స్త్రీ జననాంగానికి లేజర్ చికిత్స చేస్తే శృంగారంలో నొప్పి తగ్గి లైంగిక సంతృప్తి పెరుగుతుందా

మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు యోని పునరుత్తేజం కోసం లేజర్ చికిత్సలు జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యోని పునరుత్తేజం కోసం మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు లేజర్ చికిత్సలు చేస్తున్నారు
    • రచయిత, మిషెల్లీ రాబర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

రుతుక్రమం ఆగిపోయిన (మెనోపాజ్ దశ) మహిళలకు యోనిలో చైతన్యం నింపడానికి చేసే లేజర్ చికిత్సలు ప్రమాదకరమైనవని, వాటివల్ల ప్రయోజనం కూడా ఏమీ ఉండదని ఒక అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.

ఇలాంటి చికిత్సలు తీసుకోవడం వల్ల పొడిబారిన యోనిలో మార్పు, శృంగారంలో నొప్పిలాంటివి తగ్గుతాయా అనే అంశంపై వారు పరిశోధన చేశారు.

బ్రిటన్‌లోని ఎన్‌హెచ్ఎస్ అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ ఈ థెరపీని కేవలం పరిశోధన కోసం మాత్రమే ఉపయోగించాలని చెప్పింది.

అమెరికా, బ్రిటన్‌లలోని కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లు ఈ థెరపీని అందిస్తూనే ఉన్నాయి.

లైంగిక సంతృప్తి

యోనిలోని కణాలను పునరుత్తేజింపజేయడానికి లేదా మార్చడానికి ఈ లేజర్ చికిత్స చేస్తారు. ఇలా కణాలను ప్రేరేపించడం వల్ల శరీరంలో మార్పులు చేయొచ్చని, దీనివల్ల యోనిలో లూబ్రికేషన్ పెరిగి, సెక్స్‌లో సంతృప్తి తిరిగి పొందడానికి అవకాశం ఉందని ఈ క్లినిక్‌ల నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ చికిత్సకు ఎక్కువ సమయం పట్టదని, అయితే, దీనివల్ల ప్రమాదాలు లేవని చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఈ తరహా చికిత్సలు మహిళలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు హెచ్చరించాయి.

ఈ చికిత్స కారణంగా కొందరు మహిళలకు యోనిలో గాయాలు, కొందరిలో మచ్చలు ఏర్పడినట్లు గుర్తించారు.

ఈ లేజర్ చికిత్సలో పాటించే ప్రమాణాలు, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రమాదాలకు సంబంధించిన ఇప్పటి వరకు జరిపిన అతిపెద్ద అధ్యయనం ఇదేనని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌’లో పరిశోధనా బృందం పేర్కొంది.

ఈ థెరపీ మంచిదా కాదా అన్నది తేల్చడానికి చేస్తున్న పరిశోధనలకు బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ 'నైస్' అని పేరు పెట్టింది. ఈ చికిత్సలు విస్తృతంగా ఉపయోగించడానికి పనికొస్తాయా లేదా అన్నది తేల్చడమే ఈ అధ్యయనాల లక్ష్యం.

ఇటు ఆస్ట్రేలియన్ పరిశోధకులు కూడా 85 మంది మహిళలను రెండు గ్రూపులుగా విభజించి, లేజర్, ప్లాసిబో విధానాలలో అధ్యయనం జరిపారు. చికిత్సలో భాగంగా లేజర్ పరికరాలను యోనీలోకి పంపినా, అవసరమైన డోస్‌ ఇవ్వకుండా పరీక్షలు చేశారు.

అయితే, ఈ అధ్యయనాల కారణంగా మహిళలలో ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు కనిపించ లేదు. అంతే కాదు, ఏడాది కాలంలో ఈ రెండు గ్రూపుల మధ్య పెద్ద మార్పు కూడా కనిపించ లేదు.

'యోనికి లేజర్ చికిత్సల కారణంగా తీవ్ర దుష్ఫ్రభవాలు కలగడం, వీటిని తీసుకోవద్దంటూ ఎఫ్‌డీఏ (అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్) హెచ్చరికలు కలత పెడుతున్నాయి'' అని యూనివర్శిటీ ఆఫ్ ఉటాకు చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో రచయితలు డాక్టర్ మారిసా అడెల్మన్, ఇంగ్రిడ్ నైగార్డ్ అన్నారు.

"యోని మెష్ ప్రోడక్ట్స్‌ను మార్కెట్ చేసుకోవడానికి, రాండమైజ్డ్ ట్రయల్స్ పూర్తికాక ముందే పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ చికిత్సలకు హడావుడిగా అనుమతులు ఇచ్చారు. ఇకపై ఈ ప్రోడక్టులు అమెరికాలో అమ్మడం కుదరదు''

"కేవలం మార్కెటింగ్ కోసం వీటికి అనుమతులు ఇచ్చి, నిజంగా ఇవి ప్రయోజనకరమైనవా, కావా అనే పరిశీలనకు అవకాశం లేకుండా చేశారు'' అని వారు వ్యాఖ్యానించారు.

మెనోపాజ్ దశలో మహిళలు నొప్పి, మంట, దురద, యోని పొడిబారడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెనోపాజ్ దశలో మహిళలు నొప్పి, మంట, దురద, యోని పొడిబారడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు

యోని పొడిబారడం

'' ఇలాంటి ఒక పరిశోధన కోసం మేం చాలాకాలంగా ఎదురు చూస్తున్నాం. ఇలాంటి ర్యాండమైజ్డ్ టెస్టులకు నిధులు అందలేదు'' అని బ్రిటిష్ మెనోపాజ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు టిమ్ హిల్లార్డ్ వ్యాఖ్యానించారు.

"దీని వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడానికి వైద్యులు ఈ చికిత్సను క్లినికల్ ట్రయల్స్‌ ద్వారా మాత్రమే అందించాల్సి ఉంది'' అని హిల్లార్డ్ అన్నారు.

‘‘మెనోపాజ్ దశలో ఉన్నవారికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ల అవసరం ఉంది. అయితే, వాటి పని తీరు మీద పరిశోధనలు ఎంతో విలువైనవి'' అన్నారు హిల్లార్డ్ వ్యాఖ్యానించారు.

"యోని పొడిబారడం, దురద, అసౌకర్యం, సంభోగం సమయంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి మహిళలకు చాలా బాధ కలిగిస్తుంటాయి" అని ఆయన చెప్పారు.

" ఈ సమస్యల గురించి మాట్లాడటం చాలా కష్టం. చాలామంది మహిళలు ఈ బాధను భరిస్తారుగాని, డాక్టర్ సలహా తీసుకోరు. కానీ కొన్ని చికిత్సలు సహాయపడతాయి, నిపుణుల సలహాలు కూడా కొంత ఉపశమనం కలిగిస్తాయి'' అని ఆయన అన్నారు.

45 ఏళ్ల వయసు నుంచి మహిళల్లో మెనోపాజ్ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది

ఫొటో సోర్స్, SOPHIE ROBEHMED

ఫొటో క్యాప్షన్, 45 ఏళ్ల వయసు నుంచి మహిళల్లో మెనోపాజ్ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది

మెనోపాజ్‌ సమస్యలను ఎలా గుర్తించాలి.. ఎలా అధిగమించాలి

  • చాలామంది మహిళలు 45-55 సంవత్సరాల మధ్య మెనోపాజ్ దశకు చేరుకుంటారు.
  • రుతుక్రమం పూర్తిగా ఆగిపోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాల ముందు నుంచి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఇవి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతాయి
  • శరీరం నుంచి ఆవిర్లు వచ్చినట్లు అనిపించడం, రాత్రిపూట చెమటలు పట్టడం, యోని పొడిబారడం, మానసికంగా మార్పులు, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.
  • హార్మోన్ లెవెల్స్‌ను తెలుసుకోవడానికి వైద్యులు రక్త పరీక్షలు చేయవచ్చు, మెనోపాజ్‌ స్పెషలిస్టుల దగ్గరకు వెళ్లమని రిఫర్ చేయవచ్చు.
  • హార్మోన్-రీప్లేస్‌మెంట్ థెరపీ లేదా యోని ఈస్ట్రోజెన్ క్రీమ్‌లు, లూబ్రికెంట్లు కొంత వరకు సాయపడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)