జపాన్ దీవుల్లోని కొండకోనల్లో దాగిన ప్రాచీన ఆలయాల విశేషాలు...

జపాన్ అడవుల్లో దాగిన ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాబ్ గాస్
    • హోదా, బీబీసీ ట్రావెల్

అడవిలో సంచారం

క్రీస్తుశకం 816లో కుకాయి అనే ఒక జపాన్ సాధువు కొత్తగా స్థాపించిన షిన్గోన్ తెగకు చెందిన ఎసోటెరిక్ బుద్ధిజంకి ఒక స్థావరం స్థాపించడానికి జపాన్ లోని వాకాయామా మండలంలో ఉన్న మౌంట్ కోయా-సన్ లో ఉన్న దట్టమైన వన్య ప్రాంతాలలో సంచరించారు.

అక్కడ ,8 పర్వత శిఖరాలను చుట్టుకుని 800 అడుగుల లోతులో ఉన్న లోయను ఆయన తన స్థావరం ఏర్పాటు కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ పర్వత శిఖరాల అంచులు ఎనిమిది రేకులు విచ్చుకున్న కలువ పూవును పోలి ఉంటాయి. 12 దశాబ్దాల తర్వాత 117 దేవాలయాలు ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ప్రాంతాన్ని జపాన్లో అతి పవిత్రమైన స్థలాలలో ఒకటిగా చెబుతారు. ధూపపు పరిమళం, సాధువుల మంత్రోచ్చారణ, అడవుల్లో నెలకొన్న ప్రాచీన కాలపు సమాధులతో నిండిన ఈ ప్రాంతంలో కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మరెక్కడా లభించదు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

ప్రకృతి ఆరాధన

పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గాలుగా చెప్పుకునే కుమానోకోడో లో కోయాసన్ ఇప్పుడొక అంతర్భాగంగా ఉంది. ఇక్కడ కొన్నిచోట్ల కనిపించే ఎత్తయిన సెడార్, సైప్రస్ వృక్షాలు, తృళ్ళిపడే జలపాతాలు, దేవాలయాలతో పొదిగిన పర్వత శిఖరాలు ఆకాశంలోంచి మబ్బుల్లోంచి రాలిపడినట్లుగా అనిపిస్తాయి.

నాచు పట్టిన రాళ్లు, మట్టి దారులతో కూడిన ఈ 307 కిలోమీటర్ల మార్గం మూడు కుమానో మందిరాలను కోయా-సన్ తో కలుపుతుంది. ఇక్కడకు ఏటా 1.5 లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ప్రకృతిని ఆరాధించే జపనీయుల నమ్మకానికి ఇది అద్దం పడుతుంది. అడవులు, రాళ్లలో భగవంతుని ఆత్మ చేరి ఉంటుందని, ప్రకృతిలో ప్రతి అంశం దైవికమని జపాన్లోని షింటోయిజం మతం విశ్వసిస్తుంది.

కోయా-సన్ ప్రాంతంలో విస్తరించిన 117 మందిరాలలో 50 వరకు సందర్శకులకు విశ్రాన్తి గదులుగా ఉన్నాయి. వీటిని షుకోబో ఇన్ అంటారు. సందర్శకులు ఇక్కడ ఉండి ధ్యానం చేసుకోవడం గాని, సాధువులతో సంభాషించడం గాని చేయవచ్చు.

కుకాయి ఈ ప్రాంతాన్ని మొదటి సారి కనుగొన్న 1200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఆత్మ ఒక శాశ్వత ధ్యానంలో ఇక్కడే నివసిస్తుందని భావిస్తారు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

ఎగిరే గాలిపటం (సాంకో)

ఈ కోయా-సన్ ప్రాంతానికి కుకాయి ఎలా వచ్చారనేది కాస్త నిజం, కాస్త కట్టు కథలా అనిపిస్తుంది. ఇక్కడకు రాక ముందు ఆయన ఎసోటెరిక్ బుద్ధిజంని అధ్యయనం చేయడానికి చైనాలో గడిపారు. ఆయన క్రీస్తు శకం 806 లో జపాన్ కి తిరిగి వస్తుండగా పూజా క్రతువుల్లో వాడే ఒక శంఖాన్ని గాలిలోకి విసిరి, "నేను ఈ భోధనలను నేర్చుకున్నాను. అయితే వీటిని వ్యాప్తి చేయడానికి ఒక మంచి ప్రదేశం దొరికితే నువ్వు వెళ్ళి ఆ ప్రాంతాన్ని నాకు చూపించు" అని అన్నారని, పౌరాణిక కథలు చెబుతాయి.

ఈ శంఖం కోయా -సన్ వైపు వెళ్ళింది. కుకాయి 10 సంవత్సరాల తర్వాత అడవులలో ప్రయాణిస్తూ ఉండగా దారిలో ఆయన ఒక వేటగాడిని, కుక్కలను కలిశారు. వారు అక్కడొక పైన్ చెట్టుకు చిక్కుకుని ఉన్న శంఖాన్ని చూపించారని చెబుతారు.

16వ శతాబ్దం నాటి కోయా- సన్ ప్రధాన దేవాలయం కోంగోబుజి దగ్గర ఉండే శపథపు పలకల మీద ఈ వేటగాడు, కుక్కల చిత్రాలు కనిపిస్తాయి. దాని మీద ఇక్కడకు వచ్చే సందర్శకులు వారు భగవంతునికి చేసే ప్రార్థనలను రాస్తారు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

పవిత్ర స్థలం

కుకాయి ఇక్కడ మందిరాలను నిర్మించక ముందు జపాన్ రాచరికపు న్యాయస్థానం నుంచి అంగీకారం తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి అప్పటి చక్రవర్తి సాగా క్రీస్తు శకం 816లో ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి కోయా- సన్ క్రమ క్రమంగా విస్తరిస్తూ ఎడో యుగం (1603 -1868) నాటికి 1000 చిన్న మందిరాల నిర్మాణం జరిగింది. ఇవన్నీకలిపి నేడు మొత్తం 117 మందిరాలుగా ఉన్నాయి. వీటికి జపాన్ రాచరిక కుటుంబం నుంచి, ధనిక వర్గాల నుంచి, సమురాయ్ ప్రభువుల నుంచి , మరి కొంత మంది సాధారణ ప్రజల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కోయా- సన్ లో ఉన్న ఒకునోయిన్ సమాధిలో తనువు చాలించి కుకాయి ఆత్మకు దగ్గరగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు.

ఒకునోయిన్ సమాధిలో కనిపించే కొత్త స్మారకాలను చూస్తే కొన్ని కొన్ని అగ్ర సంస్థలు కూడా ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. నిస్సాన్, పానాసోనిక్, షార్ప్ లాంటి సంస్థల్లో పని చేసే చాలా మంది సిబ్బందికి ఇక్కడ స్మారకాలు ఉన్నాయి. కొంత మంది వారి సహచరులకు, ఖాతాదారులకు నివాళులు అర్పించడానికి వచ్చి వారి బిజినెస్ కార్డులను పోస్ట్ బాక్సులలా ఉండే స్మారకాలలో పెట్టి వెళతారు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

ఇక్కడ కనిపించే పర్యటక బస్సులు, రక రకాల సావెనీర్ల దుకాణాలు , జన సందోహం చూస్తుంటే కోయా- సన్ పర్యటక ప్రాంతంలా కనిపిస్తుంది. ఇక్కడకు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. అందులో 60,000 మంది మాత్రమే ఇతర దేశాలకు చెందిన వారు ఉంటారు. ఒకునోయిన్ మాత్రం ఇంకా పౌరాణిక కాలం నాటి ఆధ్యాత్మిక ప్రాంతాన్ని తలపిస్తూ ఉంటుంది.

కోయ-సన్ లో నివసించే 3000 మంది జనాభాలో అత్యధికులు షింగోన్ వర్గానికి చెందిన వారే ఉంటారు. అందులో కొంత మంది సాధువులు, సమాధి పలకలు తయారు చేసే రాతి పరిశ్రమల్లో పని చేసే సన్యాసులు కూడా ఉంటారు.

ఇక్కడ ఉన్న మందిరాలు మాత్రమే కాకుండా ఈ ప్రాంతం ఒక సాధారణ జపాన్ పట్టణాన్ని తలపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీధుల్లో, పచారీ దుకాణాలు, నూడుల్స్ అమ్మే దుకాణాలు, మద్యం, మాంసం దొరికే ఇజకాయ పబ్ లు, కూడా ఉంటాయి. కోయా- సన్ ఆసక్తికరమైన ప్రాచీనతను కాపాడుకుంటూనే ఆధునికతతో కూడిన ఒక సమతుల్యతను పాటించడానికి ప్రయత్నిస్తోంది.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

కోయా- సన్ కి ఎలా వెళ్ళాలి?

కోయా- సన్ కి కొంత మంది భక్తులు ఇప్పటికీ నడిచి వెళుతూ ఉంటారు. కానీ, ఇక్కడకు రావడానికి కార్లు, రైళ్లు, కోచ్ లు ఉన్నాయి. కోయా- సన్ కొండ కింద నుంచి 5 నిమిషాల కేబుల్ కారు ప్రయాణంతో 900 మీటర్ల దూరంలో ఉండే కోయా- సన్ శిఖరాల పైకి చేరవచ్చు. అయితే ఈ మార్గం రాక ముందు, జపాన్లో యాత్రీకులందరూ ఈ 21 కిలోమీటర్ల చోయ్షిమిచ్చి ప్రయాణాన్ని 1705 లో నిర్మించిన 25.8 మీటర్ల ఎత్తున్న ప్రవేశ ద్వారం ద్వారా పూర్తి చేసేవారు. దారికి రెండు వైపులా ఉండే కోంగోరిక్షి అనే దేవతా విగ్రహాలు ఆ మార్గానికి కాపలా కాస్తాయని చెబుతారు.

కానీ, ఒకప్పుడు మౌంట్ ఫ్యూజీ పర్వత సానువులు ఎలా అయితే మహిళలకు ప్రయాణం చేసేందుకు అనువుగా ఉండేవి కాదో, అలాగే, 1872 వరకు మహిళలను కోయా- సన్ కి రావడానికి అనుమతించే వారు కాదు. ఆ పక్కనే ఉండే డైమన్ ట్రయిల్ దగ్గర వరకు వచ్చి వారు ప్రార్ధనలు చేసుకుంటూ ఉండే వారు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

అందరికీ ప్రవేశం

పాత మార్గం మీద డైమన్ తర్వాత ఉండే మజిలీ డాంజో గారాన్. ఇక్కడ కుకాయి అనుచరులు కోయా- సన్ లో నిర్మించిన 12 వరకు మందిరాలు ఉంటాయి. ఇది నేడు కోయా- సన్ కి వచ్చే భక్తులకు సందర్శకులకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ ఉండే చాలా భవనాలు ఆధునికమైనవే. ముఖ్యంగా ఈ ప్రాంతపు వాటికల్లోనే కుకాయి విసిరిన శంఖం వచ్చి చేరిందని అంటారు.

అయితే, ఇక్కడ 47 మీటర్ల 2 అంతస్థుల కొంపోన్ డైటో పగోడా ప్రస్ఫు టంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని దర్శించే భక్తులు అక్కడుండే డైనిచ్చి విగ్రహానికి పూజ చేసే ముందు బూజు పట్టినట్లు ఉండే, ఘాటైన లవంగ వాసన వచ్చే సౌరభాన్ని వాళ్ళ చేతుల పై రుద్దుకుని తమను తాము పవిత్రం చేసుకుంటూ ఉంటారు. ఎసోటెరిక్ బుద్ధిజంలో ఈ విగ్రహాన్ని భక్తికి ప్రధాన మూర్తిగా కొలుస్తారు.

ఈ విగ్రహం చుట్టూ 4 రక్షక విగ్రహాలు కాపలా కాస్తూ ఉంటాయి. రంగులు వేసిన 16 స్తంభాలు కలిపి అధిభౌతిక విశ్వపు చిత్రాన్ని తలపిస్తూ ఉంటాయి. ఇక్కడకు మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చని అక్కడుండే సన్యాసి చెప్పారు.

"షిన్గోన్ అందరినీ ఆహ్వానించే మతమని, కోయా-సన్ సందర్శించడానికి మత విశ్వాసమే ఉండనక్కర లేదని, ఇక్కడకు వచ్చే చాలా మందికి మత విశ్వాసం ఉండదని, ఎవరైనా వచ్చి దీపం గాని, ధూపం వెలిగించవచ్చని ఆమె చెప్పారు.

జపాన్ అడవుల్లో దాగిన ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

ఆధ్యాత్మిక కేంద్రం

డాంజో గారాన్ నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో కోంగోబుజి ఉంటుంది. ఇది దేశంలో ఉన్న 3600 షిన్గోన్ దేవాలయాలకు ప్రధాన మందిరం. కోయా-సన్ ప్రమాణాల ప్రకారం కొంగో బుజి ఇటీవల చేరిన కొత్త ప్రాంతం. దీనిని అప్పటి జపాన్ పాలకుడు టొయోటోమీ హిదెయోషి 1593లో ఆయన తల్లి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఆయనకు కుటుంబంలో తల్లి తప్ప వేరే ఎవరూ ఇష్టం లేకపోవడంతో ఆయన మేనల్లుడిని ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకోమని ఆదేశించారు. ఆయన మేనల్లుడు కోంగోబుజి లో ఉన్న ఒక తాతామి (ధ్యాన ఆసనం) ఉన్న గదిలో ఆయన ఆదేశాలను పాటించారు. ఆయన గది కున్న తలుపుల మీద మంచులో మునిగిన చెట్టు పై వాలిన ఒక పక్షి చిత్రం ఉంటుంది. టొయోటోమీ అధికారానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ కళాకృతి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది.

ఇసుక మీద ఉండే 140 గ్రానైట్ రాళ్లతో స్త్రీ పురుష డ్రాగన్ల ఆకారంలో ఉంటూ మబ్బుల నుంచి పుట్టినట్లు ఉండి ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నట్లు కనిపించే బాన్ర్యుటెయ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది జపాన్లో అతి పెద్ద రాక్ గార్డెన్.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

ప్రత్యేక స్మశానం

కోయా-సన్ కి అవతలి వైపు, కేబుల్ కార్ స్టేషన్ వైపు ఒకునోయిన్ ఉంటుంది. ఇక్కడ దట్టంగా ఉండే అడవుల మధ్య ఉండే సమాధులను దాటుకుని యాత్రీకులు 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కోయా-సన్ పవిత్ర స్థానాన్ని చేరుకోవచ్చు. ఇక్కడే శాశ్వత ధ్యానంలో ఉన్న కుకాయి సమాధి ఉంటుంది. ఒకునోయిన్ ఎత్తైన సెడార్ వృక్షాల నీడలో నడుస్తుంటే సుమారు 200000 సమాధులు, బౌద్ధ స్మారకాలు కనిపిస్తాయి. ఈ స్థూపాలన్నీ బూజు పట్టి, ఎర్రని వస్త్రం ధరించిన చిన్నచిన్న జిజో విగ్రహాలు ఆ చెట్ల మధ్య నుంచి పడే వెలుతురులో వైభవంగా కనిపిస్తూ ఉంటాయి.

అక్కడ నుంచి టోరోడో కి వెళతారు. సమాధి ఎదురుగా ఉండే హాలు అది. ఇక్కడ భక్తులు విరాళంగా ఇచ్చిన 10,000 లాంతర్లు నిత్యం అఖండ దీపాల్లా వెలుగుతూనే ఉంటాయి.

జపాన్ అడవుల్లో దాగిన ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

పగలు/రాత్రి

ఒకునోయిన్ కి పగటి పూట వెళితే తెలుపు వస్త్రాలు, సూదిగా ఉండే టోపీని ధరించిన ఆధునిక యాత్రీకులు, పొడవాటి గౌన్ల లాంటి వస్త్రాలను ధరించిన సాధువులు కనిపిస్తూ ఉంటారు. వారికి ఫోటోలు తీసే సందర్శకుల సంఖ్య అక్కడుండే స్థానికుల కంటే ఎక్కువగా ఉంటుంది. రాత్రయ్యేసరికి మాత్రం ఇక్కడ వాతావరణం, కలిగే అనుభూతి పూర్తిగా మారిపోతాయి.

జనమంతా మాయమయ్యేటప్పటికీ లాంతర్లు వెలిగించిన దారంతా ఒక తెలియని కీడు శంకించేలాంటి విచారకరమైన వాతావరణం ఆవరించేస్తుంది . ఆ భయంకరమైన నిశ్శబ్ద వాతావరణంలో అప్పుడప్పుడూ వినిపించే కీటకాల చప్పుళ్ళు, చెట్ల మీద నుంచి ఎగిరే ఉడతలు శబ్దం తప్ప మరేమీ వినిపించదు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

దేవాలయాలలో బస

కోయా- సన్ లో ఉన్న 52 మందిరాలలో షుకోబో వసతి గృహాలలో బస చేయడం ఒక విశేష అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ తాతామి చాపలతో కూడిన గదులు, ఫుటోన్ మంచాలు ఉంటాయి.

అయితే వీటిని ఇక్కడుండే సాధువులే నిర్వహిస్తారు. ఇవి దేవాలయాల ప్రాంగణంలోనే ఉంటాయి. ఆహారాన్ని ఇక్కడుండే యువ సాధువులు గదులలోకే తెచ్చి అందిస్తారు. అక్కడ పర్వతాలలో దొరికే కాయగూరలు, టోఫు, బీన్స్ తో వండిన పదార్ధాలు ఆహారంలో ఉంటాయి. షిన్గోన్ సంప్రదాయంలో శాఖాహారమే తింటారు.

"కఠినమైన బౌద్ధ సిద్ధాంతాల ప్రకారం మాంసాహారం నిషిద్ధం. కుకాయి కోయా- సన్ ని కనిపెట్టినప్పటి నుంచీ ఇదే పద్ధతి అమలులో ఉంది" అని ఎకోయిన్ మందిరంలో ఉండే ఒక సాధువు సెష్షు కొండో చెప్పారు. "వీటికి రుచిని తేవడం కోసం చాలా తక్కువ సరుకులు, తేలికపాటి పదార్ధాలు వాడతారు.

జపాన్ ప్రాచీన ఆలయాలు

ఫొటో సోర్స్, Alamy

అగ్ని క్రతువులు

షుకోబోకి వెళ్లే అతిధులు కచ్చితంగా సాధువులు జీవించే విధానాన్నే చవి చూడరు. కానీ, కొన్ని ధ్యాన సమావేశాలకు హాజరై, పవిత్రమైన బౌద్ధ సూత్రాలను రాయడం, ఎకోయిన్ మందిరాల దగ్గర తెల్లవారు జామున జరిగే ప్రార్థనలకు హాజరవడం ద్వారా కొంత వరకు వారు జీవిత అనుభవాన్ని అనుభూతి చెందవచ్చు.

ఇక్కడ కాస్త చీకటిగా ఉండే చిన్న హాల్లో జరిగే 30 నిమిషాల క్రతువులో చుట్టూ ఉన్న సాధువులు మంత్రాలు వల్లిస్తూ వాయిద్యాలు వాయిస్తూ ఉండగా, ఒక సాధువు అగ్నిహోత్రంలో సమిధలు వేస్తూ ఉంటారు. అందులో జ్వాలలు ఒక తరంగంలా ఎగురుతూ, తగ్గుతూ ఉంటాయి. ఈ అగ్నిని బుద్ధుని జ్ఞానానికి ఆ అగ్నిహోత్రంలో వేసే సమిధలను మనిషి దుఃఖానికి కారణమైన కోరికలకు ప్రతీకగా చెబుతారు. ఇక్కడ ప్రార్ధన చేయడం ద్వారా బుద్ధుడు ఈ దుఃఖాన్ని తొలగిస్తారని నమ్ముతారు.

"ఈ మంత్రోచ్చారణతో కూడిన అగ్నికి ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది. ప్రతికూల శక్తిని తొలగించడానికి, హానికరమైన ఆలోచనలు, కోరికలను నాశనం చేయడానికి , కోరికలను సాధించుకోవడానికి , ఆశీర్వచనాలు పొందటానికి ఈ అగ్నిహోత్రం చేస్తామని కొండో చెప్పారు. "ఇదొక వర్ణనాతీమైన అనుభూతి" అని అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)