ఫుకుషిమా విధ్వంసం: భూకంపం, సునామీ, న్యూక్లియర్ పేలుళ్ల విధ్వంసం నుంచి జపాన్ ఎలా కోలుకుంటోంది?

జపాన్‌లో 2011లో వచ్చిన భూకంపం మున్నెన్నడూ లేనంత విధ్వంసం సృష్టించింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జపాన్‌లో 2011లో వచ్చిన భూకంపం మున్నెన్నడూ లేనంత విధ్వంసం సృష్టించింది
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

సరిగ్గా ఒక దశాబ్దం కిందట మార్చి నెలలో ఒక మధ్యాహ్నం జపాన్‌లో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం తూర్పు తీరాన్ని కుదిపేసింది.

రిక్టర్ స్కేలు మీద అత్యధికంగా 9.0 తీవ్రతను నమోదు చేసిన ఈ భూకంపం భూమిని అక్షం నుంచి పక్కకు జరిగేలా చేసింది. భూకంపంతో ఎగసిపడ్డ సునామీ హోన్షూ దీవిని ముంచెత్తింది. అక్కడి నగరాలను పూర్తిగా ప్రపంచ పటంలో కనిపించకుండా తుడిచిపెట్టేసింది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.

ఈ భూకంప తీవ్రత వలన ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోకి ఒక భారీ అల రక్షణ వలయాలను చేధించుకుని ప్లాంటులో ఉన్న రియాక్టర్లను ముంచేస్తూ, రానున్న విపత్తుకు సంకేతాన్నిచ్చింది.

ప్లాంటు నుంచి వెలువడే రేడియషన్ పెరుగుతూ ఉండటంతో అధికారులు ఆ చుట్టు పక్కల ఉండే మినహాయింపు ప్రాంత పరిధిని పెంచుతూ వెళ్లారు. దీంతో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సుమారు 1,50,000 మంది ప్రజలను తరలించాల్సి వచ్చింది.

ఒక దశాబ్దం తర్వాత కూడా ఆ నిషిద్ధ ప్రాంతం అలాగే ఉంది, కానీ, అక్కడ నుంచి తరలి వెళ్లిన నిర్వాసితులు మాత్రం వెనక్కి తిరిగి రాలేదు. ఇప్పటికే ఈ ప్రాంతం పునరుద్ధరణ కోసం జపాన్ కొన్ని లక్షల కోట్ల యెన్ లను ఖర్చు పెట్టింది. కానీ, ఇక్కడ పూర్తి స్థాయిలో పని పూర్తి కావడానికి మరో 40 సంవత్సరాలు పడుతుందని భావిస్తోంది.

ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ 2011 మార్చిలో మంటలు చెలరేగడాన్ని చూపిస్తున్న ఉపగ్రహ చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ 2011 మార్చిలో మంటలు చెలరేగడాన్ని చూపిస్తున్న ఉపగ్రహ చిత్రం

ప్లాంటు ఎక్కడ ఉంది?

ఫుకుషిమా దైచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకుమా పట్టణంలోని ఫుకుషిమా మండలంలో నెలకొని ఉంది. ఇది జపాన్ తూర్పు తీరంలో రాజధాని టోక్యోకు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మార్చి 11, 2011లో ఏర్పడిన గ్రేట్ ఈస్ట్ జపాన్ ఎర్త్ క్వేక్ ఫుకుషిమా ప్లాంటుకు 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెండై నగరపు తూర్పు భాగాన్ని కుదిపేసింది. సునామి తీరాన్ని తాకుతుందన్న హెచ్చరిక అక్కడి ప్రజలకు కేవలం 10 నిమిషాల ముందే తెలిసింది.

సునామి, భూకంపం, న్యూక్లియర్ ప్లాంటు ప్రమాదం వలన మొత్తం మీద 5 లక్షల మంది ప్రజలు వారి ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.

సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఫుకుషిమా పవర్ ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఫుకుషిమా పవర్ ప్లాంట్

ఫుకుషిమా దగ్గర ఏంజరిగింది?

న్యూక్లియర్ ప్లాంటు దగ్గర అమర్చిన భూకంప సంకేత పరికరాలు భూకంప సూచనను కనిపెట్టడంతో న్యూక్లియర్ రియాక్టర్లను ఆపేసారు. రియాక్టర్ల చుట్టూ కూలంట్ పంపింగ్ అవ్వడానికి అత్యవసర పరిస్థితుల్లో వాడే డీజిల్ జెనరేటర్లను కూడా ఆన్ చేశారు. లేదంటే, అవి ఆపివేసిన తర్వాత కూడా విపరీతమైన వేడిని వెదజల్లుతాయి.

కానీ, 14 మీటర్ల సముద్రపు కెరటం ఫుకుషిమాని తాకినప్పుడు, ఆ పెను అల న్యూక్లియర్ ప్లాంట్ ప్రహారీ గోడను దాటి ఆ ప్రాంగణాన్ని ముంచెత్తింది. దీంతో జెనరేటర్లు కూడా పని చేయడం మానేశాయి.

కరెంటును పునరుద్ధరించడం కోసం కార్మికులు ప్రయత్నించారు. కానీ, ఒక రియాక్టర్లో ఉన్న న్యూక్లియర్ ఇంధనం వేడెక్కిపోయి వాటి ముఖ్య భాగాలను కొంత వరకు కరిగించేసింది. దీనినే న్యుక్లియర్ మెల్ట్ డౌన్ అని అంటారు.

రసాయనిక విస్ఫోటనాల వల్ల ప్లాంటు భవనాలన్నీ నాశనమయ్యాయి. వాతావరణంలోకి రేడియో యాక్టివ్ పదార్ధాలు వెలువడడం ప్రారంభించాయి. మరో వైపు పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన సునామి, అక్కడ నుంచి ప్రజలను తరలించాల్సిన ప్రాంతాల పరిధిని పెంచింది.

చిన్నారులకు రేడియేషన్ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నారులకు రేడియేషన్ పరీక్షలు

ఎంత మంది గాయపడ్డారు?

న్యూక్లియర్ విపత్తు సంభవించిన వెంటనే మరణాలు నమోదు కాలేదు. ఈ పేలుళ్లలో కనీసం16 మంది కార్మికులు గాయపడగా, కొన్ని డజన్ల మంది రేడియషన్కి గురయ్యారు. వారు రియాక్టర్లను చల్లబరచడానికి పని చేయాల్సి వచ్చింది.

అధిక రేడియషన్ కి గురి కావడంతో ముగ్గురిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.

ఈ రేడియషన్ వలన కలిగే దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందన్ని ఇప్పటికీ తేలాల్సిన విషయమే.

ఈ ప్రాంతంలో ఈ ఉత్పాతం వల్ల పరిగణించాల్సిన రీతిలో క్యాన్సర్ రోగం పెరగలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013 లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

జపాన్ శాస్త్రవేత్తలు, బయట వారు కూడా కూడా ఈ రేడియషన్ వలన కలిగిన ముప్పు తక్కువే ఉందని తేల్చేశారు.

ఐక్యరాజ్య సమితి మార్చి 09, 2021లో విడుదల చేసిన నివేదిక కూడా ఈ ఉత్పాతం వల్ల సంభవించిన రేడియషన్ వలన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు లేవని చెప్పింది. అయితే, భవిష్యత్తులో రేడియషన్ వల్ల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపించటం లేదని స్పష్టం చేసింది.

అయితే, దీని వలన చాలా ప్రమాదాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. స్థానికులు మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారు. అధికారులు ఇక్కడ ఆంక్షలను తొలగించినప్పటికీ చాలా మంది వెనక్కి తిరిగి రాలేదు.

ఈ రేడియషన్ తాకిడికి గురై ఒక కార్మికుడు మరణించినట్లు జపాన్ ప్రకటించి ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.

అయితే, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లే క్రమంలో చాలా మంది మరణించినట్లు ధ్రువీకరించారు.

ఫుకుషిమా ఘటనను 7వ స్థాయి ఘటనగా ( లెవెల్ 7 ఈవెంట్) ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వర్గీకరించింది. చెర్నోబిల్ ఘటన తర్వాత ఆ స్థాయిలో చోటు చేసుకున్న విపత్తు ఇదే.

ఫుకుషిమా దుర్ఘటనపై ప్రజల నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫుకుషిమా దుర్ఘటనపై ప్రజల నిరసన ప్రదర్శనలు

తప్పెవరిది?

అయితే, ఈ ఘటనకు ముందు సన్నద్ధంగా లేకపోవడాన్ని, ప్లాంట్ నిర్వాహకులు, టోక్యో ఎలక్ట్రిక్ పవర్, ప్రభుత్వం నుంచి వచ్చిన అస్పష్టమైన స్పందనను విమర్శకులు విమర్శించారు.

జపాన్ పార్లమెంట్ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఫుకుషిమా ఘటనను మానవ తప్పిదంగా పేర్కొంది.

ఇంధన సంస్థ భద్రతా నియమాలను పాటించలేదని చెబుతూ అలాంటి ఘటనను ఎదుర్కోవడానికి తగిన సంసిద్ధతను కలిగి లేదని తెలిపింది. అయితే, 2019లో ఒక జపాన్ కోర్టు ఈ నిర్లక్ష్యానికి సంబంధించి నమోదు చేసిన క్రిమినల్ కేసు నుంచి మాత్రం మాజీ టెప్కో ఉద్యోగులకు విముక్తి కల్పించింది.

అప్పటి జపాన్ ప్రధాన మంత్రి యొషిహికో నోడా 2012లో ఈ ఘటనకు సంబంధించిన నిందను ప్రభుత్వం కూడా పంచుకుందని అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం పాక్షికంగా బాధ్యత తీసుకున్నందున అక్కడి నుంచి వెళ్లిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని 2017లో కోర్టు తీర్పునిచ్చింది.

న్యూక్లియర పవర్ ప్లాంటుకు రెండున్న కిలోమీటర్ల దూరంలో తన కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న హిసే ఉనూమా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, న్యూక్లియర పవర్ ప్లాంటుకు రెండున్న కిలోమీటర్ల దూరంలో తన కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న హిసే ఉనూమా

ఇక్కడ పనులెలా జరుగుతున్నాయి?

ఈ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత కూడా జపాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న చాలా పట్టణాలు నిర్జీవంగానే ఉన్నాయి.

ఆ ప్రాంతాన్ని ప్రక్షాళన చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాని వలన అక్కడ నివాసం ఉండే వారు వెనక్కి తిరిగి వస్తారని భావిస్తున్నారు.

అయితే, ఇంకా చాలా సవాళ్లున్నాయి. ఇక్కడ పేరుకుపోయిన న్యూక్లియర్ వ్యర్ధాలను, ఇంధనపు రాడ్లను, కొన్ని మిలియన్ టన్నుల రేడియో యాక్టివ్ పదార్ధాలతో నిండిన నీటిని తొలగించడానికి రానున్న 30 - 40 సంవత్సరాలలో కొన్ని వేల మంది కార్మికులు అవసరమవుతారు.

కానీ, ఇక్కడ ఉండే రేడియషన్ వల్ల కొంత మంది స్థానికులు ఎప్పటికీ ఈ ప్రాంతానికి తిరిగి రావాలని అనుకోవడం లేదు. వారంతా మరో చోట కొత్తగా జీవితాలను కూడా మొదలు పెట్టారు.

ప్రభుత్వం వచ్చే ఏడాది మొదటి నుంచి రేడియో యాక్టివ్ పదార్ధాలను తొలగించిన నీటిని పసిఫిక్ మహా సముద్రంలోకి వదలడం మొదలు పెట్టవచ్చని 2020లో వచ్చిన కొన్ని మీడియా రిపోర్టులు చెప్పాయి.

ఈ మహా సముద్రంలో ఈ నీరు కలిసిపోవడం వలన మనుషులు, పశువుల ఆరోగ్యానికి ముప్పు పెద్దగా ఉండదని కొంత మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కానీ, ఈ నీటిలో ఉండే పదార్ధాలు మానవ డీఎన్ఏకు హాని చేయవచ్చని పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ చెబుతోంది.

ఇప్పటి వరకు ఈ నీటిని ఏమి చేయాలనే విషయంపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)