మలేరియా వ్యాక్సీన్: ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఎన్ని డోసులు వేసుకోవాలి? 7 ప్రశ్నలు, సమాధానాలు

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేరియా కోసం తయారు చేసిన వ్యాక్సీన్‌ను ఉపయోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతించడంతో పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాంతక మలేరియా బారిన పడి ఏటా అనేక మంది చనిపోతుంటారు. ఆసియా, ఆఫ్రికా, మధ్య-దక్షిణ అమెరికాల్లో మలేరియా ఒక పెద్ద సమస్య.
సబ్-సహారన్ ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం అయిదేళ్లలోపు పిల్లలు 260,000 మందికి పైగా మలేరియాతో మరణిస్తున్నారు.
దశాబ్దాలపాటు సాగిన ఈ పరిశోధనల వల్ల వెలువడిన తాజా ఫలితాలు వేలసంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ వ్యాక్సీన్ పేరు ఆర్‌టిఎస్,ఎస్.
మరి ఈ టీకాను ఎప్పటి నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారు? దీనికి గురించి చర్చించే ముందు దీనికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు ఇక్కడ ప్రస్తావించాలి.

ఫొటో సోర్స్, AFP
1. మలేరియా వ్యాక్సీన్ ప్రభావం ఎంత, సేఫ్టీ సంగతేంటి?
కొత్తగా వచ్చిన ఈ టీకా ఆరు సంవత్సరాల కిందటే ప్రభావవంతమైనదిగా నిరూపణ అయ్యింది. 40% వరకు మలేరియా కేసులు రాకుండా చూస్తుందని, 30% తీవ్రమైన కేసులను నివారించగలదని గుర్తించారు.
2019 నుండి ఈ టీకాతో ఘనా, కెన్యా, మలావి దేశాలలో పైలట్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
2. రక్షణ తక్కువగా ఉండటం సమస్యా?
మలేరియా వ్యాక్సీన్ ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటే అంత మేలు జరుగుతుంది. కానీ, కొన్ని వందల మిలియన్ల కేసులు వస్తుండగా, కేవలం 40% ప్రభావం చూపడంపై నిరాశ వ్యక్తమవుతోంది. అయితే, ఇప్పటికే దీనికి వేలమందిని రక్షించగలిగింది.
"ఇది అద్భుతం కాకపోయినా, మధ్యస్థంగా ప్రయోజనకరమే. 30-40% మరణాలను తగ్గించినా అది ఉపయోగకరమే'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డాక్టర్ పెడ్రో అల్సోనో బీబీసీతో అన్నారు.
మలేరియాపై పోరాటానికి ఇది కొత్త ఆయుధమని చెప్పడానికి ఆరోగ్య అధికారులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. టీకా ఎలా పనిచేస్తుంది?
మలేరియా అనే పరాన్నజీవి పునరుత్పత్తి కోసం జీవుల రక్తకణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. ఇది రక్తం పీల్చే దోమ కాటు ద్వారా మనుషుల్లోకి వ్యాపిస్తుంది.
ఆఫ్రికాలో అత్యంత ప్రాణాంతకమైన ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే మలేరియా పరాన్నజీవిని లక్ష్యంగా చేసుకుని ఈ టీకాను తయారు చేశారు.
దోమకాటు వేసిన కాసేపటికే మలేరియా వైరస్ బాధితుడి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ‘‘ఈ టీకా మలేరియా వైరస్‌తో పోరాడుతుంది. మానవ శరీర కణాలలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుం’’ అని డాక్టర్ అలోన్సో చెప్పారు.
ఈ టీకా మరింత ప్రభావవంతంగా ఉండటానికి నాలుగు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయిదు, ఆరు, ఏడు నెలల వయసుల్లో మొదటి మూడు డోసులు, 18 నెలల వయసు తర్వాత ఒక బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్దల మాదిరిగా కాకా, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, మలేరియా కారణంగా మరణాలు ఎక్కువగా పిల్లల్లోనే జరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, CRISTINA ALDEHUELA
4. ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు చెల్లించాలి?
ఈ వ్యాక్సీన్‌ను ఫార్మా దిగ్గజం జీఎస్‌కే డెవలప్ చేసింది. తయారీ ధరకు అదనంగా 5% చేర్చి సరఫరా చేస్తామని ఆ సంస్థ వెల్లడించింది. కానీ, ధర ఎంతో ఇప్పటి వరకు వెల్లడించలేదు.
వీటిని కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు దాతలను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ''అంతర్జాతీయంగా నిధులు సమకూర్చే సంస్థలు చర్చించి టీకాను సేకరించడంపై నిర్ణయం తీసుకోవాలి'' అని జీఎస్‌కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ బీబీసీతో అన్నారు.
జాతీయ రోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా టీకాకు ఎలా ఆర్థిక సహాయం పొందాలనే అంశంపై ప్రపంచ మార్గదర్శకత్వం కోసం తమ అధికారులు ఎదురుచూస్తున్నారని కెన్యాలో పైలట్ ప్రోగ్రామ్ సమన్వయకర్తల్లో ఒకరైన రోజ్ జలంగో చెప్పారు.
ప్రస్తుతం కెన్యాలో టీకాలకు ఎక్కువగా నిధులు ప్రపంచ వ్యాక్సీన్ కూటమి 'గవి', ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ వంటి దాతల నుండి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
5. పంపిణీకి ఎంత సమయం పడుతుంది?
ఘనా, కెన్యా, మలావిలో పైలట్ కార్యక్రమాలు కొనసాగుతాయి. అధ్యయనం కోసం జీఎస్‌కే 10 మిలియన్ డోస్‌లను విరాళంగా ఇచ్చింది. ఇప్పటి వరకు వాటిలో పావువంతు వాడారు.
సంవత్సరానికి 15 మిలియన్ డోస్‌లను అందించడానికి సిద్ధమని కంపెనీ వెల్లడించింది.
నిధులు అందగానే 2022 చివర, లేదా 2023 ఆరంభం నుండి టీకాను అందరికీ అందుబాటులోకి తెస్తామని సంస్థ అధికారి బ్రూయర్ చెప్పారు.
కానీ, ఈ సంఖ్య సరిపోక పోవచ్చని ఆష్లీ బిర్కెట్ అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ వ్యాధి నిరోధక కార్యక్రమాలను నిర్వ హిస్తుంది. ఈ దశాబ్దం ముగిసే నాటికి ప్రతియేటా 100 మిలియన్ డోస్‌లు అవసరం కావచ్చని ఆ సంస్థ వెల్లడించింది.
6. మౌలిక సదుపాయాల సంగతేంటి?
ఈ టీకా రెండేళ్లలోపు పిల్లలకు వేయాల్సి ఉంది కాబట్టి, దీనిని పిల్లల ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లలో కలిపి సరఫరా చేయవచ్చు. అదనంగా మౌలిక సదుపాయాల అవసరం ఉండదు. అయితే ప్రభుత్వ విద్య, ఆరోగ్య కార్యకర్తలకు కొంత శిక్షణ అవసరం.
కెన్యాలో పైలట్ ప్రోగ్రామ్‌లో, 200,000 కంటే ఎక్కువ మంది పిల్లలకు టీకాలు వేశారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా రిమోట్ క్లినిక్‌ల ద్వారా వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ జలంగో బీబీసీతో అన్నారు. .

ఫొటో సోర్స్, Getty Images
7. ఇంకా ఏయే టీకాలు తయారవుతున్నాయి?
యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతోపాటు కొన్ని సంస్థలు వ్యాక్సీన్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిశోధనా ఫలితాలపై గత ఏప్రిల్‌లో విడుదలైన నివేదికల ప్రకారం ఇది 70% ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
మలేరియాకు వ్యాక్సీన్ తయారు చేయడం సుదీర్ఘ ప్రక్రియ. ఇది కోవిడ్-19 కంటే క్లిష్లమైన వ్యాధి.
ఆర్‌టీఎస్,ఎస్ అన్ని రకాల తనిఖీలు, ట్రయల్స్ తర్వాత అనుమతి కోసం వెళ్లిన మొట్టమొదటి మలేరియా వ్యాక్సీన్. కానీ, రాబోయే కాలంలో దీనికన్నా మరింత ప్రభావవంతంగా ఉండే వ్యాక్సీన్‌లు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ వెళ్లలేరు.. ఇండియాలో ఉండలేరు
- మా ఊరు ఎవరిది
- మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- కరోనావైరస్తో పోరాడే మాత్ర ఇదేనా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
- కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇది కరోనా సైడ్ ఎఫెక్టేనా
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













