'నగ్నంగా ఆరుబయట స్నానం చేయమన్నారు, మొదట్లో సిగ్గుపడ్డాను కానీ....'- జపాన్‌లో స్థిరపడిన భారతీయుల అనుభవాలు

ఫొటో సోర్స్, Stephanie Crohin/gettyimages
- రచయిత, అరవింద్ చాబ్రా
- హోదా, బీబీసీ పంజాబీ
జపనీయులకు స్నానమంటే ప్రాణం. వారి సంప్రదాయ వేడి నీటి స్నానాల గురించి ప్రపంచమంతటికీ తెలుసు.
టోక్యోకు నాలుగు దశాబ్దాల కిందట వచ్చి అక్కడే స్థిరపడిన భారతీయుడొకరు నాకు ఈ విషయం చెప్పారు.
''నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరికొందరు కుర్రాళ్లతో కలిసి ఒక చిన్న రూమ్ షేర్ చేసుకునేవాడిని. మా గదిలో బాత్రూమ్ లేకపోవడంతో ఆరుబయట స్నానం చేయడానికి వెళ్లేవాళ్లం. స్నానాల గది లేని మాలాంటివారంతా ఆరు బయటే స్నానం చేయాల్సి వచ్చేది.
అయితే దుస్తులన్నీ విప్పేసి పూర్తి నగ్నంగా స్నానం చేయాలని నాకు చెప్పినప్పుడు నిర్ఘాంతపోయాను. జపాన్‌కు రావడానికి ముందు భారత్‌లో ఉన్నప్పుడు చిన్నతనంలో చెరువులు, బోరుబావుల దగ్గర బట్టల్లేకుండానే స్నానం చేసేవాళ్లం. కానీ టోక్యోలో అలా చేయమనేసరికి షాకయ్యాను'' అని చెప్పారు ప్రవీణ్ గాంధీ.
ప్రవీణ్ గాంధీ 1974లో హరియాణాలోని అంబాలా నుంచి జపాన్‌లోని టోక్యోకి వచ్చారు.
''మిగతా కుర్రాళ్లు ఎంత చెప్పినా వినకుండా నేను దుస్తుల్లోనే స్నానం చేసేవాడిని. దాంతో అందరిలో నేనొక్కడినే వేరేగా అనిపించేవాడిని. వారు నన్ను ఒక అవుట్‌సైడర్‌గా చూసేవారు. వారందరి ముందు నగ్నంగా స్నానం చేయడానికి నాకు ఆర్నెళ్లు పట్టింది. అప్పటి నుంచి నేను కూడా వారిలో ఒకడినయ్యాను. నాలో చాలా మార్పు వచ్చింది'' అన్నారాయన.
ప్రవీణ్ గాంధీ ఆ తరువాత టోక్యోలో ఒక ట్రావెల్ కంపెనీ ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్‌లో భారతీయుల సంఖ్య పెరుగుతోంది
''మన భారతీయులం సాధారణంగా సిగ్గరులం. విదేశీయుల ముందు అలా దుస్తులన్నీ తీసేసి నిలబడాలంటే ఇబ్బందిగా ఉంటుంది'' అన్నారు అక్కడే ఉంటున్న మరో భారతీయుడు సత్నామ్ సింగ్.
ఆయన 1973లో అమృత్‌సర్ నుంచి టోక్యో వచ్చారు. అక్కడే ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఆ తరువాత ఇండియన్ రెస్టారెంట్లు నెలకొల్పారు. ఇటీవలే వాటిని ఆయన అమ్మేశారు.
జపాన్ జనాభా 12.6 కోట్లు. అందులో భారతీయులు 38వేల మంది ఉంటారు. ఇదేమీ పెద్ద సంఖ్య కాదు.
జపాన్‌కు ఇమిగ్రేషన్ అంత సులభం కాకపోవడం వల్లే భారతీయులు ఆ దేశంలో తక్కువగా ఉన్నారని అక్కడివారు చెబుతున్నారు.
ఐటీ రంగంలో అవకాశాలు రావడంతో చాలామంది భారతీయ యువత ఇప్పుడు జపాన్‌కు వస్తున్నారు. దీంతో ఇక్కడ ఇండియన్స్ జనాభా క్రమంగా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రి 2 గంటలకు 18 ఏళ్ల అమ్మాయి నిర్భయంగా నడుచుకుంటూ..
దశాబ్దాలుగా జపాన్ రాజధాని టోక్యోలో ఉంటున్న అనేక మంది భారతీయులతో నేను మాట్లాడాను.
అక్కడే నివసించాలన్న తమ నిర్ణయంపై వారు సంతోషంగానే ఉన్నారు. కొన్ని సవాళ్లున్నప్పటికీ స్థానిక ప్రజల కలివిడి స్వభావం తమను అక్కడ స్థిరపడేలా చేసిందని వారు చెబుతున్నారు.
జపాన్‌లో నివసించే ఇతర దేశస్థులలా కాకుండా తాము మాట్లాడే భాష స్థానికులు మాట్లాడినట్లుగానే ఉంటుందని 54 ఏళ్ల కిందట దిల్లీ నుంచి వచ్చి స్థిరపడిన ఉజ్వల్ సింగ్ సాహ్నీ అన్నారు.
''జపనీయులు శాంతి కాముకులు. ఇక్కడ నేరాలు చాలా తక్కువ'' అన్నారు హైదరాబాద్ నుంచి వచ్చి స్థిరపడిన వీకే రూపానీ.

హోటల్ సిబ్బంది టిప్స్ ఆశించరు
''వేకువన 2 గంటల సమయంలో కూడా ఇక్కడ ఆడవాళ్లు ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటూ వెళ్తుంటారు. అంతేకాదు, ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వారికి ఎక్కువ. రాత్రి 2 గంటలకు మీకు ఏదైనా అవసరమైతే ఒక 18 ఏళ్ల అమ్మాయి నిర్భయంగా మీ దగ్గరకు సహాయం చేయడానికి రాగలదు'' అన్నారు సత్నామ్ సింగ్.
జపనీయులలో దేశభక్తి కూడా అధికమని.. దేశం కోసం వారు ఏమైనా చేస్తారని అక్కడి భారతీయులు చెప్పారు.
''వేల మంది ప్రాణాలు, వేల కోట్ల విలువైన ఆస్తి నష్టానికి కారణమైన 2011 నాటి సునామీ తరువాత జపాన్ ప్రజలు తక్కువ జీతానికి ఎక్కువ సమయం పనిచేయడానికి సిద్ధపడ్డారు. అది జపాన్ పునరుజ్జీవానికి సంబంధించిన అంశంగా వారు చూస్తారు' అన్నారు సత్నామ్ సింగ్.
అంతేకాదు, జపాన్‌లోని హోటళ్లలో పనిచేసే సిబ్బంది అక్కడికి వచ్చే అతిథుల నుంచి ఎలాంటి టిప్స్ ఆశించరని కూడా ఆయన చెప్పారు.

భాషపై పట్టు సాధిస్తేనే
జపాన్‌లో నివసించడానికి నిర్ణయించుకున్నాక అక్కడి భాష నేర్చుకోవడం తప్పనిసరని గుర్తించి తామంతా నేర్చుకున్నామని ఉజ్వల్ సాహ్నీ చెప్పారు.
జపాన్ భాష నేర్చుకోవడానికి కనీసం ఆర్నెళ్లు పడుతుందన్నారు సాహ్నీ.
అయితే, నాలుగేళ్ల కిందట టోక్యో వచ్చి బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న హర్‌దీప్ సింగ్ రతన్ మాత్రం జపాన్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని చెప్పారు. భాష కూడా సమస్యేనని, అక్కడి భాషపై పట్టు సాధించకపోతే ఇబ్బంది తప్పదని హర్‌దీప్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








