లిథువేనియా: యూరప్‌లోని ఈ చిన్న దేశం చైనాను ఎలా సవాల్ చేయగలుగుతోంది, ఎందుకు కంగారు పెడుతోంది?

చైనాను లిథువేనియా మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఐరోపా ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతోందని లిథువేనియా అనుమానిస్తోంది.

ఫొటో సోర్స్, GETTY / MIKHAIL METZEL

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్

యూరప్‌ ఖండంలోని లిథువేనియా చైనా నాయకత్వంలోని సీఈఈసీ (సెంట్రల్‌ అండ్ ఈస్టర్న్‌ యూరోపియన్ కంట్రీస్) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. కేవలం 28 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న లిథువేనియా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చైనాను ఇరుకున పెడుతున్నాయి.

2012 సంవత్సరంలో చైనా ఆధ్వర్యంలో సీఈఈసీ ఫోరం ఏర్పాటైంది. దీనిని 17+1 ఫోరం అని కూడా అంటారు. లిథువేనియా ఈ ఫోరం నుంచి తప్పుకోవడమే కాక, మిగిలిన దేశాలు కూడా బైటికి రావాలని పిలుపు నిచ్చింది.

''లిథువేనియా ఇకపై ఈ ఫోరంలో సభ్యదేశం కాదు. దీని కార్యక్రమాలలో పాల్గొనదు'' అని ఆ దేశ విదేశాంగ మంత్రి గాబ్రియేల్ ల్యాండ్స్‌ బెర్గిస్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు. చైనాతో సంబంధాలు తెంచుకోవాలని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఆయన సూచించారు.

యూరప్ శక్తి ఆ ఖండంలోని దేశాల ఐక్యత మీద ఆధార పడి ఉందని గాబ్రియేల్ అన్నారు. గత కొన్నేళ్లుగా లిథువేనియా సీఈఈసీ ఫోరంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది.

లిథువేనియా మినహా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో చైనా ఆర్ధిక, రాజకీయ ప్రాబల్యం పెరుగు తోందని 'బాల్టిక్ టైమ్స్' పత్రిక లిథువేనియా నేషనల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నివేదికను ఉంటంకిస్తూ పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో చైనా ఇంటెలిజెన్స్ కదలికలు కూడా బాగా పెరిగాయి.

అయితే, లిథువేనియా అభిప్రాయాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లిజియన్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న సంఘటనలకు చైనా నేతృత్వంలోని సీఈఈసీ ఫోరం ప్రభావితం కారాదని లిజియన్ అన్నారు.

''ఇది ప్రాంతీయ సమాఖ్య. ఉమ్మడి అభివృద్ధి కోసం ఉద్దేశించింది. ఇందులోని అన్ని దేశాల ప్రజలకు ప్రయోజనాలు ఉంటాయి'' అని లిజియన్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థను యూరప్‌తో తాము సంబంధాలను కొనసాగించడానికి ఒక కీలకమైన విభాగంగా చూస్తున్నామని లిజియన్ చెప్పారు.

చైనా విదేశాంగ శాఖ లిథువేనియా వ్యాఖ్యలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ, చైనా అధికార వార్తాపత్రిక 'గ్లోబల్ టైమ్స్' మాత్రం లిథువేనియా అమెరికా కనుసన్నలలో పని చేస్తోందని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా, లిథువేనియా జెండాలు

అసలు సీఈఈసీ ఎందుకు ?

మధ్య, తూర్పు యూరప్ దేశాలతో సహకారాన్ని పెంపొందించుకునే ఉద్దేశ్యంతో చైనా 2012లో ఈ ఫోరంను ప్రారంభించింది.

లిథువేనియా తప్పుకున్న తర్వాత అల్బేనియా, బోస్నియా, హెర్జెగోవినా, బల్గేరియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, గ్రీస్, హంగరీ, లాత్వియా, నార్త్ మాసిడోనియా, మాంటెనెగ్రో, పోలాండ్, రొమేనియా, సెర్బియా, స్లోవేకియా, స్లోవేనియా దేశాలు ఈ గ్రూపులో ఉన్నాయి.

పోలండ్‌లోని వార్సాలో ఏర్పడ్డ ఈ సంస్థ, ప్రతియేటా ఒక దేశంలో సమావేశం నిర్వహిస్తుంది. కరోనా కారణంగా 2020లో శిఖరాగ్ర సదస్సు జరగలేదు.

వాణిజ్యం, పెట్టుబడులను పెంచడానికి చైనా మొదలు పెట్టిన మరో ప్రాజెక్ట్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ కూడా సీఈఈసీని ప్రోత్సహిస్తోంది.

సెర్బియా దేశానికి చెందిన ఓ హైవే ప్రాజెక్ట్ కూడా సీఈఈసీలో భాగంగానే ప్రారంభమైంది. ఇవి కాకుండా బుడాపెస్ట్-బెల్‌గ్రేడ్‌ రైల్వే, చైనా-యూరప్ ల్యాండ్-సీ ఎక్స్‌ప్రెస్ వే పనులు జరుగుతున్నాయి.

ఇంకా అనేక సభ్యదేశాలలో పలు ప్రాజెక్టులను ప్రతిపాదించారు.

ఈ ఫోరంలోని దేశాలు, చైనా మధ్య వాణిజ్యం 58.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. సభ్య దేశాల్లో చైనా పెట్టుబడులు ఎనిమిది బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి.

చైనాకు ఇబ్బందికరమైన అనేక నిర్ణయాలను లిథువేనియా ప్రకటిస్తోంది. తైవాన్ ‌లో వాణిజ్య కార్యాలయం తెరవాలన్న నిర్ణయంపై చైనా ఆగ్రహంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీఈఈసీ సభ్యదేశాల ప్రతినిధులు

లిథువేనియా నిర్ణయం-చైనా వైఖరి

లిథువేనియా వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ, చైనా అధికార వార్తాపత్రిక 'గ్లోబల్ టైమ్స్' మాత్రం లిథువేనియా అమెరికా కనుసన్నల్లో పని చేస్తోందని వ్యాఖ్యానించింది.

అయితే, లిథువేనియా నిర్ణయం చెడిన చైనా, యూరోపియన్ యూనియన్‌ సంబంధాలతో ముడిపడి ఉంది. వీగర్‌ ముస్లింలపై హింసను యూరోపియన్ యూనియన్‌తో పాటు లిథువేనియా కూడా లేవనెత్తింది.

గత గురువారం చైనా-యూరోపియన్ యూనియన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపే ప్రక్రియను యూరోపియన్ పార్లమెంటు నిలిపివేసింది. తమ పార్లమెంటు ఎంపీలపై చైనా నిషేధం ఎత్తివేసేవరకూ ఈ ప్రక్రియ ముందుకు సాగదని ఈయూ తేల్చి చెప్పింది.

వీగర్ ముస్లింపై చైనా పాల్పడుతున్న అరాచకాలకు నిరసగా షింజియాంగ్ ఎంపీలను యూరోపియన్ యూనియన్ నిషేధించగా, అందుకు ప్రతిగా చైనా కూడా ఈయూ పార్లమెంటు సభ్యులపై నిషేధం విధించింది.

ఇరుదేశాల మధ్య సంబంధాలు తెగిపోవడానికి యూరోపియన్ యూనియనే కారణమని చైనా ఆరోపించింది.

''రష్యా విషయంలో లిథువేనియాకు కొన్ని భయాలు ఉన్నాయి. చైనా, రష్యాలు వ్యూహాత్మకంగా సన్నిహితంగా వ్యవహరిస్తుండటం వల్ల, ఆ భయంతో లిథువేనియా చైనాకు దూరంగా జరుగుతోంది'' అని చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని యూరోపియన్ స్టడీస్ విభాగం డైరెక్టర్ కుయ్ హాంగ్జియాన్ 'గ్లోబల్ టైమ్స్‌' పత్రికతో అన్నారు.

లిథువేనియా ఈ ఫోరంలో చైనాకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

'వీగర్ ముస్లింల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరు మానవత్వానికి మచ్చ తెచ్చేదిగా ఉంది'' అంటూ ఇటీవల లిథువేనియా పార్లమెంటు తీర్మానం చేసింది.

అంతే కాదు, తైవాన్‌కు విషయంలో లిథువేనియా తీసుకున్న ఓ నిర్ణయంపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తైవాన్‌తో వాణిజ్యాన్ని పెంచడానికి అక్కడ ఒక ఆఫీసును ప్రారంభిస్తామని లిథువేనియా మార్చిలో ప్రకటించింది.

'వన్‌ చైనా' పాలసీ ప్రకారం తైవాన్‌ను చైనా తమ దేశంలో భాగంగా భావిస్తుంది. తైవాన్‌తో ఏ దేశమైనా ప్రత్యక్షంగా వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడాన్ని చైనా ఇష్టపడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)