మసూద్ అజర్: ‘పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చైనా ఎందుకు అండగా ఉంటోంది?’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వరణ్ సింగ్
- హోదా, ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ స్టడీస్ - జేఎన్‌యూ
పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను 'అంతర్జాతీయ ఉగ్రవాది'గా ప్రకటించకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా మరోసారి 'సాంకేతిక నిలుపుదల' నోటీసు ఇచ్చింది.
భద్రతామండలి 1999లో ఆమోదించిన 1267 తీర్మానం కింద ఏర్పాటైన ఈ ఆంక్షల కమిటీ.. మసూద్‌ను 'అంతర్జాతీయ ఉగ్రవాది'గా ప్రకటిస్తే అతడి ఆస్తులను స్తంభింపచేయటంతో పాటు, ప్రయాణం మీద నిషేధం విధిస్తారు. అతడికి ఆశ్రయం ఇచ్చినందుకు పాకిస్తాన్‌ను తప్పుపట్టటానికీ వీలుంటుంది.
అయితే.. చైనా ఎప్పటిలాగానే.. ఈ ప్రతిపాదనను 'పరిశీలించటానికి మరింత సమయం కావాలి' అని పాత పాటే పాడింది. ఇటువంటి నిర్ణయం సమర్థంగా తీసుకోవటానికి అన్ని దేశాలూ పూర్తిగా సంతృప్తి చెంది తీరాలని వ్యాఖ్యానించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
2009లో నవంబర్ 26వ తేదీన జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇండియా తొలిసారి ఈ ప్రతిపాదనను భద్రతామండలి ముందుకు తీసుకువచ్చింది. 2016లో పఠాన్‌కోట్ వైమానికదళ స్థావరం మీద ఉగ్రవాద దాడులతో ఇండియా రెండోసారి ఇదే అంశాన్ని లేవనెత్తింది.
ఈసారి పీ-3 దేశాలు - అంటే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం గల బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌లు బహిరంగంగా భారత ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి ముందు ఈ మూడు దేశాల ఆమోదం తప్పనిసరి.
2017లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీలో భారత సైనిక బ్రిగేడ్ ప్రధాన కేంద్రం మీద అతి పెద్ద ఉగ్రవాద దాడి జరిగినపుడు, పీ-3 దేశాలు స్వయంగా ముందుండి మళ్లీ ఇదే ప్రతిపాదనను భద్రతామండలి ఆంక్షల కమిటీ ముందుకు తీసుకువచ్చాయి.
కానీ, చైనా ప్రతిసారీ ఈ ప్రతిపాదనను 'పరిశీలించటానికి మరింత సమయం కావాలి' అని అడుగుతూ 'టెక్నికల్ హోల్డ్' పేరుతో అడ్డుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర దాడులు కొనసాగుతుండడంతో ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం సాధించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పెరిగింది. 'అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టటానికి ఐక్యరాజ్యసమితి ఒడంబడిక'ను ప్రతిపాదించడం ద్వారా, మసూద్ అజర్‌ను ఐరాస ఆంక్షల జాబితాలో చేర్చటం ద్వారా భారత్ ఈ దిశగా కృషి చేస్తూ వచ్చింది.
అమెరికా మీద 9/11 ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా మండలి 2001 అక్టోబర్‌లోనే పలు ఉగ్రవాద సంస్థలతో పాటు జైషే మొహమ్మద్‌ను కూడా 'అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ'గా నిషేధించింది. ఫలితంగా మసూద్ అజార్ మెడకు ఉచ్చు బిగుసుకుంది.
కానీ, జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్ మద్దతు నిరాటంకంగా కొనసాగుతుండటంతో ఆ సంస్థ ఉగ్రవాద దాడులను రచించి, అమలు చేయటానికే కాదు. ఆ దాడులు తమ పనేనని ప్రతిసారీ ప్రకటించుకోవటానికి కూడా వీలుకల్పించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నేపథ్యంలో గత బుధవారం భద్రతామండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన ఫ్రాన్స్ ఇదే ప్రతిపాదనను బ్రిటన్, అమెరికాలతో కలిసి ఆంక్షల కమిటీ ముందుకు తీసుకువచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో ఫిదాయీ దాడి అందుకు ప్రేరేపించింది. ఆ దాడి అనంతరం చైనా వైఖరిలో కొంత మార్పు కూడా కనిపించింది.
పుల్వామా దాడి ''మా పనే" అని జైషే మొహమ్మద్ ప్రకటించుకున్న తరువాత, అది క్రూరమైన, పిరికిపంద ఆత్మాహుతి బాంబుదాడి'' అని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఫిబ్రవరి 21వ తేదీన ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో చైనా కూడా భాగంగా ఉంది.
బలమైన దేశాలు మద్దతు ఇవ్వటంతో ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ భూభాగంలో భారత్ వైమానిక దాడులు చేసింది. మరుసటి రోజు, ముందుగా నిర్ణయించినట్లుగా జరిగిన రష్యా - ఇండియా - చైనా విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక సమావేశం.. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ తుడిచిపెట్టాలన్న వైఖరిని పునరుద్ఘాటించింది.

ఫొటో సోర్స్, Getty Images
వూజెన్‌లో జరిగిన ఈ త్రైపాక్షిక భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటన.. ''రాజకీయ, భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోరాద''ని, ఉగ్రవాదాన్ని 'పుట్టిస్తున్న నర్సరీల'ను తుడిచిపెట్టటానికి అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని ఉద్ఘాటించింది.
2017 సెప్టెంబర్‌లో జియామెన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన తుది ప్రకటన మీద కూడా రష్యా, ఇండియా, చైనా నాయకులు సంతకాలు చేశారు.
ఆ ప్రకటనలో ఉగ్రవాదానికి సంబంధించి అయిదు పేరాలలో ప్రస్తావించారు. అందులో అర డజను ఉగ్రవాద సంస్థల పేర్లు కూడా ఉటంకించారు. అయితే.. గత ఏడాది జొహెనెస్‌బర్గ్‌లో జరిగిన శిఖరాగ్రంలో ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించలేదు.
ఈ పరిణామాల వల్ల.. 2011 నుంచి 2018 నవంబర్ వరకూ భద్రతామండలి ఆంక్షల కమిటీ ముందు 'సాంకేతిక నిలుపుదల' వైఖరిని అవలంబిస్తున్న చైనా ఎట్టకేలకు మారుతున్నట్లు కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
పైగా.. గత వారం ఫ్రాన్స్ ముందుకు తెచ్చిన ప్రతిపాదన కొన్ని తాజా ఆధారాలను కూడా సమీకరించింది. ఇప్పుడు బ్రిటన్, అమెరికా, జర్మనీలు కూడా సహ ప్రతిపాదకులుగా ఉన్నాయి.
ఫిబ్రవరి 14న పుల్వామా దాడి అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత ప్రధానమంత్రితో సన్నిహితంగా సంప్రదింపులు జరిపారని, భారత చర్యలకు మద్దతు తెలిపారని, మసూద్ అజార్‌ను 'అంతర్జాతీయ ఉగ్రవాది'గా ప్రకటించటానికి కూడా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్తున్నారు.
ఇటీవలి కాలంలో చైనా, పాకిస్తాన్‌లకు రష్యా దగ్గరయింది. అయినా, చారిత్రకంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కశ్మీర్ మీద చర్చల్లో ఇండియాకు మద్దతుగా నిలిచే బలమైన మూలస్తంభంగా రష్యా ఉంది.
మసూద్ అజార్ పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నాడని పాక్ విదేశాంగ మంత్రి బీబీసీతో మాట్లాడుతూ నిర్ధారించటాన్ని బట్టి నిజానికి పాకిస్తాన్ కూడా చివరికి ఈ పరిణామానికి సంసిద్ధమైనట్లు కనిపించింది. అతడు చాలా అనారోగ్యంగా ఉన్నాడని, పాక్ న్యాయవ్యవస్థ అతడిపై ఎటువంటి విచారణ చేపట్టాలన్నా నిజమైన, బలమైన సాక్ష్యాలు అవసరమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వీటన్నిటిని బట్టి చూస్తే.. ఉగ్రవాదాన్ని తన విదేశాంగ విధానంలో వ్యూహాత్మక ఆయుధాలుగా ఉపయోగిస్తోందన్న అపకీర్తి మూటగట్టుకున్న ''తన చిరకాల నేస్తా''నికి అండగా నిలవటం కోసం అంతకంతకూ తీవ్రమయ్యే ఈ మూల్యాన్ని అంగీకరిస్తూ 'సాంకేతిక నిలుపుదల' చేయటం.. చైనా అనివార్యతల గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ఈ పరిస్థితుల్లో చైనాకు ప్రోత్సాహాలు ఇవ్వటంతో పాటు మరింత ఏకాకిని చేసే విషయంలో ఇండియా తన వ్యూహాన్ని కొంత మార్చాల్సిన అవసరముంది.
తనకు లభించే ప్రయోజనాలకన్నా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను కాపాడటానికి ఎక్కువ మూల్యం అయ్యేట్లయితే చైనా.. పక్షం మారిపోతుందని ట్రాక్ రికార్డ్ చెప్తోంది.
ఇందుకోసం అతిగా స్పందించకుండా ఉండటం ముఖ్యం. తొలుత పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులతో చైనా సంబంధాల మీద.. భద్రతా మండలి ఆంక్షల కమిటీ వంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి వారిని ఎందుకు రక్షిస్తోంది అనే అంశాల మీద.. దృష్టి కేంద్రీకరించాలి.
1980ల్లో అఫ్గానిస్తాన్‌లో సోవియట్ బలగాలతో పోరాడటం ద్వారా మసూద్ అజార్ జీవితం ప్రారంభించాడు. ఆ తర్వాత అతడు జైషే మొహమ్మద్ స్థాపించాడు. అదే సమయంలో పాకిస్తాన్ ఇస్లామీకరణ, అఫ్గానిస్తాన్‌లో సోవియట్ బలగాలతో ముజాహిదీన్లుగా పోరాడటం కోసం తాలిబ్‌ల (ఇస్లామిక్ విద్యార్థుల) సైన్యాన్ని ముల్లాలు తయారు చేయటం జరిగాయి.

ఫొటో సోర్స్, AFP
సోవియట్ వ్యతిరేక ముజాహిదీన్లతో చైనా సంబంధాలు కూడా 1980ల నాటివే. చైనాను ఇరుకున పెట్టే విధంగా.. ఆ దేశంలోని వీగర్లు కూడా ఈ ముజాహిదీన్లలో వందల సంఖ్యలో చేరారు. దీని ఫలితంగా చైనాలో ముస్లింలు మెజారిటీగా ఉన్న షిన్‌జాంగ్‌లో 1980, 1981, 1985, 1987లలో చైనా వ్యతిరేక ఆందోళనలు పునరావృతమయ్యాయి.
1990 ఏప్రిల్‌లో బూరెన్ ఆందోళనలు తూర్పు తుర్కెమినిస్తాన్ డిమాండ్‌కు మళ్లీ జీవం పోశాయి.
1989లో సోవియట్ వెనుదిరగటంతో అఫ్గానిస్తాన్ నుంచి వీగర్ ముజాహిదీన్లు వెనక్కు వచ్చారు. దీంతో.. షిన్‌జాంగ్‌లో చెదురుమదురుగా జరిగే ఆందోళనలు.. ప్రధాన నగరాలైన ఉర్ముచి, కష్గర్, ఖోటాన్‌లు మొదలుకుని కుచా, అక్సు, అర్తుష్ వంటి చాలా చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి.
ఇదే.. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల విషయంలో చైనా హ్రస్వదృష్టితో స్వీయ సంతుష్ట వ్యూహాన్ని అవలంబించేలా చేసింది.

ఫొటో సోర్స్, AFP
2000 నవంబర్‌లో పాకిస్తాన్‌లో చైనా రాయబారి లు షులిన్.. తాలిబన్ నాయకుడు ముల్లా ఒమర్‌తో భేటీ అయినపుడు ఈ మార్పు చోటుచేసుకుందని చెప్తుంటారు. ఆ భేటీలో.. వీగర్లు షిన్‌జాంగ్‌లో దాడులు చేయకుండా చూస్తానని ముల్లా ఒమర్ హామీ ఇచ్చినట్లు భావిస్తారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ అణచివేత పాలన ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమది. ఆ తాలిబన్ పాలనను అమెరికా 2001లో ప్రారంభించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై యుద్ధంలో ధ్వంసం చేసింది.
కానీ.. తాలిబన్‌తో ఇన్‌ఫార్మల్‌గా అయినా అధికారిక సంబంధాలు నెలకొల్పుకుని కొనసాగిస్తున్న అతి కొద్ది దేశాల్లో చైనా కూడా ఉంది.
తాలిబన్‌ను సంతృప్తిపరచే చైనా వైఖరి 2009 జూలై 5-6 తేదీల్లో ఒక్క ఉరుముచి నగరంలో 156 మంది మరణాలకు కారణమైన అల్లర్లు మినహా.. ఆ దేశం ఆశించిన ఫలితాలనే ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఆ అల్లర్లు జరిగినపుడు అధ్యక్షుడు హు జింటావో ఇటలీలో జరుగుతున్న జి-8 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్థంతరంగా వెనుదిరిగి రావాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఉగ్రవాదులను సంతృప్తపరచటమనే చైనా సిద్ధాంతాన్ని చైనా - పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపెక్) మరింత బలోపేతం చేసింది.
పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులు.. చైనాలో ముస్లింలు మెజారిటీగా ఉన్న అలజడుల ప్రాంతం షిన్‌జాంగ్‌లో వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వనంత కాలం, సిపెక్ ప్రాజెక్టు కింద తన ప్రాజెక్టులకు ఆటంకం కలిగించనంత కాలం.. ఆ ఉగ్రవాదులకు అంతర్జాతీయ దండన నుంచి చైనా రక్షణ కల్పిస్తుందని లోపాయకారీ ఒప్పందం ఉన్నట్లు కనిపిస్తోంది.
అంతర్గతంగా.. నిఘా సాంకేతిక పరిజ్ఞానాలు, బల ప్రదర్శనల ద్వారా షిన్‌జాంగ్‌లో పరిస్థితులను నియంత్రిస్తోంది. లక్షలాది మంది వీగర్లు నిర్బంధ 'పున:శిక్షణ' శిబిరాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో చైనా వ్యూహాన్ని ఇండియా ఎలా తిప్పికొట్టగలదన్నది ఓ చిక్కు ప్రశ్నే. ఇండియా తన వ్యూహాలను పున:పరిశీలించుకోవాల్సిన అవసరముంది.
(రచయిత స్వరణ్ సింగ్ దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విభాగంలో డిప్లొమసీ అండ్ డిసార్మమెంట్ ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- మసూద్ అజర్ మీద ఐక్యరాజ్యసమితి చర్యలను మళ్లీ అడ్డుకున్న చైనా
- ‘అభినందన్‌లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు.. ఆయన కోసం 48ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..’
- న్యూజీలాండ్‌లో మసీదులపై 'ఉగ్రవాద దాడి', 49 మంది మృతి, వీరిలో ఒకరు హైదరాబాదీ
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









