ఇసబెల్లా ఆన్ అలెన్: పుస్తకాలలో దాచుకున్న పువ్వులు, ఆకులే ఆధారంగా ఆమె ఎవరో తెలిసింది

ఫొటో సోర్స్, Rhs
19వ శతాబ్దానికి చెందిన ఒక వృక్షశాస్త్రవేత్తకు సంబంధించిన జీవిత రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఆమె గురించిన వివరాలను ప్రజలే పరిశోధించి వెలుగులోకి తెచ్చారు.
'ఇసబెల్లా అన్నీ అలెన్' అనే ఆ వృక్షశాస్త్రవేత్త ఒక పాత పుస్తకంలోని పేజీల మధ్య దాచిపెట్టి తరువాత తరానికి అందజేసిన మొక్కల రహస్యాలే ఆధారంగా ఆమె వివరాలు కనుగొన్నారు.
ఆమెకు సంబంధించిన సమాచారం కావాలంటూ బీబీసీ న్యూస్ వెబ్‌సైట్‌లో పిలుపునివ్వడంతో ఆమె ఎవరు? ఎక్కడివారన్నది తెలిసింది.
వార్సెస్టర్‌షైర్‌లోని మాడ్రెస్‌ఫీల్డ్ అనే గ్రామంలో ఆమె నివసించినట్లు తేలింది.
'ది ఇంగ్లిష్ ఫ్లోరా' అనే పుస్తకం మధ్యలో దాచిపెట్టిన పువ్వులు, కవితలు, యథాలాప చిత్రాలే ఆధారంగా ఆమె వివరాలు తెలిశాయి.
దశాబ్దాల కిందట రాయల్ హార్టీకల్చరల్ సొసైటీ(ఆర్‌హెచ్ఎస్)కు విరాళంగా ఇచ్చిన ఆ పుస్తకం కూడా అనుకోకుండా దొరికింది. ఆర్‌హెచ్‌ఎస్ నుంచి కొన్ని పుస్తకాలను కొత్త లైబ్రరీలోకి మార్చుతున్న క్రమంలో ఈ పుస్తకాన్ని గుర్తించారు.
ఆ పుస్తకం ఆధారంగా.. దాని అసలు యజమాని స్థానిక సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తిలా అనిపించారని 'ఆర్‌హెచ్ఎస్ లైబ్రరీస్, ఎగ్జిబిషన్స్' హెడ్ ఫియానా డేవిసన్ చెప్పారు.
''ఆమె ఒక గార్డెనర్, వృక్షశాస్త్రవేత్త కూడా'' అని ఫియానా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ న్యూస్ వెబ్‌సైట్‌లో ఈ గార్డెనర్ గురించి వివరాలు తెలిస్తే చెప్పాలంటూ కథనం ప్రచురించిన కొద్ది గంటల్లోనే ఎంతోమంది సంప్రదించారు.
ఓ వ్యక్తి పదే పదే సంప్రదించి సమాచారం పంచుకున్నారు.
ఇసబెల్లా అన్ని అలెన్ 1810లో జాన్ హెన్రీ, సుసానా రెబెకా దంపతులకు జన్మించారని.. తల్లిదండ్రులు, ఎంతో మంది సేవకులతో కలిసి మాడ్రెస్ ఫీల్డ్‌లో తమ రిడ్ హౌస్‌లో నివసించేవారని 1851 నాటి బ్రిటన్ జనగణన లెక్కలు ధ్రువీకరించాయి.
మాల్వరిన్ హిల్స్ దిగువన సెవర్న్ నదికి అత్యంత సమీపంలోనే ఉండే రిడ్ హౌస్‌లో గార్డెన్, సమీప అటవీ ప్రాంతాలు ఆమెకు ఎన్నో మొక్కలను సేకరించే అవకాశం కల్పించాయి.
అంతేకాదు... 1860 జులై నాటి 'వార్సెస్టర్‌షైర్ క్రానికల్' పత్రికలో వచ్చిన ఓ ఆర్టికల్ కూడా ఇసబెల్లాకు సంబంధించిన ఆధారాలు అందించింది.
'మాల్వెర్న్ హార్టీకల్చర్, ఫ్లోరల్ షో'కు 'మిస్ అలెన్ ఆఫ్ ద రిడ్' ఎన్నో మంచి మంచి గులాబీలు పంపించారన్నది ఆ వార్తలో విషయం.

ఫొటో సోర్స్, Rhs
అక్కడికి అయిదేళ్ల తరువాత అలెన్ మరణించారు. ఆమెను మాడ్రెస్‌ఫీల్డ్‌లోనే ఖననం చేశారు.
ఇసబెల్లాకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలు ఆమె సోదరి వద్ద ఉండిపోయాయి. ఆమె వాటిని తన మేనకోడలు మారియా ఆలిస్ ఎంప్సన్‌కు ఇచ్చారు.
అలా తనకు వచ్చిన పుస్తకాలలోని 'ది ఇంగ్లిష్ ఫ్లోరా' నాలుగు వాల్యూమ్‌లను ఎంప్సన్ 1948లో తాను చనిపోవడానికి ముందు ఆర్‌హెచ్ఎస్‌కు విరాళంగా ఇచ్చినట్లు భావిస్తున్నారు.
ఇసబెల్లాకు ఆ పుస్తకాలను 18 ఏళ్ల వయసులో ఆమె స్నేహితురాలు గ్రీన్ ఇచ్చారు.
మొత్తానికి బీబీసీ న్యూస్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది అందించిన వివరాలతో ఇసబెల్లా ఎవరు? ఎక్కడి వారనేది తెలిసిందంటూ ఫియానా డేవిసన్ సంతోషం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- అఖిలేశ్ యాదవ్: అసదుద్దీన్ పార్టీ వల్ల నష్టం లేదు, మైనారిటీల ఓట్లు మాకే
- పాకిస్తాన్లో అఫ్గాన్ రాయబారి కుమార్తెపై దాడి, కిడ్నాప్
- ముంబయిలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి 15 మంది మృతి
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
- కోవిడ్ వ్యాక్సీన్: ఆరు నెలలైనా భారత్‌లో టీకా కార్యక్రమం ఎందుకు వేగవంతం కాలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








