డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా

ఫొటో సోర్స్, Getty Images
డేటింగ్ యాప్స్‌ను ఉపయోగించే వారు బరువును నియంత్రించుకోడానికి అసహజ పద్ధతుల్లో ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని ఒక అధ్యయనం పేర్కొంది.
అమెరికాకు చెందిన ఒక పరిశోధన సంస్థ 1700 మందిని సర్వే చేసిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది.
డేటింగ్ యాప్స్ ఉపయోగించేవారు బరువు తగ్గే మందులు వాడటం, వాంతులు చేసుకోవడం, ఉపవాసం ఉండటం లాంటి అనారోగ్యకర విధానాలు అవలంబిస్తున్నారని పేర్కొంది.
అయితే, డేటింగ్స్ యాప్స్ వల్లే అందరూ ఇలా అవుతున్నారనేది ప్రత్యక్షంగా నిరూపణ కాలేదని, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని పరిశీలించడానికి మరింత పరిశోధన అవసరం అని తెలిపింది.
అనారోగ్యం బారిన పడే డేటింగ్ యాప్స్ వినియోగదారులకు తగిన మద్దతు ఇవ్వాలని ఈటింగ్ డిజార్డర్స్‌పై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ బీట్ తెలిపింది.
కొన్నాళ్లుగా ఆన్‌లైన్ డేటింగ్ బాగా పెరుగుతోంది. రొమాంటిక్, సెక్సువల్ పార్ట్‌నర్ కోసం యువతీయువకులు ఇటీవల డేటింగ్ యాప్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ఈ యాప్స్ ద్వారా తాము ఎంచుకోవాలనుకుంటున్న భాగస్వామి లక్షణాలు, భౌతిక రూపాన్ని గమనిస్తుంటారు.
ఈ అధ్యయనంలో భాగంగా డేటింగ్ యాప్స్ ఉపయోగించేవారు, ఉపయోగించనివారిని తీసుకొని వారి ప్రవర్తనను పరిశీలించారు. ఈ అధ్యయనం వివరాలు ఈటింగ్ జర్నల్ డిజార్టర్స్‌లో ప్రచురితమయ్యాయి.
డేటింగ్ యాప్స్ ఉపయోగించేవారు బరువు నియంత్రణకు ఆరు రకాల అనారోగ్యకర పద్దతులకు అలవాటు పడుతున్నారని పరిశోధకులు గుర్తించారు.
వాంతులు, విరోచనాలు చేసుకోవడం, ఉపవాసం ఉండటం, సన్నబడే మాత్రలు వాడటం, కండరాలను పెంచే మందుల వినియోగం, శరీరాకృతిని పెంచే స్టెరాయిడ్స్ తీసుకోవడం వంటివి చేస్తున్నారని గుర్తించారు.

సర్వే చేసిన 1,726 మంది డేటింగ్ యాప్స్ వాడకందారులలో 183 మంది మహిళలు కాగా, 209 మంది పురుషులు ఉన్నారు.
ఈ గ్రూపులోని సగం మంది బరువు తగ్గించుకునేందుకు ఉపవాసాలు ఉన్నారు. అంతేకాకుండా ఇందులోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు బరువు నియంత్రణకు వాంతులు చేసుకునేవాళ్లమని చెప్పారు.
ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు, 40 శాతం పురుషులు బరువు నియంత్రణకు మందులు వాడేవాళ్లమని తెలిపారు.
ఇక శరీరాకృతిని మలుచుకునేందుకు మహిళల కంటే పురుషులే ఎక్కువగా స్టెరాయిడ్స్, మందులు తీసుకుంటున్నట్లు తేలింది.
ముఖ్యంగా డేటింగ్ యాప్స్ ఉపయోగించే అల్పసంఖ్యాక వర్గాలకు చెందినవారిలోనే ఈ అనారోగ్యకర అలవాట్లు ఎక్కువగా కనిపించాయని బోస్టన్‌లోని టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ప్రధాన రచయత డాక్టర్ అల్విన్ ట్రాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
శరీరాకృతిపై ఆందోళన
అయితే, డేటింగ్ యాప్స్ ఉపయోగించడానికి ముందే వారు బరువు నియంత్రణకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారా అనేది తమకు తెలియదని డాక్టర్ ట్రాన్ తెలిపారు. అందంగా కనిపించాలని వారు చేస్తున్న ప్రయత్నం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.
‘‘అనారోగ్యకర రీతిలో బరువును నియంత్రించాలనుకునే వారందరిలో ఈటింగ్ డిజార్డర్ సమస్య ఉండదు. అయితే, ఇలాంటి పద్దతులు పాటించేవారు జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే, డేటింగ్ యాప్స్ ఉపయోగానికి, అనారోగ్యకర రీతిలో బరువు తగ్గడానికి ప్రత్యక్ష సంబంధం లేదని ఈ పరిశోధనలో రుజువు కాలేదు. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి’’ అని బీట్ విదేశీ వ్యవహారాల డైరెక్టర్ టామ్ క్విన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








