అఫ్గానిస్తాన్: కాబుల్ వెళ్లిన పాకిస్తాన్ ఫొటోగ్రాఫర్‌ను 'నమస్తే' అంటూ ఆహ్వానించిన కుటుంబం

ఫొటో సోర్స్, ZAHID ALI KHAN
- రచయిత, ఫైజుల్లా ఖాన్
- హోదా, బీబీసీ కోసం
"పాకిస్తాన్ పీస్ కమిటీతో కలిసి నేను కాబుల్ వెళ్లాను. అక్కడి ప్రజలతో సంబంధాలు కలుపుకోవడానికి ఆ సందర్భాన్ని వినియోగించుకున్నా. ఎన్నో యుద్ధాలను చూసిన కాబుల్ లోపల మరో కాబుల్ నిక్షిప్తమై ఉందని వారితో మాట్లాడడం ద్వారా తెలుసుకున్నాను" అంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ జాహిద్ అలీ ఖాన్ తన 28 ఏళ్ల కిందటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
"ఒక పెయింటర్ కుటుంబం నన్ను నమస్తే అంటూ పలకరించి, సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ఇంట్లో అమ్మాయిలకు హిందీ సినిమాలంటే చాలా ఇష్టం. అవి చూస్తూ కొంచెం కొంచెం హిందీ, ఉర్దూ నేర్చుకున్నారు. నేను ముస్లింనని, నాకు సలాం చెప్పొచ్చు అని వారితో అన్నాను."
'పాకిస్తాన్‌లో కూడా సలాం చేయడానికి 'నమస్తే' అనే అంటారనుకున్నాం' అని వారు చెప్పారు."
ఒక వైపు లోపల కొద్దిగా భయపడుతూనే ఆ కుటుంబంతో తాను గడిపిన క్షణాలను, ఆనందాన్ని జాహిద్ ఖాన్ గుర్తుచేసుకున్నారు.
"వారితో మాట్లాడుతుంటే వారిది ఒక ఆధునిక కుటుంబం అని అర్థమైంది. నేను వాళ్లని ఫొటోలు తీస్తుంటే చాలా సంతోషించారు. వారంతా నాకు మంచి స్నేహితులైపోయారు. పిల్లలు మరీ దగ్గరయ్యారు. నవ్వుతూ, ఆడుతూ నా దగ్గరే కూర్చున్నారు.
పాకిస్తాన్ నుంచి ఒక జర్నలిస్ట్, ఫొటోగ్రాఫర్ వచ్చారని ఆ చుట్టుపక్కలంతా తెలిసిపోయింది. ఆ తరువాత, రోజుకు ఒక కుటుంబం నన్ను కలవడానికి వచ్చేది.” అన్నారు జాహిద్

ఫొటో సోర్స్, ZAHID ALI KHAN
ఊహించిన దానికన్నా కన్నా భిన్నంగా ఉన్న కాబుల్
కాబుల్‌లో వివిధ కుటుంబాలను కలిసిన తరువాత జాహిద్ ఖాన్‌కు తాను ఊహిచినదాని కన్నా కాబుల్ భిన్నంగా కనిపించింది.
"అప్పట్లో కూడా బజార్లో మహిళలు కనిపించేవారు కాదు. కానీ, కాబుల్ నివాస ప్రాంతాల్లో వాతావరణం భిన్నంగా ఉండేది. రోడ్లపై మిలిటెంట్లు తిరుగుతూ ఉండేవారు. ప్రజలు భయపడుతునే ఉండేవారు కానీ, కాబుల్ వీధుల్లో జీవితం వేరుగా ఉండేది.
అఫ్గానిస్తాన్‌లో ప్రతీ చోటా ముజాహిదీన్లు ఉంటారనుకున్నాను. కానీ, నా ఆలోచనలకు భిన్నంగా అక్కడ అమ్మాయిలు జీన్స్, టీషర్ట్ వేసుకుని తిరుగుతూ కనిపించారు. నేనొక ఫొటోగ్రాఫర్ ఇంటికి వెళ్లాను. వారి బంధువు ఒకాయన రేడియో కాబూల్ సీనియర్ ఎడిటర్. ఆ కుటుంబంలోని వారంతా విద్యావంతులే" అంటూ జాహిద్ వివరించారు.
కాబుల్ ప్రజల ఆలోచనా విధానం వేరని, ప్రభుత్వంలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే దానిపై వారికి చింత లేదని, వారు కోరుకునేదల్లా శాంతిభద్రతలు మాత్రమేనని జాహిద్ అన్నారు.
కాబుల్ వాసులకు, మిలిటెంట్లకు మధ్య ఘర్షణలు
ముజాహిదీన్లు కాబూల్‌లో ప్రవేశించిన తరువాత దోపిడీల గురించి వార్తలు రావడం మొదలైందని జాహిద్ చెప్పారు. "ముజాహిదీన్లతో కాబుల్ ప్రజలకు తొలుతే చేదు అనుభవం ఎదురైంది. అందుకే, రష్యన్ వ్యతిరేక భావజాలం నుంచి వెలువడిన విప్లవాన్ని వారు ద్వేషిస్తారు."
భావజాలాల విషయంలో కూడా కాబూల్ వాసులకు, ముజాహిదీన్లకు మధ్య అంతరం ఉందని జాహిద్ అన్నారు.
"ముజాహిదీన్ సభ్యులు చాలావరకు గ్రామీణ నేపథ్యం కలిగినవారు లేదా మొదటిసారి నగరానికి వచ్చినవారు. కాబూల్ ప్రజలు వారిని ద్వేషించేవారు. ముజాహిదీన్లు త్వరగా కాబుల్ విడిచి వెళిపోవాలని కోరుకునేవారు. అఫ్గానిస్తాన్ పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆలోచనను భిన్నంగా ఉంటాయనే ఇప్పటికీ నా అనుకుంటుంటాను"
రష్యా, అమెరికాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో చాలా మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారేనని జాహిద్ అభిప్రాయపడ్డారు.
కాబూల్ పౌరులకు ఇస్లాంతో ఎలాంటి సమస్య లేదు. కానీ, వారంతా ఎక్కువగా పాశ్చాత్య నాగరికతకు ప్రభావితం అయినవారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు జర్మనీ, చెకోస్లోవేకియా, రష్యాలలో నివసిస్తున్న కారణంగా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వారిపై ఎక్కువగా ఉందని జాహిద్ అన్నారు.
"నాకు స్నేహితులైన ఒక కుటుంబంలో 15 నుంచీ 20 మంది అబ్బాయిలు, అమ్మాయిలు రష్యాలో చదువుకుంటున్నారు. నేను అక్కడ ఉన్నప్పుడే రష్యా నుంచి ఒక యువకుడు వచ్చాడు. ఆ దేశంలో ఉచిత విద్య, స్కాలర్‌షిప్ లభిస్తున్నాయని, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఆ దేశంతో మంచి సంబంధాలు ఏర్పడతాయని ఆ కుర్రాడు అన్నాడు."

ఫొటో సోర్స్, ZAHID ALI KHAN
ముజాహిదీన్ కాలంలో వీడియో మార్కెట్
ఒకసారి జాహిద్ ఖాన్ రాష్ట్రపతి భవన్‌లో ఉన్నప్పుడు, ఒక జనరేటర్ కొనుక్కురమ్మని అక్కడ ఉన్న గార్డులను మార్కెట్టుకు పంపించారు.
"నేను కూడా వారితో పాటు వస్తానని చెప్పాను. అందుకు గార్డులు అంగీకరించారు. అక్కడ నేను ఒక ఆసక్తికరమైన దృశ్యాన్ని చూశాను. గార్డులు ఐదారు బస్తాల నోట్ల కట్టలను కారు డిక్కీలోకి ఎక్కించారు. వాటి విలువ మొత్తం పద్నాలుగు వేల పాకిస్తాన్ రూపాయలు.
మార్కెట్లో ఒక వీడియో షాపు చూసి కంగారు పడ్డాను. ఆ షాపు ముందు కారు ఆపమని గార్డులకు చెప్పాను. ముజాహిదీన్లకు వీడియో షాపుతో ఏం పని అనుకున్నాను.
‘‘కారు దిగి ఆ షాపు దగ్గరకు వెళుతుంటే ఎదురుగా ఒక చిన్న ఇరుకైన వీధి కనిపించింది. ఆ వీధి నిండా వీడియో షాపులే. అది అచ్చు కరాచీలోని రెయిన్‌బో సెంటర్‌లాగే ఉంది. ఆ దుకాణాల వీధి చాలా రద్దీగా ఉంది. వరుసగా చిన్న చిన్న వీడియో షాపులు ఉన్నాయి. వాటన్నిటి నిండా హిందీ సినిమాలే. భారతీయ సంస్కృతి ప్రభావం, కాబూల్ పట్టణ జనాభాపై ఎంత ఉందో అప్పుడే నాకు అర్థమైంది. అందుకే కాబోలు నన్ను నమస్తే అంటూ పలకరించారు."
"రష్యా నుంచి వచ్చిన సరుకులు అఫ్గానిస్తాన్‌లో చౌకగా దొరుకుతాయని విన్నాను. గార్డులతో కలిసి నేనొక రష్యా మార్కెట్టుకు కూడా వెళ్లాను. అక్కడ పాత కాలపు సామాన్లు అమ్మే దుకాణం చూశాను. దుకాణదారు నన్ను సాదరంగా లోనికి ఆహ్వానించారు. 200 పాకిస్తాన్ రూపాయలు పెట్టి రష్యాలో తయారుచేసిన జెనాక్స్ కెమెరా, 15 ఫిల్టర్‌లను కొన్నాను. అలాగే ఒక మహిళ బలవంతంగా నాకు ఓ దుప్పటి అమ్మారు. దాన్ని నేను చాలా తక్కువ ధరకే కొన్నాను. కానీ, దాని అసలు విలువ అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు."

ఫొటో సోర్స్, ZAHID ALI KHAN
ప్రతినిధి బృందం సభ్యులతో అక్కడకు వెళ్లాను
తన కుటుంబానికి చెప్పకుండా కరాచీ నుంచి కాబూల్‌కు వచ్చేశానని జాహిద్ చెప్పారు. కాబుల్ చేరుకున్నాక రాష్ట్రపతి భవన్ పైన ఉన్న వైర్‌లెస్ సాధనం ద్వారా తన ప్రయాణం గురించి కుటుంబసభ్యులకు తెలియజేశారు.
అది 1993 ఫిబ్రవరి మాసం. సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టి ఒక ఏడాది అయింది. కానీ, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
కాబూల్‌లో, బుర్హానుద్దీన్ రబ్బానీ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వివిధ ముజాహిదీన్ గ్రూపుల మధ్య అంతర్యుద్ధాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది.
దేశంలో ఎన్నికలు జరగాలని గుల్బుద్దీన్ హెక్‌మత్యార్‌కు చెందిన హిజ్బ్-ఎ-ఇస్లామీ డిమాండ్ చేసింది. కానీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి రబ్బానీ సిద్ధంగా లేరు.
ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జమాత్-ఎ-ఇస్లామీ చీఫ్ ఖాజీ హుస్సేన్ అహ్మద్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాకిస్తాన్ నుంచి కాబూల్ వచ్చింది. 27 రోజుల పాటు అఫ్గాన్ నాయకులతో సమావేశమై ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించింది.
ఈ ప్రతినిధి బృందంలో భాగంగా రాజకీయ నాయకులు, సైనిక ప్రముఖులతో పాటు ఫొటోగ్రాఫర్‌గా తాను కూడా కాబుల్ వచ్చానని, అప్పటికి తనకి 30 ఏళ్లు అని జాహిద్ చెప్పారు.
బయలుదేరుతున్నప్పుడు జాహిద్ దగ్గర ఒక పోలరాయిడ్ కెమేరా ఉంది. కాబుల్‌లో దాంతో చాలా పనిపడుతుందని బయలుదేరేటప్పుడు జాహిద్‌కు తెలీదు.
మూసి ఉన్న రాష్ట్రపతి భవనం తలుపులు తెరవడానికి, ముజాహిదీన్లతో మాట్లాడడానికి, కాబుల్ వాసులతో స్నేహం చేయడానికీ ఈ కెమెరా ఎంతో ఉపయోగపడింది.
పెషావర్ నుంచి కాబుల్‌కు విమాన ప్రయాణం
ఫిబ్రవరి ప్రారంభంలో ప్రతినిధి బృందం పెషావర్ విమానాశ్రయం నుంచి కాబూల్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఖాజీ హుస్సేన్ అహ్మద్‌తో పాటు, జనరల్ హమీద్ గుల్, ఇరాన్, సౌదీ అరేబియాల దౌత్యవేత్తలు కూడా ఈ బృందంలో ఉన్నారు.
ఆ ప్రయాణం ఒక తమాషా సంఘటనతో ప్రారంభమైందని జాహిద్ చెప్పుకొచ్చారు.
“విమానం బయలుదేరడానికి ముందు పైలట్, కో పైలట్ విమానం చక్రాల్లో తగినంత గాలి ఉందో లేదో పరిశీలిస్తున్నారు. తరువాత, ప్రయాణికులు విమానం ఎక్కడానికి అనువుగా ఒక చిన్న ఇనుప నిచ్చెనను తలుపుకు ఆనించారు.
ఇదంతా చూస్తున్న ప్రతినిధి బృందం సభ్యులకు అనుమానం వచ్చింది.. ఇంతకీ ఈ విమానం గమ్యాన్ని చేరుకోగలదా లేదా అని సందేహం వ్యక్తం చేశారు.
ఆ విమానంలో కూర్చుంటే కరాచీలో మినీబస్‌లో కూర్చున్నట్లు అనిపించింది. కార్గో విమానం లాగ లోపల కుర్చీలకు బదులు బెంచీలు ఉన్నాయి. ఆ ప్రయాణాన్ని ఏ రకంగానూ సౌకర్యవంతం అని చెప్పలేం.”

ఫొటో సోర్స్, ZAHID ALI KHAN
శాంతి కమిటీని రాష్ట్రపతి భవనానికి పంపించారు
కాబూల్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతినిధి బృందం రాక గురించి ముందే తెలుసు కాబట్టి కాబూల్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోరాడుతున్న ముజాహిదీన్ గ్రూపులు రెండు గంటల పాటు కాల్పులకు విరమణ ఇచ్చాయి.
"మా బృందానికి రాష్ట్రపతి భవన్‌లో బస ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న అయిదారు రోజులకే నాకు బోర్ కొట్టేసింది. ఇంక అక్కడ ఉండడం నావల్ల కాదనిపించింది. వీధుల్లో, బజార్లలో తిరుగుతూ కాబుల్ ప్రజల గురించి, అక్కడి పర్యావరణం గురించి తెలుసుకోవాలని, ఫొటోలు తీయాలని ఆరాటపడ్డాను. నా అభ్యర్థన మేరకు వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్‌కు నా మకాం మార్చారు."
కెమెరా మాయాజాలం
"నా దగ్గర ఉన్న పోలరాయిడ్ కెమెరా కారణంగా రాష్ట్రపతి భవన్ భద్రతా సిబ్బందితో స్నేహం కుదిరింది. మీరేం మాయ చేశారు? వీరంతా ఇంత మీకు ఇంత దగ్గరైపోయారు? అని మా బృందంలో మిగతా సభ్యులు ఆశ్చర్యపోతూ అడిగేవారు"
గార్డులు జాహిద్ ఖాన్‌ను చాలా బాగా చూసుకున్నారు. కహ్వా తాగించి, తినేందుకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవారు. "ఫిల్మ్ రోల్‌తో ఫొటోలు తీస్తానంటే వద్దనేవారు" అన్నారు జాహిద్ ఖాన్
గార్డులతో స్నేహం జాహిద్‌కు కలిసొచ్చింది. రాష్ట్రపతి భవన్ మొత్తం కలయదిరుగుతూ ఎక్కడైనా ఫొటోలు తీసుకునేందుకు అనుమతి లభించేది.
ఆ భవనం గోడల నిండా అందమైన, విలువైన పెయింటింగులు ఉండేవి. ఎక్కువగా తూర్పు ఐరోపా దేశాలైన పోలాండ్, చెకోస్లోవేకియా కళాకారులు, మధ్య ఆసియాకు చెందిన కళాకారులు గీసిన బొమ్మలు ఉండేవి. అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది కానీ దానికి సీలు వేశారు.
వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతానికి మారిన తరువాత జాహిద్‌కు కాబుల్ పౌరులతో స్నేహం చేసే వీలు కలిగింది.
"అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా మమ్మల్ని బయటకు రానిచ్చేవారు కాదు. అపరిచితులను కలవనిచ్చేవారు కాదు. కానీ నేను రిస్క్ తీసుకున్నా."

ఫొటో సోర్స్, ZAHID ALI KHAN
షాకింగ్ సంఘటన
జాహిద్ ఎక్కువ ఫొటోలు తీయడంతో పోలరాయీడ్ కెమెరా కాట్రిడ్జ్ అయిపోవచ్చింది. ఫిల్మ్ రోల్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
"కాబుల్‌కు చేరుకున్న పది రోజుల తరువాత నా దగ్గరున్న ఫొటోలన్నీ పాకిస్తాన్ వార్తాపత్రికలకు ఇవ్వడానికి, కొత్త ఫిల్మ్ రోల్ తెచ్చుకోవడానికి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఒక డ్రైవర్‌తో మాట్లాడాను.
మేం కాబూల్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి, మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు తొర్ఖం చేరుకున్నాం."
ప్రయాణంలో జాహిద్‌కు దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి జరిగింది.
"జలాలాబాద్ ముందు ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో మిలిటెంట్లు మమ్మల్ని ఆపారు. యాపిల్ తింటున్న ఒక యువకుడు నా దగ్గరకు వచ్చి.. తుపాకి కాదు, కలష్నికోవ్ కూడా కాదు ఏకంగా రాకెట్ కొన నా నుదుటిపై పెట్టాడు. అదే నా జీవితంలో ఆఖరి క్షణం అనుకున్నాను.
మీరెవరు? అని దరీ భాషలో ఆ యువకుడు నన్ను అడిగాడు. పాకిస్తాన్ రిపోర్టర్‌ను అని అదే భాషలో కష్టపడి నేర్చుకున్న వాక్యాన్ని చెప్పాను. ఆ మాట విన్నాక ఆ యువకుడు లాంచర్ కిందకు దించాడు. జేబులోంచి మరో యాపిల్ తీసి నాకిచ్చి, నన్ను మెచ్చుకుంటూ అక్కడి నుంచి వెళిపోయాడు."
‘పాకిస్తాన్ అన్న పదమే పాస్‌పోర్ట్‌లా పనిచేసింది’
"ఆ సమయంలో పాకిస్తాన్ అన్న పదమే మాకు పాస్‌పోర్ట్ అయింది. మేం ఎక్కడికి వెళ్లినా పాకిస్తాన్ అని చెప్పగానే వారి వైఖరి మారిపోయేది. మమ్మల్ని చూసి సంతోషించేవారు" అని జాహిద్ చెప్పారు.
ఖాజీ హుస్సేన్ అహ్మద్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదని జాహిద్ తెలిపారు. సౌదీ అరేబియా, అమెరికా, పాకిస్తాన్, ఇరాన్, ఇండియా అన్నీ తమదైన రీతిలో ఇందులో పాలుపంచుకున్నాయిగానీ సమస్యలు పరిష్కారం కాలేదు.
"బహుశా ఈ అంశం ఖాజీ హుస్సేన్ అహ్మద్, హమీద్ గుల్, ఇతర దౌత్యవేత్తల పరిధిలోనిది కాకపోవచ్చని" అని జాహిద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
- అఫ్గాన్ మహిళలు రంగురంగుల దుస్తులు వేసుకుని ఆ ఫొటోలు షేర్ చేస్తున్నారెందుకు
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- అఫ్గానిస్తాన్: కో-ఎడ్యుకేషన్ రద్దు, విద్యార్థినులకు హిజాబ్ తప్పనిసరి
- 'జాక్ మా' లాంటి పారిశ్రామిక దిగ్గజాలను చైనా ఎందుకు ‘ఇబ్బంది పెడుతోంది’
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- అఫ్గానిస్తాన్ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు, కీలక స్థానాల్లో అతివాదులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- అమెరికా అమాయకులను చంపేసిందా? కాబుల్ చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
- మొహమ్మద్ అట్టా: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి విమానాన్ని ఎలా హైజాక్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










