అఫ్గానిస్తాన్: తాలిబాన్‌లకు ఇప్పుడు ఐఎస్ శత్రువుగా మారిందా?

తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత వారిపై ఐఎస్ దాడులు పెరిగాయి.
ఫొటో క్యాప్షన్, తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత వారిపై ఐఎస్ దాడులు పెరిగాయి.
    • రచయిత, అజీజుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ ఉర్ధూ, పెషావర్

అఫ్గానిస్తాన్‌లో అష్రఫ్‌ ఘనీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నంగర్‌హర్ ప్రావిన్సులోని జలాలాబాద్‌ ప్రాంతంలో ప్రభుత్వ దళాలపై తాలిబాన్‌లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఇస్లామిక్‌ స్టేట్ మిలిటెంట్ గ్రూప్‌ కూడా ప్రభుత్వ దళాల మీద దాడులు చేసింది.

కానీ, ఆగస్టు 15న తాలిబాన్‌లు కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత పరిస్థితి మారిపోయింది. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) తాలిబాన్‌లకు ప్రత్యక్ష శత్రువుగా మారింది.

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత దేశంలో ఐఎస్ ముప్పు మరింత పెరిగింది. భారీ ఎత్తున విదేశీ సైనికులు ఉండగానే ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంపై ఐఎస్ దాడి చేయగలిగింది.

ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులతోపాటు, 150 మందికి పైగా మరణించారు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఐఎస్ తనకు అత్యంత పట్టున్ననంగర్‌హార్, జలాలాబాద్ నుండి చేసిన అతి పెద్ద దాడి. ఈ అటాక్ ద్వారా తాలిబాన్‌కు తానే పెనుముప్పునని నిరూపించుకునేందుకు ఐఎస్ ప్రయత్నించింది.

సెప్టెంబర్ 18, 19 తేదీలలో జలాలాబాద్‌ ప్రాంతంలో జరిగిన పేలుళ్లకు ఐఎస్ బాధ్యత వహించింది. తాము విజయం సాధించామంటూ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించుకుంది. ఈ దాడుల్లో మొత్తం 35 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

అల్‌ జజీరా చానల్ రిపోర్ట్ ప్రకారం ఈ దాడులకు సంబంధించి తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఇస్లామిక్ స్టేట్ పేరు ప్రస్తావించకుండానే వారిపై ఆరోపణలు చేశారు.

మతం విషయంలో తాలిబాన్‌లకన్నా ఐఎస్ కఠినంగా ఉంటుంది.
ఫొటో క్యాప్షన్, మతం విషయంలో తాలిబాన్‌లకన్నా ఐఎస్ కఠినంగా ఉంటుంది.

ఐఎస్కు తాలిబాన్లు ఎందుకు టార్గెట్ అయ్యారు?

కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాక తాలిబాన్ సభ్యులే భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. కానీ, వారు అధికారంలోకి వచ్చాక దేశంలో ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడం ఇదే మొదటిసారి. పైగా ఈ దాడులను తానే చేశానని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.

తాలిబాన్లకు, ఇస్లామిక్ స్టేట్‌కు మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయి. గతంలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలున్నాయి. ఇటీవల జరిగిన జరిగిన దాడులు ఊహించినవేనని అఫ్గానిస్తాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్‌ యూసఫ్‌జాయ్ బీబీసీతో అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబాన్లకు ఇస్లామిక్ స్టేట్ అతి పెద్ద సవాలని ఆయన అన్నారు.

తాలిబాన్‌ల విషయంలో అఫ్గాన్ ప్రభుత్వం నిస్సహాయంగా కనిపించినట్లే, ఇప్పుడు ఐఎస్ విషయంలో తాలిబాన్‌లు నిస్సహాయంగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు.

గతంలో ఐఎస్ సభ్యులు నంగర్‌హర్ ప్రావిన్సులోని జలాలాబాద్‌ ప్రాంతంలో ప్రభుత్వ దళాలపై దాడులు చేసేవారని, ఇప్పుడు తాలిబాన్‌లు అధికారం చేపట్టడంతో వారిపై దాడులు చేస్తున్నారని సీనియర్ కామెంటేటర్ అబ్దుల్ సయీద్ బీబీసీతో అన్నారు.

ఇటీవల జరిగిన దాడులు చిన్నవని, మున్ముందు తీవ్రంగా ఉండొచ్చని ఆయన అన్నారు. గతంలో తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ ఉనికి లేదని వ్యాఖ్యానించారని, ఇప్పుడు వారు సవాల్ చేస్తున్నారని సయీద్ వ్యాఖ్యానించారు.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలలో తాలిబాన్ సభ్యులతోపాటు ఐఎస్ మిలిటెంట్లు కూడా ఉన్నారని, తాము తప్పించుకునే క్రమంలో కొందరు ఐఎస్ సభ్యులను తాలిబాన్లు చంపారని, దీంతో ఇస్లామిక్ స్టేట్ వారి విషయంలో ఆగ్రహంగా ఉందని యూసఫ్ జాయ్ వెల్లడించారు.

ఈ దాడుల ద్వారా ఇస్లామిక్ స్టేట్ తన శక్తిని ప్రదర్శిస్తోందని, ఒకవైపు తాలిబాన్లపై ఒత్తిడిని పెంచడంతోపాటు అంతర్జాతీయంగా కూడా తమ ఉనికిని చాటుకునేందుకే ఈ దాడుల ఉద్దేశమని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతంలో అఫ్గానిస్తాన్‌లో అన్ని శక్తులు తమ ఉనికిని, సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని పెషావర్ యూనివర్సిటీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్‌‌ఫ్లిక్ట్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బాబర్ షా అన్నారు.

అఫ్గాన్‌లో తమ సత్తా చాటుకోవడానికి అన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్‌లో తమ సత్తా చాటుకోవడానికి అన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తాలిబాన్లు కూడా సలాఫీలను టార్గెట్ చేస్తున్నారా?

సైద్ధాంతికంగా ఐఎస్ మతం విషయంలో తాలిబాన్‌ల కంటే తీవ్రంగా ఉంటుందని చెబుతారు. గతంలో తాలిబాన్‌తో పనిచేసి, మతం విషయంలో వారి విధానాలు నచ్చక అసంతృప్తితో ఉన్నవారిని ఐఎస్ తన వర్గంలో చేర్చుకుంది.

ఇస్లాంలో హనాఫీ సిద్ధాంతాన్ని ఆచరించే తాలిబాన్‌లు సలాఫీ విధానాన్ని అనుసరించే ఐఎస్ సభ్యులను వ్యతిరేకిస్తారని అబ్దుల్ సయీద్ వెల్లడించారు.

తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత సలాఫీ సిద్ధాంతాన్ని అనుసరించే మసీదులు, మదర్సాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాడులు జరిగాయి.

సలాఫీ వర్గానికి చెందిన అనేకమంది ప్రభావశీలురైన మత పెద్దలను తమతో చేర్చుకునేందుకు తాలిబాన్‌లు ప్రయత్నించారు.

గత రెండు దశాబ్దాలుగా అఫ్గానిస్తాన్‌లో సలాఫీ వర్గం తూర్పు, ఉత్తర ప్రావిన్సులలో ముఖ్యంగా కాబుల్, నంగర్‌హార్ ప్రాంతంలో బలంగా పాతుకుపోయింది.

ఐఎస్ అనుకూల వర్గాలకు కేంద్రంగా మారడానికి ముందు ఈ ప్రాంతం తాలిబాన్‌ల ఆధీనంలో ఉండేది. కానీ సలాఫీ వర్గం వారిని ఇక్కడ దాదాపు లేకుండా చేసింది.

సలాఫీ గ్రూపులపై దాడులను తాలిబాన్‌లు ఆపకపోతే, ఐఎస్ వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు కూడా చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం దేశంపై పట్టుకోసం ఐఎస్ ప్రయత్నిస్తోందని, అందుకోసం తాలిబాన్‌లను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉందని యూసఫ్‌‌ జాయ్ అన్నారు.

తాలిబాన్ల అజెండా, లక్ష్యాలు కేవలం అఫ్గానిస్తాన్‌కు మాత్రమే పరిమితమయ్యాయని, ప్రపంచ స్థాయి అజెండా లేదని, ఐఎస్ అందుకు భిన్నమని ఆయన అన్నారు.

తాలిబాన్‌ల అజెండా అఫ్గానిస్తాన్‌కే పరిమితం కాగా, ఐఎస్‌ది అంతర్జాతీయ అజెండా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబాన్‌ల అజెండా అఫ్గానిస్తాన్‌కే పరిమితం కాగా, ఐఎస్‌ది అంతర్జాతీయ అజెండా

ఇబ్బందుల్లో అల్ ఖైదా

కాబూల్ విమానాశ్రయంపై జరిగిన దాడులు అల్-ఖైదా, దాని మద్దతుదారులకు ఇబ్బందులు కలిగించాయి.

ఈ దాడుల్లో అమెరికా సైనికులు మరణించినందుకు అల్ ఖైదా సంతోషంగానే ఉన్నా, ఈ దాడిని తన ప్రత్యర్ధిలాంటి ఇస్లామిక్ స్టేట్ జరపడం ఇబ్బందిగా మారింది.

ఎందుకంటే తాలిబాన్, అల్‌ ఖైదా స్నేహితులు.

ఇక సిరియాకు చెందిన జిహాదీ వర్గాలు కూడా ఐఎస్ దూకుడును తప్పుబడుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో శాంతిని నెలకొల్పి, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం ఎంతో అవసరమని, తాలిబాన్‌లు అధికారంలోకి రావడాన్ని ఓర్వలేకే ఐఎస్ దాడులకు పాల్పడుతోందని జిహాదీ గ్రూపులు ఆరోపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)