లవ్‌ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?

లవ్ కోచ్ రాబర్ట్ బురాలే
ఫొటో క్యాప్షన్, లవ్ కోచ్ రాబర్ట్ బురాలే
    • రచయిత, మేఘా మోహన్, యూసఫ్ ఎల్డిన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

లవ్ కోచింగ్. ఇప్పుడు ఇదొక కొత్త కోచింగ్ పరిశ్రమ. దినదిన ప్రవర్ధమానవుతున్న పరిశ్రమ. సరైన జోడీ కోసం వెతుకుతున్న 30 ఏళ్లకు కాస్త అటుగా ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో ఇలాంటి కోచింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

సరైన పార్ట్‌నర్ కనుగొనేలా చేస్తామనిఈ కోచ్‌లు తమ కస్టమర్లకు హామీలు ఇస్తుంటారు. కానీ, వాటికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఎప్పుడో ఒకసారి మాత్రం వారు తమ కస్టమర్‌కు సంతోషం కలిగిస్తుంటారు.

''మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటో మీకు వివరిస్తాను. వినడానికి మీరు రెడీయా'' అంటూ రాబర్ట్ బురాలే స్టేజ్ మీదకు వచ్చారు. అక్కడంతా నిశ్శబ్ధం ఆవరించింది. ఆ హాలులో ఉన్నవారిలో కొందరు తమలో తాము గొణుక్కున్నారు.

‘రెడీయా’ అని మరోసారి అరిచారు బురాలే. అందరూ ఎస్ అంటూ అరిచారు.

''మీరు భర్తకు ఇచ్చే అధికారాలన్నీ బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చి పెద్ద పొరపాటు చేస్తుంటారు'' అన్నారు బురాలే.

''మగవాళ్లు సింహం లాంటి వేటగాళ్లు. ఆ సింహం మీ మెడను పట్టుకుని రక్తం కారుతుండగానే, మరో ఎర కోసం వెతకడం ప్రారంభిస్తుంది'' అని బురాలే వివరించారు.

''కాబట్టి, మీరు ఆ అవకాశం అస్సలు ఇవ్వద్దు'' అన్నారు బురాలే. అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

రాబర్ట్ బురాలే ఒక లవ్ కోచ్. ఈ ఈవెంట్‌కు ‘డియర్ ఉమన్’ అని పేరు పెట్టారు. ఒంటరి యువతులకు పార్ట్‌నర్‌ను వెతుక్కొనేందుకు శిక్షణ ఇవ్వడమే ఆయన పని.

కొన్ని రోజుల కిందట ఆయన కెన్యాలోని నైరోబి పట్టణంలో తన కార్యాలయం దగ్గర మమ్మల్ని విష్ చేశారు. ఆఫీసులోకి అడుగు పెట్టగానే ఆయన ప్రసంగాలతో రూపొందించిన వీడియోలు ఆఫీసు లోపల స్క్రీన్‌ల మీద ప్లే అవుతున్నాయి.

దాదాపు డజను మంది ఉద్యోగులు అక్కడి కంప్యూటర్లలో ఏవో టైప్ చేస్తున్నారు.

రాబర్ట్ బురాలే వీడియోలు చూశాక తన జీవితం మారిపోయిందని అక్కడ రిసెప్షనిస్టుగా పని చేస్తున్న ఓ యువతి వెల్లడించారు.

ఆయన టేబుల్ అంతా ఆయన రాసిన సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలతో నిండి కనిపించింది. ఇందులో ఆయన బయోగ్రఫీ కూడా ఉంది. పోర్న్ అడిక్ట్ నుంచి ఒక స్ఫూర్తివంతమైన ప్రసంగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన క్రమాన్ని ఆ పుస్తకం వివరిస్తుంది.

ఆయన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ, శాశ్వత ప్రేమను సంపాదించే ట్రిక్ తన దగ్గర ఉందని రాబర్ట్ అంటారు.

''నేను నా భార్యతో విడిపోయాను. ఇందులో రహస్యం ఏమీ లేదు. కానీ, సక్సెస్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఎలా కొనసాగించాలో నేను మహిళలకు సలహాలివ్వగలను. వాళ్లు ఎక్కడ పొరబాటు చేస్తున్నారో చెప్పగలను '' అన్నారు రాబర్ట్.

మహిళలు చేస్తున్న చిన్న తప్పు కారణంగా సింగిల్‌గా మిగిలిపోతున్నారని బురాలే అన్నారు.
ఫొటో క్యాప్షన్, మహిళలు చేస్తున్న చిన్న తప్పు కారణంగా సింగిల్‌గా మిగిలిపోతున్నారని బురాలే అన్నారు.

లవ్ కోచింగ్‌కు డిమాండ్

2015 నాటి లెక్కలతో పోలిస్తే పర్సనాలిటి డెవలప్‌మెంట్ (వ్యక్తిత్వ వికాసం) ఇండస్ట్రీ రెండింతలయ్యిందని ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్ వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగింది.

పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచింగ్‌లో మెడిటేషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ తదితర అంశాలు ఉంటాయి. లవ్ కోచింగ్‌లో డేటింగ్ గురించి ఎక్కువగా ఉంటుంది. అయితే లైఫ్ స్టైల్ కోచింగ్‌లో పార్ట్‌నర్‌ను వెతుక్కోవడం అంతిమ లక్ష్యం కావచ్చు.

''దీనికి రెండు కారణాలున్నాయి'' అన్నారు ‘మేక్ యువర్ మూవ్’ రచయిత, డేటింగ్ ఫైనాన్స్ నిపుణుడు జోన్ బిర్గర్.

"మొదటిది యూనివర్సిటీలలో జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది. యూనివర్సిటీకి వచ్చే పురుషులు తగ్గుతున్నారు. మరొకటి ఆన్‌లైన్ డేటింగ్ విష సంస్కృతి. ఈ రెండు ధోరణులు 30, 40 ఏళ్ల ప్రాయంలో ఉండి, చదువుకుని, విజయాలు సాధించిన, వివాహం కాని మహిళలకు డేటింగ్ చేయడాన్ని కష్టంగా మార్చాయి. వాళ్లంతా లవ్‌ కోచ్‌లను ఆశ్రయించాల్సి రావడంలో ఆశ్చర్యం లేదు'' అన్నారు.

యూకేకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గత సంవత్సరం ఒక నివేదిక విడుదల చేసింది. 30 ఏళ్లలో వివాహం చేసుకోని బ్రిటీష్ మహిళల సంఖ్య ఒక దశాబ్దంలో రెట్టింపైంది.

కెన్యాలో 30 ఏళ్లు దాటిన చాలామంది ఒంటరి మహిళలు లవ్ కోచింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, కెన్యాలో 30 ఏళ్లు దాటిన చాలామంది ఒంటరి మహిళలు లవ్ కోచింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఖర్చు కూడా ఎక్కువే

డేటింగ్ నిపుణులతో వన్ టు వన్ కోచింగ్ నెలకు 8,000 డాలర్ల వరకు ఖర్చవుతుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పరిశ్రమ ఏటా 13 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా మారిందని ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ వెల్లడించింది.

‘డియర్ ఉమెన్’ ఈవెంట్‌కు ముందు రోజు పొరుగింటి మహిళ తమ ఆరు రోజుల పాపకు వరండాలోని ప్లాస్టిక్ టబ్‌లో స్నానం చేయించడాన్ని మేరీ చూశారు. తనకు కూడా బిడ్డ కావాలని మేరీ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం మేరి వయసు 35 సంవత్సరాలు. కెన్యాలో నగరాల్లో వివాహ సరాసరి వయసు 21 సంవత్సరాలు కాగా, గ్రామీణ ప్రాంతాలో 19 ఏళ్లని వరల్డ్ బ్యాంక్ నివేదిక ఒకటి వెల్లడించింది. మేరీ ఐదుగురు చెల్లెళ్లలో ముగ్గురు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు.

''పెళ్లి చేసుకొమ్మని కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది'' అన్నారు మేరీ.

ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. ''కానీ, నా తప్పు ఎక్కడుందో నాకు అర్దం కావడం లేదు'' అన్నారు. మేరీ.

మీరు ఒంటరిగా ఉండటమంటే ఆమె ఏదో తప్పు చేస్తున్నారని అర్దం కాదు. ఇంకా ఏమైనా కారణాలు ఉండొచ్చుకదా ? సరైన వ్యక్తిని కలుసుకోలేక పోవడం ఒక కారణం కావచ్చు కదా ? అన్నప్పుడు.."చాలామంది నేను నచ్చినట్లు చెబుతారు. కానీ నిజంగానో నచ్చానో లేదో తెలియదు'' అన్నారు మేరీ.

మేరీ ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తుంటారు. రాబర్ట్ బురాలే ‘డియర్ ఉమెన్’ కోర్సు కోసం ఆమె ఒక వారం జీతాన్ని ఖర్చు పెట్టారు.

దీని వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందో లేదో అర్ధం కాలేదు. తాను పెట్టిన పెట్టుబడి తనకు భర్తను తీసుకురాగలుగుతుందో లేదో కూడా ఆమెకు తెలియదు. కానీ ఆమె అన్నింటికి సిద్ధంగా ఉన్నారు. '' ప్రయత్నించి చూడటం బెటర్‌ కదా'' అన్నారామె.

లవ్ కోచింగ్ సెమినార్‌లో ప్రసంగిస్తున్న రాబర్ట్ బురాలే
ఫొటో క్యాప్షన్, లవ్ కోచింగ్ సెమినార్‌లో ప్రసంగిస్తున్న రాబర్ట్ బురాలే

ఓదార్పు కోసం క్లాసులు

మాథ్యూ హస్సీ ఒక గ్లోబల్ కోచింగ్ స్టార్. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ 'గెట్ ది గై' పుస్తక రచయిత. ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో (2.2 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లతో) "3 మ్యాన్ మెల్టింగ్ ఫ్రేజెస్ దట్ ఎ గై ఫాల్ ఫర్ యు" పేరుతో ఒక వీడియో 18 మిలియన్లకు పైగా హిట్‌లను సాధించింది.

ఆయన ఇచ్చే లైఫ్‌స్టైల్ కోచింగ్‌ తీసుకోవాలంటే వేల డాలర్లు ఖర్చవుతుంది. కేవలం వర్చువల్ కోచింగ్‌కు 800 డాలర్లు ఖర్చవుతుంది.

తన పార్ట్‌నర్ నుంచి విడిపోయిన బాధ నుంచి కోలుకునేందుకు ఓ మహిళ మాథ్యూ ఈవెంట్‌‌లో పాల్గొనాలని భావిస్తున్నారు. ఆ మహిళతో మేం మాట్లాడిన తర్వాత మాథ్యూని కలిశాం.

‘‘జీవితంలో బాధాకర, బలహీన స్థితిలో ఉన్నవారు మీ దగ్గరకు వస్తుంటారు, మీరు వారికి కలలను అమ్ముతుంటారు. అంతే కదా’’ అని మేం మాథ్యుని అడిగాము.

'' నా వీడియోలు చూసిన వారెవరూ నేను కలలను అమ్ముకుంటున్నానని విమర్శించ లేదు'' అన్నారు మాథ్యూ.

"నేను సాధ్యమైన విషయాలే చెబుతాను. డేటింగ్ సలహా కోసం ఎవరైనా నా వద్దకు వస్తే, వారు సంతోషంగా ఉండటానికి ఏది పనికి వస్తుందో ఆ విషయాన్నే చెబుతాను. అయితే, అన్నీ అన్నిసార్లు పని చేయకపోవచ్చు'' అన్నారు మాథ్యూ.

వీధిలో ఎవరైనా నాకు ఎదురొచ్చి మీరిచ్చిన సలహాను పాటించాను, పెళ్లి చేసుకోగలిగాను అని చెబితే చాలా సంతోషంగా ఉంటుందని మాథ్యూ అన్నారు.

"మీరు కోరుకున్నది, మీకు లభించింది ఒకటే అయితే అంతకంటే అదృష్టం ఏముంటుంది?’’ అన్నారాయన.

బాధలో ఉన్నవారికి కలలను అమ్మడమే లవ్ కోచింగ్ లక్ష్యమా ?
ఫొటో క్యాప్షన్, బాధలో ఉన్నవారికి కలలను అమ్మడమే లవ్ కోచింగ్ లక్ష్యమా ?

ఉపశమనం

సాధారణంగా రాబర్ట్ బురాలే వందలాది మంది హాజరయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే కోవిడ్ ఆంక్షల కారణంగా ఈసారి కేవలం 30 మంది మహిళలను మాత్రమే ఆహ్వానించారు. మేరీ కూడా ఆ హాలులోకి ప్రవేశించారు.

మూడు బస్సులు మారి, 5 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడికి వచ్చిన మహిళ కూడా ఉన్నారు.

''ఈ సెమినార్ మీరు సరైన జోడీని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. క్రిస్మస్ నాటికి మీకు మంచి భర్త దొరుకుతాడు. మీరు ఈ పని మీద రాకపోతే వెళ్లిపోవచ్చు'' సెమినార్‌ను ఉద్దేశించి అన్నారు బురాలే.

''మీలో కొందరు సింగిల్‌గా ఉన్నారు. దీనికి కారణం పురుషులు లేకపోవడం కాదు. మీరు చేసే తప్పుల కారణంగా మీరు సింగిల్‌గా మిగిలారు'' అని బురాలే వివరించారు.

''మీరు వారితో సెక్స్ చేయడమే మీరు చేస్తున్న పెద్ద తప్పు'' అన్నారు రాబర్ట్. ఈ మాట వినగానే ఏదో నోట్ చేసుకుంటున్న మేరీ ఉలిక్కిపడి చూశారు.

మీలో కొందరు ఎందుకు ఒంటరి వారయ్యారో చెప్పడానికి చెప్పడానికి స్టేజి మీదకు రావాల్సి ఉంటుందని రాబర్ట్ ఎనౌన్స్ చేశారు. ఆ లిస్టులో మేరీ కూడా ఉన్నారు.

''మీరు ఎందుకు సింగిల్‌గా ఉండిపోయారు'' అడిగారు రాబర్ట్

''మా ఊళ్లో ఒకబ్బాయి ఉండేవాడు. అతను చాలా అందంగా, సౌష్టవంగా ఉండేవాడు. సిక్స్ ప్యాక్ ఉండేది. మేము దాదాపు ఏడాదిన్నర పాటు డేటింగ్‌లో ఉన్నాం. తర్వాత అతనికి నైరోబిలో ఉద్యోగం వచ్చింది. జాబ్ వచ్చాక కూడా మేం మూడు నెలలు టచ్‌లో ఉన్నాం. కానీ తర్వాత్తర్వాత కమ్యూనికేషన్ తగ్గిపోయింది. తర్వాత పూర్తిగా పోయింది'' అని వివరించారు మేరీ.

అతను తనను పెళ్లి చేసుకుంటాడని ఎంతగానో ఆశలు పెంచుకున్నానని మేరీ తెలిపారు.

''ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోవడానికి అతనికి కాల్ చేశాను. అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు నా లైఫ్‌స్టైల్ మారింది. నా ఆర్థిక స్థితి మారింది అని చెప్పాడు'' అని మేరీ వివరించారు.

‘‘అతను నిన్ను చిన్నచూపు చూశారా?’’ ప్రశ్నించారు రాబర్ట్. ''చాలా. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతిశాడు'' అని మేరీ కన్నీరు పెట్టుకున్నారు.

రాబర్ట్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ''ఇందులో మీ తప్పేమీ లేదు. మీరు ప్రేమించడానికి ఓపెన్ గా ఉన్నారు'' అంటూ అనునయించారు.

సాధారణంగా బ్రేక్‌ అప్ తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీకి చెప్పే అనునయపు మాటలే రాబర్ట్ కూడా మేరీకి చెప్పారు.

ఆరుగంటల సెమినార్ తర్వాత అక్కడికి వచ్చిన మహిళలంతా చివర్లో ఒకరినొకరు పలకరించుకుంటూ, ఫోన్ నంబర్లు షేర్ చేసుకుని వెళ్లిపోయారు.

మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలని లవ్ కోచింగ్‌లో బోధిస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలని లవ్ కోచింగ్‌లో బోధిస్తున్నారు.

ఫలితం ఉందా?

‘డియర్ ఉమెన్’ ఈవెంట్ తర్వాత రోజు రాబర్ట్ బురాలే ఒక రేడియో స్టేషన్‌లో తన వీక్లీ కోచింగ్ షోలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఆయన్ను కలవడానికి వెళ్లాము. ఈ వారమంతా చాలా బిజీగా గడిపానని, అలసిపోయి ఉన్నానని రాబర్ట్ అన్నారు. అయితే, తన కోచింగ్ సాగుతున్న తీరుపై ఆయన సంతోషంగా ఉన్నారు.

''మీరు సలహాలు మంచివని అనుకుంటున్నారా? చాలామంది మహిళలు తప్పులు చేస్తున్నందువల్లే సింగిల్‌గా మిగులుతున్నారని మీరు నమ్ముతున్నారా ? వేరే కారణాలే లేవా '' అని ప్రశ్నించాం.

"ఇదే వర్కవుట్ అవుతుంది. వాళ్లు చేస్తున్న ప్రయత్నాలను ఎలా వేగవంతంగా చేయాలో నేను వారికి చెబుతున్నాను'' అన్నారు రాబర్ట్

మాథ్యూల హస్సీ లాగే, భర్తను పొందడంతోపాటు అనేక అంశాలు తన కోచింగ్‌లో ఉంటాయని రాబర్ట్ అన్నారు.

"ఒక విషయం తెలుసుకోవాలని ప్రజలు నా దగ్గరకు వస్తారు. చివరకు తమకు కావాల్సింది వేరే అని వారికి తెలుస్తుంది" అని ఆయన అన్నారు.

మేరీ త్వరలో ఒక మగ స్నేహితుడిని త్వరలో కలవబోతున్నారు. ఆమెకు ఆ సెమినార్ ఎంతో నచ్చింది. దాని నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారామె.

ఒక వ్యక్తి మనకు కమిట్ అయ్యాడని తెలిసే వరకు సెక్స్‌కు దూరంగా ఉండాలన్న సలహా గురించి మీరు ఏమనుకుంటున్నారని ఆమెను అడిగాం.

''ఇది కొంచెం పాత విధానం అనిపించింది. నేను దానిని పట్టించుకోను'' అన్నారామె.

"ఆ కోర్సు నుండి నేర్చుకోదగిన విషయం ఏంటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మీరు సంతోషపరుచుకోండి. ఇతరులను ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి''

‘‘నాకు ఇంకా చాలా టైమ్ ఉంది. నేను ఇంకా చిన్నదానినే అనుకోండి.’’

ఈ కోచింగ్ తీసుకున్న అయిదు నెలల తరువాత కూడా మేరీ ఒంటరిగానే ఉన్నారు.

కానీ ఆమె జీవితంలో ఏదో మారినట్లు అనిపిస్తోంది. ఆమె సింగిల్‌గా ఉన్నా, సంతోషంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)