కరోనావైరస్: మాస్ టెస్టింగ్ ఎలా చేస్తారు... దీనితో మరో లాక్‌డౌన్ రాకుండా చేయొచ్చా?

కరోనావైరస్, మాస్ టెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గళగర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రజలందరికీ భారీ ఎత్తున కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి, పాజిటివ్‌గా తేలినవారిని ఐసోలేషన్‌కు పంపిస్తే... మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవసరం రాకుండా చేయొచ్చన్న అంశం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఇందుకోసం మాస్ టెస్టింగ్ చేయాలి. మాస్ టెస్టింగ్ అంటే... అన్ని గ్రామాల్లో పట్టణాల్లో అందరికీ పరీక్షలు చేయడం. లక్షణాలున్నవారిని, లేనివారిని అందరినీ పరీక్షించాలి.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తమ దేశంలో ఇలా విస్తృత స్థాయిలో పరీక్షలను పెంచుతామని అన్నారు. లివర్‌పూల్ నగరంలో మొదగా దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.

అయితే, ఈ మాస్ టెస్టింగ్ వల్ల ప్రయోజనాలు ఉంటాయా? లేక వృథా ప్రయాసగా మిగులుతుందా? ఇలా అనేక సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి.

కరోనావైరస్, మాస్ టెస్టింగ్

ఫొటో సోర్స్, Reuters

ప్రయోజనాలు

"మాస్ టెస్టింగ్ మనల్ని సమస్య నుంచి బయట పడవేయవచ్చు. కానీ, దీని గురించి మరీ ఎక్కువగా ఊహించుకోకపోవడం మంచిది'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జాన్ బెల్ అభిప్రాయపడ్డారు.

మాస్ టెస్టింగ్‌ను క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పోల్చవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తే, ఏవైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించి వైద్యం అందించడానికి ఉపయోగపడుతుంది.

కరోనావైరస్ మాస్ టెస్టింగ్‌తోనూ ఇలాగే వైరస్ సోకి, లక్షణాలు ఇంకా బయటపడని వారిని ముందే గుర్తించవచ్చు. పాజిటివ్ వచ్చినవారందరినీ గుర్తించి విడిగా ఉంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

ముందే వైరస్ బాధితులను గుర్తించడం వల్ల లాక్‌డౌన్ లాంటి కఠినమైన నిబంధనలను విధించాల్సిన అవసరం లేకుండా... వైరస్ సోకినవారిని మాత్రమే విడిగా ఉంచి, మిగిలినవారంతా సాధారణ జీవితాలను కొనసాగించవచ్చు.

చైనా ఈ పద్ధతిని అనేక సార్లు అమలుచేసింది. ఆ దేశంలోని నగరాల్లో ఒకటో, రెండో కరోనా కేసులు బయటపడిన వెంటనే ప్రతీ ఒక్కరికీ పరీక్షలు జరిపించారు.

స్లోవేకియా కూడా దేశవ్యాప్తంగా మాస్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మూకుమ్మడిగా కాకుండా, వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే స్థలాలు, వర్గాలను లక్ష్యంగా చేసుకుని కూడా మాస్ టెస్టింగ్ నిర్వహించవచ్చు.

కోవిడ్ 19 రిస్క్ అధికంగా ఉండే ఆసుపత్రులు, వృద్ధాశ్రమాల్లో రోజూ పరీక్షలు చేయొచ్చు. స్కూళ్లు, యూనివర్సిటీల్లో మాస్ టెస్టింగ్ నిర్వహించొచ్చు. సినిమా హాళ్లు, ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచులకు వెళ్లేవారికిగ ముందుగా పరీక్షలు చేయొచ్చు.

కరోనావైరస్, మాస్ టెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా సాధ్యమంటే...

లేటరల్ ఫ్లో టెస్టింగ్ విధానం ఈ మాస్ టెస్టింగ్ ఆలోచన చేసేందుకు కారణమైంది.

లేటరల్ ఫ్లో పరీక్షలో కరోనావైరస్‌ను వేగంగా గుర్తించవచ్చు. గర్భ నిర్ధారణ పరీక్షల తరహాలో చాలా సులువుగా దీన్ని చేసేయొచ్చు. ఈ పరీక్ష కిట్ల ధర కూడా తక్కువే. ఫలితాలు వేగంగా వెల్లడవుతాయి.

ముక్కు లేదా గొంతు నుంచి స్వాబ్ ద్వారా సేకరించిన శాంపిల్‌ను ఆ కిట్‌లో ఉండే స్ట్రిప్‌కు ఓ చివరన వేయాలి. ఒకవేళ కరోనావైరస్ ఆ శాంపిల్‌లో ఉంటే, మరో చివరన కొత్త రంగుతో మార్కింగ్ కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే, వైరస్ ఉన్నట్లు లెక్క. ఈ కిట్‌తో ఇంట్లోనే ఎవరికివారు పరీక్ష చేసుకోవచ్చు.

లూప్-మీడియేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ (ఎల్ఏఎంపీ) అనే మరో విధానం కూడా ఉంది. మాస్ టెస్టింగ్‌కు ఇది కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

అయితే, ఈ పద్ధతిలో స్వాబ్‌లను సేకరించి, ప్రయోగశాలకు పంపి పరీక్ష జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరీక్షా విధానం కన్నా ఇది కాస్త మెరుగైన పద్ధతే, కానీ లేటరల్ ఫ్లో టెస్ట్ అంత వేగవంతమైనది కాదు.

వేగం, సౌకర్యం, కచ్చితత్వం

వేగంగా ఫలితాలు వెల్లడించే పరీక్షలు ప్రయోగశాలల్లో చేసే పీసీఆర్ పరీక్షలంత కచ్చితత్వంతో ఉండవు. పీసీఆర్ పరీక్షల్లో కరోనావైరస్ జన్యుసంకేతాలు కూడా గుర్తించవచ్చు.

లేటరల్ ఫ్లో టెస్టుల పనితీరు ఎంత సమర్థంగా ఉంటుందన్నది ఇంకా తేలాల్సి ఉంది.

"లేటరల్ ఫ్లో టెస్ట్ సంపూర్ణమైన పరీక్ష కాదు. ఈ పరీక్షల్లో వెయ్యిలో ఒకరికి వైరస్ లేకపోయినా, ఉన్నట్లు ఫలితం వచ్చే అవకాశాలున్నాయి" అని జాన్ బెల్ బీబీసీతో అన్నారు.

ఇది ముఖ్యమైన విషయమే. తప్పుడు ఫలితాలు కొత్త సమస్యలను తీసుకురావచ్చు.

భారీ ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు తప్పుడు ఫలితాల వల్ల వచ్చే సమస్యల తీవ్రత చాలా ఎక్కువ ఉండొచ్చు. వారానికి రెండుసార్లు 6 కోట్లమందికి పరీక్షలు నిర్వహిస్తే, వారానికి రెండున్నర లక్షల మంది విషయంలో తప్పుడు ఫలితాలు రావొచ్చు.

''శరీరంలో వైరస్ ఎక్కువగా ఉన్న కేసుల్లో 90 శాతం వరకూ పాజిటివ్‌గా ఫలితం వస్తుంది. కానీ, మొత్తంగా చూస్తే మాత్రం కేసుల్లో 60-70 శాతం పాజిటివ్ వస్తున్నాయి. కరోనావైరస్ ఉన్నప్పటికీ ఫలితాలు నెగటివ్‌గా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ, ఇలాంటివి చాలా తక్కువ'' అని జాన్ బెల్ అన్నారు.

కరోనావైరస్, మాస్ టెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

పీసీఆర్ పరీక్షల ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. స్వల్ప స్థాయిలో వైరస్ ఉన్నా కూడా గుర్తుపడతాయి. కానీ, ఇది నిర్వహించి, ఫలితం వచ్చేసరికి ఆలస్యమవుతుంటుంది. కొన్ని సార్లు రోగి పూర్తిగా కోలుకున్నాక పరీక్ష ఫలితం వస్తూ ఉంటుంది.

లేటరల్ ఫ్లో టెస్టులు వీటికి పూర్తిగా వ్యతిరేకం. వైరస్ తక్కువ స్థాయిలో ఉంటే గుర్తించలేకపోవచ్చు. ఫలితం మాత్రం త్వరగా వస్తుంది.

దీనివలన వ్యాప్తికి కారణమయ్యేవారి మీదేకే దృష్టి పరిమితమవుతుంది అని కొందరు భావిస్తున్నారు.

"ఇన్ఫెక్షన్ ఆరంభంలో వైరస్ తీవ్రత తక్కువగా ఉండొచ్చు. అలా అని, వారి నుంచి వైరస్ సోకే ముప్పు ఉండదని కాదు. మనకు ఇంకా కావాల్సినంత సమాచారం లేదు. ఈ విషయంలో తొందరపడుతున్నామేమో అనిపిస్తోంది'' అని బర్మింగ్హమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ న ప్రొఫెసర్ జోన్ డీక్స్ అన్నారు.

ప్రారంభ దశలోనే ఇన్ఫెక్షన్‌ను గుర్తించాలంటే, జనానికి రెండు రోజులకు ఓసారి పరీక్ష చేయాల్సి రావొచ్చు. కానీ, పరీక్షలు ఎక్కువగా చేసిన కొద్దీ, తప్పుడు ఫలితాల సంఖ్య కూడా అదే రీతిలో పెరగుతుంది.

కరోనా ఉండి, లక్షణాలు లేనివారిలో సగం మంది ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినా ప్రయోజనమేనని జాన్ బెల్ అన్నారు.

కరోనావైరస్, మాస్ టెస్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

నష్టాలు

మాస్ టెస్టింగ్ చేసినప్పడు కొన్ని ప్రతికూల అంశాలు ఉండటం సహజం.

బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షల కార్యక్రమం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువని అభిప్రాయపడే వైద్యులు కూడా ఉన్నారు.

"అన్ని రకాల పరీక్షలతోనూ ఏవో కొన్ని నష్టాలు ఉంటాయి. వాటిలో లోపాలు ఉండటం సహజం. పరీక్షలు చేస్తున్న కొద్దీ వాటి ద్వారా జరిగే పొరపాట్ల సంఖ్య పెరుగుతూ పోవచ్చు. వైరస్ లేనివారికి ఉన్నట్టు తప్పుడు ఫలితాలు వస్తే, వారిలో అవి అనసవర ఆందోళనకు కారణం కావొచ్చు'' అని ప్రొఫెసర్ డీక్స్ అన్నారు.

మరో లాక్‌డౌన్ రాకుండా కాపాడగలదా?

మాస్ టెస్టింగ్‌తో మరో లాక్‌డౌన్ రాకుండా నివారించవచ్చని జాన్ బెల్ అంటున్నారు.

"కోవిడ్ 19 పూర్తిగా అరికట్టడానికి వ్యాక్సిన్ తప్ప మరో మార్గమేమీ లేదు. ఈ కొత్త లేటరల్ ఫ్లో టెస్టులు ప్రయోజనం చేకూరుస్తాయో లేదో పరీక్షించి చూడొచ్చు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఏ విషయమూ కచ్చితంగా తేల్చి చెప్పలేం" అని జాన్ బెల్ అన్నారు.

"లేటరల్ ఫ్లో టెస్టులు ఉపయోగకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ, మనం కాస్త నెమ్మదించాలి. వీటిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని ప్రొఫెసర్ డీక్స్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)