తాలిబాన్లు రావడం సంతోషమే అంటున్న ఓ అఫ్గాన్ కుటుంబం

తన కుటుంబంతో షంసుల్లా
ఫొటో క్యాప్షన్, తల్లీ, కొడుకుతో షంసుల్లా
    • రచయిత, జెరేమీ బోవెన్
    • హోదా, బీబీసీ మధ్యప్రాచ్యం ఎడిటర్, హేల్‌మంద్

మట్టి ఇటుకలతో కట్టిన ఆ ఇంటి లోపలి భాగం చల్లగా, శుభ్రంగా ప్రశాంతంగా ఉంది.

షన్సుల్లా కాళ్ల మీద చిన్న వయసులో ఉన్న ఆయన కొడుకు ఊగుతున్నాడు. ఆయన మమ్మల్ని అతిథులను ఆహ్వానించే గదిలో కూచోపెట్టారు.

నేలపై రగ్గులు పరిచి ఉన్నాయి. గోడలకు ఆనుకోడానికి కనీసం రెండు అడుగులు మందంతో ఉన్న దిండ్లున్నాయి.

గోడకు మెరుస్తున్నవి ఏవో వేలాడుతున్నాయి. అక్కడ అర డజను రంగు రంగుల బాటిళ్లు ఉన్నాయి. కానీ, ఆ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. 20 ఏళ్ల పాటు కొనసాగిన యుద్ధంలో వారి దగ్గర ఉన్నదంతా నాశనం కావడమో, దోచుకోవడమో జరిగింది.

ఆ ఇల్లు మండే ఎండల నుంచి, దుమ్ము తుఫానుల నుంచి రక్షణ అందిస్తుంది. దాని చుట్టూ మందంగా ఉన్న ఎత్తైన మట్టి గోడలు ఉన్నాయి. హేల్‌మంద్ ప్రావిన్సులోని మార్జాహ్‌లోని మిగతా ఇళ్లలాగే అది యుద్ధభూమిగా మారిన పొలాల్లో ఉంది. ఇంట్లో వాళ్లు షంసుల్లా అప్పుడే బయట పొలాల్లోంచి తీసుకొచ్చిన పత్తిని తీస్తున్నారు.

షన్సుల్ నన్ను తన తల్లి గోల్జుమా దగ్గరికి తీసుకెళ్లారు. 65 ఏళ్ల ఆమె తనను ఒక పెద్ద దుప్పటితో తల నుంచి కాలి వేళ్ల వరకూ కనిపించకుండా చుట్టుకుని ఉన్నారు. కళ్ల దగ్గర ఉన్న చిన్న ఖాళీ నుంచి ఆమె నన్ను చూడగలుగుతున్నారు.

తాలిబాన్ ఫైటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబాన్ ఫైటర్

నలుగురు కొడుకులు యుద్ధంలో చనిపోయారు

నాకు ఆమె కళ్లు, ముక్కు కొన్నిసార్లే కనిపించాయి. యుద్ధం వల్ల తమ జీవితం నాశనం అయ్యిందని, ఆ సమయంలో తన నలుగురు కొడుకులు చనిపోయారని గోల్జుమా చెప్పారు. అది చెబుతున్నప్పుడు ఆమె గొంతు చాలా కఠినంగా మారిపోయింది.

ఇప్పుడు ఆమె కొడుకుల్లో షన్సుల్లా మాత్రమే మిగిలారు. 24 ఏళ్ల ఆయన అందరికంటే చిన్నవారు. కానీ ఆయన ముఖం చూస్తే, తన వయసు కంటే పదేళ్లు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తున్నారు.

గోల్జుమా కొడుకుల్లో అందరికంటే పెద్ద వాడైన జియా ఉల్ హక్ 11 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆయన తాలిబాన్ ఫైటర్‌గా పనిచేశారు.

"నా కొడుకు తాలిబాన్లలో చేరాలనుకున్నాడు. ఎందుకంటే, అమెరికన్లు అఫ్గానిస్తాన్, ఇస్లాం రెండింటినీ నాశనం చేయాలని చూస్తున్నారని తను అర్థం చేసుకున్నాడు" అన్నారు గోల్జుమా.

గోల్జుమా మిగతా ముగ్గురు కొడుకులు 2014లో కొన్ని నెలల వ్యవధిలోనే చనిపోయారు. ఖుదరతుల్లా వైమానిక దాడుల్లో చనిపోగా, మిగతా ఇద్దరు హయాతుల్లా, అమీనుల్లాను పోలీసులు వారి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు.

తన ఇద్దరు అన్నలను బలవంతంగా సైన్యంలో చేర్చారని, అక్కడ వాళ్లు చనిపోయారన్న షంసుల్లా "నేను ఇంటి బాధ్యతలు చూసుకోవాలని ఆ అల్లానే నిర్ణయించాడు" అన్నారు.

తాలిబాన్ ఫైటర్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా సైన్యానికి పీడకల

షన్సుల్లా మాతో, "మీరు ఒక చేతిలో ఐదు పుచ్చకాయలు పట్టుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా, నాకు ఇది అలాగే ఉంది" అన్నారు.

ఇంటి బాధ్యతలతోపాటూ తన పెద్ద అన్న జియా చనిపోయాక ఆయన భార్యను షంసుల్లా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. "నాకు ఇప్పుడు కూడా మా అన్నలు చాలా గుర్తొస్తుంటారు" అంటారు షన్సుల్లా.

"అందరికంటే పెద్దన్న చనిపోగానే, ఆయన భార్యను మా రెండో అన్నకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మూడో అన్నకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన కూడా చనిపోవడంతో మా నాలుగో అన్న ఆమెను చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను కూడా హత్య చేశారు. దాంతో ఆమెను నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది" అన్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లో భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించడానికి మొదట అనుమతించింది మార్జాహ్ ప్రాంతంలోనే.

ఆ సమయంలో తమ ప్రత్యర్థులకు భారీ నష్టం జరుగుతుందని, దాంతో అఫ్గానిస్తాన్ ప్రభుత్వం, అమెరికా, బ్రిటన్, మిత్ర దళాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అనుకున్నారు.

"మేం తాలిబాన్లను బయటకు తరిమికొట్టగానే, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మంచి స్కూళ్లు, మెరుగైన ఆరోగ్య సేవలు, స్వేచ్ఛగా కొనసాగే మార్కెట్లు ఉంటాయి" అని అదే ఏడాది అమెరికా సైన్యం ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.

మార్జాహ్‌లోని పత్తి, ఓపియం పొలాల్లో తాలిబాన్ ఫైటర్లతో చేసిన యుద్ధం విదేశీ దళాలకు ఒక పీడకలగా మిగిలిపోయింది.

మూడు నెలలపాటు జరిగిన ఆ పోరాటం తర్వాత అమెరికా కమాండర్ జనరల్ స్టాన్లీ మాక్‌క్రిస్టల్ మార్జాహ్‌ను ఒక 'రక్తం కారే పుండు'గా వర్ణించారు. తర్వాత పదేళ్లపాటు అక్కడ ఎన్నోసార్లు యుద్ధం జరిగింది.

వీడియో క్యాప్షన్, ఇస్లామిక్ స్టేట్‌ తీవ్రవాదులు తాలిబాన్లపై దాడులు ఎందుకు చేస్తున్నారు?

తాలిబాన్లు రావడం సంతోషమే- గోల్జుమా

అఫ్గానిస్తాన్‌ను ప్రజలు నివసించడానికి మరింత మెరుగైన ప్రాంతంగా మారుస్తామని చెప్పిన పశ్చిమ దేశాల నేతలపై గోల్జుమా మండిపడ్డారు.

"నాకు వాళ్ల మిషన్ గురించి ఏం తెలీదు. వాళ్లు మా దేశాన్ని నాశనం చేశారు" అన్నారు.

ఆమెతో నేను "తాలిబాన్లు రాక ముందు మహిళలు ఇక్కడ చాలా చేయగలిగేవాళ్లు. ఇప్పుడు వారు మళ్లీ రావడంతో వారంతా బాధపడుతున్నారు" అన్నప్పుడు గోల్జుమాకు నా మాటపై నమ్మకం కలగలేదు.

"వాళ్లు ఇక్కడ ఉన్నప్పుడు మావాళ్లు చాలా మంది ఎన్నో భరించారు. వాళ్లు మా భర్తలను, సోదరులను, మా కూతుళ్లను చంపేశారు" అన్నారు.

"నాకు తాలిబాన్లు ఇష్టం. ఎందుకంటే వాళ్లు ఇస్లాంను గౌరవిస్తారు. మేం కాబూల్‌లో ఉండే మహిళలు లాంటి వాళ్లం కాదు" అన్నారు.

"తాలిబాన్లు యుద్ధం గెలిచేవరకూ ప్రతి ఒక్కరూ వాళ్లంటే భయపడ్డారు. కానీ ఇప్పుడు అందరూ ఈ యుద్ధం ముగిసినందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు" అంటారు గోల్జుమా.

అయితే, ఆమె స్వేచ్ఛగానే మాట్లాడారా అనే ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే తాలిబాన్ మీడియా కార్యాలయం మాతోపాటూ ఒక తాలిబాన్ బాడీగార్డ్‌ను, అనువాదకుడిని పంపించింది.

మాతోపాటూ ఒక తాలిబాన్‌ వస్తాడనే షరతుతోనే వాళ్లు మమ్మల్ని హేల్‌మంద్ వరకూ వెళ్లనిచ్చారు. వాళ్లు మాతోపాటూ అక్కడ లేకుంటే, తాలిబాన్లంటే ఉన్న భయం గురించి అక్కడ బహుశా చాలా మంది అఫ్గాన్లు మాకు చెప్పేవారేమో.

కానీ, గోల్జుమా నిజమే చెప్పారా అనే విషయంలో మాత్రం నాకు ఎలాంటి సందేహం రాలేదు.

అమెరికా, మిత్ర దళాల సైన్యం వల్ల హేల్‌మంద్‌లో వ్యవసాయం చేసుకుని జీవించేవారు తీవ్రంగా నష్టపోయారని ఆమె మాకు చెప్పారు. దానితోపాటూ తన నలుగురు కొడుకులు చనిపోయిన బాధ ఆమెలో స్పష్టంగా కనిపించింది.

లష్కర్ గాహ్‌లో తాలిబాన్ ఫైటర్లు
ఫొటో క్యాప్షన్, లష్కర్ గాహ్‌లో తాలిబాన్ ఫైటర్లు

కొత్త కాలం, కొత్త సవాలు

అమెరికాపై 9/11 దాడుల తర్వాత 2001లో అమెరికా, బ్రిటన్, మిత్ర దళాలు అఫ్గానిస్తాన్ మీద దాడులు చేశాయి. అల్ ఖైదాను తుడిచిపెట్టేయాలని, వారికి ఆశ్రయం ఇచ్చిన తాలిబాన్లను తరిమికొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

కానీ, ఆ తర్వాత ఏమేం జరిగాయో, వాటిని అర్థం చేసుకోవడం, జరిగిందంతా సరైనదే అని నిరూపించడం చాలా కష్టం. ఎడతెగని ఒక యుద్ధం అఫ్గాన్ ప్రజల జీవితాలను మెరుగ్గా చేయాలనుకున్న వారి అన్ని ప్రయత్నాలనూ అంతం చేసింది.

ఈ దారిలో పశ్చిమ దేశాలు కొన్ని విజయాలు కూడా సాధించాయి. నిజానికి పట్టణ మహిళలు, పురుషుల్లో ఒక తరం విద్యావంతులయ్యారు. ముందుకెళ్లారు. కానీ ఆ ప్రయోజనాలు పేదల వరకూ చేరలేకపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో గోల్జుమా లాంటి కుటుంబాలకు విద్య అందించలేకపోయాయి.

1996లో తాలిబాన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు అక్కడ వారు మతపరమైన, సాంస్కృతిక విశ్వాసాలను అమలు చేడానికి హింసాత్మక మార్గం ఎంచుకున్నారు.

ఇప్పుడు దేశంలో ఎక్కువమంది అఫ్గాన్లు యువతీ యువకులే. వీరికి 9/11 లేదా అమెరికా దాడుల గురించి తెలీదు.

లష్కర్ గాహ్‌లో బీబీసీ కెమెరా చూడగానే యువ తాలిబాన్‌లు తమ మొబైల్ ఫోన్ తీసి వీడియో తీయడం ప్రారంభించారు. విదేశీయులతో సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు.

అక్కడ మొబైల్ డేటా అక్కడ చాలా చౌకగా ఉంది. మాతో ప్రయాణిస్తున్న తాలిబాన్ ఫైటర్ కూడా తన ఫోన్‌లోబీబీసీ పష్తో సర్వీస్ చూస్తున్నాడు.

ఇప్పుడు వారికి ప్రపంచం తలుపులు తెరిచి ఉంది. ఇది 1990వ దశకంలో ఉన్నట్లు లేదు. అప్పట్లో తాలిబాన్లు ఫొటోగ్రఫీపై నిషేధం విధించారు.

తాలిబాన్లలో ఇప్పటి ఫైటర్లు బయటి ప్రపంచం గురించి ఏమీ తెలీని ఆనాటి వారులా లేరు.

అయితే, తాలిబాన్లు ఇప్పుడు మిగతా ప్రపంచానికి దూరంగా ఉండాలని యువ ఫైటర్లపై ఒత్తిడి తీసుకొస్తారా. వారిని స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ నుంచి దూరం చేయగలరా?

"అయితే, ఈసారి కూడా అలా ఒక దేశం మెడలు వంచడం, విచ్ఛిన్నం చేయడం అంత సులభం కాకపోవచ్చు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)