Ivermectin: కోవిడ్-19పై ఈ ఔషధం అద్భుతంగా పోరాడుతోందా? ఈ వార్తల్లో నిజమెంత

ఐవెర్‌మెక్టిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేచల్ స్క్రేర్, జాక్ గుడ్‌మ్యాన్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

కోవిడ్ వ్యాక్సీన్లను వ్యతిరేకించేవారు ఐవెర్‌మెక్టిన్‌ను ‘‘అద్భుతమైన ఔషధం’’గా చెబుతున్నారు. కొన్ని దేశాల్లోని ఆరోగ్య అధికారులు దీన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే, ఈ ఔషధం పనిచేస్తుందని చెప్పే అధ్యయనాల్లో దోషాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

మనుషులతోపాటు జంతువుల్లోనూ పారాసైట్లతో చుట్టుముట్టే ఇన్ఫెక్షన్లకు చికిత్సగా ఏళ్ల నుంచీ ఐవెర్‌మెక్టిన్‌ను ఉపయోగిస్తున్నారు.

అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ ఔషధం మరోసారి వార్తల్లో కెక్కింది. కరోనావైరస్‌తో ఇది పోరాడగలదని, కోవిడ్-19 మరణాలను ఇది అడ్డుకోగలదని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే, కోవిడ్-19పై ఈ ఔషధం పనిచేస్తుందని చెప్పే స్పష్టమైన ఆధారాలు లేవని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)ల్లోని ఆరోగ్య అధికారులు వివరిస్తున్నారు. అయినప్పటికీ, వ్యాక్సీన్లను వ్యతిరేకించేవారు ఈ ఔషధానికి మద్దతుగా ప్రచారాలు చేపడుతున్నారు.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలో కొన్ని సోషల్ మీడియా గ్రూప్‌లలో ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. కొందరైతే జంతువులపై వాడే ఐవెర్‌మెక్టిన్‌ రకాలను కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఐవెర్‌మెక్టిన్‌పై విస్తృతంగా చేపడుతున్న ప్రచారాలతో చాలామంది దీన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.

దీనికి మద్దతుగా ప్రచారం చేపడుతున్నవారు కొన్ని అధ్యయనాలను ఉటంకిస్తున్నారు. ఈ అధ్యయనాల ఫలితాలను పట్టించుకోవడం లేదని, కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఈ అధ్యయనాలను సమీక్షించిన ఓ స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చాలా సందేహాలను లేవనెత్తింది.

‘‘దాదాపు 26 అధ్యయనాల్లో మూడో వంతుకుపైగా అధ్యయనాల్లో దోషాలు ఉన్నాయి. కొన్నింట్లో అయితే ఫలితాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగినట్లు సంకేతాలు వస్తున్నాయి. వీటిలో ఏ అధ్యయనంలోనూ ఐవెర్‌మెక్టిన్ శక్తిమంతంగా పనిచేస్తుందని చెప్పే ఆధారాలు బయటపడలేదు’’అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘‘కోవిడ్-19 మరణాలను ఐవెర్‌మెక్టిన్ అడ్డుకోగలదని చెప్పే ఒక్క క్లినికల్ ట్రయల్ కూడా మాకు కనిపించలేదు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో చాలా దోషాలు ఉన్నాయి’’అని అధ్యయనాలను పరిశీలించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ కైలే షెల్డ్రిక్ చెప్పారు.

ఐవెర్‌మెక్టిన్‌కు మద్దతుగా దక్షిణాఫ్రికాలో నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐవెర్‌మెక్టిన్‌కు మద్దతుగా దక్షిణాఫ్రికాలో నిరసన

ఆ అధ్యయనాల్లో సమస్యలివీ..

  • ఒకే రోగుల సమాచారాన్ని చాలాసార్లు ఉపయోగించారు. నిజానికి ఇక్కడ వేరే రోగుల సమాచారం సేకరించాలి.
  • అధ్యయనాల కోసం రోగులను రాండమ్‌గా ఎంచుకోలేదు.
  • శాతాలను కూడా సరిగా కట్టలేదు.
  • స్థానిక ఆరోగ్య సంస్థలకు ఈ అధ్యయనాలపై సమాచారం లేదు.

అధ్యయనాలను విశ్లేషించిన బృందంలో డాక్టర్ గీడెన్ మెవెరోవిట్జ్ కార్జ్, డాక్టర్ జేమ్స్ హీథెర్స్, డాక్టర్ నిక్ బ్రౌన్, డాక్టర్ షెల్డ్రిక్‌లు ఉన్నారు. వీరంతా ఫేక్ అధ్యయనాలపై పనిచేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ కూడా వీరు స్వచ్ఛందంగా ఇలాంటి పరిశోధనలు చేపట్టారు.

ఈజిప్టులో నిర్వహించిన ఓ ఐవెర్‌మెక్టిన్ అధ్యయనంలో దోషాలు ఉన్నాయని బయోమెడికల్ విద్యార్థి జాక్ లారెన్స్ గుర్తించడంతో, దీనిపై అధ్యయనానికి శాస్త్రవేత్తలంతా ఒక బృందంగా ఏర్పడ్డారు.

ఈజిప్టులో నిర్వహించిన కొందరు రోగులు ఆ ట్రయల్స్ మొదలవ్వకముందే మరణించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో, ఈ అధ్యయనాన్ని ప్రచురించిన ఆ జర్నల్ తమ కాపీని వెనక్కి తీసుకుంది.

దీంతో కోవిడ్-19పై ఐవెర్‌మెక్టిన్ పనిచేస్తుందని చెప్పే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్(ఆర్‌సీటీ)ని తాజా శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. ఆర్‌సీటీలో పాల్గొనేవారిలో కొందరికి ఔషధం ఇస్తారు. మరికొందరికి ప్లాసెబో అంటే డమ్మీ ఔషధం ఇస్తారు. అనంతరం ఫలితాలను విశ్లేషిస్తారు.

ఐవెర్‌మెక్టిన్

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువ ప్రజాదరణ పొందిన ఆరు పరిశీలన అధ్యయనాలపై (అబ్జర్వేషనల్ స్టడీస్) శాస్త్రవేత్తల బృందం ప్రధానంగా దృష్టిసారించింది.

మొత్తంగా సమీక్షించిన 26 అధ్యయనాల్లో ఐదింటిలో డేటాలో దోషాలున్నట్లు బయటపడింది. అంటే వీటిలో నమ్మశక్యంకాని విధంగా డేటా ఉంది. కొందరు రోగుల డేటాను ఒకచోట నుంచి కాపీచేసి మరోచోట పేస్ట్ చేసినట్లు కనిపిస్తోంది.

మరో ఐదు అధ్యయనాల్లో ఇంకా తీవ్రమైన దోషాలు కనిపించాయి. ఇందులో నంబర్లను సరిగా కూడలేదు. కొన్నిచోట్ల శాతాలను తప్పుగా లెక్కగట్టారు. అసలు ఈ అధ్యయనాలు చేపట్టినట్లు స్థానిక ఆరోగ్య సంస్థలకు సమాచారం కూడా ఇవ్వలేదు.

మరికొన్ని అధ్యయనాల్లో 14 మంది అధ్యయనకర్తలు కొంత సమాచారాన్ని దాచిపెట్టారు. దీన్ని మోసంగానే పరిగణించాలి.

ivermectin

ఫొటో సోర్స్, SOPA Images/gettyimages

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కొన్ని ప్రముఖ అధ్యయనాలను కూడా తాజాగా శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ అధ్యయనాల్లో చాలావరకు ఐవెర్‌మెక్టిన్ శక్తిమంతంగా పనిచేస్తుందని చెప్పినవే. మరికొన్ని అయితే, ఇన్ఫెక్షన్లను ఈ ఔషధం అడ్డుకోగలదని, మరికొన్ని అయితే ప్రాణాలను ఇది కాపాడగలదని వివరించాయి. అయితే, వీటిలో దోషాలు ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు.

ఈ అధ్యయనాల్లో దోషాలులేవని చెప్పడం చాలా కష్టమని సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్‌లోని పరిశోధకుడైన డాక్టర్ షెల్డ్రిక్ వివరించారు. కొన్ని అధ్యయనాలను కావాలనే మార్చి ప్రచురించారని ఆయన అన్నారు.

లెబనాన్‌లో చేపట్టిన ఒక అధ్యయనంలో 11 మంది రోగుల సమాచారం పదేపదే కాపీ, పెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులుగా చెబుతున్నవారిలో చాలా మంది డేటా తప్పని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు.

‘‘ఈ అధ్యయనంలోని డేటాలో చాలా తప్పులు ఉన్నాయి. వీటిని కావాలనే తప్పుగా మార్చి ఉండొచ్చు. లేదా అనుకోకుండా అయినా జరగొచ్చు’’అని అధ్యయనాలను సమీక్షించిన శాస్త్రవేత్తలు బీబీసీతో చెప్పారు.

ఐవెర్‌మెక్టిన్ కోసం ఫేస్‌బుక్‌లో పోస్టులు
ఫొటో క్యాప్షన్, ఐవెర్‌మెక్టిన్ కోసం ఫేస్‌బుక్‌లో పోస్టులు

ప్రజలు కోవిడ్-19తో మరణించకుండా ఐవెర్‌మెక్టిన్ అడ్డుకోగలదని చెబుతున్న ఓ ఇరాన్ అధ్యయనాన్ని కూడా తాజాగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇందులోనూ దోషాలున్నట్లు గుర్తించారు.

‘‘రోగుల రక్తంలో ఐరన్ స్థాయిలు ఏ శాతంలో ఉన్నాయో చెబుతూ ఈ అధ్యయనంలో కొన్ని గణాంకాలు ఉన్నాయి. ఇవి నిజంగా ఇలా నమోదయ్యే అవకాశం దాదాపుగా ఉండదు’’అని డాక్టర్ షెల్డ్రిక్ వివరించారు.

అయితే, ఈ అధ్యయనం చేపట్టిన డాక్టర్ మోర్టేజా నియీ దీన్ని వెనకేసుకొచ్చారు. శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలతో తాను విభేదిస్తున్నానని వివరించారు.

అయితే, ఐవెర్‌మెక్టిన్‌పై చేపట్టిన ట్రయల్స్‌ను సమీక్షిస్తూ ప్రచురించిన పరిశోధన పత్రం ‘‘కొక్రేన్’’లో లెబనాన్, ఇరాన్ ట్రయల్స్‌ను ఉటంకించలేదు. ఈ రెండు ట్రయల్స్‌లో చాలా దోషాలున్నాయని, అందుకే వీటిని పరిగణలోకి తీసుకోలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మొత్తంగా కోవిడ్ రోగులు ఐవెర్‌మెక్టిన్ తీసుకుంటే ఎలాంటి ప్రత్యేక ప్రయోజనమూ ఉండదని తాజాగా పరిశోధకుల సమీక్షలో తేలింది.

ఐవెర్‌మెక్టిన్‌పై అతిపెద్ద అధ్యయనాన్ని కెనడాలోని మెక్‌మాక్టర్ యూనివర్సిటీ చేపట్టింది. ఇందులోనూ కోవిడ్-19 రోగులకు ఐవెర్‌మెక్టిన్ మేలు చేస్తుందని వెల్లడికాలేదు.

ఐవెర్‌మెక్టిన్ కోసం ఫేస్‌బుక్‌లో పోస్టులు

సురక్షితమైన ఔషధమే..

ఐవెర్‌మెక్టిన్‌ను సురక్షితమైన ఔషధంగానే వైద్యులు పరిగణిస్తారు. అయితే కొన్నిసార్లు స్పల్ప దుష్ప్రభావాలు కూడా కనిపిస్తుంటాయి.

వాంతులు, డయేరియా, గందరగోళం, తల తిరగడం లాంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తుంటాయి.

అయితే, తప్పుడు భరోసాలతో ఈ ఔషధాన్ని ఇస్తే తీవ్రమైన పరిణామాలు తలెత్తే ముప్పుంది. ముఖ్యంగా ఆసుపత్రిలో చేరే బదులు ఈ ఔషధం వేసుకుంటే చాలు.. లాంటి వార్తలు ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడతాయి.

‘‘ఒక దశలో హాస్పిటల్‌లో చేరిన ప్రతి 15 మందిలో 14 మంది ఐవెర్‌మెక్టిన్ తీసుకున్నవారు ఉన్నారు. అయితే, వారు ఆసుపత్రికి వచ్చేసరికి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు’’అని పెరూకి చెందిన ప్రజారోగ్య నిపుణురాలు ప్యాట్రీషియా గెర్సియా అన్నారు.

ఫేస్‌బుక్‌లోని చాలా గ్రూప్‌లు ఐవెర్‌మెక్టిన్‌ గురించి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. కొన్ని గ్రూపుల్లో అయితే, ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్ప సిద్ధాంతాలతో పోస్టులు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈ ఔషధానికి మద్దతుగా ప్రచారం చేస్తూ.. వ్యాక్సీన్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. మరికొంతమంది డాక్టర్లు కూడా ఈ ఔషధం కోవిడ్-19పై పనిచేస్తుందని చెబుతున్నారు.

ఈ అధ్యయనాలపై సందేహాలు వస్తున్నప్పటికీ తన ధోరణిని మార్చుకోబోనని వైద్యులు పెర్రీ కోరి అనే వైద్యుడు చెప్పారు. మరోవైపు టెస్ లారీ అనే మరో డాక్టర్ బ్రిటిష్ ఐవెర్‌మెక్టిన్ రికమండీషన్ డెవలప్‌మెంట్ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. ఆమె అయితే, కోవిడ్-19 టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయాలని కూడా పిలుపునిచ్చారు.

భారత్, దక్షిణాఫ్రికా, పెరూ, కొన్ని లాటిన్ అమెరికా దేశాలతోపాటు స్లొవేకియాలోనూ కోవిడ్-19 రోగుల్లో కొందరికి ఐవెర్‌మెక్టిన్‌ను సిఫార్సు చేశారు. ప్రస్తుతం భారత్, పెరూలలో ఈ ఔషధాన్ని వైద్యులు సూచించడంలేదు.

ఐవెర్‌మెక్టిన్‌ను తయారుచేస్తున్న సంస్థల్లో ఒకటైన మెర్క్.. కోవిడ్‌పై ఈ ఔషధం పనిచేస్తుందని చెప్పే ఆధారలేమీ దొరకలేదని గత ఫిబ్రవరిలో వెల్లడించింది.

ఈ ఔషధం కోవిడ్ రోగులపై పనిచేస్తుందని చెప్పే ఆధారలేమీ లేవని దక్షిణాఫ్రికాలో వైద్యులు చెబుతుంటే... వైద్యుల అనుమతి లేకుండానే ఈ ఔషధాన్ని తీసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)