హవాలా అంటే ఏంటి? ఈ నెట్‌వర్క్‌ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?

హవాలా నెట్‌వర్క్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేనియేల్ గోంజాల్వేజ్
    • హోదా, బీబీసీ ముండో

డబ్బును ఒకచోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లకుండా ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా? బ్యాంకులు.. కరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌ల గురించి ఆలోచించొద్దు.

ఎక్కువ రుసుములు వసూలు చేయకుండా శతాబ్దాల తరబడి కొనసాగుతున్న ఒక విధానం ఉంది. ఇక్కడ డబ్బు ఇచ్చేవారు, తీసుకునేవారితోపాటు మరో ఇద్దరు మధ్యవర్తులు ఉంటేచాలు.

దీన్నే హవాలా అని పిలుస్తుంటారు. దీనికి శతాబ్దాలనాటి చరిత్ర ఉంది. సంప్రదాయ బ్యాంకులు పుట్టకముందు నుంచే ఈ విధానం మనుగడలో ఉంది. సులువుగా డబ్బులు చేతులు మారే విధానాలే దీనికి కారణం. దీంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.

అసలు ఎవరు తీసుకుంటున్నారో.. ఎవరు ఇస్తున్నారో.. తెలుసుకోకుండానే కోట్ల రూపాయలు హవాలా మార్గంలో బదిలీ చేయొచ్చు. సాధారణంగా మధ్యవర్తులు ఎలాంటి రికార్డుల్లోనూ లావాదేవీలు నమోదు చేయరు.

అసలు ఈ డబ్బును ఎవరు పంపారో? ఎవరికి పంపారో తెలుసుకోవడంలో ఇదే అతిపెద్ద సమస్య. కొన్నిసార్లు ఈ డబ్బును అక్రమ నగదు లావాదేవీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు, ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహానికీ వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తుంటాయి.

‘‘హవాలాతో నేరుగా నేరాలకు సంబంధం ఉండకపోయినప్పటికీ.. దీన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకొనే అవకాశం చాలా ఎక్కువ’’అని మ్యాడ్రిడ్‌లోని యూనివర్సిడాడ్ పొంటిఫియా డి కొమిలాస్‌లోని ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ అల్బెర్టో ప్రీగో మరీనో చెప్పారు.

పర్షియన్ గల్ఫ్‌తోపాటు హార్న్ ఆఫ్ ఆఫ్రికా, దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఈ హవాలా ద్వారా ఇప్పటికీ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంటుంది.

హవాలా నెట్‌వర్క్

ఫొటో సోర్స్, Getty Images

డబ్బులు ఎలా చేతులు మారుతాయి?

బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా ప్రజలు ఈ అనధికార, సంప్రదాయ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలోని మధ్యవర్తులను ‘‘హవాలాదార్‌’’లని పిలుస్తారు. వీరిపై ఉండే నమ్మకంపై ఆధారపడి ఈ మొత్తం వ్యవస్థ నడుస్తుంది.

ఉదాహరణకు న్యూయార్క్‌లోని వ్యక్తికి పాకిస్తాన్ నుంచి డబ్బులు పంపాలంటే.. ఎలాంటి బ్యాంక్ ఖాతా అవసరం లేకుండానే ఈ విధానంలో డబ్బులు పంపొచ్చు.

దీని కోసం మొదట మనం పాకిస్తాన్‌లో స్థానిక హవాలాదార్‌ను కలవాలి. అతడికి మనం డబ్బులు ఇవ్వడంతోపాటు ఒక పాస్‌వర్డ్‌ను చెప్పాలి. ఈ పాస్‌వర్డ్ డబ్బులు తీసుకునే వ్యక్తికి, డబ్బులు ఇచ్చే వ్యక్తికి మాత్రమే తెలిసేలా ఉంటుంది.

ఒకసారి మనం స్థానిక హవాలాదార్‌కు పాస్‌వర్డ్ చెప్పిన తర్వాత, అతడు న్యూయార్క్‌లోని రెండో హవాలాదార్‌కు ఫోన్‌చేసి ఆ పాస్‌వర్డ్ చెబుతాడు. ఇప్పుడు ఆ డబ్బును తీసుకోవాలని అనుకునేవారు అదే పాస్‌వర్డ్‌ను రెండో హవాలాదార్‌కు చెప్పాలి.

డబ్బులు తీసుకునే వ్యక్తి చెబుతున్న పాస్‌వర్డ్ సరైనదో కాదో రెండో హవాలాదార్ పక్కాగా చూసుకుంటాడు. అన్నీ సవ్యంగా ఉంటే, గంటల్లోనే రెండో వ్యక్తి చేతిలోకి డబ్బులు వెళ్లిపోతాయి.

డబ్బులు చేతులు మార్చినందుకు ఇద్దరు హవాలాదార్‌లు స్పల్ప మొత్తంలో కమీషన్ తీసుకుంటారు.

హవాలా నెట్‌వర్క్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా మొదలైంది..

ఈ హవాలా లావాదేవీలు ఎలా మొదలయ్యాయో స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే, 8వ శతాబ్దంలో భారత్‌లోని సిల్క్ రోడ్ గుండా వెళ్లేవారు ఈ విధానాన్ని ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది.

ఆసియాలోని తూర్పు ప్రాంతాలను ఆగ్నేయాసియా, ఆఫ్రికా, ఐరోపాలతో అనుసంధానిస్తూ సిల్క్ మార్గం విస్తరించి ఉండేది.

ఈ మార్గంలో వెళ్లే వ్యాపారులపై తరచూ దోపిడీలు జరుగుతుండేవి. దీంతో దొంగలు, బందిపోట్ల నుంచి తమను తాము రక్షించుకునేందుకు, భారత, అరబ్, ముస్లిం వ్యాపారులు హవాలా మార్గాన్ని ఆశ్రయించేవారు.

హవాలా అనే పదానికి ‘‘మార్పిడి’’, ‘‘బదిలీ’’ అనే అర్ధాలున్నాయి.

హవాలాలో ఉపయోగించే పాస్‌వర్డ్ కొన్నిసార్లు వస్తువు రూపంలో ఉంటుంది. మరికొన్నిసార్లు ఏదైనా సంకేతం లేదా పదం రూపంలో ఉంటుంది. రెండో వ్యక్తి సరిగ్గా అదే వస్తువును చూపించాలి. లేదా అదే పదాన్ని చెప్పాలి.

ఈ పాస్‌వర్డ్ ద్వారా తగిన వ్యక్తికే డబ్బులు ఇచ్చామని హవాలాదార్‌లు ధ్రువీకరించుకుంటారు.

కలకత్తాలో 18వ శతాబ్దంలో భారతదేశంలో ఏర్పాటైన తొలి బ్యాంక్ ‘‘బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్’’కంటే ఇది చాలా పూరాతనమైన విధానం.

నేడు టెక్నాలజీ పెరగడంతో.. ఈ కోడ్‌లు, పాస్‌వర్డ్‌లను వెంటవెంటనే వాట్సాప్ మెసేజ్‌లలోనూ పంపేస్తున్నారు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, హవాలాదారులు బ్యాంకర్లు కావాల్సిన పనిలేదు. వారు ఇతర వ్యాపారాలు చేసుకుంటూనే, ఈ పని కూడా కొనసాగిస్తుంటారు. ఉదాహరణకు న్యూయార్క్ లేదా దుబాయ్ లేదా ప్యారిస్‌ వీధుల్లో కొందరు కిరాణా దుకాణం, మరికొందరు ట్రావెల్ ఏజెన్సీ లాంటివి నడుపుతూనే హవాలాను కూడా కొనసాగిస్తుంటారు.

హవాలా నెట్‌వర్క్

అంత గోప్యత ఎందుకు?

‘‘ఎందుకంటే చాలాసార్లు చట్ట వ్యతిరేకమైన లేదా పన్ను చెల్లించని నగదును ఇలా తరలించేందుకు ప్రయత్నిస్తుంటారు’’అని మరీనో చెప్పారు.

‘‘చాలాసార్లు పన్నుల నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి విధానాలను అనుసరిస్తుంటారు. కొన్నిసార్లు తాము పనిచేసి సంపాదించిన డబ్బులను ఇంట్లోవారికి పంపేందుకూ ఇలాంటి విధానాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా తక్కువ కమీషన్ తీసుకునే ఏజెంట్లవైపు వారు చూస్తారు.’’

అమెరికా నుంచి వేరే దేశంలోని తమ సొంత ఇంటికి డబ్బులను పంపాలి అనుకుంటే.. సంప్రదాయ బ్యాంకింగ్ విధానాల్లో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ముందుగా బ్యాంక్ ఖాతా ఉండాలి. అందులోనూ తగిన మొత్తంలో నగదు ఉండేలా చూసుకోవాలి. మరోవైపు బ్యాంక్ ఖాతా తీసుకోవాలంటే గుర్తింపు, చిరునామా లాంటి కార్డులు ఉండాలి.

కొన్ని అంతర్జాతీయ మనీ ఎక్స్‌ఛేంజ్ సేవలు అయితే, పంపే నగదులో 20 శాతం వరకు కమీషన్‌గా తీసుకుంటాయి.

హవాలాలో అయితే, ఇలాంటి షరతులు, నిబంధనలు ఏమీ ఉండవు. ఈ విధానంలో వేగంగా తక్కువ కమీషన్‌తో నగదును పంపించొచ్చు.

హవాలా నెట్‌వర్క్

ఫొటో సోర్స్, Getty Images

అవే ముఖ్యం...

‘‘హవాలాదార్‌లకు కాంటాక్ట్‌ల నెట్‌వర్క్ చాలా ముఖ్యం. ఎన్ని ఎక్కువ కాంటాక్టులు ఉంటే, అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది. కమీషన్ తక్కువ తీసుకోవడంతోనూ కాంటాక్టులు పెరుగుతాయి’’అని మరీనో అన్నారు.

‘‘మధ్యవర్తులు వీలైనంత ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తారు. వీరు తీసుకునే కమీషన్ మొదట్లో చాలా తక్కువగా ఉండేది. పశ్చిమ ఆసియాతోపాటు ఇతర ఆసియా దేశాల్లో బ్యాంకింగ్ సేవలు విరివిగా అందుబాటులేని రోజుల్లో ఈ విధానం ప్రాచుర్యం పొందింది.’’

‘‘కొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల కంటే ఇలాంటి మధ్యవర్తుల్నే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే కొందరు మధ్యవర్తులకు ఇది తరతరాలుగా వస్తున్న వ్యాపారం. ఎప్పటినుంచో ప్రజలు వారిని నమ్ముతూ వస్తున్నారు.’’

‘‘గతంలో హవాలాకు చాలా ప్రాముఖ్యం ఉండేది. నేడు బ్యాంకుల విస్తృతి పెరగడంతో హవాలాపై మనకున్న అభిప్రాయాలు, అవగాహనలు పూర్తిగా మారాయి’’అని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌లోని లీగల్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఆసియా డిపార్ట్‌మెంట్ కోఆర్డినేటర్ మరీనా మార్టిన్ చెప్పారు.

హవాలా నెట్‌వర్క్

ఫొటో సోర్స్, Getty Images

ఈ బిజినెస్ ఎంత పెద్దది?

హవాలా వ్యవస్థలో ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే, దీనిలోని లావాదేవీలు ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థల ఆధీనంలో ఉండవు.

అయితే, కొన్నిసార్లు ఎలాంటి రికార్డులూ నమోదుచేయకపోవడంతో లావాదేవీల్లో అవకతవకలు కూడా జరుగుతుంటాయి. ఈ డబ్బును ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకోవడం కష్టం అవుతుంది.

న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌పై జరిగిన 9/11 దాడులకు అవసరమైన డబ్బును మిలిటెంట్లకు అందించేందుకు ఇలాంటి హవాలా వ్యవస్థలనే ఉపయోగించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

‘‘9/11 దాడుల తర్వాత, ఉగ్రవాదులకు ఆదాయాన్ని చేకూర్చే మార్గాల్లో హవాలా కూడా ఒకటని అమెరికా భావిస్తోంది’’అని మార్టిన్ వివరించారు.

‘‘మరోవైపు సంప్రదాయ హవాలా విధానాలతో నేరాలు, అక్రమ నగదు చెలామణీ, రాజకీయ అవినీతి, మానవుల అక్రమ రవాణాతో కూడా సంబంధాలున్నాయి’’అని ఆమె వివరించారు.

ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ సమాచారం ప్రకారం.. 2018లో దుబాయిలో పనిచేస్తున్న విదేశీ కార్మికులు భారత్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లోని తమ కుటుంబాలకు డబ్బులు పంపేందుకు హవాలా మార్గాన్ని కూడా ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. రూ.240 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్నే ఇలా పంపినట్లు వెల్లడైంది.

హవాలా నెట్‌వర్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫిబ్రవరి 2016లో అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ (డీఈఏ) విచారణలో లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు డబ్బులు, మాదకద్రవ్యాలను పంపేందుకు కొలంబియా సహా మరికొన్ని దేశాల్లోని ముఠాలు హవాలా వ్యవస్థను అనుసరిస్తున్నట్లు తేలింది.

డీఈఏ సమాచారం ప్రకారం, కోట్ల రూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలను లెబనాన్ ద్వారా పశ్చిమాసియాలోకి పంపిస్తున్నారు. దీనికి ప్రతిగా హవాలా మార్గంలో యూరోలు కొలంబియాకు చేరుతున్నాయి.

ఇటీవల కాలంలో విదేశాల్లో పనిచేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల కార్మికులు తమ సొంత దేశాలకు డబ్బులను పంపడం ఎక్కువైందని ప్రపంచ బ్యాంకు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది.

కరోనావైరస్ సంక్షోభం ఉన్నప్పటికీ, 2020లో 400 ట్రిలియన్ డాలర్లు (సుమారుగా రూ.296 కోట్ల కోట్లు.. రూ.2965800000 కోట్ల) ను కార్మికులు అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు పంపించారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2019తో పోలిస్తే ఇది 1.6 శాతం తక్కువ.

అయితే, అనధికార మార్గాల్లో పంపించిన మొత్తాన్ని కలిపితే, ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటుండటంతో, అల్ప, మధ్యాదాయ దేశాలకు విదేశీ కార్మికులు పంపే డబ్బులు 2021, 2022లో మరింత ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. వీటిలో చాలా మొత్తం హవాలా మార్గంలో చేతులు మారే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)