కరోనావైరస్: మొదటగా వచ్చే కోవిడ్ టీకాలు సమర్థంగా పనిచేయవా? వైరస్ మరిన్ని దశాబ్దాలు మనతోనే ఉంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘెర్
- హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి
కరోనావైరస్‌తో ప్రపంచం మొత్తానికి జబ్బు చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ ఏడాదిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు దూరం అయ్యారు. పెళ్లిళ్లు రద్దు అయ్యాయి. పిల్లలు స్కూల్‌కు దూరం అయ్యారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్తులను కోల్పోవడంతో చాలా మంది ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మళ్లీ మునుపటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం, మెరుగైన చికిత్సా మార్గాలు, వ్యాక్సీన్‌తో అంతా మారుతుందా?
లేకపోతే సంవత్సరాలు, దశాబ్దాలపాటు వైరస్ మనతోనే ఉంటుందా?
వైరస్ ప్రభావంతో మన జీవన శైలి చాలా మారుతుందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
‘‘వచ్చే ఏడాది వేసవికి పరిస్థితులు ఒక కొలిక్కి రావొచ్చు. అయితే, 2019 నాటి పరిస్థితులు రావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుంది’’అని లివర్‌పూల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జూలియన్ హిస్‌కాక్స్ వివరించారు.

ఫొటో సోర్స్, Sefa Karacan/Anadolu Agency via Getty Images
ఏం జరుగుతుంది?
కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తే, ఇంకా కోవిడ్-19 వ్యాపిస్తూనే ఉంది.. అనే మాటలు వినిపిస్తాయి. దీన్నే ఎండెమిక్ ఇన్ఫెక్షన్ అంటారు.
అంటే పరిస్థితి ఇప్పుడున్నట్లే ఉంటుందని కాదు. వైరస్‌తో కొత్త రకమైన సంబంధాలు ఏర్పడతాయి. అంటే మన జీవితాలపై దాని ప్రభావం తగ్గుతుందనే చెప్పాలి. ఇదివరకు విజృంభించిన మహమ్మారుల విషయంలో ఇదే జరిగింది.
వ్యాక్సీన్ లేదా ఇన్ఫెక్షన్ పలుమార్లు సోకడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదే సమయంలో వైరస్ శక్తి కూడా తగ్గుతుంది.
‘‘ఇదంతా జరిగేటప్పటికి కొన్ని దశాబ్దాలు పడుతుంది’’అని ఎడిన్‌బరో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్క్ వూల్‌హౌస్ వ్యాఖ్యానించారు.
‘‘అయితే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందనేదే అసలు సమస్య. ఈ మార్గంలో పయనించడం అంత తేలిక కాదు’’.

ఫొటో సోర్స్, YEGOR ALEYEV
తర్వాత కొన్ని నెలలు..
మొదట చలికాలం పూర్తికావాలి. ఈ శీతాకాలంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి.
శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. మరోవైపు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి ఇది అనువైన సమయం.
వైరస్ వ్యాప్తికి కళ్లెం వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఆంక్షలను సడలించిన చోట కేసులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.
బ్రిటన్‌లో వేసవిలో సగటున కోవిడ్-19 కేసులు రోజుకు 22,000కుపైనే నమోదయ్యాయి. ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే నాలుగు రెట్లు వేగంగా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. రెండో వేవ్ చాలా ప్రమాదకరంగా ఉండబోతోందని ప్రభుత్వం కూడా అంచనావేసింది.

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY
ఆ తర్వాత..
శీతాకాలం తర్వాత కొంత ఉపశమనం లభించే అవకాశముంది
వాతావరణం మెరుగుపడటంతో ప్రజలు బయట ఎక్కువగా గడుపుతారు. మరోవైపు వైరస్ మనుగడ సాగించడమూ ఈ పరిస్థితుల్లో కష్టం అవుతుంది.
ప్రజల్లో రోగ నిరోధక శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే శీతాకాలంలో చాలా మందికి వైరస్ సోకుతుంది.
టీకా అప్పటికే అందుబాటులోకి వస్తుంది.
‘‘వేసవిలో కేసులు తగ్గుతాయని గత అనుభవాలు చెబుతున్నాయి. ఎందుకంటే అప్పటికే చాలా మందికి కోవిడ్-19 సోకి ఉంటుంది’’అని యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ క్రిస్టీనా పేజెల్ వివరించారు.
‘‘ఇంకా చలికాలం పూర్తిగా రాలేదు. దాన్ని తలచుకుంటేనే కుంగుబాటు వస్తోంది. పరిస్థితులు చూస్తుంటే మరోసారి లాక్‌డౌన్‌లు తప్పేలా కనిపించడం లేదు’’అని ఆమె వ్యాఖ్యానించారు.
‘‘దాదాపు 20 శాతం మందికి కోవిడ్-19 సోకి ఉంటే.. వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. వ్యాక్సీన్ ఆలస్యమైనప్పటికీ పరిస్థితులు మెరుగుపడతాయి’’
‘‘మూడో వేవ్ కూడా వచ్చే అవకాశముంది. అయితే, రెండు లేదా మూడో వేవ్ లతో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. అప్పటిలోగా వ్యాక్సీన్ రాకపోతే నాలుగో వేవ్ కూడా వస్తుంది’’అని మార్క్ వ్యాఖ్యానించారు.
‘‘వచ్చే 18 నెలల వరకు పరిస్థితులు మారుతాయని నేను అనుకోవడం లేదు’’.

ఫొటో సోర్స్, Getty Images
తొలి వ్యాక్సీన్‌ల ప్రభావం అంతంతే..
వచ్చే ఏడాది రాబోతున్న వ్యాక్సీన్‌తో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో వాస్తవిక అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాక్సీన్లకు మెరుగైన చికిత్సా విధానాలు తోడైతే పరిస్థితులు మెరుగుపడతాయి.
ప్రస్తుతం 11 వ్యాక్సీన్ల ప్రయోగ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. అవి ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి? వాటి ప్రభావం ఎంత కాలం ఉంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు మనం ఎదురుచూస్తున్నాం.
మిగతా వ్యాధులకు అందుబాటులోనున్న వ్యాక్సీన్లు భిన్నమైనవి. కొన్ని వ్యాక్సీన్లు ఇన్ఫెక్షన్లు సోకకుండా నిలువరిస్తాయి. మరికొన్ని వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. మరోవైపు వ్యాక్సీన్లు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తాయి.
అయితే, మ్యాజిక్ జరుగుతుందని మనం ఆశించకూడదు.
‘‘పరిస్థితులు ఒక మోస్తరు ఆశాజనకంగానే ఉంటాయి. మొదటగా వచ్చే వ్యాక్సీన్లు కొందరిని ఆసుపత్రి పాలు కాకుండా కాపాడగలవు. అయితే, వైరస్ వ్యాప్తిని పూర్తిగా ఇవి అడ్డుకోలేకపోవచ్చు’’అని హిస్‌కాక్స్ వ్యాఖ్యానించారు.
మరోవైపు వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిపై వ్యాక్సీన్ ప్రభావం అంతంత మాత్రమేనని ఆయన వివరించారు.
‘‘వ్యాక్సీన్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అయితే, సమర్థవంతమైన టీకా వచ్చే సరికి ఆలస్యం అవుతుందని చరిత్ర చెబుతోంది’’అని వూల్‌హౌస్ వ్యాఖ్యానించారు. కోట్ల మందికి వ్యాక్సీన్ చేరవేయడం, పూర్తిగా వైరస్ నుంచి రక్షణ లభించకముందే ఆంక్షలు ఎత్తివేయడం తదితర ప్రశ్నలు ఎప్పుడూ ఉత్పన్నం అవుతూనే ఉంటాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సాధారణ స్థితి రావడానికి సమయం పడుతుంది
లాక్‌డౌన్‌నాటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు మెరుగుపడ్డాయి. పాఠశాలలు తెరచుకున్నాయి. ఇంట్లోనే ఉండాలని చెప్పే ఆంక్షలను ఇప్పుడు ఎత్తివేశారు.
అయితే, కొంతవరకు సామాజిక దూరం నిబంధనలు వచ్చే ఏడాది వరకు కొనసాగుతాయిన ప్రొఫెసర్ హిస్‌కాక్స్ చెప్పారు. ఆ ఆంక్షలు అంత కఠినమైనవి కాకపోవచ్చని అన్నారు.
‘‘ముప్పు పొంచివున్నవారు ఇంటికే పరిమితం అయితే మంచిది. వారు అదనంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రక్షణ గురించి చాలా అస్పష్టత నెలకొంది’’.
పరిస్థితులు మునుపటికి రావాలంటే.. వైరస్ వ్యాప్తికి కళ్లెం వేయడంతోపాటు అనారోగ్యానికి గురికాకుండా చూసే వ్యాక్సీన్ రావాలని ఆయన చెప్పారు. దానికి కనీసం ఐదేళ్లు పడుతుందని ఆయన అన్నారు.
‘‘చాలా మంది విషయంలో.. కోవిడ్-19 జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. పరిస్థితులు మునుపటికి వెళ్లడం ఇక సాధ్యపడకపోవచ్చు’’
ఆయన వైరస్ వ్యాప్తి విషయంలో కొంచెం ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ‘‘కొత్త కేసులు తగ్గడానికి అవసరమైన రోగ నిరోధక శక్తి ఇప్పటికే చాలా మందికి వచ్చింది. కాబట్టి సంక్షోభ పరిస్థితులు రాకపోవచ్చు. అయితే, ఇప్పటికీ మనం మాస్కులు పెట్టుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి’’అని ఆయన చెప్పారు.
‘‘కోవిడ్-19 కూడా ఇతర ఫ్లూల్లానే మారిపోతుంది. చాలా మంది దీనికి అలవాటు పడిపోతారు. అయితే శీతాకాలం మాత్రం ఇదివరకటి కంటే చాలా కఠినంగా ఉండబోతుంది. ఆసుపత్రులపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది’’అని పేజెల్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- జమ్మూ కశ్మీర్: ‘‘ఎవ్వరినీ వదిలిపెట్టబోమని చెబుతూ జర్నలిస్టులందరికీ గట్టి సందేశం పంపిస్తున్నారు’’
- పదహారేళ్లు దాటినా రజస్వల కాకపోతే పెళ్లి చేయొచ్చా? డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి
- పోలవరం ప్రాజెక్టు: ''మునిగిపోయే మండలాలే కదా అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు''
- బిహార్ ఎన్నికలు: ముస్లింలు లాలూను కాదని అసదుద్దీన్ ఒవైసీతో చేతులు కలుపుతారా?
- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వివాదాలకు కేంద్రంగా మారిన మరో 'రాముడు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








