గడ్డం గీయడాన్ని నిషేధించిన తాలిబాన్.. ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమని ప్రకటన

గతంలో తాలిబాన్ పాలన ముగిశాక హెయిర్ సెలూన్లకు ప్రజాదరణ పెరిగింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గతంలో తాలిబాన్ పాలన ముగిశాక హెయిర్ సెలూన్లకు ప్రజాదరణ పెరిగింది

గడ్డం గీయడం లేదా సవరించడం ఇస్లామిక్ చట్టానికి విరుద్ధం అంటూ అఫ్గానిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రాంతంలో హెయిర్‌డ్రెస్సర్లను నిషేధించింది తాలిబాన్.

ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది.

రాజధాని కాబుల్‌లోని బార్బర్లకు కూడా ఇలాంటి ఆదేశాలే వెళ్లినట్లు సమాచారం.

ఈసారి తాలిబాన్ ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ, ఈ నిబంధనలు చూస్తుంటే గతంలో లాగే కఠినమైన పాలన వైపు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

గత నెల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబాన్లు ప్రత్యర్థులపై కఠిన శిక్షలు అమలు చేశారు.

కిడ్నాపర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని తాలిబాన్ మిలిటెంట్లు శనివారం కాల్చి చంపారు. వారి మృతదేహాలను హెరాత్ కూడళ్లలో బహిరంగంగా వేలాడదీశారు.

హెల్మాండ్ ప్రాంతంలో సెలూన్లకు నోటీసులు అతికించారు. జుట్టు కత్తిరించడం, గడ్డం గీయడం మొదలైన విషయాల్లో కచ్చితంగా షరియా చట్టం పాటించాలంటూ హెచ్చరించారు.

"ఫిర్యాదు చేసే హక్కు ఎవరికీ లేదు" అని ఆ నోటీసుల్లో రాసి ఉన్నట్లు బీబీసీ గమనించింది.

"అమెరికా పద్ధతులు పాటించవద్దని, గడ్డం గీయకూడదని" కొందరు బార్బర్లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం.

కొత్త నిబంధనలతో తమ ఉపాధిని కోల్పోతామంటూ బార్బర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కొత్త నిబంధనలతో తమ ఉపాధిని కోల్పోతామంటూ బార్బర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు

గతంలో 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ పాలనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిబంధనలే విధించారు. ఆడంబరమైన కేశాలంకరణ కూడదని, పురుషులు గడ్డాలు పెంచుకోవాలని ఆదేశించారు.

తాలిబాన్ పాలన ముగిశాక, క్లీన్ షేవ్ ఫ్యాషన్ అయింది. ఎంతోమంది అఫ్గాన్ పురుషులు సెలూన్లకు వెళ్లి ఫ్యాషన్‌గా గడ్డం గీయించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం తాలిబాన్ విధించిన కొత్త నియమాల వలన తమ ఉపాధిని కోల్పోతామంటూ పలువురు బార్బర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొన్నిచోట్ల ఇంకా అధికారిక ఆదేశాలు వెళ్లనప్పటికీ ముందు జాగ్రత్తతో గడ్డం గీయడం ఆపేశామని మరికొందరు బార్బర్లు చెప్పారు.

"సెలూన్లకు కస్టమర్లు రావడం తగ్గింది. వీధుల్లో తాలిబాన్ మిలిటెంట్లకు లక్ష్యం కావాలని వాళ్లు కోరుకోవట్లేదు. ఇప్పుడు హెయిర్ స్టయిల్, ఫ్యాషన్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు" అని ఒక బార్బర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)