ప్రకాశ్ రాజ్ ఇంటర్వ్యూ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు

ప్రకాశ్ రాజ్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రాజుకుంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.

మా ఎన్నికలకు సంబంధించి తమ విధివిధానాలు, హామీలపై ప్రకాశ్ రాజ్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు. ఆ వివరాలు ప్రశ్న-సమాధానాల రూపంలో..

ప్రశ్న: ప్రచారం ఎలా సాగుతోంది? వ్యూహం ఏమిటి? అందరినీ కలవడం పూర్తయిందా?

సమాధానం: అందరినీ కలుస్తున్నాం. లేఖలు రాస్తున్నాం. ఫోన్ చేస్తున్నాం. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి హామీలేంటి? ఎవిరిని నమ్మాలి? అని ఎన్నుకోవాల్సింది ‘మా’ సభ్యులు. గెలుపైనా ఓటమి అయినా వారిదే. సరైనవారిని ఎన్నుకుంటే వారు గెలుస్తారు. వాళ్ల ఇష్టం. మనం ఓటు అడుగుతాం అంతే.

ప్రశ్న: హామీల విషయంలో ‘మా’ భవనం అంశం బాగా చర్చనీయమైంది. సొంత ఖర్చుతో భవనం నిర్మిస్తామని మంచు విష్ణు ప్యానల్ హామీ కూడా ఇచ్చింది. ఆ భవనం మీ దృష్టిలో కూడా ప్రాధాన్యాంశమేనా?

సమాధానం: అసలు భవనం అంటే ఏంటి అనే స్పష్టత కావాలి. అది ఒక బిల్డింగ్ కాదు. రెండు అంతస్తులు కట్టి, ఫీస్, స్టాఫ్, మీటింగు పెట్టుకునే చోటు కాదు. భవనం అనేది మన ఇల్లు అవ్వాలి. కేరాఫ్ అవ్వాలి. కళా భవనంలా, ఒక ఫృథ్వీ థియేటర్‌లా, రవీంద్ర భారతిలా మా థియేటర్స్ ఉండాలి. ప్రొజెక్షన్ థియేటర్స్ ఉండాలి. ఆర్టిస్టులకు స్పేస్ ఉండాలి. నాటకాల రిహార్సల్స్ వంటివి జరుపుకొనేలా ఉండాలి. కమ్యూనిటీ హాల్ ఉండాలి. సెల్ఫ్ సస్టెయినబిలిటీ రావాలి.

నెల నెలా సంఘం కొంత సంపాదించగలగాలి. ఇలా ఎన్ని సంవత్సరాలు వాళ్లనీ వీళ్లనీ అడుగుతూ డొనేషన్లపై బతుకుతుంది ఈ సంఘం?

అలాకాదు కదా! ఏ వ్యవస్థ అయినా తన కాళ్లపై నిలబడగలగాలి. ఒక లైబ్రరీ కావాలి. ఆ భవనం మన వైభవం కావాలి. ఇది చాలా పెద్ద కల. ఏదో చిన్న సైట్ చూసి రెండు ఫ్లోర్లు కట్టడం కాదు. రూ.30-40 కోట్లు అయ్యే పని.

మేమేదో హామీ ఇస్తాం. పెన్షన్ 10 వేలు చేసేస్తాం అని అంటారు. దానికి పది మంది దగ్గరకు వెళ్లాలి. వచ్చే కొత్త ప్యానల్‌కు అది బరువుగా పెడతామా? సస్టెయినబుల్ రెవెన్యూ జనరేషన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మోడల్ కావాలి. ఆ భవనం మన వైభవం కావాలి.

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, Facebook/PrakashRaj

ప్రశ్న: భవనం కాకుండా మా సభ్యులకు సంక్షేమంపరంగా ఏం చేయాలి అనుకుంటున్నారు?

సమాధానం: ఇప్పటివరకూ చారిటీలా పనిచేస్తున్నాం. అలా ఉండకూడదు. ఎంప్లాయిమెంట్ క్రియేషన్ రావాలి. జాబ్ సెక్యూరిటీ, సెల్ప్ రెస్పెక్ట్ కల్పించాలి. మనం ఒక గొంతు అవ్వాలి. ఆదుకోవాలి. సభ్యులంతా మాకు మా ఉంది అనుకోవాలి. వారి కుటుంబాలు కూడా గర్వించాలి.

చదువులకు స్కాలర్షిప్స్, హెల్త్ కార్డులు ఉండాలి. చావు బతుకులు వచ్చినప్పుడు కాదు, ఆ పరిస్థితికి వెళ్లకముందే ఆదుకునే సంఘం కావాలి.

వయసు అయిన వారు ఒంటిరి అయిపోతున్నారు. ఒంటరితనంతో ఓల్డ్ ఏజ్ హోంలో ఉన్నాం అనుకునే వారికి, నేను నమ్ముకున్న సంఘం నన్ను కౌగలించుకుంది అనే భావన కావాలి. ఒక ఇల్లు ఉంది అనుకోవాలి.

ప్రశ్న: బెంగళూరు లాంటి పెద్ద లోక్‌సభ నియోజకవర్గంలో పది లక్షల పైగా ఓట్లుండే స్థానంలో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ సంఖ్యా పరంగా చాలా తక్కువ ఉన్న ‘మా’ అనే సంఘం వైపు ఎందుకు వచ్చారు?

సమాధానం: ఇక్కడ సంఖ్య, విస్తృతి కాదు. సమస్యల పరిష్కారం ముఖ్యం. ఎక్కడ సమస్యలు ఉన్నాయో, అక్కడ వాటి పరిష్కారం కోసం పనిచేయాలి. ఎంపీ అవుతామా? మా అధ్యక్షుడు అవుతామా? అని కాదు. నిరంతరంగా ప్రశ్నించాలి. విశ్లేషించాలి.

దానిలో అవగాహన ఉన్న వ్యక్తి చిన్నా లేదా పెద్ద సంస్థలో ఉన్నా దానికి స్పందించడం ముఖ్యం.

ప్రకాశ్ రాజ్

ప్రశ్న: మా ఎన్నికల్లో రాజకీయాల పాత్ర రాను రాను బహిర్గతం అవుతూ ఉంది. మీ ప్యానల్‌కి ఏదైనా రాజకీయ పార్టీ అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉందని మీరు అనుకుంటున్నారా?

సమాధానం: రాజకీయ నాయకులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వారికి వేరే పనేమీ లేదా? వారు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలాలి. అయితే, అవతలి ప్యానల్ వారు, మిగతా వారు దీన్ని తీసుకువస్తున్నారు. క్లియర్‌గా బీజేపీ వంటి పార్టీలకు నాపై వ్యక్తిగతంగా సమస్య ఉంది. దీంతో ఇక్కడ కూడా వీడు గెలవకూడదు అనుకుంటున్నారు. పోటీలో, ఎన్నికల్లో వాళ్ల గెలుపు కోసం కాకుండా, మమ్మల్ని ఓడించడానికి చూస్తున్నారు. అది వేరే ఎజెండా. మెంబర్స్‌కి అది అర్థం అవుతుంది. ఇది మా మీద ప్రేమ కాదు. ఒక వ్యక్తి మీద ఉన్న కసి.

ప్రశ్న: మీకు టిఆర్ఎస్‌తో పరిచయం ఉంది, తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో కలవగలిగే యాక్సెస్ ఉంది. కానీ, మిగతా ప్రభుత్వాల దగ్గర?

సమాధానం: ఎవరైనా సరైన అంశాన్ని పట్టుకుని వెళ్లవచ్చు. వాళ్లేమీ కక్ష సాధించరు కదా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వీరంతా చుట్టూ ఉన్నవారికి చేయరా? సమస్యను ఎవరు తీసుకెళ్లినా వారు స్పందిస్తారు. ఆదుకునే ప్రభుత్వం ఎవరున్నా స్పందిస్తారు. జగన్, పినరయ్ విజయన్, కేసీఆర్, కేజ్రీవాల్.. వారు నాకు తెలుసు. కానీ ఆ చనువుతో కాదు, సమస్యల ద్వారా వెళ్లాలి. మనం సమస్యల పరిష్కారం కోసం వెళ్తే ఎవరు కాదంటారు? నేను వెళ్లినా, విష్ణు వెళ్లినా ఎవరూ కాదనరు.

ప్రకాశ్ రాజ్, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, facebook/prakashraj

ప్రశ్న: మీరు చెప్పింది ఆదర్శ విధానమే. కానీ ఇక్కడ వ్యక్తిగత పరిచయం కూడా ముఖ్యమనే అంశం తెరమీదకు వచ్చింది. ఫలానా ప్యానల్ వారికి ఫలానా నాయకులు తెలుసు అనే వాదన ఉంది.

సమాధానం: అది అనవసరం. వారు (ప్రత్యర్థి ప్యానల్) దాన్ని వాడుకుంటున్నారు. నాకు వారు తెలుసు, వీరు తెలుసు అని మోసం చేస్తున్నారు సభ్యులను. పోటీదారులు ఎవరున్నారు? సమస్య పరిస్కరించే దిశగా వారు ఏం ఆలోచించారు? సమస్యలను ఎలా విశ్లేషిస్తున్నారు? ఎలాంటి పరిష్కారం చూపించారు అని మాట్లాడాలి.

ముందు సభ్యులను ఎన్నుకోనివ్వండి. అప్పడు సమస్యల గురించి రిప్రజెంట్ చేయవచ్చు. ఎవరు వద్దన్నారు. వారు (రాజకీయ పెద్దలు) నాకు తెలుసు. ఫ్రెండ్సే. కానీ నేను చెప్పుకోను. అర్హత, స్థాయి, చెప్పే పాపులారిటీ ఉంటే వింటారు. చిన్న వాళ్లు వెళ్తే అవగాహన ఉందా అని చూస్తారు.

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, facebook/PrakashRaj

ప్రశ్న: ఆన్‌లైన్ టికెట్ల గొడవ నడుస్తోంది. రెండు ప్రభుత్వాల వద్దా సినీ పరిశ్రమకు చాలా డిమాండ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయం కాస్త ఘర్షణాత్మకంగా మారింది. ఇంతకీ దీనిపై మీ ప్యానల్ విధానం ఏమిటి?

సమాధానం: మాకు చాలా స్పష్టమైన విధానం ఉంది. ప్లీజ్ లెటజ్ డూ అవర్ ఫ్రీట్రేడ్ (మా వ్యాపారం మమ్మల్ని చేసుకోనివ్వండి). మీరు ఎన్ని టికెట్లు వెళ్తున్నాయో మోనిటర్ చేయండి. కలెక్షన్లు కంప్యూటరైజ్డ్ చేయండి. టాక్స్ మీకు రానివ్వండి. కానీ ఇది ఓపెన్ బిజినెస్‌లా చేయనివ్వాలి. లేకపోతే ఆ బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. ఇది డిమాండ్ అండ్ సప్లై కదా. కొంచెం కన్సిడర్ చేయండి. ఇది చిన్న పరిశ్రమ. అలాంటి నిర్ణయాలను తట్టుకోలేదు.

ప్రశ్న: ‘మా’ చేసే సేవా కార్యక్రమాలు కోసం పెద్దల దగ్గరకు వెళుతుంటారు. వారి ఉదారత మీద నడస్తుందీ సంఘం. దాని వల్ల సంఘం కొందరు వ్యక్తులపై ఆధారపడుతున్నట్టయింది కదా?

సమాధానం: తప్పు కదా! దాని వల్లే ఇలా ఉన్నాం. కొందరిపై ఆధారపడితే వారు ఎలా చెప్తారో అలాగే నడపాలి. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఆత్మగౌరవం అంటే అదే కదా. సంఘం ఎవరిపై ఆధారపడకుండా తను తన కాళ్లపై నిలబడేలా ఉండి తన మనుషులను ఆదుకోవాలి. కానీ ఒకరిపై ఆధారపడితే ఆ మనిషిలో సర్వాధికారం వచ్చేస్తుంది.

నేనింత చేస్తే నా మాట వినరా అనే భావన వస్తుంది. దీనివల్ల ప్రజాస్వామ్యం ఓడిపోతుంది. అది మంచి మోడల్ కాదు. అందుకే మేం ఈ ఎన్నికల కోసం (పెద్దలు) ఎవర్నీ వాడుకోవడం లేదు. మేం ఏం చెప్తున్నాం, ఏం చేయబోతున్నాం, పరిష్కారాలు ఏమున్నాయనేది పెట్టి మా సత్తా మీద గెలుస్తున్నాం. యు హావ్ టు విన్ ఫర్ వాట్ యు ఆర్. (మీ సామర్థ్యంతోనే మీరు గెలవాలి.)

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, facebook/PrakashRa

ప్రశ్న: కానీ పరిశ్రమలో అనివార్యంగా పెద్దల జోక్యం ఉంటుంది. దానికి ఆశీర్వాదం అనో లేదా మరో పేరు పెట్టినా, ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణీ అవుతున్నవారితో సంబంధాలు ప్రధానమవుతున్నాయి కదా..

సమాధానం: వేర్వేరు మాటలతో అదే చెప్తున్నారు. ఇద్దరు నుంచుంటే వారి మధ్య పోటీనా లేక వారి వెనుక ఉన్న పెద్దల మధ్య పోటీనా అనేది ముఖ్యమైనది. ఎన్నికలు అనేవి అలా కాకూడదు.

ప్రశ్న: తెలుగు పరిశ్రమలో పెద్ద నటులుగా చెబుతున్న వారిలో మీకు స్పష్టంగా మద్దతు ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా?

సమాధానం: పెద్దయినా, చిన్నయినా, ఎన్నికల వరకూ అందరూ సభ్యులే. ఇక ప్రభావం చూపగలిగే వారుంటారు. దర్శకులు, నిర్మాతలు.. ఇలా చాలా మంది ఉంటారు. దాదాపు 40 ఏళ్ల సినీ జీవితం మోహన్ బాబు గారిది. ఆయన సన్నిహితులు ప్రభావితం చేస్తారు. నాది 25 ఏళ్ల ప్రయాణం. నాకు కొత్త తరం మద్దతు ఉండొచ్చు. ఇవన్నీ ఎన్నికల్లో జరుగుతుంటాయి. ఎవరి బలాబలాలు వారికుంటాయి.

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, Instagram/Prakahraj

ప్రశ్న: చిరంజీవి కోటరీ – కుటుంబ మద్దతు మీకుందని చెబుతారా?

సమాధానం: ఎన్నికల్లో అందరి మద్దతూ అడగాలి. ఒకరి మద్దతే పెట్టుకుంటే ఎలా? అసలు ఆయన్ను (చిరంజీవిని) ఎందుకు లాగుతారు. నేను మొదట్నుంచీ కాదు కాదు అంటున్నాను. కానీ కొత్త విషయం నమ్మడానికి రెడీగా లేకపోతే ఎలా? నాగబాబు వచ్చారు, మద్దతు తెలిపారు.

ఓకే... చిరంజీవి, బాలకృష్ణ మద్దతు చెప్తే నాకేంటి? అలా అయితే మరి కృష్ణ, మహేశ్ బాబు మొత్తం కుటుంబం మంచు ప్యానల్‌కి మద్దతు అంటారా? ఒకవేళ ఎవరి వైపూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ద్వేషిస్తున్నట్టా? (ప్రత్యర్థి పానెల్ ను ఉద్దేశించి) అసలు వారినెందుకు ఇబ్బంది పెట్టి ఇందులోకి లాగుతున్నారు?

కృష్ణగారితో ఫోటో తీసుకుని ఏం చెప్పదలచుకున్నారు సభ్యులకి? మొత్తం కృష్ణ గారి కుటుంబం నాకు మద్దతు అని చెప్తారా? అలా కాదు కదా.

ఓటు గోప్యమైనది. ఫోటోలు ట్విట్టర్లో పెట్టుకుని షో ఆఫ్ ఏంటి? ఏ కారణంతో సెల్ఫీ తీసుకున్నారో తెలియదు. వారినెందుకు ఇబ్బంది పెడ్తున్నారు.. నేను వారిని ద్వేషించాలా? వారు లోపలికి వెళ్లి ఎవరికి ఓటేస్తారో తెలుస్తుందా?

ప్రశ్న: పవన్ కల్యాణ్ గురించి మీరు మీడియాలో వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొందరు నటులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. వాళ్లకు గవర్నమెంటుతో యాక్సెస్ ఉన్నప్పుడు వారెందుకు వెళ్లి సమస్యను పరిష్కరించరు అని ప్రశ్నించారు పవన్. మీరు కూడా పవన్ కల్యాణ్‌కి మద్దతుగా చాలా కఠినంగా మాట్లాడారు.

సమాధానం: వారి పొలిటికల్ ఎంజెడాలు వేరే. వారు కొట్టుకోవడం తిట్టకోవడం ఉంటాయి. పవన్ ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే బహుశా ఆయన్నెవరో లాగి ఉంటారు. అవి మాకు సంబంధం లేదు.

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌కీ నాకూ ఏం సంబంధం? నేనక్కడ స్థానికుడిని కాదు. అక్కడకు ట్రావెల్ చేయలేదు. అక్కడ జగన్, చంద్రబాబు, పవన్, బీజేపీ ఉన్నారు. వారు కొట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా జగన్ ఈజ్ ద సీఎం. జడ్పీటీసీల్లో 90 శాతం గెలిచారు. ప్రజలెన్నుకున్నారు. మీరేం చేయలేరు. వచ్చే ఎన్నికలకు ఆలోచించాలి.

ఈ మధ్యలో ప్రతిపక్షాలు మాట్లాడతాయి. ఇక మా ఎన్నికల సంగతికి వస్తే… ఎన్నికల్లో ఉన్నప్పుడు నేను మా ఎన్నికలు, సినిమా గురించి ఆలోచించాలి. అంతేకానీ వారు ఎందుకు మాట్లాడారు అని విశ్లేషించాల్సిన అవసరం నాకు లేదు. ద్వేషించాల్సిన అవసరం లేదు.

పవన్ కల్యాణ్ ఏ పొలిటికల్ పార్టీకెళ్లినా, ఎవర్ని ఎదిరించినా సినిమా వరకూ వచ్చేసరికి ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ముఖ్యమైన ఆస్తి. ఆయనెంత తీసుకుంటారని, ఎంత పెద్ద సినిమా ఇస్తారని కాదు. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్లందరూ పరిశ్రమ సొత్తు.

వీళ్ల వల్ల ఎంతో మంది కార్మికులు బతుకుతున్నారు. కాంటీన్, పార్కింగ్, పోస్టర్ ఇలా ఎందరో బతుకుతున్నారు. నేను ఆ గౌరవంతో ఆయన్ను చూస్తాను.

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, Insta/PrakashRaj

ప్రశ్న: మీరే అన్నారు చిన్నా పెద్దా నటులు ఉండరని.. మరి పవన్‌ను విష్ణును ఎందుకు పోల్చారు?

సమాధానం: నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అనవసరంగా ఎక్కడో కూర్చున్న వాడిని, నన్నెందుకు లాగుతున్నారు. పవన్ పక్కన ఉన్నావా? ఇండస్ట్రీ పక్కన ఉన్నవా? అన్నారు.. అంటే పవన్‌ను పక్కన పెట్టేశారా?

నేను పవన్ తరపున నాలుగు మాటలు మాట్లాడితే నన్ను పక్కన పెట్టేసి, మొత్తం ఇండస్ట్రీకి ప్రకాశ్ రాజ్ వ్యతిరేకం అని నా మీద బురద జల్లడానికి కదా? నన్ను లాగావు సరే. కానీ పవన్ కళ్యాణ్‌ని లాగేముందు, ఆయన స్థాయి ఏంటి? ఊరికే మనుషులు తెలుసనీ, ఎన్నికలు ఉన్నాయనీ, వేడివేడిగా ఉందనీ ఎవర్ని పడితే వారిని, కేసీఆర్నీ, జగన్నీ, పవన్‌లను లాగేస్తారా? వారి వ్యక్తిగత బలాబలాలు ఏంటి? వారిని కొంచెం గౌరవించాలి కదా.

‘నీకు తెలుసా పవన్ ఎంత? ఆయన మార్నింగ్ షో కలెక్షన్ నీ బడ్జెట్ కాదు. అది ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు. అతను అంత పెద్ద వాడు’ అన్నాను. ఒక వేదిక దొరికిందని, ఏదో ఎజెండాతో ఠక్కున లాగేయకండి. నీకు ఆయనతో పొలిటికల్ విభేదాలు ఉన్నాయా? నాకు ఉన్నాయి.

పొలిటికల్ విభేధాలు నాకు పవన్‌తో ఉన్నాయి. కానీ పవన్ ఎంత గొప్ప మనిషి అంటే, నాకు ప్రకాశ్‌కీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ సినిమాకు వచ్చేసరికి ఆయన నందా నేను బద్రి అంతే అన్నారు. కలిసి వకీల్ సాబ్ చేశాం.

నాకు నచ్చే మనిషి పవన్ కల్యాణ్. కానీ ఆయన వేసుకున్న షర్ట్ నచ్చకపోతే నేను చెప్పాలి కదా. అది ఆయన మీద ప్రేమతోనే చెప్తున్నా. మీరు కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలి. కొంచెం మెచ్యూరిటీ కావాలి. ఊరికే కళ్లల్లో, మొహంలో ఆ అహంకారం ఉండకూడదు. ఒక స్థాయిలో ఉన్నాం. పది మంది చూస్తున్నారు. ఇచ్చిపుచ్చుకోవాలి. గివె అండ్ టేక్ రెస్పెక్ట్.

ప్రశ్న: ఇండస్ట్రీలో పెద్దరికం అనే సబ్జెక్ట్ ఉంది. అసలు పెద్దరికం అవసరం ఉందని మీరు నమ్ముతున్నారా?

సమాధానం: గౌరవం ఉండాలి. ఏలడానికి కాదు. పెద్దరికం భయపెట్టకూడదు. పెద్దరికం గౌరవించాలి. (ఒక పెద్ద వ్యక్తిని చూస్తే) పెద్ద చెట్టు, 50 ఏళ్ల నుంచీ ఉన్న చెట్టు. ఎన్నేళ్లు బతికిన చెట్టు. ఎన్నో పక్షులకు ఆహారం,నీడ ఇచ్చిన చెట్టు. ఎన్ని వసంతాలు, ఎన్ని వానాకాలాలు చూసిన చెట్టు. దాని కిందకు వెళితే ఆప్యాయత ఉంటుంది అనేలా ఉండాలి పెద్దరికం. పెద్దరికం అంటే తమకు గౌరవం ఇవ్వమంటున్నారా? లేక సమస్య ఉంటే ఆదుకుంటారన్న నమ్మకంతో వెళ్లాలా? లేక భయపడాలా? మనం పెద్దరికం గురించి మాట్లాడేప్పుడు, వాళ్ల ప్రభావం గురించి మాట్లాడేప్పుడు చాలా చిన్న తేడా ఉంటుంది.

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, Facebook/PrakashRaj

ప్రశ్న: ప్రస్తుతం పరిశ్రమలో ఎవరికైనా పెద్దరికం ఉందని కానీ, గతంలో ఉండేదని కానీ, భవిష్యత్తులో వస్తుందని కానీ మీరు నమ్ముతున్నారా?

సమాధానం: ఇప్పడు అవసరం లేదు. పాతది తవ్వాల్సిన పనిలేదు. మనం భవిష్యత్తు గురించి చూద్దాం. ఇది భవిష్యత్తును చూడ్డానికి ఉండే ప్యానల్. అన్ని వర్గాల, అన్ని రకాల, అన్ని నేపథ్యాల ఆర్టిస్టులతో నిండిన ప్యానెల్ మాది. మీరు మమ్మల్ని ఎన్నుకుంటే ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది.

ప్రశ్న: గత ప్యానల్‌లో మీకు అసలు నచ్చని విషయం..

సమాధానం: ఒక సభ్యుడిగా చెబుతున్నా. వీరు సంఘాన్ని మసకబారించారు. కొట్లాడుకున్నారు. ఏదో క్రికెట్ మ్యాచ్ లానో, టెన్నిస్ మ్యాచ్ లానో చేశారు. గవర్నెన్స్ లేదు. అది నాకు నచ్చలేదు.

ప్రశ్న: మీరు ఎన్నికైతే రాజకీయాలకతీతంగా, మా అధ్యక్షుడిగా అన్ని పార్టీలు, గవర్నమెంట్ల దగ్గర మీకు యాక్సెస్ ఉంటుందని నమ్ముతున్నారా?

సమాధానం: మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అందరమూ ప్రజలమే కదా. ఊరికే ఫ్రెండ్షిప్ కోసం కాదు కదా ఈ పోస్టు. అసోసియేషన్ బాగోగుల కోసం అండగా నించోవడం అవసరం అయితే వెళదాం. అనవసరంగా ఎందుకు వెళతాం? ముందు మనం ఉండి, వెళ్లి మనకు ఏం కావాలో అడుగుతాం. నాటక కళాకారుల కోసం అడుగుతాం. రిక్వెస్ట్‌తో వెళితే తప్పక చేస్తారు.

ప్రశ్న: మీపై గతంలో తీసుకున్న క్రమశిక్షణా చర్యల ప్రస్తావన వచ్చింది. అధ్యక్ష స్థానంలో అలాంటి వారు ఉంటారా అంటున్నారు. గర్విష్టి అన్నారు..

సమాధానం: విధేయత అంటే చెప్పింది వినడమా? నా లాంటి బిజీ ఆర్టిస్టుకు ఘర్షణలు ఉంటాయి. ప్రతీ ఎదిగిన మనిషీ అవతలి వాడు తనలానే ఉండాలని కోరుకుంటారు. మనం అలా ఉండలేం కదా. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. సక్సెస్‌లో ఉన్నప్పుడు నాకు ఉన్న కోపం వల్ల, నేను పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ఘర్షణలు జరిగి ఉండొచ్చు. అవన్నీ కూర్చుని మాటలాడుకుని పరిష్కారించుకున్నాం. అయిపోయింది. కానీ అయిపోయిన వాటిని, ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతున్నప్పడు, సరిగ్గా ఎన్నికల సమయంలో మళ్లీ ఆ టాపిక్ తెస్తున్నారంటే మీ ఎజెండా వేరు. ప్రీస్ట్‌కి ఒక పాస్ట్ ఉంటుంది. థీఫ్‌కి ఒక ఫ్యూచర్ ఉంటుంది. (ఆధ్యాత్మికవేత్తకూ ఒక గతం ఉంటుంది. దొంగకూ ఒక భవిష్యత్తు ఉంటుంది.) ప్రతీ మనిషీ మారతాడు. పరిపక్వం అవుతారు. మెచ్యూర్ అవుతారు. ఆయా కాలఘట్టాల్లో మనిషి చేసినదానికి, ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఉరి వేస్తారా? అప్పుడే ఉరి తీసి ఉండొచ్చు కదా. కానీ తీయలేదుగా. అంటే అప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిందిగా.. నేను ఒకప్పుడు ఆరోపణ ఎదుర్కొన్న వాణ్ని కావచ్చు. కానీ నేరస్థుణ్ని కాదు.

ప్రశ్న: ప్రకాశ్ రాజ్ ది ఆత్మగౌరవమా? విధేయతా? అభిజాత్యమా?

సమాధానం: నన్ను ఇంకొకడు గౌరవించేదాక ఎదురు చూడను. నన్ను నేను చాలా గౌరవించుకుంటాను. అది అహంకారంలా కనిపిస్తుంది. కానీ అది నన్ను నేను గౌరవించుకోవడం.

నన్ను బయటి వాడు, తెలుగు రాని వాడు, గర్విష్టి, వద్దు అనుకునే వారికి, పంపేయాలని అనుకునేవారికి ఇది చెబుతున్నాను. నన్ను తరమకండి, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతాను. రాళ్లతో కొట్టకండి, ఇల్లు కట్టుకుంటాను. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకండి, ఇంటికి దీపం చేసుకుంటాను. నన్ను చంపాలని విషం పెట్టకండి, మింగేస్తా గరళకంఠుణ్ని అయిపోతాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)