ఇండియన్ సీరియల్ డేటర్: 365 మంది మహిళలతో డేటింగ్ తన టార్గెట్ అంటున్న యువకుడి అసలు లక్ష్యం ఏంటి?

Sunder Ramu

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళ నటుడు, ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఫోటోగ్రాఫర్ సుందర్ రాము గత కొన్నేళ్లుగా 335 మంది మహిళలతో డేటింగ్ చేశారు. తన 365 డేట్ల లక్ష్యానికి ఇంకా 30 డేట్‌ల దూరంలో ఉన్నానని అంటున్నారు.

ఆయన విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. శృంగారానికేమీ ఆయన వ్యతిరేకి కాదు. అలాగని ఆయన డేట్స్ అన్నీ శృంగారభరితమైనవి కావు. ఆయన లక్ష్యం ప్రేమ మాత్రమే కాదు.

చెన్నైలోని తన నివాసం నుంచి బీబీసీతో మాట్లాడిన సుందర్ రాము, ''నేను చాలా రొమాంటిక్. నేను ప్రతిరోజూ ప్రేమ కోసం చూస్తున్నాను. కానీ, 365 డేట్స్ వెనుక ఉన్న ఆలోచన మహిళలతో స్నేహం చేయడం మాత్రమే కాదు'' అని అన్నారు.

''నేను భారతదేశంలో మహిళల హక్కులపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నాను'' అని వివరించారు.

సుందర్ రాము దశాబ్దం క్రితం తమిళ, మలయాళ సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాల్లో కూడా నటించారు. ఆయన ఈ డేటింగ్ ప్రాజెక్ట్‌ను జనవరి 1 నుంచి ప్రారంభించారు.

సుందర్ రాము ఫేస్‌బుక్ పేజీని పరిశీలిస్తే ఆయన డేట్ చేసిన మహిళల కథలు తెలుసుకోవచ్చు. 105 ఏళ్ల బామ్మ, తన అపార్ట్‌మెంట్ నుంచి చెత్త తీసుకెళ్లే మహిళ, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని, నటి, మోడల్స్, యోగా టీచర్, యాక్టివిస్టులు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా ఎంతోమంది మహిళలు ఆయనతో డేట్ చేసిన జాబితాలో ఉన్నారు.

SUNDER RAMU

ఫొటో సోర్స్, SUNDER RAMU

ఫొటో క్యాప్షన్, పండ్లు అమ్మే మహిళతో డేట్‌కు వెళ్లిన సుందర్

''నేను స్త్రీలను బాగా చూసుకునే, గౌరవించే కుటుంబంలో పెరిగాను. లింగ వివక్ష లేని పాఠశాలలో చదువుకున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలను వేరుగా చూడలేదు. కానీ, స్కూల్ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాక, సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్షను గమనించాను. అలాంటి సంస్కృతిని చూసి షాక్ కు గురయ్యాను'' అని ఆయన చెప్పారు.

దిల్లీలో ఒక బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై దారుణం జరగడం ఆయన్ని కలచి వేసింది.

"2012 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన నన్ను కుదిపివేసింది. చాలా రాత్రులు నిద్రపోలేకపోయాను" అని ఆయన చెప్పారు.

విదేశాలకు వెళ్లినపుడు తనను ఎవరైనా ''భారతీయులు మహిళలను అంత దారుణంగా ఎందుకు చూస్తారు'' అని అడిగినప్పుడు కూడా చాలా కోపం వచ్చేదన్నారు.

''ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం వేరేవాళ్ల పని.. అంటే ప్రభుత్వం లేదంటే స్వచ్ఛంద సంస్థల పని అని మనం అనుకుంటుంటాం."

"అదే పనిని నేను వైవిధ్యంగా ఎలా చేయగలను అనుకున్నాను. అప్పుడే 365 డేట్స్ ఆలోచన వచ్చింది."

"మగవారు కూడా ఈ సమస్య పరిష్కారంలో భాగం కావాలి. డేటింగ్‌కి వెళ్లేప్పుడు వారిలో చాలా అపోహలు ఉంటాయి. కానీ, మహిళలు అంటే ఒంపు సొంపులే కాదు ప్రతి వ్యక్తి మరొకరి కంటే భిన్నంగా ఉంటారు.''

''మీరు ఆ లింగ భేదాలను తీసి పక్కన పెట్టి డేట్‌కి వెళ్లండి. వారి సమస్యలను కాస్త ఎక్కువగా అర్థం చేసుకుంటారు'' అని సుందర్ రాము చెబుతున్నారు.

తన 365 డేట్స్ ప్రణాళిక గురించి సుందర్ రాము 2014 డిసెంబర్ 31న ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.

"మహిళలూ నన్ను డేట్‌కు పిలవండి, ప్లాన్ చేసుకోండి, ఒక ప్రాంతం ఎంచుకోండి, భోజనానికి డబ్బు చెల్లించండి లేదా వంట చేయండి'' అని ఆయన రాసుకొచ్చారు.

సుందర్ రాము

ఫొటో సోర్స్, Getty Images

డేట్‌కి వెళ్లడం వల్ల ఆదా అయిన తన భోజనం ఖర్చులతో ఆయన ప్రతి నెల చివర్లో కొన్ని స్వచ్చంద సంస్థల కోసం ఆహారం కొనుగోలు చేసి అందిస్తున్నారు.

పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే కొత్త సంవత్సరం రోజున, ఆయనను డేట్‌కి తమ ఇంటికి భోజనానికి రావాలంటూ ఒక ఫ్రెండ్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.

ఆయన మొదటి పదికి పైగా డేట్‌లు తనకు తెలిసిన వ్యక్తులతోనే జరిగాయి. జనవరి 10 నాటికి, స్థానిక మీడియాలో ఆయనపై కథనాలు వచ్చాయి. ఆ తర్వాత చాలా మంది నుంచి డేట్‌కి ఆహ్వానాలు వచ్చాయి.

దీంతో ఆయన 'ది డేటింగ్ కింగ్', '365-డేట్స్ మ్యాన్', 'సీరియల్ డేటర్'గా పాపులర్ అయిపోయారు.

పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే మన దేశంలో డేటింగ్‌‌ను పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుండడంతో మొదట ఆయన నిర్ణయంపై స్నేహితులు కాస్త ఆందోళనకు గురయ్యారు.

''నాకు చాలా మంది మహిళలు తెలుసని చూపించడానికే ఇలా చేస్తున్నావా? అసలు నీ సమస్య ఏంటి? ప్లే బాయ్‌లా ఉండాలనుకుంటున్నావా'' అని వారంతా సుందర్ రాముని మందలించారు.

''ఇతరులను కలుసుకుని వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ప్రశ్నలు అడుగుతూ ఒకరి దృక్పథాన్ని మరొకరు తెలుసుకోవాలనున్నా, లింగ సమానత్వాన్ని సాధించడమే నా అంతిమ లక్ష్యం'' అని వాళ్లకు బదులిచ్చానని ఆయన చెప్పారు.

365 డేట్స్ అనుకున్నప్పటి నుంచి, ఆయన ఎన్నో దేశాల మహిళలతో డేట్‌కు వెళ్లారు. డేట్స్‌కి మన దేశంలో వివిధ నగరాల్లో తిరిగారు. వియత్నాం, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, థాయ్‌ ల్యాండ్, శ్రీలంకకు కూడా వెళ్లారు.

సుందర్ రాము

ఫొటో సోర్స్, SUNDER RAMU

ఫొటో క్యాప్షన్, డేట్‌లో ఒకే రకం కళ్లజోడులు ధరించిన బామ్మ, మనవడు

తన ప్రతి డేట్‌ని ప్రత్యేకమైనదిగా వర్ణించిన సుందర్ రాము, తన మేజిక్ డేట్ మాత్రం సొంత బామ్మతో రెండేళ్ల క్రితం జరిగిందేనని చెప్పారు.

''నాకు మెర్సిడిస్‌లో ప్రయాణించాలని ఉందని ఆమె తరచూ చెప్పేవారు. అందుకే నేను ఒక మెర్సిడిస్ కారు కొన్నాక కుళ్లంచవేదిలో ఇంట్లో ఉన్న ఆమెను దాన్లో తీసుకువచ్చాను. మా తాత చనిపోయాక, ఓటు వేయడం తప్ప 22 ఏళ్ల నుంచీ మా బామ్మ బయటకే రాలేదు'' అన్నారు.

ఇద్దరూ స్థానిక దేవాలయానికి వెళ్లి, సూర్యాస్తమయం చూడటానికి సరస్సు దగ్గరకు వెళ్లారు.

''ఆమెది పెద్దవయసు కావడంతో కొంచెం వంగి ఉంటారు. కానీ, బాగానే ఉన్నారు. మేం మ్యాచింగ్ కళ్లజోడు పెట్టుకున్నాం. నా వయసు కాస్త తక్కువయ్యుంటేనా, నీ యంగ్ డేట్స్ అన్నింటికి గట్టి పోటీ ఇచ్చేదాన్ని అని బామ్మ జోక్ చేశారు'' అన్నారు.

''మా బామ్మతో ఎక్కువ సమయం గడపడం ఇదే మొదటిసారి. డేట్‌కి వెళ్లకపోయి ఉంటే ఆమెతో ఇదంతా మాట్లాడలేకపోయేవాడిని అనిపించింది'' అని సుందర్ రాము తెలిపారు.

డేట్‌లో భాగంగా సుందర్ చెన్నైలోని ఒక కాన్వెంట్‌లో ఐరిష్ సన్యాసిని సిస్టర్ లోరెటోతో కలిసి భోజనం చేశారు.

''ఆమెకు 90 ఏళ్ళు. తనకు ఇదే మొదటి డేట్ అని చెప్పారు. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో చర్చిలో చేరడానికి ఇండియా వచ్చేశారు'' అని ఆయన చెప్పారు.

మొదట ఒక ఏడాదిలోనే 365 డేట్స్ పూర్తి చేయాలని అనుకున్నానని సుందర్ రాము చెప్పారు. అయితే 2015 నవంబర్‌లో వరదలు రావడంతో చెన్నైలో చాలా ప్రాంతాలు మునిగిపోవడంతో అది వీలుకాలేదని తెలిపారు. తర్వాత ఏడాది దానిని మళ్లీ ప్రారంభించి, వేగం పెంచాలనుకున్నారు.

సుందర్ రాము

ఫొటో సోర్స్, SUNDER RAMU

ఫొటో క్యాప్షన్, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని సిస్టర్ లోరెటోతో డేట్ కి వెళ్లిన సుందర్ రాము

''నేను ఎంతో మంది అందమైన మహిళలతో ఉచితంగా భోజనం చేశాను. ఇప్పుడు అది నా జీవితకాల ప్రాజెక్ట్‌గా మారింది. ఈ సంభాషణను కొనసాగించాలనే ఆలోచన ఉంది'' అని అన్నారు.

ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పటితో పోల్చితే ప్రస్తుతం లింగ సమానత్వం ఎక్కువగా ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామని మీరు భావిస్తున్నారా అని నేను ఆయనని అడిగాను.

''నేను చాలా ఉన్నతమైన ఆశయాలున్న చోట పెరిగాను. కానీ ఒక దేశాన్ని, పితృస్వామ్యం లోతుగా పాతుకుపోయిన సమాజాన్ని మార్చగలనా అనుకుంటే, నాలో నాకే నవ్వొస్తుంది'' అని ఆయన చెప్పారు.

"అయితే మనం ఎక్కడో ఒక చోట, దానిని ప్రారంభించాలని నేను నమ్ముతున్నాను. ఇది రాత్రికి రాత్రే అయిపోదు. సత్వర పరిష్కార మార్గం లేదు. దీనికి బహుశా కొన్ని తరాలు కూడా పట్టొచ్చు. కానీ, మనం మన జీవితకాలంలోనే దానిని ప్రారంభించి కొనసాగించాలి" అంటారు సుందర్ రాము.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)