మనిషిక్కడ - మనసక్కడ: ఆంధ్ర, తెలంగాణల్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

తెలంగాణలో వికారాబాద్‌కి చెందిన చంద్రరేఖకు కర్నూలు జిల్లాలో డిగ్రీ లెక్చరెర్‌గా ఉద్యోగం వచ్చింది. తరువాత రాష్ట్రం విడిపోయింది. కానీ ఆవిడ ఉద్యోగం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతోంది. ఆమె భర్తది హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం. తమ సొంత రాష్ట్రానికి రావాలని ఆమె కోరుతోంది. కానీ పరిస్థితి వేరే రకంగా ఉంది.

ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్లానింగ్ విభాగంలో పనిచేస్తోన్న సంపత్ రెడ్డి భార్యకు విశాఖపట్నంలో విద్యా శాఖలో ఉద్యోగం ఉంది. వీరిదీ ఇదే పరిస్థితి.

భర్త అక్కడా.. భార్య ఇక్కడా.. సొంతూరు ఇక్కడ.. ఉద్యోగం అక్కడా.. తండ్రి లోకల్ స్టేటస్ తెలంగాణ.. పిల్లల లోకల్ స్టేటస్ ఆంధ్ర.. ఇలా చెప్పుకుంటే ఆంధ్ర - తెలంగాణ అంతర్రాష్ట్ర బదిలీల కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగులు సమస్యలు చాలా చిత్రమైనవి. ప్రత్యేకమైనవి. వీరిలో విద్యా శాఖ వారే అధికం, మిగతా శాఖల వారూ ఉన్నారు.

''భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. విడాకుల వరకూ వెళ్తున్నాయి. ఎవరూ తమ వృత్తి వదలుకోలేరు. ఇక పిల్లలు తమ సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో లోకల్ అవుతారు. వారు పెద్దయ్యాక ఇబ్బంది అవుతోంది. ప్రతిదానికీ దూరాభారం అవుతోంది'' అన్నారు ఇటువంటి ఉద్యోగుల కోసం పోరాడుతున్న మురళీకృష్ణ.

2014లో రాష్ట్ర విభజన జరిగింది. కానీ ఉద్యోగుల విభజన పూర్తి స్థాయిలో చేయలేదు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఉన్నతోద్యోగులను విభజించిన కేంద్రం నియమించిన సంఘాలు, కింది స్థాయి ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోలేదు. దీంతో వారు నరకం చూస్తున్నారు.

వాస్తవానికి ఏ రాష్ట్ర విభజన జరిగినా, పూర్తి స్థాయిలో విభజన జరుగుతుంది. కానీ ఆంధ్ర - తెలంగాణలు విడిపోవడానికి కారణాల్లో కూడా ఉద్యోగాలు ఒకటి. అంత తీవ్రమైన సమస్య రెండు రాష్ట్రాల మధ్యా ఉంది.

రెండు ప్రాంతాలూ కలిసినప్పుడు కూడా ఉద్యోగులు జిల్లా, జోన్ వారీగా విభజితమై, ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేసేలా నిబంధనలు ఏర్పాటు చేశారు. ఒక ప్రాంతం వారు మరో ప్రాంతంలో ఉద్యోగం చేయకుండా ఈ ఏర్పాటు.

కాకపోతే రిక్రూట్మెంట్ సమయంలో అతి కొద్ది మందిని తమ జోన్ పరిధి దాటి వేరే జోన్, వేరే జిల్లాల్లో కూడా నియమించారు. ఓపెన్ కోటాలో వచ్చిన వారూ, సబ్జెక్ట్ పోస్టింగులు ఖాళీలేని వారు.. ఇలా రకరకాల కారణాలతో రెండు చోట్లా, స్థానికేతర ఉద్యోగులు ఉన్నారు.

దీంతో వీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రలో పనిచేస్తోన్న తెలంగాణ ప్రాంతం వారు ‘తెలంగాణ నేటివ్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర’ పేరుతో ఒక సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు

ఫొటో సోర్స్, UGC

''మొత్తం ఉద్యోగులు పది లక్షలు ఉంటే వారిలో 50 వేల మంది రాష్ట్ర స్థాయి సిబ్బందిని విభజించి చేతులు దులుపుకుంది కేంద్రం. మిగిలిన సిబ్బందిని ఎక్కడి వారు అక్కడే అన్నట్లు వదిలేశారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్ర విభజన సమయంలోనూ ఇలా జరగలేదు. నిజానికి రెండు రాష్ట్రల మధ్య పోరాటానికి ఉద్యోగాలు కూడా ప్రధాన కారణం. అందుకేనేమో, కేంద్రం ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా, రెండు రాష్ట్రాలూ మాట్లాడుకుని చేసుకోండి. జిల్లా, జోన్, మల్టీ జోన్ పోస్టులను వదిలేశారు. ఆఖరికి పార్లమెంటులో చేసిన విభజన చట్టంలోనూ వీరి ప్రస్తావన లేదు’' అన్నారు మురళీకృష్ణ.

ప్రస్తుతం ఆంధ్రలో పనిచేస్తోన్న తెలంగాణ వారిలో ఎక్కువ మంది 3 లేదా 4వ ఆప్షనల్ గా ఆయా జోన్లను ఎన్నుకుని వెళ్లిన వారే. వారు ఒకేవేళ తిరిగి వస్తే ఇక్కడ వారి సర్వీస్ కోల్పోతారు. ప్రమోషన్లలో వెనుకబడతారు. అయినప్పటికీ వారు వెనక్కు రావాలనే బలంగా కోరుకుంటున్నారు.

2017లో ఒకసారి ఇటువంటి వారికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ అవి మ్యూచువల్, స్పౌజ్ కోటాల్లో. అంటే అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు బదిలీ కోరుకుంటూ, అదే కేడర్, అదే సబ్జెక్ట్ అయితే అప్పుడు వారిని బదిలీ చేశారు. కానీ భార్యా, భర్తల్లో ఎవరో ఒకరు మాత్రమే ఉద్యోగస్తులు అయిన కేడర్ వాళ్లు, సేమ్ సబ్జెక్ట్ దొరకని వారికి ఆ అవకాశం లేదు. దీంతో ఈ ఉత్తర్వులు పనిచేయలేదు. తరువాత ఆ ఉత్తర్వుల గడవు ముగిసింది.

నిజానికి ఇటువంటి వారు ఎంత మంది ఉంటారనేదానిపై స్పష్టమైన సంఖ్య అందుబాటులో లేదు. ఆంధ్ర నుంచి తెలంగాణ రావాలనుకునే వాళ్లలో జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వారు సుమారు 120 మంది, జిల్లా కేడర్ వారు సుమారు 220 మంది ఉంటారు.

ఇక తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లాలనుకే వారు జోనల్, మల్టీ జోనల్ విషయాల్లో 60 -70 మందీ, జిల్లా స్థాయిలో 400-500 మందీ ఉంటారని అంచనా. దీనిపై సమగ్ర అధ్యయనం జరగలేదు. అతి కొద్ది సంఖ్యలో వెళ్లడానికి ఆసక్తి లేని వారు కూడా ఉన్నారు.

గతంలో ఇటువంటి బదిలీలు జరిగినప్పుడు నేటివిటీ ఆధారంగా కాకుండా, ఆప్షనల్‌గా బదిలీ అవకాశం కల్పించడం కూడా కాస్త ఇబ్బంది అయింది. స్థానికేతరులు కూడా హైదరాబాద్ ఆప్షనల్‌గా పెట్టుకున్నారన్న గొడవలు అయ్యాయి. మళ్లీ ఆ ప్రతిపాదనలు ఆపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు

ఫొటో సోర్స్, UGC

''ఇది అతి ముఖ్యమైన ఎమోషనల్ సమస్య. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆంధ్ర, తెలంగాణల మధ్య ఏ ఉద్రిక్తత ఏర్పడినా ఆ ప్రభావం మాపై ఉంటుంది. చుట్టూ వేరే రాష్ట్ర ఉద్యోగులు ఉన్న చోట, మీ వాళ్లే ఇలా చేశారన్న మాటలు తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలో లేకపోతే ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సమస్యలు వస్తాయి. పైగా ఆంధ్ర, తెలంగాణలు విడిపోయిన వాతావరణం, అలాంటిది'' అన్నారు చంద్రరేఖ. ఆమె ఆంధ్రలో పనిచేస్తున్నారు.

ఈ ఉద్యోగుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి గతంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్‌లతో ఒక కమిటి వేశాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. కానీ ఆ కమిటీ నివేదికలో ఏముందో తెలియదు. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు.

ఆర్థిక భారం లేనంత వరకూ ఇటువంటి బదిలీలు ఆమోదించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ గతంలో ఒక అంగీకారానికి వచ్చాయి. కానీ ప్రస్తుతం ఫైల్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగులో ఉందని చెబుతున్నారు ఈ ఉద్యోగులు.

ఉద్యోగుల డిమాండ్లు ఇవే:

  • భార్య ఉద్యోగస్తురాలయినా భర్త‌కు నేటివిటీ ఆప్షనల్ ఇవ్వాలి.
  • 9940 ఉత్తర్వులు మరికొంత కాలం కొనసాగించాలి.
  • రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల కమిటీ నివేదిక బహిర్గతం చేయాలి.
  • సబ్జెక్టుతో సంబంధం లేకుండా బదిలీలకు (హెడ్ టు హెడ్) అనుమతించాలి.

''నిజానికి ఈ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. మేం ఫైల్ తెలంగాణకు పంపాం. వారి నుంచే సమాధానం రావాలి'' అని వ్యాఖ్యానించారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఆంధ్ర రాష్ట్ర ఉన్నతాధికారి.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)