ముంబయి టు దుబయి: 360 సీట్లున్న విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు

ఫొటో సోర్స్, BBC/BHAVESHJAVERI
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెడ్ లైన్ చూడగానే.. అంత పెద్ద విమానంలో ఆయన ఒక్కడే ఎందుకు వెళ్లాడు అనే మీకు ఆసక్తి కలిగి ఉంటుంది.
స్వయంగా ఆ ప్రయాణికుడికీ అదే అనిపించింది. 360 సీట్లున్న బోయింగ్ విమానంలో తాను ఒక్కడే ప్రయాణించడాన్ని ఆయన ఆస్వాదించారు.
ఇది ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ముందు ఈ ప్రయాణం పొరపాటున, ఎవరి తప్పిదం వల్లో జరగలేదనే విషయం మనం తెలుసుకోవాలి. ఆ ఒంటరి ప్రయాణికుడికి అదృష్టం అలా కలిసొచ్చిందని అనుకోవాలి.

ఫొటో సోర్స్, BBC/BHAVESHJAVERI
తేది: 19 మే 2021
ప్రాంతం: ముంబయి ఎయిర్ పోర్ట్
సమయం: ఉదయం 4 గంటలు
పేరు: భావేష్ జవేరీ
దుబయిలో ఉంటున్న భావేష్, తన వ్యాపారం పనిమీద మే మొదటి వారంలో ముంబయి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్లడానికి పది రోజుల ముందే ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నారు.
ఆయన తరచూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కానీ, కరోనా మహమ్మారి వల్ల పెద్దగా రద్దీ ఉండదులే అనుకున్న ఆయన రూ.18 వేలు పెట్టి ఎకానమీ క్లాస్‌లో టికెట్ బుక్ చేశారు.
మే 19న ఉదయం 4.30కు ఫ్లైట్. అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనల ప్రకారం ఆయన ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్-ఇన్ చేస్తున్నప్పుడు ఆ విమానంలో వెళ్లబోతున్న ప్రయాణికుడు తానొక్కడే అనే విషయం భావేష్‌కు తెలిసింది.

ఫొటో సోర్స్, BBC/BHAVESHJAVERI
ఆయనకు అసలు తను వింటున్నది నిజమేనా అనిపించింది. కాసేపటి తర్వాత అది కల కాదు నిజమే అని ఆయనకు అర్థమైంది.
భావేష్ గత 20 ఏళ్లుగా దుబయిలోనే ఉంటున్నారు. అక్కడ నుంచి ముంబయికి ఎన్నోసార్లు వచ్చి వెళ్లారు.
కానీ, అంత పెద్ద విమానంలో ఆయనకు ఒక్కడే వెళ్లే ఈ లగ్జరీ చాన్స్ రావడం ఇదే మొదటిసారి. దుబయిలో ఉన్న భావేష్ తన ప్రయాణ అనుభవం గురించి బీబీసీతో మాట్లాడారు.
"నేను సాధారణంగా వీడియో తీయను. కెమెరా ముందుకు రావడానికి కూడా సంకోచిస్తుంటాను. కానీ ఈ ప్రయాణాన్ని నేను స్వయంగా నా మొబైల్లో షూట్ చేశాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలని అనుకున్నాను.
చెక్-ఇన్ తర్వాత ఎయిర్ పోర్ట్ గేట్ నుంచి ఫ్లైట్ వరకూ సిబ్బంది అంతకు ముందులాగే అటెండ్ చేశారు. ఎమిరేట్స్ ఫ్లైట్ సిబ్బందికి కూడా అది ఒక ప్రత్యేక సందర్భం.
విమానం లోపల అడుగుపెట్టగానే, క్రూ మెంబర్స్ నాకు చప్పట్లతో స్వాగతం పలికారు. పైలెట్ స్వయంగా కాక్‌పిట్ నుంచి బయటికొచ్చి నన్ను కలిశారు. ఆయన నాతో సరదాగా.. మొత్తం విమానమంతా ఒకసారి చూసిరవచ్చుగా అన్నారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/BHAVESHJAVERI
ప్రయాణం మొత్తం ఖర్చు ఎంత
ఎమిరేట్స్ ఫ్లైట్ EK501లో భావేష్ ముంబయి నుంచి దుబయి వరకు ప్రయాణించారు. ఇది 360 సీట్లుండే ఒక బోయింగ్ 777 విమానం.
ఈ విమాన ప్రయాణానికి ఎమిరేట్స్‌కు ఎంత ఖర్చు అయ్యుంటుంది అని మీకు సందేహం రావచ్చు.
ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ రాజేష్ హాండా ఆ ప్రయాణానికి సంస్థకు ఎంత ఖర్చయ్యుంటుందో అంచనా వేశారు.
"విమానంలో ముంబయి నుంచి దుబయి వెళ్లడానికి రెండున్నర గంటలు పడుతుంది. దానికి దాదాపు 25 టన్నుల ఇంధనం కావాలి. అందుకే, ఎయిర్ లైన్స్‌కు ఈ ఇంధనం ఖర్చే 12-15 లక్షలు అయ్యుంటుంది. ఇక మొత్తం ప్రయాణం ఖర్చులు లెక్కపెడితే అది 20-25 లక్షల వరకూ ఉంటుంది" అన్నారు.
కానీ, ఒక్క ప్రయాణికుడిని తీసుకెళ్లడానికి ఏ విమానయాన సంస్థ అయినా అంత ఖర్చు ఎందుకు భరిస్తుందా?
ఇదే ప్రశ్న ఆ విమానంలో ప్రయాణించిన భావేష్‌ను కూడా తొలిచేసింది. ఆయన క్రూ మెంబర్స్‌ను దాని గురించి అడిగారు కూడా.
ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌ను అడగాల్సిన అవసరం లేకుండా స్వయంగా భావేష్ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
"నిజానికి నేను ఆ విమానంలో పెద్దగా ప్రయాణికులు ఉండరనుకున్నాను. కరోనా మహమ్మారి వల్ల భారత్‌కు రాకపోకలపై యూఏఈలో చాలా ఆంక్షలు ఉన్నాయి. ఈమధ్య గోల్డెన్ వీసా ఉన్నవారు, యూఏఈ పౌరులు, దౌత్య అధికారులను మాత్రమే భారత్ నుంచి యూఏఈకి అనుమతిస్తున్నారు. ఈ మూడు కేటగిరీల వారు కమర్షియల్ ఫ్లైట్‌లో దుబయి వెళ్లచ్చు. అయితే, దుబయి నుంచి ముంబయికి ప్రయాణికులను తీసుకొచ్చిన ఆ ఎమిరేట్స్ విమానం తిరిగి ఖాళీగా వెళ్లేది. కానీ, నేను అదే ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేయడంతో, ఆ విమానంలో వెళ్లడానికి నన్ను అనుమతించారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/BHAVESHJAVERI
ఒంటరి ప్రయాణం అనుభవం
వజ్రాల వ్యాపారం చేసే భావేష్ స్టార్ జెమ్స్ గ్రూప్ సీఈఓ. ఆయన దుబయిలో తన భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. 360 సీట్లున్న బోయింగ్ విమానంలో ఆయన ఒంటరి ప్రయాణం వీడియో దుబయి, ముంబయిలోని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది.
ఈ మొత్తం ప్రయాణం ఒక అందమైన అనుభవంగా ఆయన వర్ణించారు. ఇలాంటి అవకాశం ఎంతో అదృష్టంతో జీవితంలో ఒకే సారి వస్తుంటుందని అన్నారు.
"బహుశా డబ్బుతో ఇలాంటి సంతోషాలు కొనుక్కోవచ్చు. కానీ, నా విమాన ప్రయాణం అర్థరాత్రి కావడంతో సరిగా నిద్రలేదు. నేను నిద్రపోకూడదని కూడా అనుకున్నాను. కానీ, నా కళ్లు మూతలు పడ్డాయి" అని చెప్పారు.
నేను నా ప్రయాణం గురించి ఇంట్లో వాళ్లకు కూడా దుబయి చేరాకే చెప్పాను అన్నారు భావేష్.
"కానీ, నా వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ కావడంతో, చాలా మంది ప్రముఖుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు నా పిల్లలు కూడా, నన్ను సెలబ్రిటీ అంటూ ఆటపట్టిస్తున్నారు" అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








