చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?

భారత వైమానిక దళం

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

    • రచయిత, రాఘవేంద్రరావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత వైమానిక దళం శుక్రవారం అక్టోబర్ 8న తన 89వ ఫౌండేషన్ డే జరుపుకుంది.

ఈ సందర్భంగా ప్రతి ఏటాలాగే ఈసారి కూడా రాజధాని దిల్లీ పక్కనే ఉన్న హిండన్ ఎయిర్ బేస్‌లో వైమానిక దళం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.

ఈ వేడుకలో వైమానిక దళానికి అధ్యక్షులుగా కొత్తగా నియమితులైన ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ప్రసంగించారు.

"ఈరోజు మనం ఎదుర్కొంటున్న భద్రతా స్థితిని చూసినప్పుడు, ఒక కీలక సమయంలో దీని బాధ్యతలు స్వీకరించానని నేను పూర్తిగా అప్రమత్తం అవుతాను. మన భూభాగంలో బయటి శక్తుల ఉల్లంఘనను అనుమతించేది లేదని మనం జాతికి చూపించాలి" అన్నారు.

వైమానిక దళం కొత్త చీఫ్ అత్యంత కీలకమైన సమయంలో భారత వైమానిక దళం బాధ్యతలు స్వీకరించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చైనా- భారత్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఉద్రిక్తలు ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. టిబెట్ భూభాగంలోని మూడు వైమానిక స్థావరాల్లో చైనా దళాల మోహరింపు కొనసాగుతోందని వైమానిక దళం చీఫ్ స్వయంగా చెప్పారు.

2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు భారత ఎయిర్ బేస్‌లోకి చొరబడిన జ్ఞాపకాలు ఇంకా మసకబారలేదు.

మరోవైపు "భారత వైమానిక దళం వచ్చే 10-15 ఏళ్లలో ఆమోదిత సామర్థ్యం అయిన 42 స్క్వాడ్రన్లకు చేరుకోవడం సాధ్యం కాదని ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అక్టోబర్ 5న ఒక ప్రకటన చేశారు.

( భారత వైమానిక దళం ఒక్కో స్క్వాడ్రన్‌లో 16 నుంచి 18 యుద్ధ విమానాలు ఉంటాయి)

మరికొన్నేళ్లలో లైట్ కాంబాట్ ఎయిర్‌ క్రాఫ్ట్(ఎల్సీఏ) ఎంకే-1 ఎ నాలుగు స్క్వాడ్రన్లు, అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(ఎఎంసీఏ) ఆరు స్క్వాడ్రన్లు, మిలిటరీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్(ఎంఆర్ఎఫ్ఏ) ఆరు స్క్వాడ్రన్లు భారత వైమానిక దళంలో చేరుతాయని ఆయన చెప్పారు.

కానీ, బాగా పాతబడిన యుద్ధ విమానాలను దశలవారీగా ఫేజవుట్ కూడా చేస్తుంటామని, అందుకే మొత్తం స్క్వాడ్రన్ల సంఖ్య మరో దశాబ్దం పాటు 35గానే ఉంటుందని, ఆ సంఖ్యను పెంచడానికి ఆస్కారం లేదని ఆయన చెప్పారు.

అంటే 42 ఆమోదిత స్క్వాడ్రన్ల కోసం అవసరమైన యుద్ధ విమానాలు అందుబాటులో లేకపోవడం అనేది భారత వైమానిక దళానికి ప్రమాద ఘంటికలుగానే భావించాలా? భారత వైమానిక దళం తమ అవసరాలకు తగినట్లు యుద్ధ విమానాలను ఎందుకు చేర్చలేకపోతోంది.

భారత వైమానిక దళం

ఫొటో సోర్స్, TWITTER/@IAF_MCC

114 యుద్ధ విమానాలు కొనుగోళ్లకు సన్నాహాలు

భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం దాదాపు 600 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో సుఖోయ్, మిగ్-29, మిరాజ్ 2000, జాగ్వార్, మిగ్-21, తేజస్, రఫేల్ ఉన్నాయి. ఫ్రాన్స్‌తో జరిగిన 36 రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకూ 26 విమానాలు డెలివరీ అయ్యాయి.

మరో నాలుగేళ్లలో భారత వైమానిక దళం నాలుగు మిగ్-21 స్క్వాడ్రన్లను దశలవారీగా తొలగించనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి మిరాజ్ 2000, జాగ్వార్, మిగ్-29 యుద్ధ విమానాలు కూడా సేవల నుంచి వైదొలుగుతాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారుతోంది.

ఈ విమానాల లోటును భర్తీ చేయడానికి భారత వైమానిక దళం ఇప్పుడు 114 మిలిటరీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది.

2019 ఏప్రిల్‌లో సుమారు 18 బిలియన్ డాలర్ల వ్యయంతో 114 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి భారత వైమానిక దళం ప్రాథమిక టెండర్ వేసింది. దీనిని ఇటీవల ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కొనుగోలు కార్యక్రమాల్లో ఒకటిగా చూస్తున్నారు.

83 తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్ల వల్ల తమ యుద్ధ సామర్థ్యానికి ఏ లోటూ రాదని భారత వైమానిక దళం ఆశిస్తోంది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ జేఎఫ్-17 యుద్ధ విమానాలు భారత్‌కు చెందిన తేజస్‌తో పోటీపడగలవా

అనిశ్చితి స్థితి

భారత వైమానిక దళం కోసం జరిగే యుద్ధ విమానాల కొనుగోళ్ల గురించి చాలా ఏళ్లుగా అప్పుడప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు వైమానిక దళం స్వయంగా చర్చల్లో నిలిచింది.

126 యుద్ధ విమానాలకు బదులు కేవలం 36 రఫేల్ ఫైటర్లు కొనుగోలు చేసినప్పుడే ఈ సమస్య మొదలైందని రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ ప్రశాంత్ దీక్షిత్ చెప్పారు.

"భారత వైమానిక దళం సమస్యలు అక్కడ నుంచే మొదలయ్యాయి. ప్రభుత్వం ఇప్పుడు లైట్ కాంబాట్ ఎయిర్‌ క్రాఫ్ట్ తేజస్ వైపు మొగ్గుచూపుతోంది. 40 తేజస్‌ విమానాలు ఆర్డర్ ఇచ్చేశారు. మరో 83 తేజస్ కొంటామని చెబుతున్నారు. అవన్నీ వచ్చేసరికి మరో పదేళ్లు పడుతుంది" అంటారు దీక్షిత్.

భారత ప్రభుత్వం 2007లో 126 మీడియం మిలిటరీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎంఎంఆర్‌సీఏ) కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించింది.

ఈ యుద్ధ విమానాల ధర దాదాపు 20 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్రక్రియలో వివిధ విమాన సంస్థల మధ్య జరిగిన పోటీలో ఈ డీల్‌ను రఫేల్ సొంతం చేసుకుంది.

కానీ, 2015లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో నేరుగా ఒక ఒప్పందం చేసుకున్న భారత ప్రభుత్వం 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఆ తర్వాత 126 యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు తెరపడింది.

"ప్రభుత్వం ఇప్పుడు పాత మిరాజ్ 2000 కొనుగోలు చేస్తోంది. ఈ పాత విమానాల్లోని భాగాలను మిగతా మిరాజ్ విమానాల్లో ఉపయోగించవచ్చని భావిస్తోంది. ఇక్కడ ఆందోళన కరమైన విషయం ఏంటంటే.. ఒక వైపు వారు ఆధునిక విమానాలు కొనుగోలు చేస్తూనే, మరో వైపు జుగాడ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు" అంటారు కమోడర్ దీక్షిత్

వైమానిక దళంలో ప్రస్తుతం అనిశ్చితి లాంటి స్థితి ఏర్పడిందనే విషయాన్ని తోసిపుచ్చలేమని యుద్ధ విమానాల కొరత గురించి మాట్లాడిన ఆయన చెప్పారు.

భారత వైమానిక దళం

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTY IMAGES

అత్యధిక ధరలు, సుదీర్ఘ ప్రక్రియ

గత రెండు దశాబ్దాలుగా యుద్ధ విమానాల టెక్నికల్ క్వాలిటీ పెరగడంతో వాటి ధరలు కూడా ఎన్నో రెట్లు పెరిగాయని నిపుణులు భావిస్తున్నారు.

భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఖరీదైన ఆ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ఒక సవాలుగా మారుతోంది.

భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రపేల్ విమానాల విలువ 59 వేల కోట్ల రూపాయలు. ఈ కొనుగోళ్లపై భారత్‌లో ఒక పెద్ద రాజకీయ వివాదం కూడా నడిచింది.

యుద్ధ విమానాల కొనుగోళ్లు అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ పీకే బార్బోరా చెప్పారు.

"విమానాల కొనుగోలు అనేది షోరూంలో కారు కొన్నట్టు ఉండదు. భారత్‌కు మొదటి విడత రఫేల్ విమానాలు అందించడానికి ఫ్రాన్సుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఒక ఒప్పందంపై మనం సంతకాలు చేసిన రోజు నుంచి మొదటి విమానం దేశానికి చేరుకోడానికి ఆరు నుంచి ఏడేళ్ల సమయం పట్టవచ్చు" అంటారాయన.

"వైమానిక దళం యుద్ధ విమానాలు తమ అవసరాలకు తగినట్లు కోరుకుంటోంది. అందుకే ఆ విమానాల్లో ఆ అవసరాలకు అనుగుణంగా పరికరాలు అమర్చడానికి అదనపు సమయం పడుతోంది" అని బార్బోరా చెప్పారు.

"ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ. అందుకే విమానాల తయారీ సంస్థ తమ ఉత్పత్తి వేగం పెంచలేదు. ఇప్పుడు 114 యుద్ధ విమానాల కోసం ఒప్పందంపై సంతకాలు చేయవచ్చు. కానీ, చివరి విమానం వచ్చే సరికి 15 ఏళ్లు పడుతుంది. అప్పుడు కూడా డబ్బుకు సంబంధించిన సమస్యే ఉంటుంది" అంటారు బార్బోరా.

భారత్‌లో తయారైన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ 'తేజస్' ఒక మంచి విమానం అని బార్బోరా భావిస్తున్నారు.

కానీ, తేజస్ రేంజ్, సహసశక్తి, ఆయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం విషయానికి వస్తే, అవి సుఖోయ్ లేదా రఫేల్ విమానాల కంటే తక్కువగా ఉంటుంది.

తేజస్ జెట్ తయారు చేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ప్రస్తుత సామర్థ్యాన్ని బట్టి అది 83 తేజస్ విమానాలు ఇవ్వడానికి సుదీర్ఘ సమయం పడుతుందని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, రఫేల్ ఫైటర్ జెట్స్ శత్రు లక్ష్యాలపై ఎలా దాడి చేస్తాయి?

చైనా నుంచి ముప్పు

ఒక వైపు భారత వైమానిక దళం తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు చైనా దగ్గర భారత్ కంటే దాదాపు రెట్టింపు యుద్ధ విమానాలు ఉండడం కలవరం కలిగిస్తోంది.

రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోగలిగే సామర్థ్యం భారత వైమానిక దళానికి ఉందా అని తరచూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

"భారత్, చైనా మధ్య సంప్రదాయ యుద్ధం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ అలా వచ్చినా భారత వైమానిక దళం మిగతా దేశాల నుంచి సాయం తీసుకోవచ్చు. భారత్ భాగంగా ఉన్న క్వాడ్ లాంటి గ్రూపు ఎలాంటి కష్ట సమయంలో అయినా భారత వైమానిక దళానికి సాయం అందించవచ్చు" " అని కమోడోర్ దీక్షిత్ అంటున్నారు.

మరోవైపు, భారత వైమానిక దళం దగ్గర ఇప్పుడు కూడా హై-టెక్ విమానాలు ఉన్నాయని ఎయిర్ మార్షల్ బార్బోరా చెబుతున్నారు.

"మిరాజ్ 2000, మిగ్-29 విమానాలను అప్‌గ్రేడ్ చేశారు. జాగ్వార్‌ను చాలావరకూ అప్‌గ్రేడ్ చేశారు. భారత్ దగ్గర 250కి పైగా సుఖోయ్ విమానాల ఫ్లీట్ ఉంది. రఫేల్ విమానాలు కూడా ఉన్నాయి. మన దగ్గర ఉన్న విమానాలు చాలా సమర్థమైనవి" అన్నారు.

చైనా లేదా పాకిస్తాన్‌తో భారత్‌కు ఒక పెద్ద స్థాయి యుద్ధం వస్తుందని తనకు అనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

"దానికి ఒక కారణం ఉంది. భారత్, ఈ రెండు దేశాలు అణు శక్తి ఉన్న దేశాలు. వైమానిక శక్తిని ఉపయోగించేలా ప్రాంతీయ వివాదాలు ఉండవచ్చు. కానీ, ఒక పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుంది అనేది మాత్రం సందేహమే" అంటారు బార్బోరా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)