కోకాకోలా, జ్యూస్‌లతో విద్యార్థులు తప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్టులు ఎలా సృష్టిస్తున్నారు?

కరోనా పాజిటివ్
    • రచయిత, మార్క్ లార్చ్
    • హోదా, హాల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ అండ్ సైన్స్ కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్

స్కూల్‌కు డుమ్మా కొట్టడానికి కొంతమంది విద్యార్థులు కొత్త పద్ధతిని కనిపెట్టారు. తప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్టులను సృష్టించేందుకు కోలాను ఉపయోగిస్తున్నారు. కానీ, ఇది ఎలా పనిచేస్తుంది?

బడికి డుమ్మా కొట్టడానికి పిల్లలు ఎప్పడూ సాకులు వెతుకుతూనే ఉంటారు. అందులో భాగంగానే వారు కొత్త ఉపాయాన్ని కనిపెట్టారు.

కోలాను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒకటైన లాటరల్ ఫ్లో టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టీ)‌ ద్వారా తప్పుడు పాజిటివ్ రిపోర్టును పొందుతున్నారు.

జ్యూస్‌లు, కోలా పానీయాలతో పిల్లలు కరోనా పరీక్షలను ఎలా మోసగిస్తున్నారు? నిజమైన రిపోర్టు నుంచి తప్పుడు పాజిటివ్ రిపోర్టును తయారు చేయడానికి ఏమైనా మార్గాలున్నాయా అనే అంశాలను కనిపెట్టడానికి నేను ప్రయత్నించాను.

మొదట, పిల్లలపై వస్తోన్న ఆరోపణలు నిజమా లేదా అనేది పరీక్షించాలనుకున్నా. అందుకే ఎల్ఎఫ్‌టీ కిట్‌లలో కోలా, ఆరెంజ్ జ్యూస్‌ చుక్కలను వేశాను. కొన్ని నిమిషాల తర్వాత రెండు కిట్‌లలో కరోనా వైరస్ ఉనికి ఉన్నట్లు నిర్ధారించే రెండు గీతలు ఏర్పడటాన్ని గమనించాను.

ముందుగా ఎల్‌ఎఫ్‌టీ పరికరం ద్వారా కరోనా పరీక్ష ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఎల్‌ఎఫ్‌టీ పరికరంలో నిట్రోసెల్యూలోస్ అనే కాగితం లాంటి మెటీరియల్ స్ట్రిప్ ఉంటుంది.

దానితో పాటు చిన్న ఎరుపు రంగు ప్యాడ్ ఉంటుంది. ఈ రెండూ కూడా T- లైన్‌కు కింద భాగంలో ప్లాస్టిక్ కేస్‌కు లోపల అమర్చి ఉంటాయి. రెడ్ ప్యాడ్‌ యాంటీబాడీలను పీల్చుకుంటుంది.

ఇవి గోల్డ్ నానోపార్టికల్స్‌తో కూడా జతకలుస్తాయి. ఈ నానో పార్టికల్స్ పరికరంలో యాంటీ బాడీలు ఎక్కడ ఉన్నాయో చూపుతాయి.

ఈ పరీక్షను చేస్తున్నప్పుడు మన శాంపిల్‌‌ను లిక్విడ్ బఫర్ ద్రావణంలో కలపాలి. ఇలా చేయడం వల్ల శాంపిల్‌ పీహెచ్ విలువ తగు మోతాదులో ఉంటుంది.

ఆ తర్వాత మన శాంపిల్‌ను స్ట్రిప్‌పై ఉంచాలి. దీని తర్వాత 15 నిమిషాల్లోనే మన ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

వైరస్ ఉన్నట్లయితే కిట్‌లో C, T గీతలు రెండూ ఎరుపు రంగులోకి మారతాయి. వైరస్ లేని పక్షంలో C మాత్రమే ఎరుపు రంగులోకి మారుతుంది.

కానీ, ఎరుపు రంగు T లైన్‌ రావడానికి సాఫ్ట్ డ్రింక్ ఎలా కారణమవుతుంది? దీనికో అవకాశముంది. అది ఏంటో తెలుసుకుందాం.

కోలాతో కరోనా పాజిటివ్

ఫొటో సోర్స్, Mark Lorch

డ్రింక్స్‌లో యాంటీబాడీలు గుర్తించే ఏదో పదార్థం ఉంటుంది. అందుకే వైరస్‌ ఉన్నప్పుడు ఎలా అయితే యాంటీబాడీలు ఆ పదార్థాన్ని గుర్తించి, బంధిస్తాయో... డ్రింక్స్‌ వాడినప్పుడు కూడా అవి అదే తరహాలో స్పందిస్తున్నాయి.

కానీ, ఇది చాలా అరుదు. ఈ వైరస్ నిర్ధారణ పరీక్షల్లో యాంటీబాడీలను ఎందుకు ఉపయోగిస్తారంటే, అవి ఎలాంటి పదార్థాలకు కట్టుబడతాయో తెలుసుకోవడం చాలా కష్టం.

మన నోరు, ముక్కు ద్వారా స్వాబ్‌తో సేకరించే సలైవాలలో చాలా రకాల కణాలు, అవశేషాలు ఉంటాయి. కానీ యాంటీబాడీలు ఇందులో ఉండే అన్ని రకాల కణాలను, వైరస్‌లను వదిలిపెట్టి కేవలం కరోనా వైరస్‌ను గుర్తిస్తాయి.

కాబట్టి సాఫ్ట్‌డ్రింక్‌లో ఉండే పదార్థాలకు కూడా ఈ యాంటీబాడీలు సాధారణంగా స్పందించవు.

దీనికి మరో మంచి వివరణ ఏంటంటే, సాఫ్ట్ డ్రింక్‌లో ఉండే ఏదో పదార్థం యాంటీబాడీల పనితీరును ప్రభావితం చేస్తోంది.

కరోనా పరీక్షల ఫలితాలను తారుమారు చేస్తోన్న పళ్ల రసాలు, కోలా ఇలా చాలా ద్రవాలు ఒక సాధారణ అంశాన్ని కలిగి ఉన్నాయి.

ఇవన్నీ కూడా అత్యంత ఆమ్లపూరిత ద్రవాలు. నారింజ రసంలోని సిట్రిక్ యాసిడ్, కోలాలోని పాస్పరిక్ యాసిడ్, ఆపిల్ జ్యూస్‌లోని మాలిక్ యాసిడ్‌లు ఈ పానీయాలకు 2.5 నుంచి 4 వరకు పీహెచ్ విలువను అందిస్తాయి.

ఇవి యాంటీబాడీల పనితీరుకు చాలా కఠినమైన పరిస్థితులు. యాంటీబాడీలు సాధారణంగా రక్త ప్రవాహంలో న్యూట్రల్ పీహెచ్ విలువ 7.4 వద్ద పనిచేస్తాయి.

ఈ కరోనా నిర్ధారణ పరీక్షల్లో యాంటీబాడీల కోసం సరైన పీహెచ్ విలువను సమన్వయం చేయడం అనేది కీలకాంశం.

అందుకే పరీక్షించే ముందు మన శాంపిల్‌ను లిక్విడ్ బఫర్ ద్రావణంలో ముంచుతారు. ఈ బఫర్ ద్రావణంతో కోలాను కలిపినప్పుడు బఫర్ పోషించే కీలక పాత్ర హైలైట్ అవుతుంది.

దీనివల్ల ఎల్‌ఎఫ్‌టీ పరికరాలతో పెద్ద సంఖ్యలో చేసే కరోనా పరీక్షలకు విలువలేకుండా పోతోందని ఆస్ట్రేలియా రాజకీయ నాయకుడు ఆరోపించారు. ఎల్‌ఎఫ్‌టీ పరికరాలు మనకు కావాల్సిన ఫలితాలను అందజేస్తాయని అన్నారు.

కోలాతో కరోనా పాజిటివ్

ఫొటో సోర్స్, Getty Images

కాబట్టి బఫర్ ద్రావణం లేకుండా పరీక్షించినట్లయితే, యాంటీబాడీలు పానీయాలలోని ఆమ్ల పీహెచ్‌కు పూర్తిగా కట్టుబడతాయి.

అందువల్ల యాంటీబాడీల నిర్మాణం, పనితీరుపై నాటకీయ ప్రభావం చూపుతుంది. యాంటీబాడీలంటే ప్రోటీన్లే. ఇవి అమైనో యాసిడ్ బ్లాక్‌లను కలిగి ఉంటాయి.

ఇవి ఒకదానితో ఒకటి కలిసి పోయి పొడవైన గొలుసులను ఏర్పరుస్తాయి. ఈ గొలుసులు ఒక ప్రత్యేకమైన నిర్మాణాలుగా మారతాయి.

ఈ గొలుసుల నిర్మాణంలో చాలా చిన్న మార్పు కూడా ప్రోటీన్ల పనితీరుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

ప్రోటీన్‌లోని వివిధ భాగాల మధ్య వేలకొలది పరస్పర చర్యల ద్వారా ఈ నిర్మాణాలు తమ విధులు నిర్వహిస్తాయి.

ఉదాహరణకు, ప్రోటీన్‌లోని నెగెటివ్ ఎనర్జీ ఉన్న భాగాలు పాజిటివ్ ఎనర్జీ ప్రాంతాల వైపు ఆకర్షితమవుతాయి.

కానీ ఆమ్లపూరిత పరిస్థితుల్లో, ప్రోటీన్ పూర్తిగా పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. ఫలితంగా ప్రోటీన్‌ను కలిపి ఉంచే అనేక పరస్పర చర్యలు దెబ్బతింటాయి. సున్నితమైన ప్రోటీన్ నిర్మాణం ప్రభావితం అవుతుంది. అందుకే, ఇక అది సరిగ్గా పనిచేయదు. ఈ సందర్భంలో యాంటీబాడీల సున్నితత్వం పోతుంది.

ఈ ఆమ్లపూరిత పానీయాల వల్ల కరోనా పరీక్షల్లో ఎలాంటి ఫలితం రాదని మీరు భావిస్తుంటారు. కానీ అసహజత్వం పొందిన ప్రోటీన్ కణాలు చాలా శక్తిమంతంగా మారతాయి.

అసహజత్వం వల్ల ప్రోటీన్లను కలిపి ఉంచే పరస్పర చర్యలన్నీ మార్పు చెందడంతో, ఈ అసహజ ప్రోటీన్లు నిర్మాణాలను ఏర్పరచుకోవడానికి ఇతర పదార్థాల కోసం వెతుకుతాయి.

ఇదే క్రమంలో ఇవి T- లైన్ వద్ద గోల్డ్ పార్టికల్స్ ద్వారా వెళ్తూ అక్కడ అతుక్కుపోతాయి. ఫలితంగా పాజిటివ్ ఫలితం వస్తుంది.

నకిలీ పాజిటివ్ పరీక్షను గుర్తించడానికి ఇక్కడ ఏదైనా మార్గం ఉంటుందా? తమకు అనుకూలమైన పరిస్థితులు తిరిగి ఏర్పడినప్పుడు ఈ యాంటీబాడీలు వాటి పనితీరును, నిర్మాణాన్ని తిరిగి పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

అందుకే నేను కోలా ద్రావణంలో మునిగిన శాంపుల్‌ను బఫర్ ద్రావణంతో కడిగి పరీక్షించాను. అప్పుడు T లైన్ దగ్గర నిలిచిపోయిన యాంటీబాడీలు సాధారణ పనితీరును ప్రదర్శించి గోల్డ్ ప్లేట్‌లెట్స్‌ను విడుదల చేశాయి.

పిల్లలూ, మీ తెలివిని నేను ప్రశంసిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను మీ ఉపాయాన్ని బయటపెట్టాను. ఇక మీ విజ్ఞానాన్ని పరిశోధనల్లో ఉపయోగించండి. అప్పుడు మేము మీ ఫలితాలను మా జర్నల్‌లో ప్రచురిస్తాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)