జపాన్ ముఖచిత్రాన్ని మార్చిన 'బుషిడో - ది సోల్ ఆఫ్ జపాన్' పుస్తకంలో ఏముంది?

samurai illustration

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సమురాయ్
    • రచయిత, మిచియో నకమోటో
    • హోదా, ది కలెక్షన్, బీబీసీ

హాలీవుడ్ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయే సినిమా 'ది లాస్ట్ సమురాయ్'. జపాన్ సంప్రదాయ విలువలను భ్రష్టు పట్టిస్తున్న శక్తులను అణచివేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసే ఓ తిరుగుబాటు యోధుడు (సమురాయ్) కట్సుమోటో కథే ఈ సినిమా.

ఈ సినిమాలో కథను అమెరికా ఆర్మీ కెప్టెన్ నాథన్ అల్గ్రెన్ చెబుతుంటాడు. తిరుగుబాటుదారులతో పోరాడటానికి జపాన్ ఇంపీరియల్ ఆర్మీ అతడిని నియమిస్తుంది. కానీ నాథన్ సమురాయ్ బృందానికి దొరికిపోతాడు.

కట్సుమోటో బృందలోని వారంతా సమర్థులు, వీరులు, క్రమశిక్షణ, కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారే కాక తమ వద్ద బందీగా ఉన్నవారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తుంటారు.

సమురాయ్ పద్ధతి, ప్రవర్తన చూసి ముగ్ధుడైన నాథన్, కట్సుమోటో బృందంలో చేరి వారికి సహకరిస్తాడు. క్లుప్తంగా అదీ కథ.

ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ నుంచి జపనీస్ టీవీ డ్రామాల వరకూ సమురాయ్‌లను ధైర్యసాహసాలకు ప్రతీకలుగా, మర్యాద గలవారిగా, జీవితం కన్నా నైతిక విలువలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వారిగా చూపుతూ వచ్చారు.

సమురాయ్ కథలకు చారిత్రకంగా కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ, 20వ శతాబ్దం ప్రారంభంలో జపనీస్ రచయిత ఇనాజ్ నిటోబ్ ఇంగ్లిష్‌లో చేసిన రచనల ఆధారంగా కాల్పనిక ప్రపంచంలో వీటికి విశేష ఆదరణ లభించింది.

నిటోబ్ రచనల్లో 'బుషిడో: ది సోల్ ఆఫ్ జపాన్' పుస్తకానికి ప్రత్యేక స్థానం ఉంది.

దీన్ని తొలుత 1900లలో ముద్రించారు. అప్పట్లో అది అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. పెంగ్విన్ 'గ్రేట్ ఐడియాస్' సీరీస్‌లో భాగంగా ఈ ఏడాది ఆ పుస్తకాన్ని మళ్లీ ప్రచురించారు.

బుషిడో అంటే 'యోధుడి (సమురాయ్) జీవన విధానం' అని అర్థం.

బుషిడో మీద ఎన్నో పుస్తకాలు వచ్చినప్పటికీ, జపాన్ వ్యవస్థలోని వివిధ కోణాలు, విలువలు, అవి మారుతూ వస్తున్న విధానాలను అర్థం చేసుకోవాలనుకునేవారికి నిటోబ్ రచనే గీటురాయి.

Samurai

ఫొటో సోర్స్, Heritage Images/Getty Images

సత్ప్రవర్తన అంటే ఏమిటి?

నిటోబ్ రచయిత మాత్రమే కాదు. ఆయనొక వ్యవసాయ ఆర్థికవేత్త, విద్యావేత్త, దౌత్యవేత్త, క్వాకర్ కన్వర్ట్, 1919 నుంచి 1929 వరకు లీగ్ ఆఫ్ నేషన్స్ అండర్-సెక్రటరీ జనరల్‌ కూడా.

'బుషిడో: ది సోల్ ఆఫ్ జపాన్' పుస్తకం ద్వారా నిటోబ్ జపనీస్ సంస్కృతికి మూలాధారమైన నైతిక విలువల గురించి పాశ్చాత్య ప్రపంచానికి వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

అవన్నీ బుషిడోలో ఉన్నాయని నిటోబ్ భావించారు. బుషిడో అంటే సమురాయ్ నైతిక సూత్రాల నియమావళిగా నిర్వచించారు.

నిటోబ్ అభిప్రాయంలో బుషిడో అంటే న్యాయబద్ధంగా జీవించడం. గౌరవ భావంతో, దయగా, నిజాయితీగా నడుచుకోవడం. తన పైనున్నవారి పట్ల వినయవిధేయతలు కలిగి ఉండడం.

ఉహాజనితమా.. వాస్తవమా?

అయితే, సమురాయ్‌ని నిటోబ్ కాల్పనికవాదంలో ముంచెత్తారని చరిత్రకారులు విమర్శించారు. ఇది ఊహాజనితంగా ఉందని, వాస్తవంలో జరిగేది వేరని వారి వాదన.

‘‘సమురాయ్, డైమ్యో (భూస్వాములు) వాస్తవ ప్రపంచంలో మర్యాద మన్ననలతో, వినయ విధేయతలతో జీవితాలు గడపలేదు. అవకాశం వస్తే తమ యజమానులను చంపి వారి స్థానాన్ని ఆక్రమించుకునేందుకు వెనుకాడలేదు " అని సోఫియా యూనివర్సిటీ (టోక్యో)లోని ఆధునిక జపాన్ చరిత్రలో ప్రొఫెసర్ స్వెన్ సాలెర్ అన్నారు.

సమురాయ్ కుటుంబం నుంచి వచ్చిన నిటోబ్, సమురాయ్ విలువలను జపాన్ ప్రజలందరూ ఆచరించారని తన ప్రధాన రచనల్లో పేర్కొన్నారు.

అయితే, ఎడో కాలం (1603-1868) నాటికి, సమురాయ్ జీవితాల్లో వచ్చిన సామాజిక స్థిరత్వం కారణంగా వారి యుద్ధ నైపుణ్యాలకు కాలం చెల్లింది. ఆ దశలో వారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే నింద ఉంది. ఇది నిటోబ్ వాదనకు విరుద్ధంగా ఉన్న అంశం.

ఏదేమైనా, సమురాయ్‌లకు చారిత్రక ఆధారాలు చూపించడం నిటోబ్ ఉద్దేశం కాదు. క్రైస్తవానికి దీటుగా జపనీయులకూ ఒక నైతిక విలువల వ్యవస్థ ఉందని పాశ్చాత్యులకు చూపించడమే ఈ పుస్తకం ఉద్దేశం.

సమురాయ్ కథల ద్వారా నిటోబ్ జాతి వివక్ష భయాలను ఎదుర్కోవడంతో పాటూ, జపనీయులను అత్యంత ధైర్యవంతులుగా, సాహసవంతులైన వీరులుగా పశ్చిమ దేశాల ఎదుట నిలబెట్టే ప్రయత్నం చేశారని ప్రొఫెసర్ సాలెర్ అభిప్రాయపడ్డారు.

cherry blossom

ఫొటో సోర్స్, Getty Images

నిటోబ్ పుస్తక లక్ష్యం

జపాన్ ఏదో ఒక రోజు యూరోప్‌కు ముప్పుగా మారుతుందనే భయాలను ఎదుర్కోవడమే నిటోబ్ పుస్తకం లక్ష్యమని సాలెర్ అన్నారు.

"జపాన్ పట్ల సానుకూల దృక్పథం ఏర్పరచడం, సైన్యం పరంగా జపాన్ చాలా బలమైన దేశమే కానీ నాగరికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశమని, యుద్ధాల్లో హద్దు మీరి ప్రవర్తించదని తెలియజెప్పడమే నిటోబ్ ఉద్దేశం."

"అంతే కాకుండా, పశ్చిమ దేశాలకు జపాన్ ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించడం, తద్వారా వలస రాజ్యాలపై ఆధిపత్యం సంపాదించే అర్హత ఉందని చెప్పడం కూడా ఈ పుస్తకం ద్వారా చేసిన ప్రయత్నం" అని చరిత్రకారులు ఎరి హొట్టా అభిప్రాయపడ్డారు.

జపాన్ విలువలను చిత్రీకరించడంలో, పశ్చిమ దేశాల ఎదుట ఆ దేశ ప్రతిష్టను మెరుగుపరచడంలో నిటోబ్ తన లక్ష్యాన్ని చేరుకున్నారని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి.

ముఖ్యంగా చైనా, రష్యాలపై సైనిక విజయాల తర్వాత ప్రపంచ పాఠకులకు జపాన్ పట్ల ఆసక్తి పెరిగిన సమయంలో ఈ పుస్తకం అనేకమందిని ఆకట్టుకుంది.

నిటోబ్ పుస్తకంలో సమురాయ్ ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు పాఠకులను ఆశ్చర్యచకితులను చేశాయి. ఒక చిన్న దేశం, శక్తివంతమైన పొరుగు దేశాలను ఎలా ఓడించగలిగిందో అప్పుడు వారికి అర్థమైంది.

"నిటోబ్ పుస్తకం, వేగంగా అభివృద్ధి చెందుతున్న జపాన్ శక్తికి మూలాన్ని వివరించే ప్రయత్నం చేసింది. జపాన్ సంస్కృతిపై వచ్చిన తొలితరం ఆంగ్ల పుస్తకాల్లో ఇదీ ఒకటి. దాంతో అది విశేష ఆదరణ పొందింది." అని లాన్స్ గాట్లింగ్ అన్నారు. గాట్లింగ్, జూడోను కనిపెట్టిన జిగోరో కానేపై 'కానో క్రానికల్స్' అనే పుస్తకాన్ని రాస్తున్నారు.

బుషిడో నియమావళి అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన జూడో అభ్యాసకుడు.

దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు, కౌంట్ కెంటారె కనేకోకు 1904 ఏప్రిల్ 13న రాసిన ఉత్తరంలో రూజ్‌వెల్ట్ దీని గురించి ప్రస్తావించారు.

"బుషిడోపై పుస్తకం నన్ను బాగా ఆకట్టుకుంది. చక్కటి సమురాయ్ స్ఫూర్తి నాకెన్నో విషయాలు నేర్పించింది.. " అని రాశారు.

కాగా, అంతర్జాతీయ వేదికపై ఎన్నో ప్రశంసలు అందుకునప్పటికీ జపాన్‌లో ఈ పుస్తకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయని, ఈ పుస్తకంలోని విషయాలు అసంబద్ధమైనవంటూ విమర్శించారని ఒలేగ్ బెనెష్ తన పుస్తకం 'ఇన్వెంటింగ్ ది వే ఆఫ్ ది సమురాయ్‌'లో పేర్కొన్నారు.

ఏది ఏమైనప్పటికీ, ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడాన్ని జపనీయులు గర్వంగా భావిస్తారని, తాము అత్యున్నత విలువలకు వారసులమంటూ పొంగిపోతారని హొట్టా అన్నారు.

Group of Samurais

ఫొటో సోర్స్, Kusakabe Kimbei/Hulton Archive/Getty Images

"పాశ్చాత్య దేశాల పక్కన నిలబడేందుకు జపాన్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని ఈ పుస్తకం నిరూపించే ప్రయత్నం చేసింది. తద్వారా వలస రాజ్యాలపై తమకూ అధికారం ఉందని, తప్పు చేయడంలో కూడా సమాన హక్కు ఉండాలని భావించేందుకు తోడ్పడింది. అప్పట్లో జపాన్ ఇమేజ్‌కు అది చాలా ముఖ్యం."

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జపాన్ సైన్యంతో అనుసంధానం అయిన బుషిడో ఆ దేశంలో తీవ్ర ప్రజాగ్రహానికి గురయ్యిందని బెనెష్ రాశారు.

అయితే, ఈమధ్య కాలంలో అంటే 1980లలో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో జపాన్ త్వరితగతిని అభివృద్ధి చెందడం చూసిన ప్రపంచానికి అందుకు కారణమైన జపాన్ మూలాలపై ఆసక్తి పెరిగింది. ఆ నేపథ్యంలో బుషిడో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఇటీవల మరణించిన తైవాన్ మాజీ ప్రెసిడెంట్ లీ టెంగ్-హుయ్, బుషిడో పుస్తకం తన జీవితాన్ని, ఆలోచనలను ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తూ 2006లో రాసిన తన జీవిత చరిత్ర పుస్తకంలో ప్రస్తావించారు.

అయినప్పటికీ, నిటోబ్ గురించి, ఆయన రాసిన పుస్తకం గురించి జపాన్‌లో అందరికీ విస్తృతంగా తెలీదు. ఈ పుస్తకం కన్నా, 1984 నుంచి 2004 వరకు 5,000 యెన్ నోటుపై ఉన్న బొమ్మగానే ఆయనను ఎక్కువమంది గుర్తిస్తారు.

Samurai in movies

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సినిమాల్లో సమురాయి వేషం

క్రీడల్లో బుషిడో

బుషిడో నియమావళిగా నిటోబ్ గుర్తించిన విలువలు.. ఇతరుల పట్ల మర్యాద, వ్యక్తిగత గౌరవం, స్వీయ నియంత్రణ, పైవారి పట్ల విధేయత మొదలైనవన్నీ ఇప్పటికీ జపనీయుల దృష్టిలో సత్ప్రవర్తనకు గుర్తులు.

జపాన్ క్రీడల్లో బుషిడోకు మంచి గుర్తింపు ఉంది. జపనీస్ జాతీయ బేస్ బాల్ జట్టుకు 'సమురాయ్ జపాన్' అనే మారుపేరు ఉంది. అలాగే, జాతీయ పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు 'సమురాయ్ బ్లూ' అని పేరు.

అయితే, జపాన్ ప్రజల్లో బుషిడో విలువల ప్రాబల్యానికి కారణం నిటోబ్ పుస్తకం కన్నా, 'కన్ఫ్యూషనిజం' ప్రభావమేనని టోక్యోలోని టీకి హేసీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యుకికో యువాసా అన్నారు.

"ఆ పుస్తకంలో ప్రవచించిన చాలా విషయాలు జపనీయుల జీవితాల్లో భాగం. కాబట్టి జపాన్ ప్రజలు వాటి గురించి తెలుసుకోవడానికి ఆ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు" అని ఆమె అన్నారు.

ఏది ఏమైనా, జపాన్ విలువల గురించి బయట ప్రపంచానికి కూలంకషంగా తెలియజెప్పే పుస్తకంగా బుషిడో ఎప్పటికీ నిలిచిపోతుంది. రాబోయే తరాలకు జపాన్ మూలాలు, నైతిక విలువలు, వాటిల్లో వస్తున్న మార్పుల గురించి అవగాహన కలిగించేందుకు బుషిడో పుస్తకం తప్పక సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)