కరోనావైరస్‌: భారతీయుల్లో కోవిడ్‌‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందా?

కరోనావైరస్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లక్షలాది భారతీయులకు శుభ్రమైన నీరు పరిమితంగా అందుతోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారు. జన సాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

దీంతో వారు గుండె, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.

వ్యాధులు పెరగడానికి ఇవి ఎక్కువ కారణం అవుతున్నాయని ప్రభుత్వ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఒక్క వాయు కాలుష్యం వల్లే దేశంలో ఏటా పది లక్షల మందికి పైగా చనిపోతున్నారు.

కోవిడ్-19కి గురికాకుండా ఆరోగ్యం కాపాడుకోవాలంటే రక్షిత నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రంగా ఉండే పరిస్థితులు చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

యునిసెఫ్, డబ్ల్యుహెచ్ఓ సంయుక్త అధ్యయనంలో ప్రపంచ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాల్లో నివసించే దాదాపు 40 శాతం మందికి, అంటే దాదాపు 300 కోట్ల మందికి కనీసం చేతులు కూడా కడుక్కునే సౌకర్యాలు లేవని తేలింది.

కరోనా అలాంటి జనాభాలోకి చేరుతుందని, భారత్ లాంటి దేశాల్లో లక్షల మరణాలకు కారణమవుతుందని చెప్పడానికి ఇది చాలు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

"ముఖ్యంగా, ఆస్పత్రి సౌకర్యాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం లాంటివి ఈ దేశాల్లో దయనీయంగా ఉన్నాయి. ఆయా దేశాల్లో సంక్రమణ వ్యాధులు తీవ్రంగా ప్రబలడానికి ఇవే కారణమని భావిస్తున్నారు. అల్ప- మధ్య ఆదాయ దేశాల్లో కోవిడ్-19 వల్ల విపత్కర పరిణామాలు ఎదురవుతాయని ఊహించలేద"ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాందే చెప్పారు.

ప్రపంచ జనాభాలో ఆరోవంతు భారత్‌లో ఉన్నారు. పాజిటివ్ కేసుల్లో ఆరో వంతు దేశంలో నమోదయ్యాయి.

అయితే, వైరస్ వల్ల ఇక్కడ 10 శాతం మరణాలే నమోదయ్యాయి. కోవిడ్ రోగుల్లో మరణాలను కొలిచే కేస్ ఫాటిలిటీ రేట్(CPR) ఇక్కడ 2 శాతం కంటే తక్కువే ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ.

ఇప్పుడు, భారత శాస్త్రవేత్తల ఒక కొత్త పరిశోధనలో తక్కువ పారిశుద్ధ్యం, శుభ్రమైన నీళ్లు లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు నిజానికి కోవిడ్-19నుంచి చాలా మంది ప్రాణాలను కాపాడి ఉండవచ్చని చెబుతోంది.

మరో మాటలో చెప్పాలంటే, అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో జీవించే ప్రజలు చిన్నతనం నుంచి రకరకాల రోగకారకాలకు గురవుతూ ఉండడం వల్ల తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్‌ను నివారించగలిగారని, అది వారికి కోవిడ్-19 నుంచి బలమైన రోగనిరోధక శక్తిని ఇచ్చిందని చెబుతున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఇంకా పరిశీలనలో ఉన్న రెండు పేపర్లలో మరణాల రేటును పోల్చడానికి పది లక్షల మంది జనాభాలో కు ఎంమరణాలను లెక్కించారు.

"జన సాంద్రత, జనాభా, వ్యాధుల ప్రాబల్యం, నాణ్యమైన పారిశుద్ధ్యం లాంటి రెండు డజన్ల పారామీటర్లపై బహిరంగంగా అందుబాటులో 106 దేశాల గణాంకాలను ఒక పేపరులో పోల్చి చూసారు. అధిక ఆదాయ దేశాల్లో కోవిడ్-19 వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఈ శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక ఆదాయ దేశాల వారితో పోల్చి చూస్తే పేద, అల్ప ఆదాయ దేశాల్లోని వారిలో ఈ వ్యాధికి ఎక్కువ రోగనిరోధక శక్తి ఉన్నట్లు అనిపించింద"ని ఈ అధ్యయనం చేసిన వారిలో ఒకరు, డాక్టర్ మాందే నాతో అన్నారు.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్లలో మనిషి శరీరం లోపల ట్రిలియన్ల సూక్ష్మజీములు-మైక్రోబయోమ్ పోషించే పాత్రను మరో పేపరులో పరిశీలించారు.

మైక్రోబయోమ్‌లో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, ఏకకణ ఆర్కేయాలు ఉంటాయి. జీర్ణక్రియకు సహకరించే ఇవి, బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ అందిస్తాయి. రోగనిరధక శక్తిని నియంత్రించి, విటమిన్లు ఉత్పత్తి చేస్తాయి.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్, బాలచందర్ 80 అధిక, మధ్య ఆదాయ దేశాలతోపాటూ మొత్తం 122 దేశాల గణాంకాలను పరిశీలించారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

వివిధ రకాల సూక్ష్మజీవులకు, ముఖ్యంగా 'గ్రామ్-నెగటివ్' బ్యాక్టీరియాకు గురయ్యే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో కోవిడ్ మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు.

సాధారణంగా ఈ బాక్టీరియా తీవ్ర న్యుమోనియాకు, రక్త, మూత్ర నాళాల వ్యాధులు, చర్మ వ్యాధులకు కారణం అవుకుంది. కానీ, అది యాంటీవైరల్ సైటోకైన్‌-అణువులను కూడా ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు.

అవి రోగకారకాలతో పోరాడ్డానికి సహకరిస్తాయి. ఇంటర్‌ఫెరాన్ అనే ఇవి కరోనావైరస్ నుంచి కణాలను కాపాడతాయి.

"ఇప్పటివరకూ ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 ఊహాజనిత నమూనాల్లో మైక్రోబయోమ్ లేదా పర్యావరణ సూక్ష్మజీవులకు బహిర్గతం కావడం వల్ల జనాభాలో ఏర్పడే రోగనిరోధక శక్తిని పరిగణనలోకి తీసుకోలేద"ని డాక్టర్ చందర్ నాకు చెప్పారు.

అన్నీ చివరకు 'స్వచ్ఛత సిద్ధాంతం' దగ్గరికే వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మన పర్యావరణం చాలా శుభ్రంగా మారిందని, దాంతో అది మన రోగనిరోధక శక్తికి తగిన శిక్షణ ఇవ్వకుండా, అలా వదిలేసిందని ఒక ఫిలాసఫీ ఉన్నట్లు 'ఎన్ ఎలిగంట్ డిఫెన్స్-ది ఎక్స్ ట్రార్డినరీ న్యూ సైన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్' రచయిత మాట్ రిచెల్ చెబుతున్నారు.

"పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెడుతున్న మనం, మన రోగనిరధక శక్తిక తగినంత శిక్షణ, పని లేకుండా అలమటించేలా చేస్తున్నామనే ఒక విస్తృత ఆలోచన ఉంది" అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

ఇది కొత్త ఐడియా కాదు

గవద బిళ్లల గురించి 1989లో ఒక పత్రిక ప్రచురించింది. అందులో ఒక పిల్లాడికి గవద బిళ్లలు వచ్చే అవకాశానికి, అతడి తోబుట్టులకు మధ్య ఒక అద్భుతమైన బంధం ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లలకు ఇది వ్యాపించడమో, లేదంటే పెద్ద పిల్లల నుంచి తల్లికి ఇన్పెక్షన్ వస్తే, ఆమె కడుపులో ఉన్నప్పుడే ఒక శిశువుకు అది సోకడమో జరుగుతుంది. అలా బాల్యంలోనే ఇన్ఫెక్షన్ ద్వారా అలెర్జీ వ్యాధుల నిరోధక శక్తి వస్తుంది " అని చెప్పింది.

వరల్డ్ అలెర్జీ ఆర్గనైజేషన్ ప్రచురించిన మరో పేపర్‌లో "జనం పేద దేశాల నుంచి సంపన్న దేశాలకు తరలిపోతుంటే, అలెర్జీ, ఆటో-ఇమ్యూనిటీ పెరుగుతుంటాయని, వలస అధ్యయనాల్లో తేలింద"ని రిచెల్ చెప్పారని పేర్కొన్నారు.

యాంటీ-వైరల్ ఇమ్యూన్ ప్రతిస్పందనలపై మనకు ఉన్న అవగాహనను బట్టి కోవిడ్-19 'స్వచ్ఛత సిద్ధాంతం' పెరుగుతుందని డేవిస్‌లోని యానివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇమ్యునాలజిస్టు స్మితా అయ్యర్ చెప్పారు.

"అయినా, మన రోగనిరోధక శక్తి చాలా బలమైన శత్రువులను ఒకటి తర్వాత ఒకటిగా, లేదా అన్నిటినీ ఒకేసారి ఎదుర్కోగలదని గుర్తించడం వల్ల, మనం ఒక మోడల్ నిర్మించవచ్చు. అందులో ఇంతకు ముందు రోగకారకాలకు ఏర్పడిన రోగనిరోధక స్పందన, ప్రస్తుతం ఇన్పెక్షన్ గురైన వారి రోగనిరోధ స్పందనపై ప్రభావం చూపవచ్చ"ని డాక్టర్ అయ్యర్ నాతో అన్నారు.

పరస్పర సంబంధం ఉన్నంత మాత్రాన ఇదే కారణం అనలేమని శాస్త్రవేత్తలు చెబుతుండడంతో ఈ అధ్యయనాలను కచ్చితంగా పరిశీలనాత్మకంగానే పరిగణించాలి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

"భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కోడానికి బలహీనమైన పారిశుద్ధ్య పద్ధతులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించేలా ఇది ఉండకూడద"ని డాక్టర్ మాందే కూడా అంటున్నారు.

మెడికల్ యూనివర్సిటీ ఆప్ సౌత్ కరోలినాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కృతికా కుప్పల్లి కొత్త పరిశోధనలో శాస్త్రీయంగా నిరూపించని ఎన్నో వాదనలను పరిగణనలోకి తీసుకున్నారు. అవి శాస్త్రీయ వాస్తవాల కంటే, ఎక్కువగా ఊహిస్తున్నట్లు ఉన్నాయి అన్నారు.

భారత్ లాంటి దేశాల్లో తక్కువ మరణాల రేటుకు యువ జనాభా కూడా కారణం కావచ్చని, వృద్ధులు సాధారణంగా చాలా బలహీనంగా ఉంటారని ఎపిడమాలజిస్టులు భావిస్తున్నారు.

ఇక మిగతా కరోనావైరస్‌లతో ఇంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తి, మిగతా అంశాలు కూడా దీనికి కారణమా అనేది స్పష్టంగా తెలీడం లేదు.

తక్కువ మరణాల రేటుకు రకరకాల కారణాలు ఉండచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.

"ఈ మహమ్మారి వచ్చి 10 నెలలే కావడంతో, మనం వైరస్ గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది" అంటారు కుప్పల్లి.

"వాస్తవం ఏంటంటే మనకు తెలీనిది ఇంకా చాలా ఉంది".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)