్యానించారు.
‘‘ఇది దాదాపు ఓడిపోతామని తెలిసి కూడా యుద్ధం చేయడమే’’.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








