కరీంనగర్: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బిచ్చగాడి అవతారం ఎత్తిన ఇంజనీర్.. 13 ఏళ్లుగా 3 రాష్ట్రాలలో అజ్ఞాతవాసం

కరీంనగర్ పోలీసులు
    • రచయిత, ఎస్.ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

కుందన శ్రీనివాసరావు ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తరువాత అనేక ఆర్థిక మోసాలకు పాల్పడి చేసి బ్యాంకుల నుంచి కోటి రూపాయలకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టి 13 ఏళ్లుగా తప్పించుకుని తిరిగారు.

చివరకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒకానొక సమయంలో తిరుపతి అలిపిరి మెట్లపై బిచ్చగాడిగా కూడా మారారు.

అనంతరం బెంగళూరులో ఓ ప్రయివేటు సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటే కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు.

కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు.

‘‘కుందన శ్రీనివాసరావుపై బ్యాంకులను మోసం చేసిన కేసులు 40కి పైగా ఉన్నాయి. 2008లో కరీంనగర్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యాక కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అప్పటి నుంచి ఆయన పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు’’ అని పోలీసులు చెప్పారు.

నకిలీ కిసాన్ వికాస్ పత్రాలను బ్యాంకుల్లో మార్ట్‌గేజ్ చేసి కరీంనగర్, వరంగల్, హన్మకొండ, గుంటూరు నగరాల్లో కోటి రూపాయల వరకు రుణాలను మోసపూరితంగా పొందారన్నది ఆయనపై ఆరోపణ.

2007లో మొదటిసారి కరీంనగర్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, 2008లో బెయిలుపై తిరిగివచ్చిన శ్రీనివాసరావు ఆచూకీ లేకుండా పోయారు.

వివరాలు వెల్లడిస్తున్న కరీంనగర్ పోలీసులు

'ఆపరేషన్ తలాష్'

నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ అయి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వారి కోసం ఇటీవల కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ 'ఆపరేషన్ తలాష్' కార్యక్రమం చేపట్టింది.

కుందన శ్రీనివాసరావు లక్ష్యంగా ఆపరేషన్ తలాష్ సాగింది. గత కొన్ని నెలల పాటు శ్రమించి బెంగళూరు లో ఉంటున్నట్టుగా కరీంనగర్ పోలీసులు గుర్తించారు. అతని బంధువులు, మిత్రుల ఫోన్ కాల్స్‌పై నిఘా ఉంచి చివరకు శ్రీనివాసరావును ప్రత్యేక బృందం పోలీసులు అదుపులో తీసుకున్నారు.

అత్యాశతో బ్యాంక్ మోసాలు

‘‘కామారెడ్డి ఎన్జీవో కాలనీకి చెందిన కుందన శ్రీనివాసరావు వరంగల్ కిట్స్ కాలేజ్ నుండి మెకానికల్ ఇంజనీర్‌గా పట్టా పుచ్చుకున్నారు. తండ్రి టెలికాం ఉధ్యోగి. మొదట కరీంనగర్‌లో పలు కాలేజీలలో లెక్ఛరర్‌గా పనిచేశారు.

నకిలీ పత్రాలు బ్యాంక్ లోన్ల కోసం వర్కవుట్ అవుతుండటంతో అత్యాశకు పోయి వరంగల్, హన్మకొండ,హైదరాబాద్, గుంటూరులలో వరుస మోసాలకు పాల్పడ్డాడు. నమోదైన మొత్తం 40 కేసులలో 23 కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి.

నకిలీ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

పరారీ..

2008 లో బెయిలుపై వచ్చిన శ్రీనివాసరావు నేరం నిరూపణ అయితే దీర్ఘకాల జైలు శిక్ష తప్పదనుకున్నారు. అప్పటికే తన సహచరులు చాలా మంది జైల్లోనే ఉండటంతో ఎలాగైనా జైలు జీవితం తప్పించుకోవాలని కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్ట్ ఇష్యూ చేసింది.

దీంతో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అనేక మార్గాలు అనుసరించారు శ్రీనివాసరావు.

కరీంనగర్ పోలీసులు పట్టుకునేంత వరకు పూటకో వేషం, ఉధ్యోగంలా సాగింది అతని జీవితం.

కరీంనగర్ జైలు ఎపిసోడ్ తర్వాత నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ , నకిలీ చిరునామాలతో కుందన శశాంక్ రావ్ పేరుతో వరంగల్, హైదరాబాద్‌లలో వివిధ కాలేజీలలో కొంతకాలం పనిచేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

అదే సమయంలో కుటుంబ తగాదాలతో భార్య ఆయన్ను విడిచి వెళ్లిపోయారు. కామారెడ్డి లో వారసత్వంగా వచ్చిన ఆస్తి వాటాలను అమ్మేసి మాకాం మారుస్తూ వచ్చారు శ్రీనివాసరావు.

ఈ సమయంలోనే తన అన్న కనిపించడం లేదని ఆయన తమ్ముడు శ్రీధర్ రావ్ వరంగల్ , నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

శ్రీధర్ రావ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు’’ అని చెప్పారు పోలీసులు.

''తన ఆచూకీ దొరక్కుండా ఉండేందుకు శ్రీనివాసరావు వేయని వేషం లేదు. మారు పేర్లతో అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రీనివాసరావు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ కుందన శశాంక్ రావ్ పేరుతో మోసపుచ్చుతూ చలామణీ అయ్యాడు. మ్యాథ్స్ , ఫిజిక్స్ బోధించడంలో నిపుణుడు.. ,కోటీశ్వరుడిని కావాలనే అత్యాశతో కొంత మందిని గ్యాంగ్‌లో కలుపుకొని నకిలీ పత్రాలతో బ్యాంక్ రుణాలను పొంది మోసాలకు పాల్పడ్డాడు. దొరక్కుండా ఉండేందుకు ఫోన్ నంబర్లు మారుస్తూ వచ్చారు. చివరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతను వాడుతున్న ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా బెంగళూరు‌లో అరెస్ట్ చేశాం" అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి తెలిపారు.

నగదు

ఫొటో సోర్స్, Getty Images

అజ్ఞాత జీవితం.. రోడ్డు ప్రమాదం

శ్రీనివాసరావుకు సంబంధించి పోలీసుల విచారణలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనమారు పేర్లతో విజయవాడ, తిరుపతి నగరాలలో హోటల్ వర్కర్ గా పని చేశారు.

తిరుపతిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. మానసికంగా, ఆర్థికంగా చితికిపోయి బతకడానికి చివరకు తిరుమల అలిపిరి గేట్ వద్ద కొంత కాలం బిక్షమెత్తారు. ఈ క్రమంలో నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొంత మంది భక్తులు అతన్ని గుర్తించి అతని తమ్ముడు శ్రీధర్ రావ్‌కు సమాచారం అందించారు.

తిరుమలలో తన ఆచూకీ తెలుసుకున్న తమ్ముడు శ్రీధర్ రావ్‌ తన సోదరుణ్ణి బెంగళూరు తీసుకువెళ్లారు. ఓ ప్రైవేటుకంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగంలో చేర్పించారు.

నిందితుడు

ఈ విషయాన్ని గుర్తించిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ సురేష్ నేతృత్వంలోని పోలీస్ బృందం అక్కడే శ్రీనివాసరావును అదుపులో తీసుకుంది.

గతంలో ఉన్న 40 కేసులకు తోడుగా నకిలీ ఆధార్ కార్డ్, నకిలీ పాన్ కార్డ్ లను కలిగి ఉన్న కేసులను కరీంనగర్ పోలీసులు శ్రీనివాసరావుపై నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)