పవన్ కల్యాణ్: ‘బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? వైసీపీకి భయం అంటే ఏమిటో చూపిస్తా’

ఫొటో సోర్స్, Janasena
- రచయిత, శంకర్.వి
- హోదా, బీబీసీ కోసం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలతో భేటీ అనంతరం ఆయన మట్లాడారు.
‘‘భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి?’’ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
"నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా" అన్నారు.

ఫొటో సోర్స్, janasena
‘మీ ఆడవాళ్ల గురించి నేను తప్పుగా మాట్లాడను’
‘‘వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా. 2014లో టీడీపీ, బీజేపీకి అభివృద్ధి కోసమే మద్దతిచ్చా. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే అడుగుతా.
సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా. రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయగలను.
నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాలి. ఏపీ ప్రభుత్వం నెలకు రూ.5 వేలు ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుంది. రూ.500కే ప్రెసిడెంట్ మెడల్ మద్యం అమ్ముతున్నారు’’ అన్నారు.
‘నన్ను ఎంత తిడితే అంత బలపడతాను’
‘‘నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెతను వైసీపీ ప్రభుత్వం నిజం చేస్తుంది. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను.
నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను.
అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడ్డానికేం లేదు. రాష్ట్రంలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి వారితో తిట్టించుకుంటున్నాను. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు" అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఫొటో సోర్స్, facebook/kolusuParthasarathi
జనం ఛీ కొట్టినా బుద్ధి రాలేదు: వైసీపీ నేత పార్థసారథి
జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత కె.పార్థసారథి స్పందించారు.
పవన్ కళ్యాణ్ తీరుని ప్రజారాజ్యం నుంచి జనసేన వరకూ జనం ఛీ కొడుతూనే ఉన్నారని.. అయినా పవన్ మారడం లేదని ఆయన అన్నారు.
‘‘ఏం మాట్లాడుతాడో తెలీదు. మతి లేని మాటలతో కొందరిని రెచ్చగొట్టాలని చూస్తున్నారాయన. ఏపీలో జగన్ జనాదరణ చూసి భయపడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో 90 శాతం విజయాలు చూసి ఏం చేయాలో తోచక అలా మాట్లాడుతున్నారు.
ఏపీకి గెస్ట్‌లా వచ్చి ఇలాంటి మాటలతో రెచ్చిపోతే సహించేది లేదు. వివేకా హత్య కేసు సీబీఐ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే తెలుస్తుంది.
ఓటుకు నోటు కేసు కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడనని చెప్పిన పవన్ కల్యాణ్‌కు వివేకా కేసు ఎక్కడ ఉందో తెలీదా. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సహించం. పవన్ మాటలు జనం పట్టించుకోరు’’ అన్నారు పార్థసారథి.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మనం రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? హైదరాబాద్‌లో తయారైన ఈ కొత్త రకం వరి అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా ‘రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?
- వెదురు చిగురు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లో ఉన్న వంటకం ఇదే
- ఆంధ్రప్రదేశ్: స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు తలలు పగలగొట్టుకునే వరకు ఎందుకెళ్లాయి?
- ‘చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









