అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, AFP
అబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల, అబార్షన్‌పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ రాష్ట్రంలో ఓ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడంతో దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.
ఇలాంటి చట్టాల వలన రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలుగుతుందని స్వేచ్ఛావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో 1973లో దేశవ్యాప్తంగా గర్భస్రావాలను చట్టబద్ధం చేశారు. 'రో వీ వేడ్' అని పిలిచే ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ దాఖలు చేసిన కేసుపై రాబోయే నెలల్లో సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
"అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలి" అని కోరుతూ నిరసనకారులు వాషింగ్టన్ డీసీలో సుప్రీం కోర్టు ముందు ప్రదర్శనలు జరిపారు.
అయితే, కొత్త చట్టాన్ని సమర్థిస్తున్నవారు కూడా లేకపోలేదు. సుమారు పాతికమంది మద్దతుదారులు, ప్రారంభంలో నిరసనకారుల ర్యాలీని అడ్డగించారు.
"అమాయక ప్రాణుల రక్తంతో నీ చేతులు తడుస్తున్నాయి" అని ఒక వ్యక్తి గట్టిగా అరిచారు. కానీ, నిరసనకారుల పాటలు, చప్పట్ల ప్రవాహంలో ఆయన అరుపులు కొట్టుకుపోయాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది.
మహిళల హక్కులకు మద్దతు ఇచ్చేందుకే తాను నిరసనల్లో పాల్గొంటున్నట్లు ర్యాలీకి వచ్చిన మరొక మహిళ తెలిపారు.

ఫొటో సోర్స్, REUTERS
"అదృష్టవశాత్తు, అలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నాకు కలుగలేదు. కానీ, ఎంతోమంది మహిళలు ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు. మా శరీరాల గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికిగానీ, పురుషులకుగానీ లేదు" అని రాబిన్ హార్న్ అనే మహిళ రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.
వార్షిక వుమన్స్ మార్చ్ నిర్వహించేవారే ఈ ర్యాలీలనూ నిర్వహించారు. వీరి మొదటి ర్యాలీ 2017లో డోనాల్డ్ ట్రంప్ పదవిని చేపట్టిన మరుసటి రోజు మొదలైంది. ఆ ర్యాలీలో లక్షలాదిమంది పాల్గొన్నారు.
"ఇది అందరికీ అద్దాలను పగలగొట్టుకుని ముందుకు దూకే క్షణం లాంటిది" అని వుమన్స్ మార్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేచెల్ ఓ లియరీ కార్మోనా అన్నారు.
"అబార్షన్ చట్టబద్ధం అని, అందరికీ అందుబాటులో ఉంటుందనే ఆలోచనతోనే మేమంతా పెరిగాం. అది ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇది అందరికీ మేలుకొలుపు లాంటిది" అని ఆమె అన్నారు.
న్యూయార్క్ రాష్ట్రంలో గవర్నర్ కాథీ హోచుల్ రెండు ర్యాలీలలో మాట్లాడారు.
"అబార్షన్ హక్కుల విషయంలో పోరాడి, పోరాడి అలిసిపోయాను. అది ఒక చట్టంగా ఈ దేశంలో స్థిరపడిపోయింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ హాక్కును మా నుంచి మీరు లాక్కోలేరు" అని ఆమె స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, REUTERS
మరొక పెద్ద ర్యాలీ, టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో జరిగింది. అక్కడ సెప్టెంబర్ 1 నుంచి అబార్షన్ హక్కును రద్దు చేశారు. కడుపులో బిడ్డ గుండె కొట్టుకోవడం ప్రారంభించిన తరువాత గర్భస్రావం చేయించుకోకూడదని చట్టం తీసుకువచ్చారు. అయితే, ఆ సమయానికి తాను తల్లి కాబోతున్నట్లు మహిళలకు తెలియకపోవచ్చు.
ఈ హార్ట్‌బీట్ చట్టం కింద గర్భం దాల్చిన ఆరు వారాల తరువాత అబార్షన్ చేసే డాక్టర్ మీద కూడా కేసు వేయవచ్చు.
కడుపులో బిడ్డలను కాపాడడమే ఈ చట్టం లక్ష్యమని సమర్థకులు అంటున్నారు.
ఇతర రిపబ్లికన్ ఆధిపత్య రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు కూడా ఈ అబార్షన్ చట్టాన్ని అమలుచేసే ఆలోచనలో ఉన్నారు.
టెక్సాస్ చట్టాన్ని నిరోధించాలని హక్కుల సంఘాలు సుప్రీం కోర్టును కోరాయి. కానీ, న్యాయమూర్తులు వారి డిమాండ్‌ను తిరస్కరించారు.
మిస్సిస్సిపీలో 15 వారాల తరువాత అబార్షన్ చేయించుకోకూడదనే చట్టం ఉంది. దానిపై డిసెంబర్ 1న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్ చేయించుకునేందుకు మరో దేశానికి వెళ్తున్న యువతులు..
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ఈ దేశంలో చర్చిలపై మహిళలు ఎందుకు దాడులు చేస్తున్నారు?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- కరోనా ఎఫెక్ట్: కోట్ల మంది మహిళలకు గర్భనిరోధక సాధనాల కొరత.. పెరిగిపోతున్న అవాంఛిత గర్భాలు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- టాయిలెట్లో శిశువును హత్యచేసిందనే ఆరోపణల నుంచి ఎల్ సాల్వడార్ మహిళకు విముక్తి
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











